పాతైదరబాదు- హైదరాబాద్ !


-

పాతైదరబాదు- హైదరాబాద్ !

-


వూరుమారిపోతోంది. అలా మారడం దాని ధర్మం. కాని ఆ మార్పుల ఆనవాళ్ళు దాచుకోకపోవడం ఆ వూరివాళ్ళ ఖర్మం.

ఒకప్పటి హైదరాబాదు ఇప్పటి హైదరాబాదులా లేదు. ఇప్పటి హైదరాబాదు మరొకప్పటి హైదరాబాదులా వుండదు. పాత నిజామ్ కాలంనాటి నగర జీవనం ఎలావుండేదో ఆ చిత్తరువులు కొన్ని అక్కడక్కడా (ఉదాహరణకు బెల్లావిస్టా ఎడ్మినిస్త్రేటివ్ స్టాఫ్ కాలేజీ, ప్రెస్ క్లబ్ అనుకునే వుంటుంది) కనిపించినప్పుడు వొళ్ళు పులకరిస్తుంది. ఇటీవలి కాలం నాటి అంటే ఓ యాభై అరవై సంవత్సరాల హైదరాబాదు ఫోటోలు కలికానికి కూడా దొరకవు, వున్నా అవి ఏ కలిగినవాళ్ళ లోగిళ్ళకొ, అయిదు నక్షత్రాల హోటళ్ళకో పరిమితమయిపోయాయి.

హైదరాబాదు గురించి, దాని సంస్కృతీ వైభవాలు గురించి నరేంద్ర లూధర్ దగ్గర నుంచి ఉడయవర్లు వరకు ఎందరో ఎన్నో పుస్తకాలు రాసారు. 'నమస్తే తెలంగాణా' వంటి పత్రిక మళ్ళీ వాటిల్లో కొన్నింటిని అయినా సామాన్య పాఠకుల చెంతకు తెస్తే బాగుంటుంది.

వింటున్నారా కట్టా శేఖర రెడ్డి గారు. చాలా ఏళ్ళ క్రితం జర్నలిష్టు అనుభవాలను గ్రంధస్తం చేసే పనిలో, ఎన్నో సార్లు అనేకమంది జర్నలిష్టులకి ఫోన్లు చేసి, నావంటి సహజ బద్దకస్తుల చేత కూడా వ్యాసాలు రాయించిన పట్టుదల, కట్టా వారిది. ఇదంతా ఎందుకంటె, శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రాసిన ఓ పుస్తకం చదివిన వేళా విశేషం.

శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రాసిన 'హైదరాబాదు నాడు నేడు' అనే పుస్తకంలో 1935 ప్రాంతాలనాటి కొన్ని విశేషాలు రాసారు. వాటిల్లో కొన్ని ముచ్చట్లు.

"బెజవాడ నుంచి సికిందరాబాదుకు నైజాం బండిలో (నిజాం స్టేట్ రైల్వే వారు నడిపే రైలు) టిక్కెట్టు మూడు రూపాయల పదమూడు అణాలు.

" దబీర్ పురావైపు మలక్ పేట రైల్వే వంతెన కిందనుంచి వెడితే మూసీ నది మీద చాదర్ ఘాట్ బ్రిడ్జ్, మధ్యలో కొంచెం ఎత్తు, అటూ ఇటూ పల్లం. చాలా అందంగా వుండేది. మంచి తారు రోడ్డు. బ్రిడ్జ్ మధ్యలో కాలిదారి మీద ఒక బీద పకీరు కూర్చుని 'అల్లా రహమ్ కరదే, మౌలా హుకుం దే' అని చక్కని స్వరంతో పాడుతూ ఉండేవాడు. ట్రూప్ బజారులో ఓ పక్క విశాలమైన ఆవరణలో 'ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా', తరువాత సాగర్ టాకీసు, జిందా తిలిస్మాత్ దుకాణం, ఆపైన ఆబిడ్స్, అదే బజారులో రెండు ఇనుప కటకటాల ఆవరణలు ఉండేవి. ధన రాజ్ గిరి, ప్రతాప్ గిరిజీలవి అవి. ప్రతాప్ గిర్జీ మార్వాడీల గురువు. ఏటా వారి పుట్టిన రోజున ఊళ్ళోని మార్వాడీలు అందరూ కలిసి వారి ఎత్తు బంగారం తూచి కానుకగా ఇచ్చేవారట. నిజాం నవాబు కన్నా వీరు ధనవంతులని చెప్పుకునేవాళ్ళు, నవాబుగారు ఒక రోల్స్ రాయిస్ కారు కొంటే, వీళ్ళు రెండు కొనేవారట.

"ఆబిడ్స్ లో 'కెఫే కరాచీ'. అందులో అమృతప్రాయమైన చాయ్ మూడు హాలీ పైసలు. ఒక అణా పెడితే 'మలై వాలా చాయ్' నిజాం రాజ్యంలో హాలీ కరెన్సీ వాడుకలో వుండేది. నూరు రూపాయలు బ్రిటిష్ కరెన్సీకి నూటపదహారు రూపాయల పది అణాల ఎనిమిది పైసలు హాలీ డబ్బులు ఇచ్చేవాళ్ళు. 

"ఆబిడ్స్ లో జమ్రుద్ మహల్ సినిమాహాలు వుండేది. దేవికారాణి నటించిన 'జవానీకి హవా' అనే సినిమా చూడడానికి నిజాం నవాబు ఆ హాలుకు వెళ్ళారు. ఆ సినిమాహాలులో అప్పుడప్పుడు సంగీత కచ్చేరీలు కూడా జరిగేవి. ఒకసారి ముసునూరి సుబ్రహ్మణ్యం గారి పాట కచ్చేరీ జరిగింది. కాచీగూడా తుల్జా భవన్ లో ఓసారి వారం రోజులపాటు సంగీతసభ జరిపారు. చౌడయ్య సోదరులు 'హరి కాంభోజి రాగంలో 'దీనామణీ వంశ - తిలక- లావణ్య - దీన శరణ్య' అని ఫిడేలుపై వాయిస్తుంటే అంతా పరవశులైపోయారు. ఆ రోజుల్లోనే ఆబిడ్స్ కార్నర్ లో ప్యాలెస్ టాకీసు కట్టారు. 'సత్య హరిశ్చంద్ర' తెలుగు టాకీ వేసారు. గౌలి గూడాలో ఒక మూకీ సినిమా హాలు వుండేది. దానికి తెర లేదు. తెల్లని గోడ మీద బొమ్మలు నడిచేవి. 'వివేక వర్ధని' పేరుతొ మరో సినిమా హాలు వుండేది."

ఈ పుస్తకం రాసిన శాస్త్రి గారిది ప్రకాశం జిల్లా అనమనమూరు గ్రామం. 1922 లో జన్మించిన శాస్త్రి గారు కేంద్ర ప్రభుత్వ సైనిక లేఖనియంత్రణ శాఖలో వివిద హోదాల్లో దేశ విదేశాల్లో అనేక చోట్ల పనిచేశారు. 'హైదరాబాదు నాడు నేడు' అనే పేరుతొ ఆయన రాసిన ఈ పుస్తకాన్ని 2008 లో మొదటి సారి ముద్రించారు. వెల యాభై రూపాయలు. నవోదయ బుక్ హౌస్ లో దొరికే అవకాశం వుంది.

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!