Sunday, September 11, 2016

రుక్మిణీ సందేశము ! (వివరణ ..... శ్రీ పిస్కా సత్యనారయణ గారు.)

రుక్మిణీ సందేశము !

(వివరణ ..... శ్రీ పిస్కా సత్యనారయణ గారు.)

నాలుగవ పద్యము

వ్రతముల్, దేవ గురు ద్విజన్మ బుధ సేవల్, దానధర్మాదులున్ 

గతజన్మంబుల నీశ్వరున్, హరి, జగత్కళ్యాణు గాంక్షించి చే 

సితినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడౌగాక! ని 

ర్జితులై బోదురుగాక సంగరములో జేదీశ ముఖ్యాధముల్

ఈ పద్యములో తన పూర్వజన్మ సుకృతఫలంగా శ్రీకృష్ణుడే తనకు భర్తగా లభించాలని రుక్మిణి కోరుకుంటున్నది.

వెనుకటి జన్మలలో నేను వ్రతములను, దేవతలకు, ఆచార్యులకు, బ్రాహ్మణులకు, జ్ఞానులకు సేవలను, దానధర్మాదులను సర్వేశ్వరుడైన శ్రీవిష్ణుమూర్తి యొక్క ప్రీత్యర్థం చేసివుంటే, ఈ జన్మలో నాకు వసుదేవనందనుడైన శ్రీకృష్ణుడే ప్రాణనాథుడు కావాలనీ, శిశుపాలాది నీచులు ఆ యదువీరుని చేతిలో సంగరరంగాన నిర్జింపబడాలనీ రుక్మిణి ప్రార్థిస్తున్నది.

భగవంతుని ప్రీతి కొరకు ఆయనకు సేవాపరంగా కర్మలను ఆచరిస్తే, అవి భగత్ప్రాప్తిని కలిగిస్తాయని శ్రుతులు, స్మృతులు బోధిస్తున్నాయి. పుణ్యకర్మల చేత భగవానుడు తృప్తినొందినప్పుడు, తానే జీవులను చేబట్టి తన సన్నిధికి చేర్చుకుంటాడు. అందుకే "పుణ్యం కొద్దీ పురుషుడు" అంటారు. కాబట్టి తన పూర్వజన్మ పుణ్యఫలమే తన మనోభీష్టాన్ని పూర్తిచేయగలదని రుక్మిణి విశ్వాసం!

"వసుదేవనందనుడు" అంటే వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు. అందుకే ఆయనను "వాసుదేవుడు" అంటారు....... దశరథ పుత్రుడైన శ్రీరాముణ్ణి "దాశరథీ" అని సంబోధించడం కూడా ఇట్టిదే!రుక్మిణీ సందేశము 

.

ఐదవ పద్యము

మరి, ఐదవ పద్యములో రుక్మిణి ఏమంటున్నదో చూడండి.

"అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో 

పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా 

వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే 

యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్."

.

ఈ పద్యములో శ్రీకృష్ణుడు తనను చేపట్టవలసిన విధానాన్ని రుక్మిణి విన్నవిస్తున్నది.

పంకజనాభుడవూ, పురుషశ్రేష్ఠుడవూ అయిన ఓ కృష్ణా! నీవు అడ్డు చెప్పేందుకు కారణమేమీ లేదు. రథ, గజ, తురగ, పదాతి చతురంగబలములతో నీవు విచ్చేసి, శిశుపాల జరాసంధులను జయించి, నా వద్దకు వచ్చి, క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించి తీసికొని వెళ్ళు. నేను నీ వెంట వస్తాను. ఇదీ ఈ పద్య భావము.

.

(మగధ చక్రవర్తియైన జరాసంధుడు తన కూతుళ్ళు ఇద్దరిని కంసునికి ఇచ్చి వివాహం చేశాడు. తన అల్లుడు కంసుని హతమార్చిన శ్రీకృష్ణునిపై పగతో ఉన్నాడు. ఇతడు శిశుపాలునికి, రుక్మి కి మిత్రుడు.)

విష్ణుమూర్తి పద్మనాభుడు. ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్తయైన బ్రహ్మదేవుని యొక్క జన్మస్థానము విష్ణుమూర్తి బొడ్డులో నుండి మొలిచిన కమలము. నాభి నుండి ఆరంభమైన ఆలోచన, సంకల్పము స్థిరమైనవి, అమోఘమైనవి. అందువల్ల ఆ పంకజనాభుడైన వాసుదేవుడు తలచుకుంటే ఏ కార్యమైనా ఎలాంటి అవాంతరం లేకుండా నిర్విఘ్నంగా నెరవేరుతుందనే అర్థం ఈ "పంకజనాభ!" అనే సంబోధనలో స్ఫురిస్తున్నది.

.

వ్యాసమహర్షులవారి "సంస్కృత భాగవతము" లో "నీవు రహస్యంగా విదర్భకు వచ్చి, రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించు" అని రుక్మిణి విన్నవించినట్టుగా ఉంది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అంశయైన గోపాలుణ్ణి రహస్యంగా రమ్మనడం పోతనగారికి నచ్చినట్లు లేదు. అందుకే, బాహాటంగా చతురంగబలాలతో రమ్మంటున్నది పోతనగారి రుక్మిణి!

ఇకపోతే, వివాహాలు 8 రకములని పెద్దలు చెప్పారు. ఈ ఎనిమిదింటిని "అష్టవిధ వివాహములు" గా మన పూర్వులు వర్గీకరించారు.

1) బ్రాహ్మము : ప్రతిఫలాపేక్ష లేకుండా సాలంకృతయైన కన్యను సమర్థుడైన వరునకు ఇచ్చి వివాహం చేయడం.

2) దైవము : కన్యాదాత యజ్ఞం చేసి, ఋత్విక్కును పూజించి, అతనికి కన్యను ఇచ్చి పెళ్ళి చేయడం.

3) ఆర్షము : కన్య తల్లిదండ్రులు వరుని నుండి గోమిధునాన్ని స్వీకరించి, శాస్త్రవిధేయంగా కన్యను ఇచ్చి వివాహం చేయడం.

4) ప్రాజాపత్యము : ' నేను సంతానార్థం పెళ్ళి చేసికొని, గృహస్థాశ్రమధర్మాలు ఆచరిస్తాను ' అని వరునితో ప్రతిజ్ఞ చేయించి, కట్నకానుకల ప్రసక్తి లేకుండా పెళ్ళి చేయడం.

5) రాక్షసము : కన్య తనకు నచ్చినవానిని తనవారి అంగీకారం ఉన్నా, లేకపోయినా (వరునిచే బలాత్కారంగానైనా సరే తీసుకొని వెళ్ళబడి) వివాహం చేసుకోవడం.

6) ఆసురము: కన్యాశుల్కం ఇచ్చి పెళ్ళి చేసుకోవడం.

7) గాంధర్వము: పెద్దల ప్రమేయం లేకుండా వధూవరులు పరస్పర ప్రేమానురాగాలతో చేసుకొనే వివాహం.

8) పైశాచము: స్పృహలేని, తనను తాను రక్షించుకోలేని దశలో ఉన్న కన్యను, కేవలం కామదృష్టితో పెళ్ళి చేసుకోవడం.

వీటిలో గాంధర్వము, రాక్షసము అనేవి క్షత్రియులకు శాస్త్రసమ్మతమైనవని "మహాభారతము - ఆదిపర్వము" లో చెప్పబడింది - "గాంధర్వ రాక్షసే క్షత్రే ధర్మ్యౌతౌ మా విశంకిధాః" అని.

స్త్రీపురుషులు పరస్పరం ఒకరినొకరు ఇష్టపడి, రహస్యంగా వివాహం చేసుకోవడం ' గాంధర్వము ' అనబడుతుంది. "మహాభారతము" లో శకుంతలా దుష్యంతుల పరిణయం ఈ పద్ధతిలోనే జరిగింది.

పురుషుడు తనను ఇష్టపడిన స్త్రీని ఎత్తుకువెళ్ళి వివాహం చేసుకోవడం ' రాక్షసము ' గా చెప్పబడింది. "మహాభారతము" లోనే భీష్ముడు తన తమ్ముడైన విచిత్రవీర్యుని కొరకు కాశీరాజు కూతుళ్ళైన అంబ, అంబిక, అంబాలికలను స్వయంవరమంటపములోని రాజులందరినీ జయించి, హస్తినాపురానికి తీసుకువచ్చి పెళ్ళి జరిపిస్తాడు. (వారిలో పెద్దదైన అంబ తాను సాళ్వుణ్ణి ప్రేమించానని చెప్తే, ఆమెను వెనక్కి పంపిస్తాడు.)

ఇటీవలి చారిత్రికకాలానికి వస్తే, జయచంద్రుని కుమార్తెయైన సంయుక్తను, పృథ్వీరాజు పైవిధంగా స్వయంవరమంటపము నుండి ఎత్తుకెళ్ళి వివాహం చేసుకుంటాడు. ఈ సంఘటనలు రాక్షసవివాహ పరిధిలోకి వస్తాయి.

ఇక్కడ రుక్మిణి సైతం తనను రాక్షసవివాహ పద్ధతిలో పరిగ్రహించమని ఆ దేవదేవుణ్ణి అర్థిస్తున్నది. అది క్షత్రియోచితమైన కార్యమే కనుక, ఎవరికీ ఆక్షేపించే అవకాశం లేదని ఆమె భావన.

ఇక, ఆరవ పద్యము.

No comments:

Post a Comment