మగవారూ - ఆడవేషాలూ ! -కవి శేఖర పానుగంటి లక్ష్మీనరసింహారావు

మగవారూ - ఆడవేషాలూ !

-కవి శేఖర పానుగంటి లక్ష్మీనరసింహారావు

ఒక మహిళా సంఘంలో ఉపన్యాసం ఇవ్వడానికి ఒకామె రాసుకున్న ప్రసంగ వ్యాసం సాక్షి సంఘానికి చేరింది.

మగవాడు మొదటి నుండి మన అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని తెలిసి కూడా అతని పాపాన అతడే పోతాడని ఊరుకున్నాం చాలా కాలం.

ఇప్పుడు వాళ్ళకెదురు తిరిగి అన్ని రంగాలలో పైకి వస్తున్నాము కాబట్టి అసూయతో కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు.వారికి సమానం కావాలనే దురాశతో మనం వారిని అనుకరిస్తున్నామని వెక్కిస్తున్నాడు.

మనకు అవసరమైనది మనం చేస్తున్నాము కాని తనను అనుకరించే ఉద్దేశ్యం ఎంత మాత్రం లేదని అతనికి ఎందుకు తెలియదు.? తాను మాత్రం ఎవరిని ఇమిటేట్ చేసి యిన్ని వేషాలు తెచ్చుకున్నాడు.

తను మనసు కాఫీ కొట్టవచ్చా ? కానీ మనం మాత్రం అతన్ని కాఫీ కొట్టకూడదా ? నాటకాలలో స్త్రీ పాత్రలు మగవాళ్ళు ఎందుకు వెయ్యాలి ?సొగసుగా ఉంటుందని మనం, ముంగురులు ఆ చెంపా ఈ చెంపా..ఒక్కొక్క అంగుళం వెడల్పున కత్తిరించుకుంటే ఎంత అల్లరి పెట్టాడు.అలాంటిది తను మీసాలు పూర్తిగా గొరిగించుకుని నాటకం స్టేజి మీద పోతు పేరంటాలులా నిలబడినప్పుడు మనం చెంపలు వాయిస్తే తప్పేముంది?.

రైకకు బొత్తాలు అంటించి చేతులు రవంత పొడుగు చేసుకుంటే కళ్ళల్లో మేకులు కొట్టుకున్నాడే !అలాంటిది అతనిప్పుడు మన రైక తొడుక్కుని మరేవో తగలబెట్టుకుని సిగ్గులేక ఉభయ భ్రష్టత్వపు ఆడ రూపంలో మగముత్తైదవులా నిలబడితే మనని అవమానించినట్లే కదా !

చుట్ట కాల్చి, మాడ్చుకున్న పెదాల మీద లత్తుక పూస్తాడు.అసలే మన తల కంటే అతని తల పెద్దది.అది చాలనట్టు దానిమీద సవరాలు పెట్టడం.

మొత్తం మీద రాకాసి తలలా అనిపిస్తుంది.ఉలా తయారయ్యి తనేదో జనన్మోహిని అవతారం అనుకుంటాడు. ఆడదానిని అనుకరించడం తన తరమా ?

అసలు ఆడదాని చూపును అలవర్చుకోగలడా మగవాడు? సూటిగా ఒక్క క్షణం చూసి తక్షణం చూపు మరల్చుకోగల లావణ్యం మగవాడికుందా ?.

మంగళ హారతి ఇచ్చినట్టు ఒక్క చూపుతో పరిసరాలన్నీ తిప్పి చూడగల ఆడదాని నేర్పు, కళ్ళల్లో ఒక్కసారి మెరుపు చూపించి అంతలోనే ఆర్పేయగల ఒడుపు మగవాడు స్వంతం చేసుకోగాలడా ?

పెదాలపై పండు వెన్నెల్లా కనబడవలసిన మందహాసాన్ని పెదాల మీదనే దాచేసి కంటికోనలో ఓ మూల దాచేయడం ఆడదానికే తగుతుంది కానీ ఈ నపుంసక రూపానికా?.

అసలు ఆడదానిలా నిలబడగలడా మగవాడు ? చనువు ప్రేమ,కనబరచవలసిన భర్త ఎదుట ఎలా నిలబడాలో, కాసంత మాత్రమే గౌరవం చూపాల్సిన పెద్దబావగారి వద్ద ఎలా నిలవాలో, భయగౌరవాలు రెండూ కనబరచవలసిన మామ గారి వద్ద ఎలా నిలబడాలో ఆ తేడా మగవాడు చూపగలడా ?.

ఒక ఉదాహరణ చెప్తాను. నా భర్త 'శాకుంతలం 'నాటకంలో ప్రియంవద వేషం వేస్తున్నాడంటే చూడడానికి వెళ్లాను. మొక్కలకు నీళ్ళు పోయడానికి శకుంతలతో కలిపి చేతిలో చెంబు పట్టుకుని మా ఆయన స్టేజి ఎక్కాడు.

ఎలా నిలబడ్డాడో తెలుసా ?.

ఎడమ చేయి నడుము మీడుకి జారి పోయింది. కుడిచేతిలో ఇత్తడి చెంబు పట్టుకుని ప్రాప్టింగు చెప్పేవాడి వైపు చూస్తున్నాడు.అదెలా ఉందో తెలుసా?.

టాయిలెట్ క్యూలో నిలబడినట్టుంది.అసలు ఏ స్త్రీయేనా అలా నిలబడుతుందా ?నడుము మీద చేయి వేసుకుంటే,బుగ్గ మీద వేలు పెట్టుకుంటే,మాటిమాటికి పైట సవరించుకుంటే ఆడదానిని అనుకరించినట్లేనా ?

వెర్రి వెర్రి పక్క చూపులు చూసి, ముసి ముసి నవ్వులు నవ్వితే మనంఆడదనుకోవాలా?ఆడదాని వేషం మగవాడికి ఎలా అబ్బుతుంది.

ఒకసారి 'ద్రౌపది వస్త్రాపహరణం 'నాటకానికి వెళ్లాను.దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఒలిచే దృశ్యం.చీరలు ఎంత మట్టుకు లాగాలో దుశ్శాసనుడికి తెలియదు.ఎంతవరకూ లాగించుకోవాలో ద్రౌపదికీ తెలియదు.

ఇద్దరూ కూడా చెడతాగి ఉన్నారు.ద్రౌపది వేషం స్త్రీ వేసి ఉంటే జాగ్రత్త పది వుండేది.కానీ వేషం కట్టినది పురుషుడు కదా !'వద్దు వద్దు 'అని తెరచాటు నుండి కేకలు వేసినా దుశ్శాసనుడు ఆగలేదు.ద్రౌపది ఆపలేదు.చివరికి ద్రౌపది వేషధారికి'రైక క్రింద గావంచా మిగిలింది.నెత్తిపైన బుట్టలా పైన సవరం ఒకటి.

సృష్టికంతకు ఒక్కటే దిష్టిపెడతలా ద్రౌపది మిగిలింది.పుట్టు గుడ్డి వేషం వేస్తున్న ధృతరాష్ట్రుడు కూడా ఆ దృశ్యం చూడలేక ఎవరి సహాయం లేకుండానే తెరచాటుకి పారిపోయాడు.

కర్టెన్ వేయబోతే పడలేదు.

ద్రౌపది నాటకం కాంట్రాక్టరంటే భయం వేసింది కాబోలు కిందకు ఉరికాడు.తను ఆడో,మగో మర్చిపోయి పురుషులవైపునే పరిగెట్టాలో,స్త్రీల వైపుకు పరిగెట్టాలో అర్థంకాక చివరికి స్త్రీల వైపు పరిగెట్టి వాళ్ళ మధ్యన కూచున్నాడు.

ఆడవాళ్ళంతా తటాలుగా లేచిపోయి పాక కాలినంత హడావుడి చేసి కేకలు వేసారు.చివరకు కొందరు మగవాళ్ళు వచ్చి ఆ వేషధారిని చావగొట్టారు కొంతకాలం పాటు ఆడవేషాలు వేస్తె పాత్రధారి ఇలాగే అవుతాడు. ఇంకొక స్త్రీ పాత్రధారి గురించి చెప్తాను.

ఆయన ఓ రోజు మార్కెట్లో కూరలు కొంటున్నాడు.పైన ఉత్తరీయంలో కూరలు మూట కట్టుకుని వెళ్తున్నాడు.

జన్మత: ఆడంగివాడు కాదు కానీ పది సంవత్సరాలుగా ఆడ వేషం వేస్తున్నాడు ఓ నాటకం కంపెనీలో. ఇంతలో ఆ కంపెనీ యజమాని అలా వచ్చాడు.

అతన్ని చూడగానే ఇతను సిగ్గుపడి, ముడుచుకుపోయి మూట గట్టగా మిగిలిన ఉత్తరీయంతో పైట వేసుకోబోయి,అది చాలక పోవడంతో రెండు చేతులను కత్తెరలాగా ఛాతీపై వేసుకుని తలవంచుకుని నిలబడ్డాడు.

ఒక్క నిమిషంలో తన మగతనాన్ని మసి చేసుకున్నాడు.అలా అని ఆడదీ కాలేకపోయాడు.

బాహ్య లక్షణాలే అనుకరించలేనివాడు స్త్రీ అంతరంగ లక్షణాలు అనుకరించగలడా ?. మనసు అంగీకరించడానికి ప్రయత్నించి భంగపడిన మగవాడు మనం అతన్ని అనుకరిస్తున్నామనడం హాస్యాస్పదం కదూ !

అసలు మగతత్వానికి ఆడతనానికి ఎంతో భేదం ఉంది కాబట్టి స్త్రీ పురుషులకు ఒకరంటే ఒకరికి ఆకర్షణ ఉంది.

ఇద్దరి మధ్య ఆ గీత చెరిపి వేయబోతే ఇలాగే ఉంటుంది ".

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!