"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" !


-

"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" !

.

"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" పేరు గాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే. జిగి అంటే తళుకు. బిగి అంటే బిగువు. మృధుమధురమైన పదప్రయోగం, వ్యర్థ పదాలు లేని దృఢమైన పదబంధం - ఇదే అల్లిక జిగిబిగి.

ఉలుకు పలుకు లేని రాతి ప్రతిమల రమణీమణుల ప్రబంధ నాయికా ప్రపంచంలో మాట పాట నేర్చిన వలపుల వయ్యారి వరూధిని. అవయవాలే తప్ప ఆత్మలు లేని కావ్య నాయికా లోకంలో ఇష్టాలు, కోరికలు, కోపాలు, తాపాలు, ప్రణయాలు, విహారాల అనుభూతులు విరబూసిన విరి మంజరి సజీవ సుందరి వరూధిని. ఆమె ప్రవహించే ఒక యౌవన ఝరి, దహించే ఒక ప్రణయ జ్వాల, మిరుమిట్లు కొలిపే ఒక సౌందర్య హేల, ఒక విరహ రాగం, ఒక వంచిత గీతం, ఒక విషాద గానం. ఆంధ్ర కవితా పితా మహుడు అల్లసాని అంతరంగంలో వికసించిన ఒక అపురూప భావనా మల్లిక.

తెలుగు పంచ మహా కావ్యాలలో ప్రథమ ప్రబంధం మను చరిత్ర. మార్కండ ేయ పురాణంలోని ఒక చిన్న కథను తీసికొని తన అద్భుత కవితా ప్రావీణ్యంతో ఒక రసవత్కావ్యం సృష్టించి తెలుగు కవిత్వ ప్రేమికులకు వెల లేని మధురాతి మధురమైన కానుకనిచ్చాడు పెద్దన. ఒక వరణా తరంగిణిని, ఒక అరుణాస్పద పురాన్ని, ఒక ప్రవరుని ఒక వరూధినిని, ఒక స్వరోచిని, ఒక మనోరమను సృష్టించి పాఠకుల హృదయాలలో ఒక అలౌకిక దివ్య ప్రపంచాన్ని ఆవిష్కరించాడు.

‘అట చని కాంచి’నదేమిటి?

తీర్థయాత్రా ప్రేమికుడైన ప్రవరుడు పాదలేపనం మహిమతో హిమాలయాలకు వెళ్ళడం మను చరిత్రలో కీలక ఘట్టం. అతడెంత నిష్టాగరిష్ఠుడైనప్పటికీ వెండి కొండల సౌందర్య వైభవానికి పరవశించి జగము మరచి తనువు మరచి పోవడమే కావ్యంలో రసవద్ఘట్టం.

పాదలేపనం కరగి పోవడంతో అతడు తన ఊరికి వెళ్ళలేక పోతాడు. ఆ ప్రాంతాల్లో ఎవరైనా కనబడతారేమోనని, తన ఊరికి దారి చెబుతారేమోనని అటు, ఇటు తిరుగుతుంటాడు. అలా తిరుగుతున్న ప్రవరుణ్ణి చూడగానే అతని అందానికి వరూధిని కళ్ళు పెద్దవవుతాయి ఆశ్చర్యంతో. ఆమెను చూసిన ప్రవరుడు- ఓ భీత హరితేక్షణ! నీవెవరివి? ఈ వన భూముల్లో ఒక్క దానివే విహరిస్తున్నావు. నన్ను ప్రవరుడంటారు. ఈ పర్వతానికి వచ్చి దారి తప్పాను. మా ఊరికి దారి చెప్పు- నీకు పుణ్యం ఉంటుందని అడుగుతాడు. అప్పుడు వరూధిని- ఇంతింత పెద్ద పెద్ద కళ్ళున్నాయి గదా నీకు ‘మా ఊరికి దారేది?’ అని అడుగుతున్నావు. ఏకాంతంగా ఉన్న నాలాటి యువతులతో ఏదో విధంగా మాటలాడాలని కోరికే గానీ నీవొచ్చిన దారి నీకు తెలియదా? కొంచెం కూడా భయం లేకుండా అడగడానికి మేమింత చులకనయ్యామా?- అని డబాయిస్తుంది.

ఎందరో కవులు కసిదీరా తమ కావ్యనాయకల శరీరాలను వర్ణించారు. కానీ ఏ కవీ కూడా అమెకొక మనసుందని చెప్పలేదు. తన నాయిక నోట ‘మనసు’ అనే మూడక్షరాల పద ప్రయోగం చేసినవాడు పెద్దన ఒక్కడే. అలా తన కావ్యనాయిక చేత ‘మనసు’ అనే ముత్యమంత మాటను తొలిగా ప్రయోగించిన పెద్దన కవీంద్రులకు శతకోటి వందనాలు!

వరూధిని ఇలా తన అభిప్రాయాన్ని ఏ డొంకతిరుగుడు లేకుండా స్పష్టంగా చెప్పినా, నిశ్చల మనస్కుడైన ప్రవరుడు - తల్లీ! వ్రతులై రోజుల్ని గడిపే విప్రులను కామించవచ్చునా? నా తల్లిదండ్రులు వృద్ధులు. ఆకలికి ఆగలేరు. నా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. దేవ కాంతలు మీకు అసాధ్యాలు లేవు గదా! నేనిల్లు చేరే ఉపాయం చెప్పమంటాడు.‘ఓ ప్రవరుడా! ఓ మానవుడు తన జీవితంలో అనుభవించ దగిన సకల సామగ్రి ఇక్కడే ఉన్నాయి. భోగివై నన్ననుభవించు.

వెన్నలాగా కరగిపోయే స్ర్తీల పరిష్వంగం లో సుఖ పడే అదృష్టం ఎప్పుడు వస్తుంది’ అని ప్రలోభపెడుతుంది. అయినా ప్రవరుడు నిశ్చల మనస్కుడై ‘బ్రాహ్మణుడు ఇంద్రియ వశుడవకూడదు. అలా ఐతే బ్రహ్మానందాది రాజ్యంనుంచి భ్రష్ఠుడౌతాడు’ అని తన మాటమీదే నిలబడతాడు. అప్పుడు వరూధిని ‘చిమ్మీలో ఉన్న దీపంలా ఇంద్రియాలన్నీ ఏ విషయంలో సుఖ పారవశ్య స్థితి పొందుతాయో అదే బ్రహ్మానందమని విజ్ఞులు చెప్పలేదా’? అని ఆనందానికి తన నిర్వచనం చెప్తే, ప్రవరుడు ‘వ్రతులైన భూసురులను కామించవచ్చా! తక్షణం నేనింటికి వెళ్ళాలి’ అని అదే మాట మీద పట్టుదలగా నున్నప్పుడు- ‘నీ యవ్వనమంతా కర్మలు చేసినట్లైతే భోగాలనుభవించేదెప్పుడు? ఎన్ని క్రతువులు చేసినా మా పరిష్వంగ సుఖం అందుకోవడానికే గదా! గంధర్వాంగనల పొందు అందరికీ లభించదు. స శరీర స్వర్గ సుఖాలు కోరి వరిస్తుంటే వ్రతాలు చేసి ఇంద్రియాలను బాధ పెట్టడం న్యాయమా’? అని వాదిస్తుది.

‘నీవు చెప్పిన విషయం కాముకునికి వర్తిస్తుంది. బ్రహ్మ జ్ఞానికి కాదు. మాకు అరణులు, దర్భలు, అగ్ని- ఇవే ఇష్టం. ఈ తుచ్ఛ సుఖాలన్నీ మీసాల మీద తేనెలే’ అని తన నిరాసక్తతను వెల్లడిస్తాడు.

ఎన్ని రకాల మాటల ఆయుధాలను ప్రయోగించినా తాను ఓడిపోయే సరికి ఉక్రోషంతో వరూధిని ప్రవరుని పరిష్వంగించి ముద్దు పెట్టుకోబోగా ప్రవరుడామె భుజాలను పట్టి తోసేస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక రోషంతో ‘చేసితి జన్నముల్‌ తపము చేసితి నంటి దయా విహీనతన్‌/ జేసిన పుణ్యముల్‌ ఫలము సెందునె? పుణ్యము లెన్నియేనియున్‌/ జేసిన వాని పద్ధతియె చేకుఱు భూత దయార్ద్ర బుద్ధికో/ భూసుర వర్య యింత తల పొయవు నీ చదువేల చెప్పుమా’? అని బాధపడుతూ ఎన్నో మాటలంటుంది.

ఆ తర్వాత ప్రవరుడు అగ్ని దేవుణ్ణి ఆరాధించి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. ఎన్ని విధాలుగా వాదించినా తన కోరిక నెరవేరలేదని ఆమె దుఃఖగీతిక అవుతుంది. అంతకు ముందు వరూధిని తిరస్కారానికి గురైన గంధర్వుడు ప్రవరుని వేషం ధరించి అక్కడే తిరుగుతుంటాడు. ఎప్పటినుంచో కోరుకున్న వరం దక్కినట్టు వరూధిని సంతోషంతో అతని చెంతకు చేరుతుంది. ఒక షరతు పెట్టి గంధర్వుడు ఆమె కోరికకు ఒప్పుకుంటాడు. ప్రవరుడు అంగీకరించాలే గానీ దేనికైనా సిద్ధమే గదా ఆమె. కానీ ఆ సందర్భంలో మాయా ప్రవరుడు వరూధినితో- ‘నీ పరిష్వంగంలో పొందే పారవశ్యాన్ని తిరస్కరించడానికి నేనేమైనా సన్యాసినా? కానీ ఎందుకో ఆ విషయంలో నాకు కోరిక లేదు. ఒక అనాశ్వాసితమైన దుఃఖం ఆ సుఖాన్ని దుర్భరం చేస్తుంది’ అని అంటాడు. తాను వలచిన స్ర్తీని మరొకరి రూపం ధరించి మోసం చేసినవాడు ఇలా అనడమే గొప్ప ఆశ్చర్యం. మాయా ప్రవరునితో కొన్ని ప్రవర లక్షణాలు, ప్రవరునిలో కొన్ని మాయా ప్రవర లక్షణాలు సృష్టించాడు కవి.

మొదట హిమాలయానికి వచ్చిన ప్రవరుడు ఆ వైపు వచ్చిన తాంబూల పరిమళ సమ్మిళిత వాయువును బట్టి ఇక్కడెవరో జనమున్నారని అనుకుంటాడు. అది మామూలు తాంబూలం కాదు. కస్తూరి ఒక వంతు, కర్పూరం రెండింతలు ఉన్న తాంబూలం. అలాంటి తాంబూలాన్ని స్ర్తీలు మాత్రమే వేసుకుంటారు. ప్రవరుడు కేవలం నైష్టికుడైతే ఈ విషయం తెలియదు. నిత్యం తాంబూల సేవానురక్తులకే ఈ విషయం తెలుస్తుంది. ప్రవరుడు కేవలం నైష్టికుడే కాదని, అతని అంతరంగం లోలోపలి పొరల్లో ఒకింత రసికత ఉందని ఈ పద్యం వలన తెలుస్తుంది.

ఈ వరూధిని కేవలం మను చరిత్రకే, ఒక పుస్తకానికే పరిమితం కాదు. ఈ వంచిత కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు. వాస్తవ ప్రపంచంలో ప్రవరుల కన్నా మాయా ప్రవరులు కూడా ఎక్కువే. పెళ్ళి చూపుల్లో వరుడు సకల సద్గుణవంతుడు అని చెప్తారు. కానీ, పెళ్ళయిన మర్నాడే అతని విశ్వ రూపం ప్రదర్శితమవుతుంది. పాపం! వరూధిని, సుర గరుడ గంధర్వులే మోహించిన సౌందర్యవతి ఐనా కోరుకున్నవాణ్ణి వరునిగా పొందలేకపోగా అతనిచే ఘోర తిరస్కారానికి, అవమానానికి గురైన ఒక పరాభవ గీతిక. మాయా గంధర్వుని చేతిలో మోసపోయిన ఒక అమాయక ప్రాణి. పెద్దన కేవలం కవే గాదు. చేయి తిరిగిన చిత్రకారుడు కూడా. కను రెప్పలు కూడా ఆర్పలేని ఎన్నో రంగుల చిత్రాలను చిత్రించాడు తన ప్రబంధంలో. దానిలో వరూధిని చిత్రాలే ఎక్కువ.

అల్లసాని పెద్దన ఊరేగుతోంటే విద్యానగర ప్రభువు శ్రీకృష్ణ దేవరాయలు...పల్లకీ మోసాడు లాంఛనంగా... అల్లసాని వారి పాదాలు కడిగీ - స్వయంగా గండ పెండేరం తొడిగాడు!

ఈ పద్యం తెలియని తెలుగు వాడు ఉండడనడంలో అతిశయోక్తి లేదేమో...

అటఁ జని కాంచె భూమిసురుఁ డంబర చుంబి శిరస్సర్ఝజరీ

పటల ముహుర్ముహు ర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన

స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము, శీతశైలమున్.........

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!