🚩అమరావతి కథలు -సత్యం శంకర మంచి.🌹 (1 నుండి 5 వరకు.)




🚩అమరావతి కథలు -సత్యం శంకర మంచి.🌹

(1 నుండి 5 వరకు.)


1.వరద.


ముఖ్య పాత్రలు-శాస్త్రిగారు, మాల సంగడు


బాపు బొమ్మ-శాస్త్రిగారు చెయ్యి చాచటం, మాల సంగడు నెయ్యి వేస్తూండటం


కథ: అమరావతిలో వరద వచ్చి అందరూ వీధిన పడిన సమయాన సమష్టి భోజనాలు కులాతీతంగా అందరూ కలసి వండుకుంటారు. వడ్డన సమయంలో, మాల సంగడు శాస్త్రిగారికి నెయ్యి వడ్డించటానికి సందేహిస్తే, శాస్త్రిగారే సంగణ్ణి పిలిచి " ఒరే సంగా! నీకు ఆకలేస్తుంది, నాకూ ఆకలేస్తుంది. ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపొదురా....వెయ్యరా" అని సంగడి చేత నెయ్యి వేయించుకుంటాడు. "వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే నాకు నమ్మకం లేదు! స్నానం చేసిన వొంటికి తెల్లారేప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లొ మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది" అన్న రచయిత ముక్తాయింపుతో కథ ముగుస్తుంది


2.సుడిగుండంలొ ముక్కుపుడక!


ముఖ్య పాత్రలు ఎలికలాళ్ళు బాచిగాడు, సింగి; భూస్వామి భూమయ్య, అతని భార్య సూర్యకాంతం


బాపు బొమ్మ- నీటి వలయాలు, అందులో సింగి చేతులో బిడ్డతో నుంచుని, బాచిగాడు పూర్తిగా వంగి నీళ్ళల్లో జల్లెడపడుతుంటాడు, ఆ జల్లెడ సూర్యకాంతం ముఖాకృతి కలిగి ఉంటుంది (వారి అంతర్యాన్ని జల్లెడపట్టి బాచిగాడు గ్రహించినట్టు)


కథ - బాచిగాడు, సింగి ఎలికలోళ్ళు, నీళ్ళల్లో జల్లెడపట్టి రంగురాళ్ళు ఏరుకొని బతుకుతుంటారు. ఒకరోజు వీరలా వారి పనిలో ఉండగా భూమయ్య, భార్య సూర్యకాంతం ప్రొద్బలంతో, పిలిచి తన భార్య ముక్కుపుడక ఆ నీళ్ళల్లొనె పొయిందని, వాళ్ళకి దొరికినా ఇవ్వలేదని అభియోగం చేసి వెంటనే ఇవ్వమని హూంకరిస్తాడు. బిత్తరపోయిన ఆ దంపతులు, దిక్కుతోచక చివరికి ఆ ముక్కుపుడక వెతికి ఇద్దామని నిర్ణయించుకుని, బాచిగాడు రొజంతా జల్లెడపట్టి ఆ ముక్కుపుడక పట్టి భూమయ్యకు సమర్పించుకుంటాడు. లోకం తెలియని సింగి భూమయ్య ఏమన్న బహుమతి ఇచ్చాడా, కనీసం పప్పన్నం అని అడుగుతుంది పాపం. బాచిగాడు చక్రవర్తి హుందాలో మంచిరాయి దొరకనీయే! మనవే పెడ్దాం అంటాడు. భూమయ్య తన ధనాధికారంతో అశక్తుడైన బాచిగాడ్ని ఎలా వాడుకుని తన పని డాంబికంగా ప్రతిఫలం ఇవ్వకుండా చేయించుకుంటాడో మనసున్న వారికి చివుక్కుమనే రీతిలో రచయిత వ్రాశారు. ఎర్ర మార్కు కథల్లో ఉండే అవేశ కావేశాలు లేకుండా, మానవ ప్రవృత్తి సహజ దర్పణంలో చూపబడింది ఈ కథలో.


3.పుణుకుల బుట్టలో లచ్చితల్లి!


ముఖ్య పాత్ర-సుబ్బాయి లేదా సుబ్బారావుగారు


బాపు బొమ్మ- ఒక మాసికల గుడ్డ చిరుగులోంచి ఒక వ్యక్తి ఆ మాసికల గుడ్డకు నమస్కరిస్తూంటాడు


కథ-స్థూలంగా పుణుకులమ్ముకునే సుబ్బాయి సుబ్బరావుగారుగా మారిన వైనం, అలా పెరిగి ధనవంతుడయినా, తన మూలాలు మరవకుండా, తన ఎదుగుదలకు ముఖ్య ఆధారాన్ని పూజిస్తూ ఉండటం. కథలో అంతర్గతంగా పేకాటరాయుళ్ళు, తాగుబోతులు, ఏవిధంగా తమ కాలాన్ని, ధనాన్ని వ్యర్ధపరుస్తూంటారో, ధన పరంగా కొంత ఎదుగుదల తరువాత పాత పేరు రోతగా మారి కొత్త పేరుగా రూపాంతరం చెందటం (సుబ్బాయి సుబ్బరావుగా, అతని మనుమడు బుచ్చయ్య హేమంతకుమార్ గా) చెప్పబడింది. పేకాట ఆడుతున్న చోటు, "పేకాట యజ్ఞవేదిక"గా వర్ణన చక్కటి హాస్యం. పేకాటరాయుళ్ళకు పావలా వడ్డీతొ, తాగుబోతులకు అర్ధరూపాయి వడ్డితో సుబ్బాయి అప్పివ్వడం, రెంటి వడ్డిల్లో ఉన్న పెద్ద అంతరం-సుబ్బాయి తాగుబోతుల బలహీనతను తనకనుకూలంగ ఎలా ద్రవ్యపరుచుకుంటాడో - వడ్డీ వ్యాపారుల మోసకారితనానికి అద్దంపడుతుంది.


4.రెండు గంగలు!


ముఖ్య పాత్రలు వాన, శాస్త్రిగారు


బాపు బొమ్మ- ఆకాశగంగ, భూలోక గంగ పక్కన వానలో అనందిస్తున్న శాస్త్రిగారి భార్య


కథ-శాస్త్రిగారు పొలంవెళ్ళి వస్తుండగా వాన మొదలయ్యి అందులోపూర్తిగా తడిసి సంపూర్ణానందం పొంది, మళ్ళీ మామూలు లోకంలోకి వచ్చి, కొత్తగా కాపురానికి వచ్చిన తన భార్య ఏమయిందోనని ఇంటికి ఆదుర్దాగవచ్చి చూస్తే, ఆమె కూడా దొడ్లో వానలో నుంచుని వాన కృష్ణలో,కృష్ణ వానలో కలవటం (అదే రెండు గంగలు) చూసి అనందిస్తూ ఉంటుంది. కథంతా శాస్త్రిగారుతన 80వ పడిలో మనవలకి చెప్తుంటే మనకు తెలుస్తుంది. ఈ కథలో వాన, వాన పడుతున్న తీరు యెక్క వర్ణన చాలా చక్కగా ఉంటుంది. కథ వింటున్న శాస్త్రిగారి పెద్ద మనవడు "వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్యా" అంటాడు. చదువరులకు కూడా అక్కడకు వచ్చేసరికి, సరిగ్గా అదే అనిపిస్తుంది. పూర్వం, అంటే 20వ శతాబ్దపు మొదటి రోజులలో, భార్యను భర్త "ఓహోయ్" అని పిలిచేవాడని హాస్య పూరకంగా తెలుస్తుంది.అప్పట్లో పట్నవాసం వాళ్ళను పల్లె వాసులు (ఇప్పుడది తిరగబడింది) ఎలా ఆట పట్టించేవారో శాస్త్రిగారు తన భార్య గురించి "అందులో పట్నంలో కచ్చేరీ గుమాస్తాగారి కూతురేమో, వర్షంలో తడిసి జలుబుచేసి ఎక్కడ ముక్కూడగొట్టుకుంటుందో" అనుకోవటం హాస్యోక్తిగా రచయిత మలచారు.


5.బంగారు దొంగ!


ముఖ్య పాత్రలు-దొంగ, జానకి రామయ్య, భూషయ్య


బాపు బొమ్మ-వినాయకుడి మీద ఎక్కి కూర్చున్న భూషయ్య, కొంత డబ్బులు పడేస్తుంటే, అనందంతో అవులిస్తూ చేతులు ఎత్తి తీసుకుంటున్న దొంగ. వినాయకుడు విచారంగా తన నెత్తిన ఎక్కిన భూషయ్యను భరిస్తుంటాడు. బొమ్మ అంతర్యం అసలు దొంగ ఎవరో చెప్పటమే.


-కథ-ఊళ్ళొ జరిగిన ఒక సంఘటన. గుళ్ళొ దొంగతనం జరుగుతుంటే పసికట్టిన జానకిరామయ్య ఊరివారిని హెచ్చరిస్తాడు. ఊళ్ళోవాళ్ళు, వాడువీడని లేకుండా అందరూ గుడిమీదపడి దోంగను పట్టుకుని, వీరొచితంగా చావగొడతారు భూషయ్యతో సహా. కథ పేరు "బంగారం దొంగ" అని పెట్టకుండా, "బంగారు దొంగ" పెట్టడంలోని చమత్కారం కథలోని కొసమెరుపు. ఆ దొంగ, భూషయ్య చేత నియోగించబడ్డవాడు. వాడికి డబ్బిచ్చి, దొంగతనానికి పురిగొల్పి, బంగారుపూతను సంగ్రహిస్తూ వాడికి నాలుగు రూకలు పడేస్తుంటాడని భూషయ్య-దొంగల సంభాషణలో తెలుస్తుంది. బంగారం దొంగ భూషయ్య, భూషయ్యకు దొంగ (వీడికి పేరులేదు) బంగారు దొంగ. వేసంకాలం మిట్టమధ్యాహ్నం, శివాలయంలో రికామిగా జరుగుతున్న దొంగ పని బయటపెట్టడానికి మొలల వ్యాధిగ్రస్తుడైన జానకిరామయ్య పాత్రను కల్పించి రచయిత హాస్యాన్ని పండించారు.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!