మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 17.

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

శ్లోకం - 17.

-

కురుతే గంగాసాగరగమనం 

వ్రతపరిపాలనమథవా దానం|

జ్ఞానవిహీనః సర్వమతేన

ముక్తిం న భజతి జన్మశతేన||

-

శ్లోకం అర్ధం : గంగాసాగర సంగమము మున్నగు చోట్ల స్నానములు చేసినను, నోములు, వ్రతములు చేసినను, దాన ధర్మముల నెన్ని చేసినను సరే అతడు జ్ఞానము పొందలేకపోయినచో, నూరు జన్మములు ఎత్తినను ముక్తిని పొందడు.

-

తాత్పర్యము : బాహ్యకర్మల వలన జ్ఞానము కాని, మోక్షప్రాప్తి కాని కలగదు. మడి, ఆచారములు, మంత్ర పఠనములు మున్నగు కార్యములు చేసినంత మాత్రముననే జ్ఞానము చేకూరదు.

.

జీవుడు తాను ఆత్మరూపుడనని, ఈ జడ దేహము కాదని ఎరిగి నడుచుకోనంత వరకు ఈ బాహ్యకర్మలు కేవలము ఆటోపములే కాని ఫలిత శూన్యములు. పవిత్ర నదులలో స్నానము చేయుట, తీర్ధయాత్రలు తిరుగుట, దానములు చేయుట, వ్రతములను ఆచరించుట మొదలగునవి అవసరమే కాని కేవలము అవి ఆచరించినంత మాత్రముననే మోక్షము కలగదు. 

.

ఈ కార్యములన్నిటి పరమార్ధము చిత్తశుద్ధిని పొందుట, తద్వారా ఆత్మజ్ఞానము బడసి పరమాత్మకు చేరువగుట. ఈ బాహ్య కార్యములన్నీ ఉపకరణములు మాత్రమేకాని, అవే గమ్యములు, పరమార్ధములు కావు. గమ్యము గోవిందుని చరణారవిందములే!

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!