విశాలి పేరి గారి సినిమా పాటల ప్రైవేట్లు !


-

విశాలి పేరి గారి సినిమా పాటల ప్రైవేట్లు !

(విశాలి పెరి గారి పోస్ట్ మీ కోసం యధాతధం వారికీ కృతజ్ఞలతో )

-

గుడివాడ వెళ్లాను గుంటూరు పోయా... " పాట పూర్తవ్వలేదు... నెత్తి మీద ఠంగుమని మోగింది. ఒక్కసారి దక్షుడి 28 మంది కూతుర్లు కనిపించేశారు. ఇంతకీ నేనేం తప్పు పాడానని ఇలా ముదస్తు హెచ్చరిక లేకుండా ఈ పిడుగు ? (అదే మొట్టికాయ) , 

అదే ప్రశ్నార్ధకమైన మొహంతో చూశాను అమ్మమ్మ వైపు. " ఇలాంటి పిచ్చి పాటలు పాడకు" అన్న వార్నింగ్ ఇచ్చింది. 

ఇది పిచ్చిపాట ఎందుకయ్యిందో ఆలోచించే వయసు కాదు. చిన్నప్పుడు కొన్ని పాట పాడితే, గుళ్ళో గంట కొట్టినట్టు 

ఇదిగో ఇలా మొట్టికాయలు పడిపోతుండేవి. ఎప్పుడేనా బాత్ రూం లో గట్టిగా పాడేసుకుంటుంటే మా అమ్మమ్మ వచ్చి " ఇలా పాటలు పాడుకునే బదులు, ఎక్కాలు చదువుకోవచ్చు కదా " అని అనేది. ఎంత ఐనస్టీన్ అయినా ఆనందానికి " న్యూటన్స్ లా " నో "ఆర్కమెడీస్ తియరీ " ఓ చదువుతాడేంటీ? ఈ అమ్మమ్మల చాదస్తం కాకపోతే!

చిన్నప్పుడు ఇలాగే బోలెడు పాటలకి అర్ధాలు తెలియకుండా పాడేసేవాళ్ళము. ఒకసారి.. కాదు మొదటి సారి నేను టేప్ రికార్డర్ లో విన్న పాట "శంకరాభరణం " . ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ వినేవాళ్ళు. ఆ పాటలో "రసికులకనురాగమై " అన్న చోట అర్ధం కాలేదు. (మిగితాదంతా అర్ధమయ్యిపోయినట్టు అనుకోకండి). అంటే ' రసికులు ' అనేది అంత వరకు వినని పదం. ఆ రికార్డ్ లో ఒక చోట పాపం ఒకాయన "ఖళ్ళు ఖళ్ళు " అని దగ్గాడు కదా, ఆయనకి పాపం జ్వరం వచ్చింది, అందుకే 'రసుకులు " (rusks) అని పాడి ఉంటాడు. ఇలా తోచిన అర్ధం వెతికేసుకున్నాను.

అలాగే "మేడంటే మేడా కాదు గూడంటే గూడు కాదు " లో "పదిలంగా " అన్న పదం. వాళ్ళ ఇంటి చుట్టూరా దండం కట్టుకొని పది లంగాలు ఆరేసేవాళ్ళేమో అని అనుకునేదాన్ని. ఆ పది పట్టులంగాలూ ఏ రంగువయ్యింటాయో అని ఊహలు కూడా ఉండేవి. కొన్నేళ్ళ తరవాత " ఈ గాలి ఈ నేల (సిరివెన్నల ) " పాటలో " నా కళ్ళ లోగిళ్ళు " విన్నాను. పాపం కళ్ళు లేవు కదా ఆ అబ్బాయికి అందుకే కళ్ళు గిళ్ళమంటున్నాడనుకునేదాన్ని. (దీనికి దానికి సంబంధమేంటీ అని అడగొద్దు).🤔

ఒకసారి మా పక్కింటి స్వరాజ్య లక్ష్మి అక్కని చూసి వెంకట్ అన్న" ఆ జడ పొడుగు మెడ నునుపు చూస్తుంటే " అనీ, " అడగక ఇచ్చిన మనసే ముద్దు లో... " చెక చెకలాడే " లైన్ పాడాడు. స్వరాజ్యం అక్క సిగ్గు పడింది. అదే నేను పాడితే మూతి మీద సిక్సర్ పడింది! 😷

ఒకసారి మా ఇంట్లో మా తాతగారి తల్లిగారి తద్దినం అయ్యింది. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే అన్నట్టు, 'తద్దినం కూడా తాంబూలాలు " లాంటిదే కొన్ని ఇళ్ళల్లో. (పెళ్ళికి ముందు తాంబూలం కాదు... భోజనం అయ్యాక తాంబూలం అన్న మాటా) . అదీ మనవలూ, మునిమనవలూ ఉన్న ఇళ్ళల్లో. ఇంట్లో గాడిపొయ్యె మీద వంట. గుండిగళ్ళతో హడావిడిగా ఇంట్లోకి బయటకు తిరిగే బాబయ్యలు, మావయ్యలు. నేనూ , మా కజిన్ వీధిలో రెండు స్థంబాలాట ఆడుకుంటున్నాము. ఆడుతూ పాడుతూ పరిగెడుతుంటే ఆకలి తెలియదని, గట్టిగా పాటలు పాడుకుంటూ ఆడుకుంటున్నాము. నేను 'బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే " అని పాడితే, మా కజిన్ "కాపురమొస్తే కాదంటానా " అంటూ పాడటం మొదలెట్టింది. అంతే... వెనకాల నుంచి ఎవరో మమల్ని గుండిగలు ఎత్తినట్టు ఎత్తుకొని పెరట్లోకి తీసుకెళ్ళిపోయి.. ప్రైవేట్ చెప్పేశారు! హన్నా... మేము చిన్నవాళ్ళమా.. చితకవాళ్ళమా? మా అంతటి వాళ్లము మేము. అయినా కాపురం అంటే డబ్బాల్లో పప్పులు, ఉప్పులు సర్ధడమే అని మా చినమామ్మ చెప్పింది. " పెద్దత్త కాపురానికి వెళ్తోంది " అని అన్నప్పుడు , "కాపురం అంటే ఏంటీ " అని అడిగాను, అదిగో అప్పుడు చెప్పింది.  😎😎

ఈ పైత్యం ఇటు తెలుగులోనే కాదు, హిందిలోకీ పాకింది. "క్యా హువా తేరా వాదా , ఓ కసం ఓ ఇరాదా " వచ్చినప్పుడు ఆ పాడేవాడు లెఖల మాస్టారేమో అని అనుకునేదాన్ని. ఎందుకంటే " ఒక్క సమ్ము చేయరాదా " అని అంటున్నట్టుగా ఉండేది. అలాగే జంగిలి సినిమాలో " ఎహసాన్ తెరా హోగా ముఝ్ పర్.... పల్ఖోంకి చావ్ మే రెహనేదో " నాకు "పళ్ళు తోముకొని చావు " అనేటట్టు వినపడేది. పాపం ఆ హీరో పాచి పళ్ళతో తిరుగుతోంటే హీరోయిన్ "పళ్ళు తోముకోమంటోంది " అని అనుకునేదాన్ని. " సంఝోతా గమోసే కర్లో " పాట "సంజోతా సమోసే కర్లో " లా వినపడీ, సమోసాలు అమ్ముకొనేవాడి పాటెమో అని ఊహించుకునేసేదాన్ని. 🤩😋

అప్పుడు ప్రైవేటు చెప్పినా, ఒన్ డే ఇంటర్నేషనల్ ఆడేసినా ఇప్పుడా పాటలు వింటే మాత్రం... పాటలతో పడిన ఆ పాట్లు... భలే నవ్వు తెప్పిస్తాయి. 😁

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!