కాయ్ ! రాజా ! కాయ్ ! ( శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి గల్పిక.)

కాయ్ ! రాజా ! కాయ్ !

( శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి గల్పిక.)

చిన్నతనములో చెవుల కింపైన మాట . సామాన్య కుటుంబములో పుట్టి పెరిగిన వారిని 

రాజా ! అని ఎవరైనా సంబోధిస్తే ఎవరి కిష్ట ముండదు ? బాధ్యతలు తెలియవు కాబట్టి చిన్నపిల్ల లందఱూ రాజకుమారులు, రాజకుమార్తెలే ! 

మా దేవాడ తాతగారు విశాఖపట్టణమునకు తఱచు వచ్చేవారు. వచ్చినపు డాయనకు మడిగా జపతపాలు చేసుకుందుకు మా యిల్లు అనుకూలముగా ఉండేది . ఆయన పనులు పూర్తి అయినాక తిరిగి దేవాడ వెళ్ళే టప్పుడు ఆయన బట్టలు , సామగ్రి ఉండే చిన్నపెట్టెను పట్టుకుని బస్ స్టాండ్ కు దిగబెట్టే వాడిని. ఆయన నా చేతిలో ఒక అణా కాసు పెట్టే వారు. అణాల బదులు నయాపైస లీలోగా వాడుక లోనికి వచ్చినా , ఆరు నయాపైసలు ఒక అణాగాను, పన్నెండు పైసలు బేడ క్రిందా, పాతిక పైసలు పావలా క్రింద చెలామణి అయ్యేవి. అణాకి నాలుగు త్రిప్పుడు బిళ్ళలు వచ్చేవి. ఆ బిళ్ళకు నాలుగు చిల్లుల లోంచి దారమును దూర్చి కట్టేవారు ఆ దారముతో బిళ్ళను మధ్య మధ్యలో నాకుతూ కావలిసింత సేపు తిప్పుకొని తరువాత ఆరగించవచ్చు. చాకలెట్ లయితే రెండు వచ్చేవి. బేడకు రెండిడ్లీలు వచ్చేవి కొచ్చిన్ కేఫ్ లో . దోసెకూడా బేడ. ఏమయితే నేమి ? డబ్బు విలువ చిన్నతనములోనే బాగా తెలిసింది. మా తాతగారిచ్చే డబ్బులతో జిహ్వచాపల్యము కొంత తీరేది. అప్పుడప్పు డా డబ్బులను మా అమ్మగారికి దాచమని యిచ్చేవాడిని. లెఖ్క కోస మావిడకు తెలియ కుండా ఒక మూల గోడపై పద్దుకూడా వ్రాసుకునేవాడిని. ఒక సారి ఆ పద్దావిడ కంటబడడము " వీడు పెద్దయితే మమ్మలిని చూడడే " అని మా పిన్నిగారితో చెప్పడము, నేను సిగ్గుతో తల వంచుకొనడము కూడా జరిగాయి.

మరి ఆ దినాలలో పావలాతో నేల టిక్కట్టుతో సినిమాకు వెళ్ళవచ్చు. నిజానికి నేల టిక్కట్టనే మాటే కాని కూర్చుందుకు బెంచీ లుండేవి. మా యింటికి దగ్గరలో సముద్రపుటొడ్డున ఉన్న మినర్వా టాకీసులో నేను రెండు, మూడు, నాలుగు తరగతులలో నున్నపుడు స్వతంత్రముగా ఒక్కడినే సినిమాలు చాలా చూసాను. చాలా సినిమాలు టిక్కట్టు కొని చూసినా , తరువాత ఆ సినిమా హాలు నడిపే మా నాన్నగారి స్నేహితుని పేరు వాడుకొని ఉచితముగా కొన్ని సినిమాలు చూసా. పావలా టిక్కట్టు కొన్నా విశ్రాంతి సమయములో హాలు ఖాళీగా ఉంటే మెల్లగా సందు చూసుకొని పై తరగతులలోనికి జారుకొని కుర్చీ నాక్రమించ వచ్చు.

ఒకసారి టిక్కట్లు కొనే నేను, మా అక్క, మా తమ్ముడు బాలనాగమ్మ సినిమాకు వెళ్ళాము. చలన చిత్రములో మాయల ఫకీరు బాలనాగమ్మ నష్ట కష్టాలు పెడుతున్నాడు. మా అక్క కళ్ళ వెంబడి నీళ్ళు కారడం చూసాను. నా కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. చీకటి కాబట్టి తెలియదు కాని హాలులో చాలా మంది కళ్ళలో నీరు తిరుగుట ఖాయము. మా తమ్ముడు నా కంటె రెండు సంవత్సరాలు చిన్న. వాడి కళ్ళలో నీళ్ళు తిరగ లేదు . కాని వాడికి ఉక్రోషము వచ్చింది. ఒరేయ్ ! వెధవా ! నిన్ను చంపేస్తా నంటూ కుర్చీల మధ్య నుంచి తెర వైపు పిడికిళ్ళు బిగించి మాయల ఫకీరుని కొట్టడానికి పరుగు పెట్టాడు. వాడిని పట్టు కుందుకు వాడి వెనుక నేను , మా అక్క పరుగెట్టి వాడిని పట్టుకొని వెనుకకు తీసుకు వచ్చాము. ముందుగానే కధ తెలిసిన మా అక్క అది సినిమా అని మాయల ఫకీరు చివరలొ చనిపోతాడని ఓపిక పట్టమని మా తమ్మున కుపశమనము కల్పించింది. మఱపు రాని సంఘటన అది. సినిమా అయ్యాక చాల పర్యాయములు నటులుంటారేమో నని హాలు వెనుక శోధించే వాడిని. ఆ సంగతి నెవరికీ యింత వఱకు తెలియ పఱచలేదు.

అయితే యీ ఖర్చు లన్నిటికీ అణా అణాలు చాలవు. పైగా గోళీకాయలు వంటివి కొనుక్కోవాలి. గాలి పటా లయితే వార్తాపత్రికలతో , యీన పుల్లలతో స్వంతముగా చేసుకునే వాళ్ళము . అయినా దానికి దారపు టుండ కొనాలిగా. బొంగరాలు కూడా తెలిసాయి, కాని అవి ఖరీదు కాదు. మధ్య మధ్యలో చ్యూయింగ్ గమ్ము కొనుక్కుంటే దానిలో బొమ్మ లుండేవి. చొక్కా జేబుపై చెంబిస్త్రీతో ఆ బొమ్మను హత్తించు కోవచ్చును. నమిలిన చ్యూయింగ్ గమ్ముని జుట్టుకి పట్టించుకొని తరువాత పీకు కొనే వాళ్ళము.

ఒక సారి మా తాతగారిని దిగబెట్టి ఆయన యిచ్చిన అణా పట్టుకొని వస్తున్నా. '" కాయ్ ! రాజా ! కాయ్ ! డైమండ్ యిస్ఫేట్, కళావర్ , ఆఠీన్ రాజా ,రాణీ ! కాయ్ ! రాజా! కాయ్ !" అనే నినాదాలు వినిపిస్తే , బాట ప్రక్కనున్న జనావళి మధ్యకు వెళ్ళాను. పిల్లలు, కొద్ది మంది పెద్దలు మూగి ఉన్నారు. మధ్యలో ఒక పెద్ద బల్లపైన డైమండ్, ఆఠీన్, ఇస్ఫేట్, కళావర్ రాజు రాణుల బొమ్మ లున్నాయి.ఇంకేమైనా బొమ్మ లున్నాయో లేవో గుర్తు లేదు. కేకలు బెడుతూ ఒక వ్యక్తి అందఱినీ ఆహ్వానిస్తున్నాడు. ఒక చిన్న డబ్బాలో ఆయా గుర్తులతో నున్న పాచికలు తిప్పి బల్లపైన వేస్తున్నాడు. గుమి కూడిన వాళ్ళలో కొందఱు డబ్బులు కాస్తున్నారు. కొందఱు గెలుస్తున్నారు. పాపం కొందఱి డబ్బులు పోతున్నాయి. కొద్ది సేపా ఆటను పరికించాక నా మస్థిష్కములో చిన్న ఆశ చిగురించింది. వాడు కాయ్ ! రాజా ! కాయ్ !, అంటునే ఉన్నాడు. నా జేబులో ఆనాటి అణా కాక అదివరకటి ఒక అణాతో కలిపి రెండణా లున్నాయి. నన్ను ధర్మరాజో, నలమహారాజో గాని ఆనాడు పూనాడు. ధైర్యము చేసి అర్ధ్ణణా నల్లకలువుల రాణిపై పెట్టాను.. అర్ధణా అణా అయింది. వరుసగా డైమండ్ రాజు, ఇస్ఫేట్ రాణి, ఆఠీన్ రాణి త్రిప్పి త్రిప్పి ఆడుతున్నాను. ధైర్యము పెరిగి పణము కూడా పెంచాను. కొద్ది పందెముల లోనే నా బేడ కాస్తా పావలా, అర్ధరూపాయి , క్రమముగా నొక రూపాయి అయింది. ఆట ఆపేద్దా మనుకుంటూనే ఆశో, లేక ఆటపై మక్కువో గాని ఆట కొనసాగించా. రూపాయి పధ్నాలు గణాలు, ముప్పావలా, పదణాలు, అర్ధ రూపాయి, పావలా బేడ, అణా అయి ఆఖరి పణపు అణా " ఆకాశంబున నుండి శంభుని శిరం బందుండి " లా అవరోహణ పర్వములో పడి అంతర్ధాన మయింది. కళ్ళు నిజంగానే బైర్లు కమ్మాయి . చేసేది లేక నిరుత్సాహముతో కాళ్ళీడ్చుకుంటూ యింటి పథము పట్టాను. రాజుకి చక్రవర్తి యోగము పట్టి, తరువాత రాజ్యమును శత్రువుల కోడి పోగొట్టుకుంటే ఎటువంటి అనుభూతి పొందుతాడో అటువంటి అనుభూతినే నే నానాడు పొందాను.

కాయ్ ! రాజా ! కాయ్ ! జీవితములో చాలా విషయాలలో చాలా సారులు జూద మాడక తప్ప లేదు. కొన్ని విజయాలు, కొన్ని ఓటములు చవిచూసాను . డబ్బు కంటె మనుజుల విలువ లెక్కువ అని కూడా తెలుసుకున్నాను . ఆరోగ్యాయుష్యులే అందఱికీ మహాభాగ్యము కదా ! ఆ విషయాలే మా తనయుల కెప్పుడూ చెబుతుంటాను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!