చాదర్ ఘాట్ స్కూలు కబుర్లు !

చాదర్ ఘాట్ స్కూలు కబుర్లు  !

(శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)


"మా ఇంగ్లీష్ టీచరు పబ్బరాజు సుబ్బారావు గారు ఓ రోజు ఇంగ్లీష్ పాఠం తీసి పైకి చదవమన్నారు. చాలా కుంట్లు పడుతూ చదివాను. అంతవరకూ నాది తెలుగు మీడియం. ఇంగ్లీష్ సరిగ్గా చూచి చదవలేని పరిస్తితి.. నా మీద నాకే సిగ్గేసింది.

"ఐదో ఫారంలో మా క్లాసు టీచరు జుల్ఫ్ కార్ ఆలీఖాన్. మంచీ ఒడ్డూ పొడుగూ, సినిమా స్టార్ లా ఉండేవాడు. కేంబ్రిడ్జ్ లో ఇంటర్ మీడియట్ చదివి వచ్చాడు. అదే ఆయన యోగ్యత. ఆయన తప్పుల్ని పిల్లలు దిద్దుతుండేవారు.

"మా క్లాసు పిల్లలు నిజంగా సిసింద్రీలు. వాళ్ళ ఇంగ్లీష్ ఇప్పటి ఎం.ఏ. వారికన్నా బాగుండేది. ముఖ్యంగా నరసింహన్ అయ్యంగార్, రామచంద్రారెడ్డి, అబ్దుల్ అజీజ్, ఆజ్మల్ ఖాన్, రాఘవన్ - వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎంతో గొప్పగా వుండేది. రాఘవన్ బేబీ ఆస్టిన్ కార్లో స్కూలుకు వచ్చేవాడు. లెక్కల టీచరు అబీద్ ఆలీ గారు. ఆయనకు పల్చటి గడ్డం వుండేది. అంచేత ఆయనకు కొత్తిమీర్ కట్ట అని కొంటే పేరు పెట్టారు పిల్లలు. ఫిజిక్స్ మహమ్మద్ ఆలీ గారు చెప్పేవారు.ఆయనకు దుబ్బుగా పొడవాటి గడ్డం. అందుకని ఝాడుకట్ట అని పేరు. హిస్టరీ జాగ్రఫీలు వామన్ రావు చెప్పేవారు. టీచర్లకు పేర్లు పెట్టె విషయంలో బందరు పిల్లలు కూడా ఏమీ తక్కువ తినలేదు. 'కాంతా వల్లభరాజులుంగారు' అనబడే మునిమాణిక్యం నరసింహారావు గారు మా క్లాసు టీచరు. ఆయనకు కళ్ళు పుసులు కారే జబ్బు. ఆయన్ని చిమ్మెట్ట గారని ఆట పట్టించేవారు. సైన్సు టీచరు సోమజాజులు గారికి మెడ పొడవు. బీకరు అనేవారు. అనంత శర్మగారికి మెడ పొట్టి. మనిషి లావు. ఆయన్ని మెట్ట వంకాయ్ అని పిలిచేవాళ్ళు. హెడ్ మాస్టర్ వెంకట రామయ్య గారు 'పాండు రంగడు'. పెద్ద పెద్ద మీసాలు వున్న తాళ్ళూరి నారాయణ రావు గార్ని బొద్దింక మాస్టారు అనే వాళ్ళు. ఆయన తండ్రి చనిపోయిన కారణంగా కర్మకాండలో మీసాలు తీసేశారు. ఇక బొద్దింక గొడవ ఉండదని ఆయన అనుకున్నారు. మీసాలు లేని ఆయన్ని చూసి బోడి బొద్దింక వచ్చిందిరా అనడంతో ఆయన చిన్నబుచ్చుకునేవారు. అలా ఉండేవి చిన్నతనంలో సరదాలు"

ముల్కీ ముచ్చట్లు 

"పరీక్షలు అయిన తరువాత ఇంటికి వెళ్లాను, గుడ్లవల్లేరు. రిజల్ట్ వచ్చిన సంగతి ఆలస్యంగా తెలిసింది. హైసెకండ్ క్లాసులో పాసయ్యాను. హైదరాబాదు వెళ్లి నిజాం కాలేజీలో అడ్మిషన్ కోసం అప్లికేషన్ ఇచ్చాను. టర్నర్ అనే ఆయన ప్రిన్సిపాల్. ఆయన వేసవి సెలవులకు ఇంగ్లండు వెళ్ళాడు. మహమ్మద్ సిద్దికీ అని ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఆయన్ని తాత్కాలికంగా ప్రిన్సిపాల్ గా వేసారు. టర్నర్ వుంటే నా మార్కులు చూసి సీటు ఇచ్చేవాడే. మహమ్మద్ సిద్దికీ గారు 'నువ్వు ఆలస్యంగా వచ్చావు. సీట్లు నిండి పోయినై. నువ్వు మద్రాసు ప్రెసిడన్సీ వాడివి. అయినా మంచి మార్కులు వచ్చాయి కనుక ముల్కీ సర్టిఫికేట్ తెస్తే సీటు ఇస్తాన'ని అన్నారు. ముల్కీ సర్టిఫికేట్ అంటే నిజాం రాజ్యంలో పుట్టయినా వుండాలి. లేదా పన్నెండేండ్లు నివాసం అయినా వుండాలి. మాకు నైజాంలో భూములు వున్నాయి కాని అవి పరాధీనంలో వున్నాయి. నైజాంలో పుట్టినట్టు సర్టిఫికేట్ కావాలంటే సాక్ష్యం వుండాలి. ఆరోజుల్లో నైజాంలో పుట్టుకల గిట్టుకల రిజిష్టర్ వుండేది కాదు. అంచేత అనేకమంది దొంగ సర్టిఫికేట్లతో చేరేవారు. మా బావ స్నేహితుడి తండ్రి ఆబ్కారీ శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయినాడు. ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మర్నాడు ఇద్దరం అప్లికేషన్ తో తాలూక్ దార్ ఆఫీసుకు వెళ్ళాము. 'ఇతను మీకెలా తెలుసు అని తాలూక్ దార్ అడిగితె, ఆబ్కారీ డిపార్టుమెంటులో పనిచేస్తూ వాళ్ళ వూరు వెళ్ళేవాడిని, అల్లా పరిచయం' అనిచెబుతాను. నువ్వూ అట్లాగే చెప్పు' అని నాతొ అన్నాడాయన. ఫారం లోపలి పోయింది. మాకన్నా ముందు వచ్చిన ఒకాయన తప్పుడు సాక్ష్యం చెప్పాడని మజరద్ గార్ నిర్ణయించి రెండువందలు ఫైను వేసాడు. అది చూసి సాక్ష్యం ఇవ్వడానికి నాతొ పాటు వచ్చిన పెద్దమనిషి భయపడి పోయాడు. ఐనా నేను లోపలకు వెళ్లి మజరాద్ గారిని కలిసాను. చిన్నవాడు. మంచి మనిషిలా కనిపించాడు. 'నీకు నిజాం కాలేజీలో సీటు వచ్చింది చేరడానికి ముల్కీ కావాలి. ఎవర్నన్నా సాక్ష్యం తీసుకురా ఇస్తాన'ని చెప్పాడు. నాకు సాక్ష్యం ఎవ్వరూ లేరు. ముల్కీ రాలేదు. సీటూ రాలేదు. అందుకే ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత బందరులో హిందూ కాలేజీలో నాలుగేళ్ళు చదివాను.” 

(శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి గారు రచించిన 'హైదరాబాదు - నాడు, నేడు' నుంచి)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!