Sunday, October 1, 2017

దేవులపల్లి -కవితల పాలవెల్లి..

.

దేవులపల్లి -కవితల పాలవెల్లి..

'' నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు? నా ఇచ్చ యే గాక నాకేటి వెరపు?'' అని నడ్డిన చేయెట్టి

తల ఎగరేసి, తలపుల పొగ వేసి, కవితల విరులు పూసి వెన్నెలల సెల ఏరులు నేమరేసిన

మాటల పాటగాడు, పాటల పన్నీటి కన్నీటి గోడు దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి గారు 1897 లోఇదే రోజున తూర్పు గోదావరి జిల్లా చంద్రం పాలెం లో జన్మించారు.

ఇదే వూళ్ళో కూచిమంచి తిమ్మకవి

కొన్ని శతాబ్దాల క్రితం నివశించాడు! '' దేవులపల్లి వంశమున దేవులు పుట్టిరి '' అని చెళ్ళ పిళ్ళ వారితో చెప్పించిన దేవులపల్లి వంశం వారు అకిరిపల్లి నుండి ఇక్కడికి వలస వచ్చారట! కృష్ణ శాస్త్రి గారి తండ్రి, పెద తండ్రి గార్లు పిఠాపురం ఆస్థాన విద్వాంసులు! పెద నాయన గారు బాల్యం లో తన పద్యాలను వినిపించి ఏది బాగుంది?అని ఈయన అభిప్రాయము అడిగేవారట! వీరితో వ్యస్తాక్షరి చేయించే వారట. ఆ పునాదుల బలంతో నే తన ఏడవ ఏటనే సామర్లకోటలో '' నంద నందనా ఇందిరా నాథ వరద!'' అని తొలిసారిగా పద్యం చెప్పారట కృష్ణ శాస్త్రి గారు.

మాటలలో గడుసుదనం,పాటలలో తీయదనం,భావంలో వెన్నెల, ఆర్ద్రత కన్నుల నిండిన, సౌకుమార్యం

పండిన పాద వల్లరికి రూపమిచ్చి, ప్రాణం పోసి పేరు పెడితే ఆ పేరు దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి!

పెద తండ్రి గారు, తమ తండ్రి గారు, ఆ తర్వాత రఘుపతి వేంకట రత్నం నాయుడు గారు ఆయనలోని

కవితా వ్యక్తిని మూర్తిమంతం చేశిన వారు. '' నవ్వంటే జాబిల్లి, పువ్వంటే మల్లి,నవ్వేటి పువ్వంటే, నా చిట్టి తల్లి ''లాంటి పిల్లల పాటలో తో మొదలుకొని, దంపుళ్ళ పాటలు,అమ్మలక్కల పాటలు,ఆకలి పాటలు,భక్తి గీతాలు ఆయన కవితా గంగ పోయిన హొయలు, సాగిన పాయలు ఎన్నెన్నో..!!

'' నేనేదో కొందరు అనుకోనేంత భక్త కవిని, భక్తుడిని కాను, కొందరనుకునేంత దుర్మార్గుడిని కాను,.ఎప్పుడో హృదయావేదన భరించలేనప్పుడు కేక పెడతాను, ఆది కీర్తన అవుతుంది '' అని తన గురించి తాను చెప్పుకున్నారు!

కాళిదాసు, భవభూతి ఒక ప్రక్కన..యమునా చార్యులు. వేదాంత దేశికులు ఒక ప్రక్కన..తిక్కన, పెద్దనలు అటు ప్రక్కన...కబీరు, సూరదాసులు ఇటు ప్రక్కన...షెల్లీ, బైరన్లు మరొక ప్రక్కన నిల్చుంటే..కృష్ణ శాస్త్రి గారు ఎవ్వరి ప్రక్కనైనా నిల్చోగలిగిన 'సత్తా' ఉన్న వారని ''దమ్మున్న' పెద్దల ఉవాచ!

తెలుగు సిని కవితకు భావుకత్వపు కుంచెతో భవ్య మైన పాటల పందిరి వేశి మాటల తోరణాలు కట్టి, అమర గాయకుల గళాలతో జంట కట్టించి శ్రోతల చెవులకు పెండ్లి పండుగ చేయించిన ఆయన సిని కవిత్వాన్ని గురించి ఎంత చెప్పినా ఎంతో మిగిలె పోతుంది..నాకైతే నావరకు..'' ఇది మల్లెల వేళ యని, ఇది వెన్నెల మాసమని, తొందర పడి ఒక కోయిల, ముందే కూసింది, విందులు చేసింది '' అనే పాట... తెలుగు సిని పాటలలో, భావానికి,భావుకత్వానికి,ఆర్ద్రతకు,అర్ధమయ్యీ కాని, అర్ధమైనా కొద్దీ ఆనందానిచ్చే తీయని బాధకు ప్రతీకగా, ప్రథమ స్థానాన్ని పొందుతుంది!

కృష్ణ శాస్త్రి గారిని ఎంతో కొంత చదువుకుంటే ఎందరినైనా మెప్పించే హాయైన సంగీతాత్మక పద బంధం పట్టుబడుతుంది!చివరి 16 సంవత్సరాల జీవితం గళాన్ని కోల్పోయి, మౌన గీతాలతో వేదనను వేదం గా స్వీకరించారు! తన బాధను ప్రపంచమంతా గేయాల రూపంలో పంచారు.. 'కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచమంతటికీ బాధ..ప్రపంచం బాధలన్నీ శ్రీ శ్రీ బాధలే' అనిపించారు! '' ఆ తరం కవులు అందరూ ఒక ఎత్తు,కృష్ణ శాస్త్రి గారు ఒక ఎత్తు, వారిలో కృష్ణ న్శాస్త్రి గారే కొంచెం ఎత్తు''అనిపించారు! ''తెలుగు దేశం నిలువుటద్దం బ్రద్దలైంది..షెల్లీ మళ్ళీ మరణించాడు..వసంతం వాడి పోయింది..'' అని శ్రీ శ్రీ

చే పలికించారు! '' మనకున్నది ఒకటే తాజ్ మహల్..ఒకడే కృష్ణ శాస్త్రి'' అనిపించారు!

ఆయన దివ్యాత్మకు శాంతి కలగాలని మనం కోరుకోనక్కర్లేదు..ఆయన దివ్యాత్మయే అమర లోకం లో తన కవితా గానంతో అమరులకు శాంతిని, ఆనందాన్ని ఇస్తూ ఉండి వుంటుంది..అప్పటి నుంచీ ఇప్పటి దాకా..ఇంకా ఎప్పటి దాకా నైనా!ఆయన సాహితీ స్రవంతి భావిలో కవులను, భావ కవులను, భలే కవులను తీర్చి దిద్దడం కొరకు ప్రవహింపజేయడమే మనకు అందమైన బాధ్యత! ఆది నెర వేర్చడమే ఆయనకు ప్రకటించే కృతజ్ఞత!

తెలిసినప్పుడు! యింకా విషాదం ఏమిటంటే నేను అప్పుడు యింట్లో లేను..ఆ పోటీ వేదిక వద్దనే శ్రోతగా అమాయకంగా వుండి పోయాను! అప్పుడు నేను పదవ తరగతిలో ఉన్నాను.

No comments:

Post a Comment