ఆవు ఆగ్రహిస్తే?





-

ఆవు ఆగ్రహిస్తే?

-


గోపయ్య తెలివైనవాడేకాని అమా యకంగా కనిపిస్తాడు. ఆ రోజు అతను నాలుగు ఆవులను మేపటానికి ఊరికి సమీపంలోని అడవికి బయల్దేరాడు. అవి వట్టిపోయిన ముసలితనంలో ఉన్న ఆవులు. 'వాటికి మేత దండగ. అమ్మేద్దాం' అని తండ్రి అంటే గోపయ్య ఒప్పుకోలేదు.

'జీవితాంతం పాలు యిచ్చిన ఆవులు. వట్టిపోయాయని అమ్మేయడం దుర్మార్గం. వాటిని నేను అడవికి తీసుకెళ్ళి మేపుకొస్తాను. మనకేం ఖర్చుకాదు.' అని గోపయ్య రోజూ ముసలి ఆవులను అడవికి తీసుకెళ్ళి అక్కడ ఏపుగా ఎదిగిన గడ్డిమేపుకొస్తున్నాడు. ఆ రోజు అమాయకంగా కనిపిస్తున్న గోపయ్యను చూసి ఇద్దరు మోసగాళ్ళు అటకాయించారు. ఆవుల్ని దొంగిలించి తీసుకుపోయి నగరంలోని తోళ్ళ పరిశ్రమకు అమ్ముకోవాలని ఆలోచించారు. ''ఏరు! ఆగు. ఆవుల్ని ఎక్కడికి తోలుకెళ్తున్నావ్‌?'' అని దబాయించారు. ''అయ్యా! ఆవుల్ని మేపడానికి అడవికి తీసుకెళ్తున్నాను.'' అని గోపయ్య మర్యాదగా సమాధానం చెప్పాడు.

''నీ మాటలు నమ్మశక్యంగా లేవు. ఆవులు వట్టిపోయి ముసలివయ్యాయి. వీటిని కోతకు అమ్మడానికి తీసుకెళ్తున్నావు. ఇంతకాలం వాటి పాలు అమ్ముకుని బతికావు. ఇప్పుడు పాలివ్వడం లేదని కోతకు అమ్మడం దుర్మార్గం. మేము ఆవుల ఆశ్రమం నడుపుతున్నాం. వీటిని మాకు స్వాధీనం చెయ్యి . వాటిని జీవితాంతం పోషిస్తాం'' అని మాయ మాటలు చెప్పారు.

''మీరు అంటున్నది నిజం కాదు. ఈ ఆవుల్ని రోజూ అడవికి తీసుకెళ్ళి మేపుకొస్తుంటాను. వీటిని అమ్ముకోవాలనే ఆలోచన మాకు లేదు. అవి ఇంతకాలం పాలిచ్చాయి. లేగ దూడలుగా వున్నప్పటి నుంచి వాటిని పెంచాను. వాటిని జీవితాంతం పోషిస్తాను. వీటిని మీకు అప్పగించలేను,'' అని జవాబు చెప్పాడు గోపయ్య.

ఐతే ఆ మోసగాళ్ళు వదిలిపెట్టలేదు. ''నువ్వు చెప్పేదంతా అబద్దం. మేము నమ్మం. గోవులను సంరక్షించడానికి నడుంకట్టాం. మా ఆశ్రమానికి అప్ప గించాల్సిందే.'' అని వాటిని తోలుకెళ్ళడానికి సిద్ధమయ్యారు.గోపయ్య అడ్డుపడ్డాడు. వాళ్ళు ఇద్దరు కావడంతో గోపయ్యను పట్టుకుని కొట్టసాగారు. అతన్ని తాళ్ళతో కట్టేయడానికి చెట్టు దగ్గరకు లాక్కెళ్తున్నారు.''రక్షించండి..రక్షించండి..'' అని గోపయ్య కేకలు వేయసాగాడు.ఇంతలో అనూహ్యంగా ఆవులు బుసకొడుతూ కొమ్ములతో పొడవడానికి మోసగాళ్ళ వెంట పడ్డాయి. వాళ్ళు భయపడి పారిపోయారు.ముసలి వయసులో తమని శ్రద్ధగా పోషిస్తున్న గోపయ్యను మోసగాళ్ళ బారినుంచి రక్షించుకున్నాయి. ఆవు ఆగ్రహిస్తే మనిషి ఎదురు నిలవలేడు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!