Wednesday, October 11, 2017

ఈవీవీ -డెవడండీ బాబూ...హటాత్తుగా వెళ్ళిపోయాడు!

ఈవీవీ -డెవడండీ బాబూ...హటాత్తుగా వెళ్ళిపోయాడు!

.

అప్పు డే తెల్లారిందా” అన్న రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ తో 

ఈవీవీ నాకు పరిచయం! ఆ సినిమా అప్పుల అప్పారావు .

సీతారత్నం గారబ్బాయి,తాళి,కన్యాదానం,

మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది,ఆమె,

ఆయనకిద్దరు (ఇవన్నీ టీవీలో చూసినవే)వీటిల్లో 

ఒక్క సినిమా కూడా కొద్దిగా కూడా రియలిస్టిక్ గా ఉండదు. ఫక్తు సినిమా కథలు, నాటకీయతానూ! 

“ ఒక కమర్షియల్ నిర్మాత నుంచి అంతకన్నా ఏం ఆశిస్తాం?”

అంటే సరే మరి! 

తాళి సినిమాలో ఆ తాళి సినిమా మొత్తం మీద ఒక వంద సార్లు అటు నుంచి ఇటూ, ఇటు నుంచి అటూ మెడలు మారుతూ ఉంటుంది. సినిమా ఏమో తాళి పవిత్రత గురించి! 

ఆమె సినిమా లో క్లైమాక్స్ నాకైతే నవ్వు తెప్పించింది. ఊహను రేప్ చేయడానికి సిద్ధమవుతున్న మామ (కోట)ను, అతని భార్య(సుధ) చంపాలనుకుంటుంది. ఎలాగూ చంపితే విధవ అవుతుంది కాబట్టి…ముందుగానే ఇంట్లోకి వెళ్ళి బొట్టు చెరిపేసుకుని,తెల్ల చీరె కట్టుకుని తీరిగ్గా వచ్చి మరీ చంపుతుంది.

ఈవిడ ఆహార్యం మార్చుకొచ్చేలోపు ఏ అఘాయిత్యం జరిగినా పర్లేదన్నట్టు!(అంటే చంపాలని అంత గట్టి determination తో ఉందని అర్థం చేసుకోవాలనుకోండి) ఇంతా చేస్తే ఈ సినిమాలో “ఆమె” అంటే సాటి స్త్రీ శీలాన్ని కాపాడ్డానికి భర్తను సైతం చంపడానికి వెనుకాడని “సుధ” పాత్రే అని ఏదో ఇంటర్వ్యూలో ఈవీవీ చెప్పినట్లు గుర్తు!

అమ్మో ఒకటో తారీకు మాత్రం బాగుంటుంది! కొంత నాటకీయత ఉన్నా! (ఇందులో కూడా వేధింపుల మొగుడు బతికున్నపుడు విధవ వేషం వేసి, అతడు చావగానే ముత్తైదువ అవతారం ఎత్తే కూతురు పాత్ర ఉంటుంది. (ఆయనకు అదో సరదా ఏమో మరి)

నా వోటు ఈవీవీ హాస్య చిత్రాలకే! 

ఆ ఒక్కటీ అడక్కు సినిమా లో రావు గోపాల రావు పాత్ర భలే ఉంటుంది. అట్టడుగు నుంచి ఎదిగిన రొయ్యల నాయుడు పెద్ద రొయ్యల ఎగుమతి కంపెనీ ఉన్నా సరే, లాగూ వేసుకుని, ఆకు చెప్పుల్తో కర్ర పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. హీరో వేసే వెధవ్వేషాలని ఏ మాత్రం లెక్క చెయ్యకుండా “ఓసోస్” అంటూ ఊంటాడు. గొప్ప ప్రాక్టికాలిటీ ఉన్న పాత్ర ఇది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ది ఒట్టి వెధవ పాత్ర అయినా అణువణువునా నవ్విస్తూనే ఉంటాడు….. 

“చదివావులే చందమామ” “తిన్నావులే ఆవకాయ” “నలిపావులే చేతులు” ఈ తరహా డైలాగులతో ! తెల్ల చొక్కల మీద కిళ్ళీ నమిలి ఉమ్మేసి “తుపుక్ తుపుక్” షర్టులని మార్కెట్లోకి వదలడం వంటి సీన్లు ఈవీవీ మాత్రమే షృష్టించగలడు.

ముఖ్యంగా ఈవీవీ డైలాగుల్లో పంచ్ ప్రేక్షకుడికి సూటిగా కితతలు పెట్టి తీరుతుంది. కొత్త కొత్త మేనరిజాలు ఉన్న పాత్రల సృష్టి కూడా ఎప్పటికప్పుడు ఈవీవీ సొంతం! చాలా బాగుంది సినిమాలో ఎల్బీ శ్రీరామ్ పాత్ర మేనరిజమ్ డైలాగ్ డెలివరీ ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. మిమిక్రీ కళా కారులు సైతం ఇప్పటికీ అదే స్టైల్లో ఎల్బీ ని అనుకరిస్తుంటారు .

ఇక హలో బ్రదర్ సినిమా మరీ ఫుల్ లెంగ్త్ కామెడీ! అనుక్షణం నవ్వులే! ఇందులోనూ ద్వంద్వార్థాలు,పచ్చి డైలాగులకేం తక్కువ లేకపోయినా డైలాగుల పంచ్ మాత్రం అదిరిపోతుంది.

కొన్ని సినిమాలు మరీ Extreme గా పోతూ అసహజమైన పాత్రలతో నిండి ఉన్నా,కేవలం డైలాగుల్తో నవ్వులబండి సాఫీగా లాగించేసి ప్రేక్షకులని “లాజిక్” జోలికి పోకుండా చేస్తాడు. జంబలకిడి పంబ,ఎవడిగోల వాడిదే,బురిడీ,ఆలీబాబా అరడజను దొంగలు ఇవన్నీ ఈ కోవలోవే! కథకు అర్థం పర్థం లేకపోయినా హాస్య సన్నివేశాల సమాహారంగా వీటిని ఎంజాయ్ చేయొచ్చు!జంబలకిడి పంబ సినిమా కథ ఎంత ట్రాష్ అయినా సరే అందులో సీన్లు నవ్వు తెప్పిస్తూనే ఉంటాయి. నరేష్ పెళ్ళి చూపులప్పుడు “డోయ్…….వాషింగ్ పౌడర్ నిర్మా..”అని పాట ఎత్తుకోవడం(ఇక్కడ ఆ డోయ్…అనేది చాలా ముఖ్యం! నిర్మా అనగానే అందరికీ మొదట ఆ మ్యూజిక్ బిట్ గుర్తొచ్చాకే మిగతా జింగిల్ గుర్తొస్తుంది మరి)

ఈవీవీ తీసిన పరమ చెత్త సినిమా మాత్రం “అల్లుడా మజాకా”! ఇందులో చిరంజీవి (తన అత్తగారైన) లక్ష్మి తో చెప్పే అతి ద్వంద్వార్థపు డైలాగులూ ఆమెను టీజ్ చేస్తూ చేసే డాన్సూ ఇవన్నీచీదర పుట్టిస్తాయి ! చిరంజీవికి ఉన్న క్లీన్ ఇమేజ్ కి పెద్ద దెబ్బ ఈ సినిమా! అలాగే ఆరుగురు పతివ్రతలు అని సినిమాకు పేరు పెట్టడం స్త్రీవాదులకు అరికాలిమంట నెత్తికెక్కించింది.కానీ ఆ సినిమా టీవీలో చూసాను. పర్లేదు,బాగానే ఉంది!

హీరో హీరోయిన్లు “ఓరి నా ఫాదరోయ్” అనో “ఓసి నా లవరోయ్” అనడం, “ఏంటి?కితకితలా(జోకా?)” అనడం, హీరో బేరర్ తో “ఓ పెసరట్టు తెచ్చుకో తినిపెడతాను” అనడం, “మీవాడేం చేశాడో తెలుసా”అని ఎవరో ఒకావిడ తగాదాకొస్తే “ఎందుకు తెలీదూ, ఎం బీ యే చేశాడు” అనడం ఇలాంటివన్నీ ఈవీవీ సినిమాల్లోనే చూస్తాం! నవ్వుతాం కూడానూ!

తొట్టిగాంగ్,బెండప్పారావు వంటి వెరైటీ టైటిల్స్ పెట్టడం తో పాటు టైటిల్ కార్డ్స్ లో కూడా ఈవీవీ వెరైటీ చివరిదాకా సినిమా చూడ్డమే కాక ఇంటికొచ్చాక కూడా తల్చుకుని నవ్వుకునేలా ఉంటుంది చూడండి…“రాసినోడు”(రచయిత) “రంగేసినోడు”(మేకప్), గొంతిచ్చినోళ్ళు(డబ్బింగ్)

డబ్బెట్టినోడు(నిర్మాత)

బట్టలు కుట్టినోడు(కాస్ట్యూములు)

కత్తెరేసినోడు(ఎడిటింగ్)ఇలా…..!

ఏమైనా,పంచ్ డైలాగుల్తో ప్రేక్షకుల్ని పగలబడి నవ్వించిన ఈవీవీ సత్యనారాయణ మరికొంత కాలం జీవించి ఉంటే ఎన్నో హాస్య చిత్రాలు సృష్టించి ఉండేవాడు.ఆయన తర్వాత ఇప్పట్లో చెప్పుకోదగ్గ హాస్య దర్శకులెవరున్నారు? ప్చ్!

నవతరంగం నుండి –సుజాత (మనసులో మాట)

No comments:

Post a Comment