🚩🚩 🚩 కళాపూర్ణోదయం -6: బ్రహ్మలోకం!🚩🚩
🚩🚩 🚩 కళాపూర్ణోదయం -6: బ్రహ్మలోకం!🚩🚩
*
( జరిగిన కథ – సుముఖాసత్తి సుగాత్రి అనీ మణిస్థంభుడే శాలీనుడనీ తేలిపోతుంది. అలఘువ్రతుడనే వాడు
కళాపూర్ణుడి కథ తెలులుకోవాలనే కోరికతో భువనేశ్వరీదేవి
జపం చేస్తాడు. మణికంధరుడు కలభాషిణిని దేవికి బలిస్తాడు.
ఆమె బతికి ద్వారకలో తనవాళ్ళతో కలుస్తుంది. మణికంధరుడు భృగుపాతానికి శ్రీశైలం వెళ్తాడు – తన దగ్గరున్న రత్నమాలికని అలఘువ్రతుడికిచ్చి. రెండేళ్ళ తర్వాత అలఘువ్రతుడు ఎగిరిపోయి
ఓ రాజసభలో పడి తన దగ్గరున్న రత్నమాలికని ఆ రాజుకి కానుకగా ఇస్తాడు. దాన్ని అక్కడే తొట్టిలో ఉన్న రెండు నెలల బాలిక మెళ్ళో వేస్తారు. హఠాత్తుగా ఆ బాలికకు పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. తను క్రితం జన్మలో కలభాషిణి నంటూ అంతకు ఆ జన్మకన్నా ఇంకా ముందటి జన్మలో జరిగిన విశేషాల గురించి చెప్పటం మొదలు పెడుతుంది. ఇక చదవండి.)
🚩
“#సరస్వతీదేవి మందిరంలో నేను ఉండేటప్పుడు ఒక రోజు భవనం బయట ఒక సరస్సు! దాన్లో హంసల బొమ్మలు! మధ్యలో ఒక గొప్ప మాణిక్య స్తంభం! పక్కన బంగారపు సోపానాలు! ఆ సరస్సు పక్కనే లేత కల్ప వృక్షాల నీడలో పూలపానుపు మీద బ్రహ్మ! ఆయన పాదాలు తన తొడల మీద పెట్టుకుని ఒత్తుతూ శారద!
హఠాత్తుగా ఆమెని ముద్దాడాలన్న కోరిక్కలిగింది బ్రహ్మకి! ఆవేశంగా ఆమె ముఖాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు! “బాగుంది మీ వరస. ఇలా నాలుగు ముఖాలతో ముద్దు పెట్టుకోవాలనుకుంటే ఒకే ముఖం ఉన్న నాకెలా కుదుర్తుంది? ఇంక ఆపండి!” అంది మెడ బిగిస్తూ, ముఖం ఎడంగా పెట్టి, పెదాలకి చేతిని అడ్డంగా ఉంచి! ఆ భంగిమలో ఆమెకి ఒక పక్క మొలక నవ్వు, మరో పక్క కోపం! ఒక పక్క తళుకు చూపులు, మరో పక్క ముడిపడ్డ కనుబొమలు!
అలా ఆమెని చూసేసరికి బ్రహ్మకి ఇంకా ఉద్రేకం కలిగి ఆమె ముఖం అందుకుని అడ్డున్న చేతిని తీసేసి చిన్న గాటు పడేట్టు కొరికాడామె పెదవిని! ఆ పని ఆవిడక్కూడా ఆనందం కలిగించటంతో ఒక మధురమైన శబ్దం బయటికొచ్చిందామె గొంతులోంచి! ఐతే తనకీ ఆనందం కలిగిందని బయటపడ్డం ఆమెకి ఇష్టం లేదు! అందుకని అలక నటిస్తూ రెండో వైపుకి తిరిగింది. కాని ఆమె మనసులోని విషయం ఆమెలో కనపడ్డ కళాశాస్త్ర లక్షణాల వల్ల అక్కడే ఉన్న నాకు తెలిసిపోయింది! అప్పుడేం చెయ్యాలో తోచలేదు బ్రహ్మకి! పక్కనే పంజరంలో ఉన్న నన్ను చూసి, “చిలకా! ఉబుసుపోటానికి ఓ కథేదన్నా చెప్పరాదూ?” అనడిగాడు. దానికి నేను, “మీకు కథలు చెప్పే పాటి దాన్నా నేను? మీరే చెప్పండి నేను వింటా” అన్నాను. సరేనని బ్రహ్మ ఇలా కథ మొదలెట్టాడు
“అనగనగా కాసారపురం అనే పట్టణంలో కళాపూర్ణుడనే రాజు. అతనికి గొప్ప సంపదలున్నాయి. అతను తన కళల్తో లోకంలో ఉన్న రాజులందర్నీ జయించాడు. అతను పుట్టగానే స్వభావుడనే సిద్ధుడొకడు ఒక కొత్త మణిని, గొప్ప విల్లుని, మెరిసే బాణాల్ని అతనికిచ్చాడు. ఆ మణి అద్భుతమైన ఎరుపు రంగుతో ప్రకాశిస్తోంది! ఆ బాణాలు ఎప్పటికీ తరిగిపోయేవి కావు! ఆ విల్లు అతని విజయాలన్నిటికీ కారణం! వాటిని అతను ఎప్పుడూ ధరించే ఉంటాడు! తర్వాత మదాశయుడనే రాజొకడు రూపానుభూతి అనే భార్యతో, ధీరభావుడనే మంత్రితో వచ్చి ఆ చుట్టుపక్కల తారాడుతుంటే కళాపూర్ణుడు తన విల్లెక్కుపెట్టి ధీరభావుణ్ణి దూరంగా తరిమేశాడు! మదాశయుడు శరణు కోరటంతో అతన్నీ అతని భార్యనీ తనకి సేవకుల్ని చేసుకున్నాడు!
అంతవరకూ అలక నటించిన సరస్వతికి అదంతా విని నవ్వొచ్చింది! “కథ బాగానే ఉంది. మరి ఆ కళాపూర్ణుడు ఏమయ్యాడో అతని తల్లిదండ్రులెవరో కూడా కనుక్కోవే!” అంది నాతో. “ఏముందీ! అప్పుడతన్ని అభినవకౌముది అనే సుందరి వచ్చి వరించింది. అతని తండ్రి సుముఖాసత్తి, తల్లి మణిస్తంభుడూ!” అనే సరికి ఫక్కున నవ్వి అతన్ని కౌగిలించి, “ఇంతలోనే ఇన్ని తబ్బిబ్బులా స్వామీ! ఆ రాజు తల్లి మగవాడూ తండ్రి ఆడదీనా! భలే ఉందే! ఆ తర్వాత ఏమైంది?” అంది అతని వీపు చరుస్తూ!
దాంతో బ్రహ్మ ఇంకా పరవశుడయ్యాడు. ఆమెని కౌగిలించుకుని తన నాలుగు ముఖాల్తో చుంబించాడు. ఐతే వాటిలో ఒకటి ఆమెకి కొంచెం గట్టిగా నాటింది! “ఆపండి చాలు!” అని కోపం చూపిస్తూ అతని నాలుగు ముఖాల్ని తన రెండు చేతుల్తోనూ వెనక్కి నెట్టి పట్టుకుంది సరస్వతి! ఆ భంగిమలో కొంత బయటికి కనిపిస్తున్న ఆమె పాలిండ్లనీ వాటి కిందగా ఉన్న ఆమె సన్నటి నడుమునీ కొంత సేపు అలాగే చూశాడు బ్రహ్మ! మళ్ళీ ఒకసారి ముద్దాడాడు! “ఇవన్నీ బాగానే ఉన్నాయి గాని ఆ రాజేమయ్యాడో చెప్పండి!” అంది శారద.
“అతనికేం! సత్వదాత్ముడనే మంత్రి అతన్ని అంగదేశంలో క్రముకకంఠోత్తర పురం అనే గొప్ప పట్టణానికి రాజుని చేశాడు. దానికి మదాశయుడు బంగారు కోట పెట్టించాడు. అప్పటికీ వెళ్ళిపోకుండా మదాశయుడు, అతని భార్య రూపానుభూతీ అతన్నే కొలుస్తూ అతని దగ్గరున్న మణి ప్రభావం వల్ల మధురలాలస అనే కూతుర్ని కన్నారు. అప్పుడా మణి గొప్పతనానికి ఆశ్చర్యపడుతూ మదాశయుడి పురోహితులు నలుగురు ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ ఆగములనే వాళ్ళు వచ్చి ఆ మణిని తాకుతూ ఆనందించారు. వాళ్ళందరూ అలా తనకి లొంగి వున్నందువల్ల కళాప్రపూర్ణుడు కూడా ఆనందించాడు. ఐతే ఇంతలో ఆ నలుగుర్లో ఒక తుంటరి ఆ మణిని గట్టిగా నొక్కి పట్టటంతో కళాపూర్ణుడికి కోపం వచ్చేసింది! వాళ్ళ నలుగుర్నీ వెంటనే అక్కణ్ణుంచి పారదోలాడు! అంతటితో ఆగక మదాశయుడు పెట్టించిన బంగారు కోటని కూడా బద్దలు కొట్టించాడు!
మదాశయుడు “ఇక్కడిక లాభం లేదు. ఈ దేశంలోనే మరో పట్టణానికి వెళ్దాం” అని భార్యా బిడ్డల్తో ఆ క్రముక కంఠోత్తర పురం విడిచి వెళ్తుండగా ఎదురుగా రెండు అద్భుతమైన పూర్ణ కలశాలు కన్పించాయతనికి! వాటిని చూసి ఆనందిస్తూ ఆ దగ్గర్లోనే మధ్య దేశంలో కొన్నాళ్ళ పాటు ఉన్నారు వాళ్ళు! కాని ఆ ప్రయాణ బడలిక వల్ల మధురలాలస నీరసపడిపోయింది! మరి ఆ పాప పరిస్థితి వల్లనో ఏమో మదాశయుడు సకుటుంబంగా మళ్ళీ క్రముకకంఠోత్తర పురానికి తిరిగొచ్చాడు! అలా తిరిగొచ్చాక కళాపూర్ణుడినీ, అతని దగ్గరి మణినీ చూట్టం తోనే ఆ పాప ఆరోగ్యవంతురాలైంది! ఆ విచిత్రం చూసిన మదాశయుడు కళాపూర్ణుడిని ఎంతగానో పొగుడ్తూ అక్కడే ఉండిపోయాడు. వాళ్ళ నలుగురు పురోహితులు కూడ వినయంగా తిరిగొచ్చి బుద్ధిగా అతన్ని సేవిస్తున్నారు. మధురలాలస క్రమక్రమంగా పెరిగి పెద్దదై ఆ కళాపూర్ణుడితో కనీ వినీ ఎరగని సుఖాలనుభవించింది! ఇదీ కళాపూర్ణుడి కథ!” అని ముగించాడు బ్రహ్మ ఉత్సాహంగా!
అదంతా విని మనసులో ప్రేమ పొంగుతున్నా పైకి మాత్రం కోపం నటిస్తూ “చాల్చాల్లే. మీరు కథలు కట్టటానికి నేనే దొరికానా!” అన్నది సరస్వతి కనుబొమలు ముడుస్తూ. దానికతను నవ్వుతూ, “అదేమిటి? ఈ కథలో నీ విషయం ఏముంది?” అన్నాడు అమాయకంగా. “సరేలెండి, మీ మాటలన్నిటికీ మూలం నేనిచ్చిన విద్యలేనని మరిచిపోకండి! మీరు చెప్పిన కథంతా ఇప్పుడిక్కడ మనిద్దరి మధ్యా జరిగిన సంఘటనలకి కథారూపమే నని నాకు తెలీదనా మీ ఉద్దేశ్యం? కావాలంటే చెప్తా వినండి” అంటూ అతను చెప్పిన కథకు తన వ్యాఖ్యానాన్ని వినిపించింది శారదాదేవి! (కొంచెం జాగ్రత్తగా బ్రహ్మా సరస్వతుల సరసాల్ని చదివిన వాళ్ళకి ఈ పాటికి ఆయన చెప్పిన కథకీ అక్కడ జరిగిన వాటికీ సంబంధం తెలిసిపోయి ఉండాలి. ఇంకా అనుమానంగా ఉంటే మరొక్కసారి చదివి ఆపైన ముందుకు సాగండి!)
“ఇప్పుడు మన ఎదురుగా ఉన్న కొలనే కాసారపురం. దాన్లో కన్పిస్తున్న నా ముఖం నీడ పూర్ణ చంద్రుడిలా ఉందని అది కళాపూర్ణుడనే రాజన్నారు (రాజంటే చంద్రుడనే అర్థం కూడా ఉంది కదా!). ఆ రాజు మిగిలిన రాజులందర్నీ తన కళల్తో ఓడించాడనటం ఆ నీడ అన్ని లోకాల్లో ఉన్న అందగత్తెల ముఖాల కన్నా కూడా అందంగా ఉందనే మీ అతిశయోక్తి! దీన్లో ఆలోచించాల్సిందేమీ లేదు.
అతనికి స్వభావుడనే సిద్ధుడు విల్లు, బాణాలు, ఎర్రటి మణి ఇచ్చాడంటే స్వాభావికంగానే విల్లులాటి కనుబొమలు, బాణాల్లాటి చూపులు, ఎర్రటి పెదాలు ఉన్నాయని చెప్పటం ఈ అర్థం ఎవరికి తెలీదు?
చూపుల బాణాలు ఎప్పటికీ తరగనివి. విల్లే అతనికి విజయాన్నిస్తుందనటం నా కనుబొమలు మీ కోరికల్ని అదుపులో పెడతాయనటం. మదాశయుడనే వాడు రూపానుభూతి అనే భార్యతో ధీరభావుడనే మంత్రితో ఆ చుట్టుపక్కలకి వస్తేనే కళాపూర్ణుడు తన వింటిని సారించి ధీరభావుణ్ణి పారదోలి మదాశయుణ్ణీ అతని భార్యనీ సేవకులుగా చేసుకున్నాడంటే ఆ నీడ వంక మీ హృదయం, దృష్టి, ధైర్యం వెళ్ళగానే అది కోపంతో కనుబొమలు ఎత్తి మీ ధైర్యాన్ని పారదోలి హృదయాన్నీ దృష్టినీ స్వాధీనం చేసుకున్నదని!
మీరంతవరకు చెప్పేసరికి నాకు నవ్వొచ్చింది. ఆ నవ్వు వెన్నెల్లా ఉందని అభినవ కౌముది (కొత్త వెన్నెల) వచ్చి కళాపూర్ణుణ్ణి వరించిందన్నారు. కళాపూర్ణుడి తండ్రి సుముఖాసత్తి తల్లి మణిస్తంభుడు అనటం చక్కటి నాముఖం (సు ముఖం) ఆ కొలనుకి దగ్గరగా ఉండటం (ఆసత్తి) వల్ల దాని నీడ కొలన్లోని మణిస్తంభంలో పుట్టిందని చెప్పటం! అలా మీరు తల్లి మగవాడు తండ్రి ఆడదీ అనటంతో నాకు నవ్వొచ్చి మీ వంక తిరగటం వల్ల కొలనులో నీడ బదులు మీ ఎదురుగా నా కంఠం పై భాగంలో ముఖం కనపడటాన్ని అంగదేశంలో క్రముక కంఠోత్తర పురంలో కళాపూర్ణుడికి పట్టం కట్టటం అన్నారు. అలా తిరగటం అనేది నా ఇష్ట ప్రకారం జరిగిన పని గనక సత్వదాత్ముడనే మంత్రి అలా అతనికి రాజ్యం పట్టం కట్టాడన్నారు.
అప్పుడు మీరు నన్ను మీ బంగారు రంగు చేతుల్తో కౌగిలించుకున్నారు. దాన్ని మదాశయుడు క్రముకకంఠోత్తర పురానికి బంగారు కోట పెట్టించటంగా చెప్పారు. మీ హృదయం, దృష్టి నా ముఖాన్నే చూస్తూ పెదాల్ని కావాలనుకోవటాన్ని మదాశయుడికీ రూపానుభూతికీ మణి మహిమ వల్ల మధురలాలస పుట్టటంగా వర్ణించారు. అప్పుడు మదాశయుడి పురోహితులు నలుగురు ఆ మణిని పట్టి చూశారనటం మీరు నాలుగు ముఖాలతో నా పెదాల్ని చుంబించటం! మీ నాలుగు ముఖాల్నుంచీ నాలుగు వేదాలు వల్లిస్తారు గనక ఆ పురోహితులకి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ ఆగములని పేర్లు పెట్టారు (ఆగమాలంటే వేదాలు కదా!). వాటిలో ఒక ముఖం కొంచెం గట్టిగా పీడించటం వల్ల కోపంతో వెనక్కి నెట్టి కౌగిలి విడిపించుకోవటాన్ని ఆ పురోహితు డొకడు మణిని గట్టిగా నొక్కటం గానూ కళాపూర్ణుడు అందుకు కోపగించి వాళ్ళను తరిమి బంగారు కోటను పడగొట్టించటం గానూ చెప్పారు.
అప్పుడు మీ హృదయం, దృష్టి నా ముఖాన్ని వదిలి మిగతా అవయవాల మీదికి వెళ్ళటాన్ని మదాశయుడు భార్యతో కలిసి కళాపూర్ణుడిని వదిలి అంగదేశంలోనే మరో చోటికి వెళ్ళటంగా పోల్చారు. అక్కడ రెండు పూర్ణ కలశాల్ని చూసి మధ్య దేశంలో కొంత కాలం ఉండటం అంటే వక్షోజాల్ని చూసి నడుం దగ్గర కొంత సేపు దృష్టి నిలపటం. ముఖం మీది నుంచి దృష్టి పోయాక పెదాల మీది కోరిక తగ్గటాన్ని కళాపూర్ణుడి నించి దూరమయాక మధురలాలస చిక్కిపోవటంగా వర్ణించారు. అప్పుడు మళ్ళీ మీ హృదయం, దృష్టి నా ముఖం మీదికి రావటం, అందువల్ల పెదాల మీద కోరిక పెరగటం, తర్వాత ఆ కోరిక తీరటం మదాశయుడు కళాపూర్ణుడి కొలువుకి తిరిగి రావటం, మణి ప్రభావం వల్ల మళ్ళీ మధరలాలస ఆరోగ్యం పుంజుకోవటం, దానికి యవ్వనం వచ్చాక కళాపూర్ణుడితో సుఖాలు పొందటంగా పోల్చిచెప్పారు. ఇదీ మీరు చెప్పిన కథలోని అసలు కథ. నేనంతా సరిగ్గానే చెప్పానా లేదా!” అని పరిహాసంగా నవ్వింది శారదా దేవి!” (ఈ అద్వితీయమైన ఘట్టాన్ని మూలంలోనే చదవాలి దాని రుచి సరిగ్గా తెలియాలంటే. మూలం కావాలంటే ఇక్కడ నొక్కండి.)
ఇక్కడి వరకూ చెప్పిన ఆ పాప నవ్వుతూ అన్నదీ, “మరి ఇదంతా జరిగేటప్పుడు నేనక్కడున్న విషయం వాళ్ళకి గుర్తు లేదో లేక చిలకే కదా అని పట్టించుకోలేదో గాని, నేను మాత్రం కదిల్తే కోపగిస్తారేమో నని బిక్కచచ్చిపోయి అక్కడే ఉండి అంతా చూసి, విన్నాను.
తర్వాత కొన్నాళ్ళకి బ్రహ్మ కొలువుకి ఇంద్రుడు వస్తుంటే రంభ కూడ అతన్తో వచ్చి సరస్వతీదేవి దర్శనానికి అంతఃపురంలోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే నేను ఒక చోట పంజరంలో కూర్చుని పనిలేక అదివరకు కొలను దగ్గర ఉన్నప్పుడు సరస్వతీ దేవి గొంతులోంచి వచ్చిన మధురమైన శబ్దాన్ని అనుకరించి ఆనందిస్తున్నా! అది విన్నది రంభ. విన్నది ఊరుకోక “ఇదేదో చాలా బాగుందే, అమ్మ గారి దగ్గర నేర్చుకున్నావా?” అనడిగితే బుద్ధిలేని దాన్ని, నేనూ ఏమీ దాచకుండా కొలను దగ్గర జరిగిన వ్యవహారమంతా పూసగుచ్చినట్టు చెప్పానామెకి! ఎంత నేర్పినా చిలకలు చిలకలే కదా! అంతటితో ఆక్కుండా ఆ రంభ “మళ్ళీ మళ్ళీ” అని అడుగుతుంటే నేను కూడ ఉత్సాహంగా ఆ శబ్దాన్ని పదేపదే వినిపిస్తున్నా.
అంతలో అక్కడికొచ్చింది శారదా దేవి! కోపంతో మండిపడుతూ! “ఎంత తిమ్మిరి కూతల దానివే నువ్వు! నోటికొచ్చిన వన్నీ చెప్తున్నావ్! దీనికి శాస్తిగా నువ్వు భూలోకంలో లంజవై పుట్టు పో!” అని నన్ను శపించింది ఆ ఆవేశంలో! ఈలోగా రంభ భయపడి పరిగెత్తి ఒక రత్నస్తంభం వెనక నక్కి నిల్చుంది. అంతలో బ్రహ్మ కూడా అక్కడికొచ్చాడు. ఆమె చేసిన పని చూసి “ఎప్పుడూ లేనిది ఇంత కోపం ఏమిటివేళ?” అంటూ సున్నితంగా మందలించాడామెని. దానికామె కూడా కోపం తగ్గిపోయి నవ్వుతూ, “చూశారా ఇది మనం ఉద్యానవనంలో చెప్పుకున్న కథంతా రంభకి చెప్పేస్తోంది!” అంది. దానికతను “అది చిలక్కదా, దానికేం తెలుస్తుంది? మరీ ఇంత నిర్దయగా తిట్టొచ్చునా?” అని ఆ శాపానికి బాధ పడుతున్న నన్ను చూసి ఓదారుస్తూ, “మీ అమ్మ గారి శాపాన్ని తిప్పటం ఎవరి వల్లనౌతుంది? అది అనుభవించక తప్పదు. కాకపోతే ఆ తర్వాతి జన్మలో నువ్వు మదాశయుడనే రాజుకి మధురలాలస అనే కూతురిగా పుట్టి కళాపూర్ణుడనే మహారాజుకి భార్యవై ఎక్కడలేని భోగాల్ని అనుభవించి కృతార్థురాలివౌతావు. విచారించకు” అని చెప్పాడు.
దానికామె విసుక్కుంటూ, “మళ్ళీ ఈ మదాశయుడూ కళాపూర్ణుడూ ఏమిటి? ఇంకా మీకు అదే కలవరింతా?” అని అతన్ని ఆక్షేపించింది. “నీ ముఖ వర్ణనకి సంబంధించిన కథలు నాకెప్పుడూ కలవరింతలేననుకో!… ఐతే, నిజంగానే, భూమ్మీద కళాపూర్ణుడనే రాజు పుడతాడు, ఇదతనికి భార్య ఔతుంది” అని అదే మాట మీద నిలబడ్డాడు బ్రహ్మ. “అలానా? మరి ఆ కథ ఎలా ఉంటుందో చెప్పండి” అని ఆమె అడిగితే, “వేరే ఏమీ లేదు. నువ్వు ఇదివరకు విన్నదే ఈ కథానూ! అందులో ఉన్న మనుషుల పేర్లు, మనుషులు, సంఘటనలు, అన్నీ అలాగే జరుగుతాయి. కాకపోతే మనం చెప్పుకున్న కథ అదివరకే జరిగినట్టు చెప్పాను, ఇది ఇక ముందు జరగబోతోంది! నేను కథని కాస్త టూకీగా చెప్పాను, అది జరిగేటప్పుడు అవసరమైన కొన్ని పిట్ట కథల్తో ఇంకొంచెం పెద్దదౌతుంది. అదే తేడా! ముఖ్యమైన కథంతా నేను ఇదివరకు చెప్పిందే!” అని వివరించాడా సృష్టికర్త.
ఆ మాటలకి చాలా ఆశ్చర్యపడింది సరస్వతి. కొంచెం ఆలోచించి, “ఐతే ఆ రాజుకి నిజంగానే తల్లి మగవాడూ తండ్రి ఆడదీనా?” అనడిగింది నమ్మలేనట్టుగా! “అనుమానం ఎందుకు? పైగా, నీ మూలానే అలా జరుగుతుంది కూడా!” “సరే లెండి. మీరు సృష్టికర్తలు, ఎట్లాగైనా చెల్లుతుంది. మధ్యలో నన్నెందుకూ ఇరికిస్తారు? … అదీ గాక ఇక్కడ మన మధ్య జరిగిన విషయాలేవీ ఎవరి దగ్గరా ఎత్తకండి. ఏదో ఏకాంతంలో చెప్పుకున్న కథ కదా అని అనుకుంటే ఇప్పుడేమో అది నిజంగానే భూమ్మీద జరగబోతుందంటున్నారు! దానికి తోడు ఇంకా “ఇది ఇలా జరుగుతుందని బ్రహ్మ ముందే చెప్పాడట” అని బయటపడితే, ఇంకేముందీ! వెంటనే, “మరి ఈ కథంతా దేన్ని గురించిట?” అని, “వాగ్దేవి ప్రతిబింబానికి రూపమే కళాపూర్ణుడు” అంటే “ఈ కథ ఏ సందర్భంలో చెప్పాడో కదా?” అనీ, ఇలా తీగ లాగితే డొంకంతా కదిల్నట్టు విషయమంతా బయటికొచ్చి నేను నలుగుర్లో నవ్వుల పాలౌతాను. కాబట్టి మీరెక్కడా బయటపెట్టొద్దు. రహస్యంగా దాచేద్దాం” అన్నది సరస్వతీ దేవి కంగారుగా.
“ఆఁ! అన్నీ పైపై మాటలే! ఎవరి కైనా వాళ్ళ శృంగార కథలు బయటికి రావాలనే ఉంటుంది! నీ మనసూ మాటా ఒకటో కాదో చూద్దాం ఏదీ నీ నాలిక్కొనతో ముక్కందుకో నమ్ముతాను!” అంటూ ఎకసెక్కెం ఆడాడతను. గొప్ప ప్రయత్నం మీద నవ్వాపుకుంటూ “నవ్వులు చాలు, మీరేమన్నా ఇక నాక్కోపం వస్తుంద”ని ఆమె ఓ పూల బంతిని అతని మీదికి విసిరింది. ఐనా అతనాపక పోవటంతో “ఇంక ఆపండి” అంది అతన్ని కౌగిలించుకుని ఒక చేత్తో గడ్డం పట్టుకుని చెక్కిలితో చెక్కిలి రాస్తూ. దానికతను ఆనందిస్తూ, “ఎందుకలా వెనకాడతావ్? నీ మాటలెలా ఉన్నా నీ మనసులో కోరిక మాత్రం ఈ కథ బయటికి రావాలనే! ఇలాటి విచిత్రమైన కథ వల్ల గాక ఇంకే విధంగా నీ మహిమలు ప్రచారమౌతాయి చెప్పు? అసలు ఆలోచించిచూస్తే దేనికైనా ప్రసిద్ధి కలిగేది భాష వల్లనే కదా!…. ఆ భాషేమో నీ రూపం! మరి అలాటప్పుడు నీ అంగీకారం లేకుండా ఏదైనా నిలుస్తుందా? కనక ఈ కళాపూర్ణుడి కథ తప్పకుండా చాలా ప్రసిద్ధి పొందబోతోంది” అని విశ్లేషించాడు ఓపిగ్గా.
“మీరింత పట్టుపట్టి చెప్తుంటే నేను కాదనటం ఎందుగ్గాని, మరి ఆ కళాపూర్ణుడి కథ జరిగినంత మాత్రాన మన కథ కూడా దాన్తో పాటు బయటికి రావల్సిందేనా?” “ఆహా, ఇది ముందుగానూ అది ఆ తర్వాతనూ వస్తాయి” “సరే, అలా ఐతే మన కథ ఎలా బయటికొస్తుందో తెలుసుకోవాలి. మీరు మాత్రం ఎక్కడా చెప్పకండి” “అలాగే!”
అప్పుడా శారదా దేవి నా వంక చూసి, “ఇప్పుడిది భూలోకంలో పుట్టబోతోంది గనక ఈ విషయాలేవీ గుర్తుండవు, ఈ కథ ఎవరికీ చెప్పలేదు!” అని “ఆ రంభ ఎటుపోయింది? దానికి సరైన బుద్ధి చెప్పాలి!” అనేంతలో గడగడ వణుకుతూ బయటికొచ్చి ఆమె కాళ్ళ మీద పడింది రంభ. “లే, లే! నువ్వీ కథ ఎక్కడన్నా చెప్పావంటే ఏమౌతుందో … నా సంగతి తెలుసుగా!” అంటుంటే బ్రహ్మ నవ్వుతూ, “నీ సంగతి ఇంక ఎవరికేం తెలుస్తుంది? ఇక ముందు ఈ కథ చెప్పే వాళ్ళూ వినేవాళ్ళూ భూమ్మీద తరతరాలకీ తరగని సంపదల్తో శుభాలు సౌఖ్యాలు పొందుతారు. ఇది నా ఆశీర్వచనం” అని సెలవిచ్చాడు. దానికి సరస్వతి కూడా, “అలాగే కానివ్వండి. ఇదీ బాగానే ఉంది. ఇక్కడి వాళ్ళెవరమూ ఇక ఈ విషయం గురించి మాట్టాడం” అని హాయిగా నవ్వేసింది.
ఇక నా శాపం వల్ల నేను కలభాషిణి అనే వేశ్యగా ద్వారకా నగరంలో పుట్టాను. బ్రహ్మ చెప్పిన విధంగా ఈ జన్మలో ఇలా ఇక్కడ పుట్టాను. క్రితం జన్మలో కాళికాలయంలో మణికంధరుడి దగ్గర చివర సారిగా చూశా ఈ హారాన్ని. అందువల్లనే ఇప్పుడన్నది రెండేళ్ళ నాడు చూశానని!” అంటూ తన రెండు జన్మల క్రితం కథని వినిపించింది ఉయ్యాల్లో పసిపాప.
ఆశ్చర్యంలో మునిగి తేలారందరూ. అలఘువ్రతుడు ఆ పాపకి సాష్టాంగ నమస్కారం చేసి “తల్లీ, నువ్వు చెప్పిన దానికి సాక్ష్యంగా కలభాషిణిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన ఒక పని నాకు కన్పిస్తోంది” అన్నాడు. “అదేమిట”ని ఆ రాజు అడిగితే, “కలభాషిణి వల్లనే నేను కళాపూర్ణుడి గురించి విన్నాను. అది విన్నందు వల్లనే నేను భువనేశ్వరీ జపం చెయ్యటం, ఇలా వచ్చి పడటం జరిగాయి.” అని చెప్పాడతను.
అప్పుడతనికి మరో ముఖ్యమైన విషయం గుర్తొచ్చింది. ఆ పాప వైపుకు తిరిగి, “నువ్వు కారణజన్మురాలివి. నీ మాటలు జరక్కపోవటం లేదు. కనక నువ్వు మధురలాలసగా ఎలా పుట్టావో, నీకు భర్త కాబోతున్న ఆ కళాపూర్ణుణ్ణి నేను ఎప్పుడు ఎక్కడ చూస్తానో కూడా చెప్పు తల్లీ” అని ప్రార్థించాడతను. దానికా బాలిక, “ఆ విషయాలు నేను చెప్పటం బాగుండదు. ఈ సభలో వాళ్ళనడుగు. వాళ్ళు నీకు చెప్తారు” అంది ఆదరంగా. అప్పుడా రాజుని చూసి, “అయ్యా!ఇదే లోకమో! ఏ పట్టణమో! మీరెవరో! నాకేమీ తెలియటం లేదు. దయచేసి చెప్పండి” అని ప్రాధేయ పడ్డాడు అలఘువ్రతుడు. అందుకా రాజు, “ఇప్పటి దాకా అద్భుతమైన కథలు వింటూ నీ విషయం కూడా అడగలేదు. ఐనా కొంత కొంత నీ విషయం బయటికొచ్చింది. ఇక మా విషయం చెప్తా విను! నేనే కళాపూర్ణుడిని! స్వభావ సిద్ధుడిచ్చిన మణీ, విల్లు, బాణాలు ఇవే! మదాశయుడి పురోహితులు నలుగురూ వీళ్ళే! అతను సత్వదాత్ముడు, ఆ పక్కన మదాశయుడు, ఆమే రూపానుభూతి! ఆమె బిడ్డే ఈ శిశువు. ఆమె తండ్రి నన్ను కొన్నాళ్ళు కొలిచి ఆ తర్వాత కొన్నాళ్ళు విడిచి వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చాడు. నన్నూ ఈ మణినీ చూడటంతో ఆ పాపకి సేద తీరిందని ఆనందిస్తూ ఇంతకు ముందే ఆ బంగారు తొట్టిలో ఉంచారామెని. దాని పేరు మధురలాలస. అలాగే ఆమె చెప్పిన కథలోని పేర్ల వాళ్ళందరూ ఇక్కడున్నారు! ఇప్పుడు మనం ఉన్నది అంగ దేశం! నేను పుట్టింది కాసార పురంలోనే! ఇది క్రముకకంఠోత్తర పురం! అన్నీ సరిపోయాయి” అని వివరించాడతనికి.
అప్పుడా అలఘువ్రతుడు కుతూహలం ఆపుకోలేక , “ఐతే మీ తల్లి మగవాడూ తండ్రి స్త్రీనా?” అనడిగాడా రాజుని. “ఆ ఒక్క విషయం మాత్రం నాకూ విచిత్రంగానే ఉంది. ఆ పాపే చెప్పాలి మనకి అదెలాగో!”
దానికి మధురలాలస మళ్ళీ ఇలా ప్రారంభించింది “అలఘువ్రతుడా! నువ్వా కాళికాలయానికి వచ్చేటప్పటికి అక్కడ మణిస్తంభుడనే సిద్ధుడూ, సుముఖాసత్తి అనే అతని భార్యా ఉన్నారు కదా! వాళ్ళూ ఈ రాజు తల్లిదండ్రులు! అదెలా జరిగిందంటే కొన్నాళ్ళ తర్వాత దేశ సంచారానికి వెళ్ళారు వాళ్ళు. సముద్రాన్ని చూసిన తర్వాత కలిగిన కోరికల్తో వాళ్ళు మదనక్రీడల్లో తేలటం ప్రారంభించారు. అప్పుడొక తోటలో ఉన్నప్పుడు అతను వింత కోరికతో, “నువ్వు పురుషుడివి కా, నేను స్త్రీనౌతాను” అన్నాడామెతో. ఆమె కూడా, “అలాగే, నువ్వు స్త్రీవి కా, నేను పురుషుణ్ణౌతాను” అంది. అదేం మాయో! వెంటనే వాళ్ళలాగే మారిపోయారు!
కొంతసేపు ఆలోచించే సరికి అలా ఎందుకు జరిగిందో అర్థమైంది సుముఖాసత్తికి.
“కాళికాలయంలో నువ్వు నన్ను బలి ఇచ్చినప్పుడు నేను చివరగా దేవిని ప్రార్థించింది నా మాట నిజమయ్యేట్టు చూడమని. కనక అక్కడి శాసన స్తంభం మీద రాసున్న విధంగా నేనన్న మాటలు నిజమయ్యే వరం ఆ దేవి నాకిచ్చిందన్నమాట!” అన్నది ఆశ్చర్యపడుతూ!
మణిస్తంభుడు వెంటనే, “అలా ఐతే ఇంకేం అనొద్దిప్పుడు నువ్వు. మనం ఇలా రూపాలు మార్చుకున్నందు వల్ల ఇదివరకు సరస్వతీ దేవి మనిద్దరికీ ఇచ్చిన విరుద్ధమైన వరాలు కూడా నిజమయ్యేట్టున్నాయి” అన్నాడు.
(ఇంకా వుంది)“
👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿...
Very interesting
ReplyDelete