రుక్మిణీ సందేశము (చివరిభాగము)

రుక్మిణీ సందేశము (చివరిభాగము)

( కృతజ్ఞతలు ... శ్రీ పిస్కా సత్యనారయణ గారికి. వారి అద్బుత వివరణకు కు 

మా అభినందనలు.)

ఎనిమిదవ పద్యము

ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని

........ కర్ణరంధ్రంబుల కలిమి యేల?

పురుషరత్నమ! నీవు భోగింపగాలేని

........ తనులత వలని సౌందర్యమేల?

భువనమోహన! నిన్ను బొడగానగాలేని

........ చక్షురింద్రియముల సత్త్వమేల?

దయిత! నీ యధరామృతం బానగాలేని

........ జిహ్వకు ఫలరస సిద్ధి యేల?

నీరజాతనయన! నీ వనమాలికా

గంధ మబ్బలేని ఘ్రాణమేల?

ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని

జన్మమేల యెన్ని జన్మములకు?!

రుక్మిణి పంపిన ప్రణయసందేశములోని చివరి పద్యం ఇది.

"శ్రీకృష్ణా! మనోజ్ఞమైన నీ మాటలు వినలేని చెవులు, నీవు అనుభవించడానికి అక్కరకురాని ఈ దేహసౌందర్యము, నిన్ను చూడడానికి నోచుకోని కన్నులు, నీ అధరామృతాన్ని గ్రోలలేని నాలుక, నీ వనమాలికా పరిమళమును ఆఘ్రాణించలేని నాసిక, నీకు సేవ చేయలేని ఈ మానవజన్మ నిష్ప్రయోజనం కదా!" అంటున్నది రుక్మిణీరమణి.

మానవ శరీరం పంచేంద్రియముల సంపుటి. చెవులున్నాయి వినడానికి. చేతులున్నాయి తాకడానికి. కళ్ళున్నాయి చూడడానికి. జిహ్వ ఉన్నది రుచులను ఆనడానికి. నాసిక ఉంది వాసన చూడడానికి. ఇవి సర్వప్రాణులకు సహజమైన లక్షణాలు.

ఐతే, రుక్మిణి దృష్టిలో పాంచభౌతికమైన తన శరీరానికి పరమావధి వేరు. ప్రాణేశ్వరుని సమాగమం, ఆ సమాగమం వల్ల కలిగే మహానుభవం తన పంచేంద్రియాల కలిమికి పరమార్థమని ఆమె భావన! ఈ అవయవాలన్నింటికీ సార్థక్యం అదేనని ఆమె విశ్వాసం!....... శరీర సాకల్యానికీ, జన్మ సాఫల్యానికీ చేసిన మహోదాత్త సమన్వయం ఈ పద్య ప్రసూనం!

ఈ సందర్భములో, ఈ పద్యానికి సంబంధించిన నా స్వానుభవం ఒకటి ఉటంకించకుండా ఉండలేకపోతున్నాను!........ నాకు బాగా ఇష్టమైన పద్యాల్లో ఇది ఒకటి. చాలారోజుల నుండి, ఈ పద్యమును విన్నప్పుడల్లా నాలో ఒక సందేహం కదలాడుతూ ఉండేది. ఇది సీసపద్యం. సీసపద్యానికి 4 పాదాలు, చివరలో ఎత్తుగీతి ఉంటాయని మనందరికీ తెలిసినదే! ఐతే, పోతనగారు మొదటిపాదములో చెవులనూ, రెండవపాదములో తనువునూ, మూడవపాదములో నేత్రాలనూ, నాల్గవపాదములో జిహ్వనూ ప్రస్తావించి, ఎత్తుగీతిలో నాసిక గురించి చెప్పారు. నాకు ఏమనిపించేదంటే, 'ఒక్కొక్క పాదములో ఒక్కొక్క అవయవమును అభివర్ణించిన కవీశ్వరులు, 2వ పాదములో మాత్రము సర్వావయవ సమ్మిళితమైన శరీరాన్ని ఎందుకు చెప్పారు?!... ఎత్తుగీతిలో ప్రస్తావించిన నాసికను 2వ పాదములో చెప్పి, తనువును ఎత్తుగీతిలో చెప్పివుంటే ఇంకా బాగా ఉండేది కదా!' అనుకునేవాడిని. సంపూర్ణమైన ఛందోజ్ఞానం నాకు లేకపోవడంచేత, 'ఒకవేళ సీసపద్యము యొక్క ఛందస్సు అందుకు అనుమతించలేదేమో!' అని నాకు నేనే సమాధానం చెప్పుకునేవాడిని. ఐనా, సంతృప్తి కలగక ఎవరైనా విజ్ఞులైనవారితో నా సందేహనివృత్తి చేసుకోవాలని అనుకున్నాను...... ఐతే, ఆశ్చర్యకరంగా నేను ఈ వ్యాసమును తయారుచేసుకునేటప్పుడే తటాలున మెరుపు మెరిసినట్టుగా నా సందేహానికి సమాధానం దొరికింది!

అదేమిటో వివరిస్తాను.

ఈ మానవ శరీరం పాంచభౌతికమైనదని ఇంతకుముందే చెప్పుకున్నాము. అనగా, పంచభూతముల మేళవింపుతో తయారైనదన్నమాట! పంచభూతములు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలము మరియు భూమి. వీటి ఆవిర్భావం ఏ వరుసలో జరిగినదో "భాగవతము" లో విశదంగా ఉంది. ప్రథమంగా అనంతమైన ఆకాశం ఉండేది. తర్వాత వాయువు, ఆపైన అగ్ని, ఆ పిమ్మట నీరు, అటుపైన భూమి ఏర్పడినాయని "భాగవతము" చెప్తున్నది. ఈ పంచభూతముల యొక్క ప్రధానగుణములు సైతం "భాగవతము"లో చెప్పబడ్డాయి. అవి ఎలాగంటే, వరుసగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనబడే గుణములు. అనగా, మొదటిదైన ఆకాశమునకు శబ్దగుణము, రెండవదైన వాయువుకు స్పర్శగుణము, మూడవదైన అగ్నికి రూపము, నాల్గవదైన నీటికి రసగుణము, చివరిదైన పుడమికి గంధగుణము ప్రధానమైనవని చెప్పారు మన మహర్షులు.

మనం చెప్పుకుంటున్న సీసపద్యములో పోతనామాత్యులు ఈ క్రమాన్నే పాటిస్తూ, వరుసగా ఒక్కొక్క పాదములో ఒక్కొక్క గుణానికి సంబంధించిన శరీరావయవమును వర్ణించారు. శబ్దగుణముకు ఆలంబనం కర్ణములు కనుక వాటిని మొదటిపాదములో, రెండవదైన స్పర్శగుణానికి ప్రాతినిధ్యం వహించేది చర్మమే కాబట్టి 2వ పాదములో తనువును, మూడవదైన రూపగుణానికి ప్రతినిధులుగా 3వ పాదములో నయనాలను, నాల్గవదైన రసగుణానికి 4వ పాదములో రసనను అనగా నాలుకను, చివరిదైన గంధగుణానికి ఆలంబనమైన నాసికను ఎత్తుగీతిలో పేర్కొన్నారు.

పైవిధంగా పర్యాలోచించి చూసుకుంటే, నా సందేహం మబ్బుతెరలా విడిపోయింది.

ఈ పద్యములో పురుషోత్తముని వనమాలికను ప్రస్తావించారు పోతనగారు. దీని గురించి ఒకమాట! ' వనమాలిక ' అంటే 5 రకముల పుష్పములతో కూర్చబడి, దేవదేవుని గళం నుండి చరణయుగళం దాకా (కంఠం నుండి పాదముల వరకు) వ్రేలాడుతూ ఉండే పూలమాల. దీనికే "వైజయంతిమాల" అని పేరు....... పరమ భాగవతోత్తముడైన విప్రనారాయణుడు ఈ వైజయంతిమాల అంశతోనే జన్మించినాడని అంటారు. సారంగు తమ్మయ అనే కవీశ్వరుడు విప్రనారాయణుని కథను "వైజయంతీ విలాసము" అనే పేరిట కావ్యంగా వెలయించాడు.

మొత్తం మీద రుక్మిణీసందేశములోని ఈ చివరి పద్యము రుక్మిణి దాస్యభక్తితో పాటు, పోతన కవితాశక్తిని ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తున్నది.

*** *** *** ***

రుక్మిణీసందేశ రూపకంగా ఉన్న 8 పద్యాలను నా చేతనైనంతమేరకు వివరించే ప్రయత్నం చేశాను. సాహితీమిత్రులు నా ఈ ప్రయత్నాన్ని సమాదరిస్తారని ఆశిస్తున్నాను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!