మహాత్ముని కోసం నిరీక్షణ!

మహాత్ముని కోసం నిరీక్షణ!

_

ఆర్.కె. నారాయణ్ రచనలు సున్నితమైన భావోద్వేగాలతో, అంతర్లీనంగా బాధను, ఆనందాన్ని తదితర భావోద్వేగాలను మోసుకొస్తూ తమ వెంట ప్రయాణిస్తున్న పాఠకుడిని అందులో లీనం చేస్తూ పయనిస్తూ ఉంటాయి. అవి చదువరిలో తీవ్రమైన స్పందనలు కలిగించడం జరగదు.

.

కథ ప్రారంభంలో శ్రీరామ్ ను పరిచయం చేస్తూ వచ్చే సంఘటనలలో తను కిటికీలో కూర్చుని వస్తూ పోయే వాహనాలను, మనుషులను చూస్తూ ఉండటం, అక్కడ జరిగే సంఘటనలు చదువుతూనే నేను నా బాల్యంతో జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను. అప్పట్లో అలా కుర్చుని ఉండటం ఓ సరదా. ఆ కిటికీయే సినిమాను ప్రొజెక్ట్ చేసే ప్రొజెక్షన్ విండో అయితే, కంటికి కనిపించేదంతా పెద్ద వెండితెరపై జరిగే జగన్నాటకం. మౌనంగా దాన్ని ఆస్వాదించడం నాకూ అనుభవమే.. తెలిసిన పాత్రలు, బాగా తెలిసిన పాత్రలు, కొత్త కొత్త పాత్రలు వస్తూ, పోతూ ఉంటాయి.

.

మాల్గుడి ఊరి బ్లూ ప్రింట్ అంతా కళ్ళ ముందు ఉంచుతారు. ఇళ్ళెక్కడున్నాయి, కార్యాలయాలెక్కడున్నాయి, కన్నీ దుకాణం, ఫండ్ ఆఫీసు యిలా.. కన్నీ దుకాణంలో ఎర్ర బుగ్గల యూరోపియన్ రాణి చిత్రం పట్ల శ్రీరామ్ యిష్టం, కౌమార దశలో బాలురలో ఉత్పన్నమయ్యే తెలియని ఆకర్షణను ప్రతిబింబిస్తుంది.

.

మహాత్మాగాంధీ గురించి పాఠాలలో చెప్పినది వినడం, ఏదైనా పాత న్యూస్ రీల్స్ లో చూడడమే తప్ప, ఆయన వ్యవహారశైలి, నడక, అలవాట్లు తెలియని మా తరానికి గాంధీని కళ్ళకు కట్టినట్లు చూపారు రచయిత.

.

సరయూ నది ఒడ్డున మహాత్ముని కోసం వేచి ఉన్న జనసందోహాన్ని వర్ణించినపుడు ఆ సన్నివేశం ఒక ఫిల్మ్ కెమెరా కంటి గుండా చూసిన భావన కలుగుతుంది. అలానే హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి గాంధీ చేసిన ప్రసంగం, అందర్నీ కలిసి మరింత పెద్దగా చప్పట్లు కొట్టమనడం, మన మధ్య ఉన్న ఎవరో యిద్దరు వ్యక్తులు వేరే విషయాలు మాట్లాడుకుంటున్నారంటూ వేసే బాణాలు – రచయిత నిజంగా ఆ సభికులలో ఒకరిగా ఉన్నారేమో అని అనిపించేంత సహజంగా ఈ సన్నివేశాన్ని నడిపించారు.

.

మున్సిపల్ ఛైర్మన్ నటేశ్ ఇంట్లో మహాత్ముని ప్రవేశించిన సందర్భంలో, గాంధీజీ ప్రాపకానికి ఛైర్మన్ పడే పాట్లు, ఆయన ఆశలు భగ్నం చేస్తూ సాగే గాంధీజీ స్పందన మనకు నవ్వు తెప్పించడంతో పాటు, దీనజనుల పట్ల మహాత్ముడు ఎంత ఆదరంగా ఉంటారో తెలియజేస్తుంది.

.

కనీస సామాజిక పరిజ్ఞానం లేని శ్రీరామ్, భారతి పట్ల ఆకర్షణతో గాంధీ ఆశ్రమ ప్రవేశం చేసి తదనంతర పరిస్థితుల్లో జాతీయోద్యమంలో భాగమయ్యే విధానం, గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారే పరిణామ క్రమాన్ని పోలి ఉన్నది.

.

బామ్మకు యిష్టం లేకపోయినా శ్రీరామ్ గాంధీజీతో కలిసి దేశ సంచారం చేస్తూ, నూలు వడకటంలో శిక్షణ పొంది, భారతి సూచనల ప్రకారం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం, కాంట్రాక్టరుతో సంభాషణ, మథీసన్ తో మాటామంతీ వీటన్నింటిలోనూ జాతీయోద్యమం పట్ల పరిమితమైన అవగాహనే ఉండి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మర్యదపూర్వకంగా తప్పుకోవడం, గాంధీ గారి అహింసా సైన్యంలో ఓ సిపాయిలా పని చేస్తున్నానన్న భావనతో ప్రవర్తించడం జరుగుతుంది.

.

గాంధీ గారి మల్టీ టాస్కింగ్, అందరినీ నూలు వడకమనడం, ప్రకృతిలో భగవంతుని దర్శించమని చెప్పడం వంటి సన్నివేశాలు సృష్టించడం ద్వారా పాఠకులకు మహాత్ముని తత్వాన్ని బోధ పరచారు రచయిత.

.

మెంపీ కొండలలో ఒంటరిగా ఉన్న కాలంలో “అసలీ రొంపిలోకి ఎందుకు దిగానా” అని ఆలోచించుకునే సందర్భాన్ని రచయిత శ్రీరామ్ అంతరంగ ఆవేదనను ఎంతో బాగా ఆవిష్కరించారు.

.

సోలూర్ గ్రామంలో దుకాణం ముందు శ్రీరామ్ చేసిన సత్యాగ్రహం మరువలేనిది. తాను అంగీకరించలేని/తనకు నచ్చని పరిస్థితులను ఎదుర్కోవడానికి, తీవ్ర అసహనంతో, దూకుడు స్వభావంతో పోట్లాటలకు, కొట్లాటలకు దిగే నేటి తరం యువత నేర్చుకోవలసిన అంశాలు ఈ సన్నివేశంలో ఎన్నోఉన్నాయి. అహింసా పద్ధతుల్లో తమ నిరసనని ఎలా తెలియజేయవచ్చో ఈ సన్నివేశం చక్కగా వివరిస్తుంది.

.

నీవు చేసే పని అంతా నీ నమ్మకం మీదే ఆధార పడుతుంది. నీవు చూసేది, నీవు అర్థం చేసుకునే దాని మీద ఆధారపడదు. నీ మన:సాక్షే, నీ అన్ని చర్యల్లో దారి చూపుతుంది. నీవు చూసే దాన్ని బట్టే నడవకు, నీ అంతరంగ ప్రబోధమే నీవు అనుసరించాల్సిన కర్తవ్యం వైపు నడుపుతుంది.

.

ఈ వాక్యాలు కథా గమన ప్రకారం శ్రీరామ్ కు చెప్పినవైనా, లక్ష్య సాధన కోసం పరితపిస్తున్న యావన్మందికీ యివి అనుసరణీయమైనవి.

.

జగదీష్ భారతి పేరు, గాంధీజీ పేరు వాడి, తన వాక్చాతుర్యంతో శ్రీరామ్ ను విప్లవ మార్గానికి వాడుకోవడం చూసి అతని అమాయకత్వం పట్ల జాలివేస్తుంది.

.

కిటికీలో కూర్చుని ప్రపంచాన్నిచూడటం, సాయంత్రం లాలీ ఎక్స్ టెన్షన్ కు పోయి సరదాగా తిరిగి రావడమే వ్యాపకంగా గల ఒక బద్ధకిష్టు, బడుద్ధాయి అయిన వాడు, జాతీయోద్యమంకోసం, ప్రజల్లో తిరగడం కోసం, భారతిని కలవడంకోసం మీసం, జుట్టు పెంచి మారువేషంలో తిరగడం, పోలీసులను లెక్క చేయకపోవడం వరకు జరిగే పరిణామ క్రమం ఎంతో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

.

భారతిని కలవడానికి జైలు పరిసరాలకు వెళ్ళినపుడు, నాయనమ్మమరణించిన సందర్భంలో పోలీసులు బయట వేచి ఉన్నసందర్భంలోనూ కథ ఆసక్తికరంగానూ, ఏం జరుగబోతుందో అన్న ఉద్విగ్నత కలుగజేస్తుంది.

.

అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టినపుడు తోటి ఖైదీలతో ఇబ్బందులు, అధికారులతో స్పర్ధలు, సిద్ధాంతాలపై రాజీ పడటానికి యిష్టపడక పోవడం.. యిత్యాది ఘటనల అనంతరం స్వేచ్ఛా భారతంలో విడుదలై, భారతి సమాచారం అందుకుని ఢిల్లీ చేరడం దాకా సన్నివేశాలు ఎంతో హృద్యంగా సాగుతాయి.

.

తన అనుమతితో వివాహమాడాలనుకున్న ఆ జంటకు అనుమతిస్తారు గాంధీజీ.

.


-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!