అవిభక్త కుటుంబము నందలి సౌందర్యముకలవారి కోడలు!

కలవారి కోడలు!

(అవిభక్త కుటుంబము నందలి సౌందర్యమును) 

.

కలవారి కోడలు కలికి కామాక్షి

కడుగుచున్నది పప్పు కడవలో పోసి

.

అప్పుడే ఏతెంచె ఆమె పెద్దన్న

కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీళ్ళు నింపె

.

ఎందుకు కన్నీళ్ళు ఏమి కష్టమ్ము

తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు

.

ఎత్తుకో బిడ్డను ఎక్కు అందలము

మీ అత్తమామలకు చెప్పిరావమ్మ

.

కుర్చీ పీట మీద కూర్చున్న అత్తా

మా అన్నలొచ్చారు మమ్మంపుతార?

నేనెరుగ నేనెరుగ మీ మామ నడుగు

.

పట్టెమంచము మీద పడుకున్న మామ

మా అన్నలొచ్చారు మమ్మంపుతార?

నేనెరుగ నేనెరుగ మీ బావ నడుగు

.

భారతము చదివేటి బావ పెదబావ

మా అన్నలొచ్చారు మమ్మంపుతార?

నేనెరుగ నేనెరుగ నీ అక్క నడుగు

.

వంట చేసే తల్లి ఓ అక్కగారు

మా అన్నలొచ్చారు మమ్మంపుతార?

నేనెరుగ నేనెరుగ నీ భర్త నడుగు

.

రచ్చలో మెలిగేటి రాజేంద్ర భోగీ

మా అన్నలొచ్చారు మమ్మంపుతార?

.

పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర

పోయిరా సుఖముగా పుట్టినింటికిని

ఎంత సుఖమైన హుకుము!

రచ్చలో మెలిగేటి రాజేంద్ర భోగి ఉత్తరాంధ్ర సీమ గేయాలలో

రెండు మూడు తడవలు కనబడుతాడు.

సరిగ్గా ఇటువంటి పాటయే రాయలసీమ పాటలలో ఒకటున్నది.

.

పట్టెమంచం మీద పండుండె మామా

అందరూ బోతారు నంది తిరణాళూ స్వామి తిరణాళూ

నన్నేమి యడిగేవు మీయత్త నడుగే

.

గద్దె పీటలమింద గౌరి పెద్దత్తా

అందరూ బోతారు నంది తిరణాళూ 

స్వామి తిరణాళూ

.

రచ్చకట్ట మింద రాజా పెదబావా

అందరూ బోతారు నంది తిరణాళూ

స్వామి తిరణాళూ

.

వంటసాలల నుండె వయ్యారి అక్కా

అందరూ బోతారు నంది తిరణాళూ 

స్వామి తిరణాళూ

.

ఎద్దూల గాసేడి ముద్దూల మఱదీ

అందరూ బోతారు నంది తిరణాళూ 

స్వామి తిరణాళూ

.

సూదుల్లో ఉండేటి ఓ మొగలీరేకా

అందరూ బోతారు నంది తిరణాళూ 

స్వామి తిరణాళూ

.

రచ్చలో మెలిగేటి రాజేంద్రభోగికీ, సూదుల్లో ఉండేటి మొగలి రేకుకీ తారతమ్యమున్నది కదా! 

అది హుకుములో కూడ కనిపిస్తున్నది. 

ఈతడు వల్లగాదన్నాడు.

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!