మనోహరమైన శ్లేషాలంకారం !

మనోహరమైన శ్లేషాలంకారం !


_-

రాజోద్యానములో రాకుమారి చిత్రాంగదను చూసినప్పటినుండి, 

విజయుని చిత్తం ఆమెయందే లగ్నమైనది. మనసు మనసులో లేక,

ఆ రాత్రంతా ఆమె గురించే ఆలోచిస్తూ నిద్రలేకుండా గడిపాడు. 

కాలం ఆగదు కదా! యధావిధిగా తెల్లవారినది.

.

"అపుడు నృపుడు ప్రఫుల్ల నవాంబుజ ప్ర

సన్నముఖుడయి, "మలయధ్వజ క్షితీశ

కమలహితునకు మామకాగమనవార్తఁ

దెలుపు" మనుచు విశారదుఁ బిలిచి పనిచె."

(విజయ విలాసము - చేమకూర వేంకటకవి)

.. 

భావము: ప్రభాతసమయానికి అర్జునుడు, బాగా వికసించిన క్రొత్తకమలము వలె ప్రసన్నముఖముతో గోచరించినాడు. అనగా, రాత్రి కలిగిన కలతనుండి తేరుకుని, ఒక నిశ్చయమునకు వచ్చాడన్నమాట. తన చెలికాడైన విశారదుణ్ణి పిలిచి, "ఈ మణిపురపు ప్రభువైన మలయధ్వజభూపతి రాజులలోకెల్లా సూర్యునివంటి తేజశ్శాలి. అతనికి నేను ఇక్కడికి వచ్చిన వార్తను తెలుపుము" అని చెప్పి పంపించినాడు.

అతిసాధారణంగా కనిపించే ఈ చిన్నిపద్యములో చేమకూరకవి 

పలు పోకడలు పోయినాడు. 

ఇందులో అతడు ఉపయోగించిన పదములు సాభిప్రాయములు.

అంబుజములకు (కమలములకు) స్నేహితుడు కమలహితుడు (సూర్యుడు). అంబుజప్రసన్నముఖుడైన విజయుడు, క్షితీశ కమలహితునికి వార్త పంపడం ఎంతో సమంజసముగా నున్నది. ఇద్దరు హితుల మధ్య కార్యం సానుకూలమే అవుతుంది కదా!

పద్యములోని "మామకాగమనవార్త" అన్న పదప్రయోగములో ఉన్నది గమ్మత్తంతా! ఎలాగో చూడండి.

1. మామక + ఆగమనవార్త = నా రాకను గురించిన వార్త రాజునకు తెలుపుము (ఇది సామాన్యార్థం).

2. మామ కాగ మనవార్త = నేను రాకుమారిని వలచినాను. నీవు నీ బుద్ధికుశలతను ఉపయోగించి, ఆ రాజు నాకు మామ అయ్యేటట్లుగా (అనగా నాకు పిల్లను ఇచ్చేటట్లుగా) మన గురించి అతనికి చెప్పవలసినది అని అర్థం.

3. మామకు + ఆగమనవార్త = రాకుమారిని పెళ్ళాడాలని నేను నిర్ణయించుకున్నాను. అంటే, ఆ భూపతి ఇప్పుడు నాకు మామ. మామకు మన రాక గురించి తెలుపుము అని మరో అర్థం.

-

మనోహరమైన శ్లేషాలంకారం ఇమిడివుంది ఈ పద్యములో!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!