సంబరాల పెట్టె మా దూరదర్శన్!

సంబరాల పెట్టె మా దూరదర్శన్!

అప్పటి దాక అదంటే ఏందో నాకస్సలు తెల్వదు. మా ఇంటి పక్కనుండే శీను వాళ్ళింట్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి అమ్మ.. అమ్మ.. గా బైరిషెట్టి ఓల్లు టి.వి తెచ్చుకున్నారే.. అని అరుసుకుంటూ చెప్పంగానే గదేంటమ్మ అని నేనడిగితే ఇప్పడు రేడియో లో మాటలు మాత్రమే వినపడతాయి గదా అందులో మనుషులు కూడ కనపడతారు అని చెప్పడంతో.. అమ్మ... అదేట్లుంటదో సూసోస్తా.. అని పరుగులాంటి నడకతో బైరిషెట్టి సమ్మయ్య ఒల్లీంటికి వెళ్ళా.. ఇల్లంతా నా బోటి పిలగాండ్లతో కిక్కిరిసింది. తోపుకుంటూ తోసుకుంటూ ఆళ్ళ తలకాయల సందుల నా తలకాయ ఇరికించి సూషినా.. నలుపు తెలుపులో కదులుతున్న మనుషులు.. నా సుట్టు గుమిగూడిన మా వాడ పిలగాండ్ల లొల్లిలో ఆ టి వి లో ఎం జరుగుతుందో అర్ధమేగాలే.. ఇగ లాభం లేదనుకున్నాడో ఏందో సమ్మయ్య పెదబాపు నడుండ్రా పోరగాల్లరా నడుండ్రి అని దబాయించి టి వి బంద్ పెట్టడంతో అందరం బయట పడ్డం..

ఇగ జుసుకో ఒకలి చెవు ఇంకోలు కొరుకుతూ మా గల్లి గల్లిలల్ల ఉన్న ప్రతి ఇంట్ల ఇదే ఇషయం హైలైటు..

నెమ్మది నెమ్మదిగ ఇక ఆల్ల ఇల్లు సందడిగా మారింది. శుక్రవారం సాయంత్రం వస్తే చాలు అందరిల్లల్లోలాగే మా అమ్మ కూడా త్వరగా వంట పూర్తి చేసేది. అటు పక్కొల్లు ఇటు పక్కొల్లు దగ్గర దగ్గర ప్రతి ఇంటి అమ్మలక్కలందరు చిత్రలహరి టైంకి చేరేటోల్లూ ఆళ్ళతోపాటే మేము కూడా.

కోడిపెట్ట తో పాటే పిల్లల్లాగా మా అమ్మ వాళ్ళతో పాటు మేము పొందిగ్గా కూసునేవాళ్ళం.. అలా అందరితో కలిసి కూసొని టి వి చూడటం లో ఉన్న మజానే వేరు.. మనుషుల్ని అంత దగ్గరగా చూడడం గక్కడినుండే షురువయ్యింది. చిత్రలహరి సూడ్డం ఒక్కటేనా మీదేం కూరా? మాది ఈ వంట? అనుకుంటూ ఏడలేని ముచ్చట్లన్ని అన్నే ఇనపడేవి.. ఇంటికొచ్చి కాస్త తిన్నాక ఇంగ్లీష్ వార్తలు అల ఐపోతాయో లేదో మా బాపు వేలు పట్టుకొని మళ్ళీ యెల్లెటోన్ని హిందీ సినిమా కోసం. మేము చేరుకునే సరికి ఇక మా వాడలోని బాపు దోస్తులంత పదిమంది దాగ రెడీ గ ఉంటె ఆల్లందరిలో నేనొక్కడినే చిన్న పిలగాన్ని. బాపు నన్ను తీసుకుబోటానికి పెద్ద కారణమే ఉంది. ఎవరో చెప్పారంట హిందీ సినిమాలు చూపించి గుండం వాడ తురుకోల్లతో మాట్లాడిస్తే హింది తొందరగా వస్తుందని. ఆ హిందీ సినిమాల పుణ్యమా అని నాకు హిందీ తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా పరిచయమయ్యాడు.. మా బాపు వాళ్ళ దోస్తులు అమితబచ్చనుకు పిచ్చి ఫ్యానులు .. ఏంటో మరి షోలే కన్నా నాకు డాన్ అంటే పిచ్చ ఇష్టం. అమర్ అక్బర్ ఆంటోనీ, కభి కభి, అభిమాన్, లావారిస్.. చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే ఐతది. అమితాబ్ సినిమాల్లో నాకు నచ్చిన రెండు పాటలు కభి కభి మేరె దిల్ మే, ఇంకోటి శరాభి లోని ఇంతిహ: హొగయి ఇంతేజార్ కి.. రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్, దేవానంద్ గైడ్ సినిమాలు ఆల్ టైం ఫేవరేట్ ఇక గైడ్ సినిమా మాత్రం ఇప్పటికి కొన్ని వందల సార్లు చూసాను. ఎందుకో తెల్వదు నాలోని అనేకానేక కోణాలు మరెన్నో తరంగాలు చిత్రం చూస్తున్నంత సేపు ఉత్తేజం అవుతుంటాయి..మనిషికి మనసుకు జరుగుతున్న సంఘర్షనల సారం చూపించిన విధానం ఎప్పటికి మరిచిపోలేను. ఆ చిత్ర దర్శకుడు ఆర్ కె నారాయణ్ అంటే వల్లమాలిన అభిమానం. తన నుండి జాలువారిన మాల్గుడి డేస్ గురించి ఎంత చెప్పిన తక్కువే అదొక చెరగని చెదరని దివ్యమైన ఆణిముత్యం.

చూస్తున్న కొద్ది షారుఖ్, అమీర్, అనిల్ కపూర్ ఒక్కొక్కరిగా టి వి లో తమ ప్రతాపాన్ని చూపించడం ప్రారంభమైంది. ఇక శనివారం ఒక్క పూట బడి ఐపొంగానే మెల్లగా మొదలయ్యేది ప్రాంతీయ బాష చలన చిత్రం. బాష అర్ధం కాకపోయినా ఎక్కువగా బాలల చిత్రాలే వేసేవారు ఏ వారం కూడా మిస్ కాకుండా సూసేటోన్ని.

ఆదివారం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతదా అని ఎదురు సూస్తుండే. సాయంత్రం అయిందంటే చాలు ఇల్లిల్లు గల్లీలు అన్ని ఖాళీ అంత టి వి ముందే. నెమ్మదిగా హబీబు వాళ్ళింట్లో కి కూడా వచ్చింది ఆ పెట్టె. ఒక దఫా అటు మరో దఫా ఇటు గా ఇడగొట్టుకొని ఎల్తుండే వాళ్ళం. ఇక చాల యేండ్ల తరువాత గాని మా ఇంట్లోకి అడుగుపెట్టలేదు. మా ఇంట్లోకి రానంత వరకు ఏదో ఓ ఇంట్లో నాకో పర్మినెంటు ప్లేసు ఉండేది. ఆ ప్లేసులో ఎవలన్నా కూర్చుంటే ఒట్టు.. మంచి సమయంలో కరెంటు పోతే మాత్రం పాపం ఆ తిట్లను గనక కరెంటు తేసేసినాయనా వింటే మెడకు ఉరి బింగించుకుంటాడు అవి అంత పవర్ఫుల్ మరి.

ఇక క్రికెట్ ఆడడం ఇప్పటికి చేతకాదు గాని చూస్తున్నంత సేపు అదేదో నేనే ఆడేస్తున్నంత గాబరా పుట్టేది ఇండియా ఓటమికి చేరువవుతున్న కొద్ది నా ఇజ్జత్ ఏదో పోతున్నదన్నంత లెవిల్లో చెమటలతో ముడుచుకు పోయేటోన్నీ... గెలిస్తే మాత్రం ఎహే గల్లి గల్లి మొత్తం పది ఇరవై మంది పిలగాల్లమంత భారత్ మాతా కి జై అనుకుంటూ మా వీధి నుండి మొదలు పెట్టి డబ్బా కాన్నుండి గుండం వాడ చెరువు గట్టు కట్ట గల్లి అల మూల మలుపులన్నీ జులుసు లాగ తిరిగేవాళ్ళం. నా కళ్ళ ముందే ఆడుకుంటూ ఆడుకుంటూ పైకొచ్చిన రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ అంటే మస్తు ఇష్టం. వాల్లేమో నిజంగానే నాకు మా దోస్తులందరికీ దోస్తులని తెగ ఫీల్ అయ్యేవాళ్ళం.

ఎందుకో తెలీదు దూరదర్శన్ అంటే ఇష్టం మొదలయ్యింది. అందులో నాకు మొదటగా నచ్చే విషయం 'స్ప్రెడ్ ది లైట్ అఫ్ ఫ్రీడం' ప్రఖ్యాత క్రీడా కళాకారులు కాగడా ని ఒకరి చేత్తో ఇంకొకరికిస్తూ అందరు కలిసి ఏకమయ్యే గీతంతో మొదలయ్యేది ప్రతి రోజు. ఆ వెంటనే సంగీత సాహిత్య చిత్ర కళాకారుల బృందం ఆలపించే మిలే సుర్ మేర తుమ్హారా అనే మధురమైన గీతం లో ఎందరో ప్రముఖులని చూడగలిగే అదృష్టం కలిగింది. 

రంగోలి, చిత్రహార్, మహాబారత్, శ్రీ కృష్ణ, రామాయణ్, విష్ణుపురాన్, ఓం నమః శివాయ, జై హనుమాన్, తేహకికాత్, అలీఫ్ లైలా, గుడ్ మార్నింగ్ ఇండియా, అల్లావుద్దీన్ నైట్, స్పైడర్ మాన్, శక్తిమాన్, భారత్ ఏక్ ఖోజ్, మాల్గుడి డేస్, మోగ్లి జంగల్ బుక్, చంద్రకాంత, అముల్ సురభి... అబ్బో ఒక్కో ప్రోగ్రాం గురించి ఒక్కో జ్ఞాపకమవుతుంది అముల్ సురభి లో ఎప్పుడు వింతలు విశేషాలని నోరెళ్ళబెట్టి చూసే వొన్ని. ఇక విక్రం ఔర్ బేతాల్ కథల గురించైతే చెప్పనక్కర్లేదు..

తెలుగులో మా అమ్మకి తెగ నచ్చే సిరియల్ ఋతురాగాలు. ఇక తెలుగు సినిమాల్లో నాకు అమితంగా నచ్చేవి సాగరసంగమం, సిరివెన్నెల ఇక నవ్వు తెప్పించే ఏ సినిమాకైనా నేను అభిమానిని. టి వి లో ఎక్కువుగా కమల్ హాసన్ సినిమాలు చూడడం వల్ల కమల్ హాసన్ కి పెద్ద ఫ్యాన్ ఐపోయా.. ఇవేనా కాదు చెప్పుకోవాలంటే తవ్వుతున్న కొద్ది బయటపడుతూనే ఉన్నాయి. పాడి పంటలు, శాంతి స్వరూప్ గారి నెమ్మదైన వార్తలు, ముళ్ళపుడి కథలు కూడా మిస్ కానిచ్చే వాణ్ణి కాను..

ఈ మధ్య కాలంలో కుప్పలకొద్ది వాణిజ్య ప్రకటనలు వద్దన్నకొద్ది రుద్దుతు రోత పెడుతుంటే అప్పుడు మాత్రం నేను మెచ్చే ప్రకటనల కోసం తెగ ఎదురు చూసే వోణ్ని ఆటిలో ధారా కుకింగ్ ఆయిల్ జిలేబి, పూరాబ్ సే సూర్య ఉగ, అమూల్ టేస్ట్ అఫ్ ఇండియా, అజంతా క్లాక్, హమారా బజాజ్, హమాం ఇలా ఎన్నో అందమైన ప్రకటనలు మంత్ర ముగ్ధుల్ని చేసేవి..

గరీబీని గుర్తు చేయకుండా మనుషుల్ని తేడా లేకుండా దగ్గర చేసేది ఒక టి వి నే అని కొందరంటే అప్పట్లో అస్సలు నమ్మలేదు. కాని ఎప్పుడైతే దూరదర్శన్ కి జిష్టి తగిలినట్టు స్టార్ కనెక్షన్లు వైరస్ లా సోకాయి. ఇంటిమీది విలువైన యాంటినాలు పుట్నాల పాలైనై.. ఇంటింటికి స్టార్ వైర్లు నిచ్చేనలేసుకొని గుంజుడే గుంజుడు ఆ ధాటికి అందరు చెల్లా చేదురైనట్టు ఇప్పుడు ఎవ్వలింట్లో వాళ్ళు కాళ్ళు జాపుకొని ఇష్టమొచ్చిన చిరు తిండ్లు తింటూ కూర్చున్నారు. కొన్నాళ్ళకి ఇక ఆ పద్దతికి కూడా ఎగనామం పెడుతూ ఒకే ఇంట్లో రెండు మూడు టి వి లు వెలిశాయి ఎవరి అభిరుచి వారిది అన్నట్టు రిమోట్ ని పీక పిసికినట్టు ఒకటే పిసుకుడు ఒక దానేంబడి ఒకటి ఉరికిస్తూ ఏ చానెల్ను చూడాల్నో అర్ధం కాక మెదడ్లు వేడెక్కి మసి బొగ్గు కాని రోజే లేదంటే ఆశ్చర్యపోనక్కరలేదు..

కాలం మనలాగే ఒక్కలా ఉండదు కదా రచ్చబండ ధాటి రేడియో ముచ్చట్లు కలిసి ఇన్న మా చుట్టాలందరిని చూసా, కష్ట సుఖాలకు మాకోసం వీళ్ళందరు ఉన్నారన్న బరోస వీధి వీధి అంత ఒకే దగ్గర టి వి చూడడం కోసం కూర్చున్నపుడు కలిగేది. మా బాపు చెప్తుండేటొడు సహాయం చేయక పోయిన పర్వాలేదు నేనున్నా అని ధైర్యం చెప్పే బలగం ఉంటె చాలు అదే పెద్ద అండ రా.. అమ్మ బాపు ని నేనుండే చోటికి ఎంత రమ్మన్న రాకపోయేది. కారణం అడిగితే మనింటిని ఆనుకోని ఎవరున్నారో తెలీకుండానే ఏళ్ళు గడుస్తాయి మనుషుల్లాగా కనిపించే యంత్రాల మధ్య బతికే ఒంటరి బతుకు నాకెందుకురా!! నేను పుట్టిన ఊరు నన్ను నిన్ను పెంచిన ఊరు దిన్ని ఒదిలి రాలేము.. అలా అని నిన్నుకాదన లేము. 

మీకు వయసొచ్చింది మీరు పారే నీరు లాంటి వారు ఎక్కడ అస్తిత్వం పొందుతారో అదే నీ చోటు నీకంటూ ఓ నలుగురుని సంపాదించుకో ఆ సంపాధనలోనే నిజమైన జీవన సూత్రం అలవడుతుంది.

నిజమే ఎవేరేం చేయకపోయినా వీళ్ళంతా నా వాళ్ళు అనుకుంటూ ఒకరికొకరు మాట సాయం చేసుకుంటూ గడపడంలో ఉన్న ఆనందం కన్నా ఇంకేముంటుంది. రోజులు మన ప్రమేయం లేకుండా మారిపోతూనే ఉంటాయి. దానికి తోడు అవసరం ఉన్న లేకున్నా మన చుట్టూ ఎన్నో మార్పులు. తప్పదు అది తప్పు అనే అధికారం కూడా ఎవరికీ లేదు. డబ్బు వెంట నన్ను నేను ప్రశ్నించుకుంటూ పరీక్షించుకుంటు పరుగులు పెట్టిస్తు సాగుతున్న పయనంలో బంగారం లాంటి సంబరాల పెట్టె మా దూరదర్శన్ ని చూడడం మానేసినా.. బంగారం లాంటి అనుభూతులు మాత్రం పదిలంగా మిగిలాయి మదిలో... ..


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!