కవిసమ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు!

కవిసమ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు!

---------------------------------------------

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు 10-09-1895 న కృష్ణాజిల్లా లోని నందమూరు అనే గ్రామంలో శ్రీ శోభనాద్రి,పార్వతమ్మ దంపతులకు జన్మించారు.వారి ప్రాధమిక విద్యాభ్యాసం అంతా నందమూరు,ఇందుపల్లి,పెదపాడు గ్రామాలలో జరిగింది.ఉన్నత విద్య అంతా బందరులో జరిగింది.వారి అదృష్టం కొద్దీ బందరులో వారికి తెలుగు ఉపాధ్యాయుడిగా శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు ఉండేవారు.ఆ రోజుల్లో వీరిపై పింగళి లక్ష్మీకాంతం,కాటూరి వెంకటేశ్వరరావు,కోట వెంకటాచలం గార్ల వంటి ప్రఖ్యాత కవుల ప్రభావం ఉండేది.పదునాలుగు ఏండ్ల ప్రాయం నుండే రచనలు ప్రారంభించారు.కానీ అవి తరువాతి కాలంలో ప్రచురించపడ్డాయి. B.A. పూర్తి చేసిన తరువాత కొంత కాలం బందరులోనే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు.ఉపాధ్యాయ వృత్తి కొనసాగిస్తూనే private గా మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో M.A పట్టాను పొందారు.ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మహాత్మా గాంధీ గారి ప్రేరణతో సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు.ఆ తరువాత మళ్ళీ వివిధ కళాశాలల్లో ఉపన్యాసకుడిగా పనిచేసారు.బందరులోని ఆంద్ర జాతీయ కళాశాల,గుంటూరులోని ఆంద్ర క్రైస్తవ కళాశాలలో,విజయవాడలోని SRR&CVR కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేసారు. ఆతరువాత కరీంనగర్ లోని ప్రభుత్వ కళాశాలకు ప్రిన్సిపాల్ గా కొంత కాలం పనిచేసారు.వారి భార్య పేరు శ్రీమతి వరలక్ష్మమ్మ గారు. వారు తమ రచనా వ్యాసంగాన్ని 1916 లో "విశ్వేశ్వర శతకం" తో ప్రారంభించారు.అదే కాలంలో వీరు "ఆంధ్రపౌరుషం"అనే ప్రసిద్ధ కావ్యాన్ని వ్రాసారు. ఆ కావ్యంతోనే వీరికి కవికులంలో ఒక విసిష్ఠ స్థానం వచ్చిందని చెప్పటంలో సందేహం లేదు.అదంతా దేశభక్తి మరియూ ప్రబోధాత్మక కావ్యం. ఆ తదుపరి "ధ్యాన కైలాసం" అనే నాటకాన్ని,"అంతరాత్మ" అనే నవలను వ్రాసి వినుతికెక్కారు.ఆ రోజుల్లోనే వీరు అనేక భక్తి, ఆధ్యాత్మిక సంబంధిత గ్రంధాలు వ్రాసారు."కిన్నెరసాని పాటలు ","గిరికుమార గీతాలు", నర్తనశాల,శృంగారవీధి,అనార్కలి,చెలియలికట్ట,ఏకవీర, మొదలగు శతాధిక గ్రంధాలను వ్రాసారు..పద్యాలు,గద్యాలు,శతకాలు,నాటకాలు,గేయాలు ,నవలలు,కథలు---ఇలా వారు చేపట్టని సాహితీ ప్రక్రియ లేనేలేదని చెప్పటంలో సందేహం ఏమాత్రం లేదు.అతి ప్రఖ్యాతమైన వీరి "వేయి పడగులు" నవలను శ్రీ పీ.వీ.నరసింహారావు గారు "సహస్ర ఫణ్" అనే పేరుతో హిందీ భాషలోకి అనువదించారు. ఆ తరువాతనే వీరికి జ్ఞానపీఠం వారి పురస్కారం లభించింది. వీరు కవిసమ్రాట్ అనే బిరుదుకు పూర్తి అర్హులు. ఆంద్ర విశ్వవిద్యాలయం వారు వీరిని "కళా ప్రపూర్ణ"బిరుదుతో సత్కరించారు.ఆ తరువాత "రామాయణ కల్పవృక్షం" అనే పద్య కావ్యంలో రామాయణం లోని వివిధ ఘట్టాలను ఆయన తనదైన బాణీలో వ్రాసి వినుతికెక్కారు. పాముపాట,తెరచిరాజు ,పిల్లల రామాయణం ...ఇలా ఎన్నని చెప్పగలం?.ఈ కవికులతిలకుని తెలుగు ప్రజలు, వారి షష్టిపూర్తి సందర్భంలో గుడివాడలో గజారోహణంచే సత్కరించి,తమ సాహితీ ప్రేమను చాటుకున్నారు.కొంతకాలం ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీకి ఉపాధ్యక్షులుగా పని చేసారు.1958 లో M.l.C.గా నియమించపడ్డారు.ఆ తరువాత ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం వీరిని ఆస్థానకవిగా నియమించి గౌరవించింది.భారత ప్రభుత్వం వీరిని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.పూర్తి సాంప్రదాయ వాది అని చాలా మంది అనుకుంటారు. అది కొంతవరకు పొరపాటు.కొత్తదనాన్ని కూడా కొంతవరకు ప్రేమించారు శ్రీశ్రీకి వీరికి చుక్కెదురు."నా వంటి కవి మరో వెయ్యేళ్ళ వరకూ పుట్టడు" అని విశ్వనాధవారు అంటే, శ్రీ శ్రీ గారు"నిజమే! వారు పుట్టి వెయ్యేళ్ళు అయింది" అనే వారు.అయినప్పటికీ శ్రీశ్రీ గారి మహా ప్రస్తానంలోని "కవితా! ఓ కవితా" అనే గేయాన్ని శ్రీశ్రీ ముఖతః విన్న తరువాత ఆనంద బాష్పాలతో మనసారా శ్రీశ్రీ ని కౌగలించుకొని అభినందించారు.అలాగే శ్రీశ్రీకి కూడా వీరంటే గౌరవం.శ్రీశ్రీ ఇలా విశ్వనాథను పొగిడారు ఒక సందర్భంలో,"నేను చిన్నతనంలో కలం పట్టిన కొత్తరోజుల్లో నన్ను బాగా ఆకర్షించిన ఇద్దరు కవులలో విశ్వనాథవారొకరు. నేనంటే సత్యనారాయణగారికి వాత్సల్యం. వారంటే నాకు గౌరవ భావం. ఎన్నో విషయాలలో వారికీ నాకూ చుక్కెదురు. అయినా భారతీయ భాషలన్నిటిలోనూ ఒక్క తెలుగులోనే గొప్ప కవిత్వం ఉందనడంలో ఇద్దరమూ ఏకీభవిస్తాం."

.

శ్రీశ్రీ - జూన్ 9, 1973న విశ్వనాథకి సమర్పించిన అక్షర నీరాజనం.

"మాటలాడే వెన్నెముక

పాటపాడే సుషుమ్న

నిన్నటి నన్నయ్యభట్టు

ఈనాటి కవి సమ్రాట్టు

గోదావరి పలుకరింత

కృష్ణానది పులకరింత

కొండవీటి పొగమబ్బు

తెలుగువాళ్ళ గోల్డునిబ్బు

అకారాది క్షకారాంతం

ఆ సేతు మిహీకావంతం

అతగాడు తెలుగువాడి ఆస్తి

అనవరతం తెలుగునాటి ప్రకాస్తి

ఛందస్సు లేని ఈ ద్విపద

సత్యానికి నా ఉపద

(శ్రీశ్రీ వ్యాసాలు నుంచి)

.

శ్రీ విశ్వనాధ వారు నిరంకుశుడు,అహంభావి అని పేరు తెచ్చుకున్నారు.అభిమానులు మాత్రం అది అహంభావం కాదు,ఆత్మాభిమానం,స్వాతిశయం అని చెబుతుంటారు.పూర్వపు కవులలో 'కవి సార్వభౌముడు' అనే బిరుదు శ్రీనాధ కవికి ఉండేది.శ్రీ విశ్వనాధ వారి సమకాలికులైన శ్రీ నోరి నరసింహశాస్త్రి

గారికి కూడా'కవి సమ్రాట్' అనే బిరుదు వుంది.శ్రీ నోరి వారు రేపల్లెకు చెందిన వారు.వృత్తి రీత్యా న్యాయవాది.ప్రవృత్తి అంతా సాహితీ సేవే! ఎన్నో నవలలు వ్రాసారు. వాటిలో ప్రఖ్యాతి గాంచినది 'శ్రీ నాధుడు' అనే నవల.(ఈ నవలను ఆధారంగా చేసుకొనే బాపూరమణులు NTR తో శ్రీనాధ సార్వభౌమ అనే సినిమాను తీసారు). సమకాలికుడైన వీరిని కూడా'కవి సమ్రాట్' అని పిలవటం విశ్వనాధ వారికి అంత రుచించలేదు.ఆ విషయాన్ని అన్యాపదేశంగా ఒక వ్యాసంలో ప్రస్థావిస్తూ,ఇలా వ్రాసారు--" రాజులు ఎందరైన ఉండవచ్చు,చక్రవర్తులు కొందరే ఉంటారు.చక్రవర్తులు మరెందరో ఉండవచ్చు,కానీ, 'సమ్రాట్'ఒక్కడే ఉంటాడు" అని వ్రాసారు. దాని భావం, తన కాలంలోని సాహితీ ప్రపంచానికి తానే'సమ్రాట్' అని చెప్పటమే! గురువులపట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాధకు తన ప్రతిభ గురించి అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవారు. తనంతటివాడు శిష్యుడయ్యాడని చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు లభించలేదని, చెళ్ళపిళ్ళవారికే దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మానసభలో అన్నారు విశ్వనాధ. ఆ పద్యం ఇలాగా ఉంటుంది.

అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం

డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో

హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే

శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్

"పూర్వపు కవులైన నన్నయ్య,తిక్కనలకు లేనటువంటి గౌరవం,మా గురువు గారు శ్రీ చెళ్ళపిళ్ళ వారికి దక్కింది.దానికి కారణం,నా వంటి శిష్యుని పొందటమే!"చూడండీ! వారి చమత్కారం! గురువుగారి గొప్ప తనాన్ని చెబుతూ మధ్యలో ఆయన గొప్పతనాన్ని కూడా ఎంత చక్కగా చెప్పారో!

తన శిష్యుని గురించి గురువు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు ఇలా అన్నారు ----

నా మార్గమ్మును కాదు, వీని దరయన్ నా తాత ముత్తాతలం

దే మార్గమ్మును కాదు; మార్గమదియింకేదో యనంగా వలెన్

సామాన్యుండనరాదు వీని కవితా సమ్రాట్వ్త మా హేతువై,

యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్.

ఆ గురు శిష్యుల ప్రేమాను రాగాలు అలా ఉండేవి.

.

రాముణ్ణి గుర్తు చేసే సీత ఆకృతి

----------------------------

అశోకవనంలో హనుమకి కనబడిన సీత ఆకృతి రాముణ్ణి స్ఫురింప జేసిందని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి అద్భుత కల్పన, వారి 'రామాయణ కల్పవృక్షం' కావ్యంలోనిది:

ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చా-

పాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామ దే-

హాకృతి, సర్వ దేహమునయందున రాఘవ వంశ మౌళి ధ-

ర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ణ యట్లుగాన్

ఆదర్శ దాంపత్యమంటే, ఆయన్ని చూస్తే ఆవిడ గుర్తుకు రావాలి, ఆమెను చూస్తే అయన గుర్తుకు రావాలి, వారి ఇంటి మర్యాద గుర్తుకి రావాలి.ఆచార్య శ్రీ జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పారు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాధ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం. చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాధ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం."వీరు అష్టావధానాలు చేసినట్లు మాత్రం నాకు తెలియదు.ఆయనకు తెలియని విద్య లేదు.సంగీతం,జ్యోతిష్యం లాంటి అనేక విద్యలలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. వారు యవ్వనంలోఉండగానే భార్య చనిపోయింది. జీవితమంతా ఒంటరి తనంతో గడిపారు

.ఆంధ్రులు గర్వించతగ్గ ప్రఖ్యాత నటుడు, తరువాతి కాలంలో ముఖ్యమంత్రి అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారు వీరి శిష్యుడే!వారు వ్రాసిన "నాయకురాలు" అనే నాటకంలోని స్త్రీ పాత్ర అయిన నాగమ్మ పాత్ర ద్వారానే వీరి రంగస్థల జీవితం ప్రారంభం అయింది.ఆయన చాలా నిరాడంబరంగా జీవించేవారు.వారివి కొన్ని అరుదైన ఛాయా చిత్రాలను శ్రీ తిరుమల రామచంద్ర గారు వ్రాసిన గ్రంధం "మరపురాని మనీషులు" నుండి సేకరించి,వాటిని ఈ దిగువన పొందుపరుస్తున్నాను.( శ్రీ తిరుమలరామచంద్ర గారికి స్మృత్యంజలితో....)

.

విశ్వనాధ వారు మంచి చమత్కార సంభాషణా ప్రియులు.ఒక సారి,తిరుపతి దేవస్థానం వారు వీరికి సన్మానం చేసి,మంచి శాలువ,వెయ్యినూట పదహారు రూపాయలతో సత్కరించారు. ఆ సందర్భంలో వారు చమత్కారంగా ఇలా అన్నారు----

అందరికీ గొరిగేవాడికి గొరిగే అదృష్టం నాకు కలిగించినందులకు దేవస్థానం వారికి కృతజ్ఞతలు.మరొక సందర్భంలో వీరికి ఒక పట్టణంలో సన్మానం ఏర్పాటు చేసారు. నిర్వాహకులు కప్పిన శాలువ ఆయనకు నచ్చలేదు.ఆ సందర్భంలో ఇలా అన్నారు---

ఈ సన్మానసభ నిర్వాకులకు నేను ఎంతో ఋణపడి ఉన్నాను.ఈ రోజు చేసిన సన్మానం వల్ల నాకన్నా నాభార్య ఎక్కువ సంబరపడిపోతుంది. కారణమేమిటంటే,ఆవిడ చాలా కాలం నుంచి వడియాలు పెట్టుకోవటానికి తగిన వస్త్రం దొరకక ఇబ్బంది పడుతుంది.నేటి ఈ శాలువాతో నిర్వాహకులు ఆమెను కూడా సంతోష పెట్టారు

.ఆయన విసిరిన చెణుకుకు నిర్వాహకుల ముఖంలో నెత్తురు చుక్కలేదు.మరొక సందర్భంలో శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారు,శ్రీ జాషువా గారు ఒక చోట సమావేశమై ఏదో కవితా గోష్టి చేస్తున్నారు.వీరిద్దరూ 'కవికోకిల' బిరుదాంకితులు.విశ్వనాధ వారి దృష్టి వీరి మీద పడింది.వెంటనే ఆయన ---ఏమిటీ! పక్షులు రెండూ ఒకే చోట చేరాయి? అని ఒక చమత్కార బాణం విసిరారు

.

పుంభావనా సరస్వతి,బహుముఖ ప్రజ్ఞావంతుడైన ఈ కవిసమ్రాట్ 18-10-1976 న తుది శ్వాస విడిచి "ఇంద్రసభ"కు వెళ్ళారు.

వారికి నా స్మృత్యంజలి!!!

Comments

  1. what is your problem. are you paying anything to read this article. Enduku alaa edusthunnaru. Atleast he is giving good info to read. Do not spoil this blog....Sivamani

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ ..ఇది విశ్వనాద్ సత్యనారయణ గారి జీవిత చరిత్ర .
      మరపురాని మనీషులు" నుండి సేకరించి,వాటిని ఈ దిగువన పొందుపరుస్తున్నాను.
      ( శ్రీ తిరుమలరామచంద్ర గారికి స్మృత్యంజలితో....) అని రాసేను కదా .. ఇంకా ఈ ఏడుపు. వీరికి ఎందుకు.

      Delete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. ఇది విశ్వనాద్ సత్యనారయణ గారి జీవిత చరిత్ర .
      మరపురాని మనీషులు" నుండి సేకరించి,వాటిని ఈ దిగువన పొందుపరుస్తున్నాను.
      ( శ్రీ తిరుమలరామచంద్ర గారికి స్మృత్యంజలితో....) అని రాసేను కదా .. ఇంకా ఈ ఏడుపు. ఎందుకు.

      Delete
  3. Nothing is copied
    ... biography will not change... facts only stated

    ReplyDelete
  4. ఇది విశ్వనాద్ సత్యనారయణ గారి జీవిత చరిత్ర .
    మరపురాని మనీషులు" నుండి సేకరించి,వాటిని ఈ దిగువన పొందుపరుస్తున్నాను.
    ( శ్రీ తిరుమలరామచంద్ర గారికి స్మృత్యంజలితో....) అని రాసేను కదా .. ఇంకా ఈ ఏడుపు. ఎందుకు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!