🌼🌿దక్షిణ కైలాసం... శ్రీ కాళహస్తి!🌼🌿
🌼🌿దక్షిణ కైలాసం... శ్రీ కాళహస్తి!🌼🌿
ఎన్నో క్షేత్రాలను దక్షిణ కాశీగా పిలుస్తున్నా దక్షిణ కైలాసంగా పేరుగాంచింది మాత్రం ఒక్క శ్రీకాళహస్తీశ్వరాలయమే. పంచభూత లింగాలలో ఒకటైన వాయు లింగం కొలువై ఉన్న ఈ ఆలయంలో అడుగు పెట్టినంతనే భక్తులకు ముక్తి లభిస్తుందంటారు. అంతేకాదు, సర్పదోష, రాహుకేతు గ్రహ దోష నివారణలకు దేశంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రమిది. న మఃశివాయలో... ‘న’ అంటే నభము (ఆకాశం), ‘మ’ మరుత్ (వాయువు), ‘శి’ శిఖి (అగ్ని), ‘వా’ వారి (జలం), ‘య’ అంటే యజ్ఞం (భూమి). ఈ అయిదింటికీ ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వపాపాలూ హరించిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.
అలాంటి పంచ భూతాత్మకుడైన పరమశివుడు వాయులింగం రూపంలో ఉద్భవించిన క్షేత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని కాళహస్తిలో ఉన్న శ్రీ కాళహస్తీశ్వరాలయం. మిగిలిన నాలుగూ ఫృథ్వీలింగం (కాంచీపురం), జలలింగం (జంబుకేశ్వరం), అగ్నిలింగం (తిరువణ్నామలై), ఆకాశలింగం (చిదంబరం) తమిళనాడులో ఉన్నాయి. కాళహస్తీశ్వరుడు వాయు లింగం రూపంలో ఉన్నాడనడానికి ప్రతీకగా గర్భాలయంలో లింగం పక్కన ఉన్న రెండు దీపాల్లో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుందట.
బ్రహ్మదేవుడు జ్ఞానం పొందిన క్షేత్రం
కృతయుగం ప్రారంభంలో బ్రహ్మ దేవుడు మహా శివుడి ఆజ్ఞను ధిక్కరించడం వల్ల అజ్ఞానంతో సృష్టి కార్య నిర్వహణలో విఫలమవుతాడు. పోగొట్టుకున్న జ్ఞానాన్ని తిరిగిపొందేందుకు కైలాసంలో తేజోవిరాజితమైన శివానందైక నిలయమనే శిఖరాన్ని తన భుజస్కంధాలపై తీసుకుని భూలోకంలో ఓ పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజించాలనుకుంటాడు. ఆ ప్రకారంగా శివానందైక శిఖరాన్ని కాశీ క్షేత్రానికి 190 యోజనాల దూరంలో దించుతాడు బ్రహ్మ. అక్కడ పంచముఖాలతో కూడిన మహా శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి, శాపం నుంచి విమోచనం పొందుతాడు. అలా శ్రీకాళహస్తి క్షేత్రం దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి పొందింది. ప్రస్తుతం దాదాపు 5500 ఎకరాల్లో ఈ కైలాసగిం¹ులు విస్తరించి ఉన్నాయి. బ్రహ్మదేవుడి మాదిరిగానే వాయులింగేశ్వరుడి దేవేరి అయిన పార్వతీ దేవి కూడా శివుడి కోసం తపస్సు చేసి జ్ఞానామృతాన్ని పొందడంతో ఈ క్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబికగా కొలువుదీరింది.
భక్తుల పేరుతోనే...
శ్రీ (సాలీడు), కాళము (సర్పం), హస్తి (ఏనుగు)... ఈ మూడు మూగ జీవాల భక్తికి మెచ్చి ముక్తిని ప్రసాదించిన శివుడు ఇక్కడ శ్రీ కాళహస్తీశ్వరుడిగా కొలువు దీరాడు. అదెలాగంటే... పూర్వం తామ్రపర్ణీ నదీ తీరంలో నివసించే కరబుడు చీరల అల్లకంలో దిట్ట. పుట్టినప్పట్నుంచీ శివ భక్తుడైన అతడు దుష్ట సావాసంతో శివారాధన విస్మరించి, వైదిక ధర్మాలను విడిచి పెట్టడంతో అనారోగ్యానికి గురై తనువు చాలించాడు. మరుజన్మలో సాలీడుగా దక్షిణ కైలాసంలో జన్మించాడు. ఈ సాలీడు తన దారాలతో వాయులింగేశ్వరుడికి కైలాసంలో ఉన్నట్లు వేదికలూ భవనాలను అల్లుతూ ఉండేదట. దాని భక్తిని పరీక్షించదలచి ఓరోజు శివయ్య ఆ అల్లికలను అగ్నికి ఆహుతి చేశాడట. అది చూసి భరించలేక అగ్నిలో దూకిన సాలీడుకి శివుడు సాయుజ్యాన్ని ప్రసాదించాడు.
కాళము(సర్పం)... హస్తి(ఏనుగు)ల కథ కూడా ఇలాంటిదే. లోగడ ఇద్దరు శివ భక్తులు పూర్వ జన్మ పాపాలతో అష్టకష్టాలూ పడుతూ వచ్చారు. ఆ ఇద్దరూ మరు జన్మలో దక్షిణ కైలాసంలో సర్పం, ఏనుగు రూపాల్లో జన్మించారు. పాము రోజూ ఓ మణిని తీసుకొచ్చి లింగానికి అర్పించి పూజలు చేస్తూ ఉండేది. కొన్నాళ్లకు అక్కడ లింగాన్ని చూసిన ఏనుగు స్వర్ణముఖీ నదిలో స్నానమాచరించి తొండంతో నీళ్లు తెచ్చి లింగానికి అభిషేకం చేసి, మారేడు బిల్వ పత్రాలతో శివార్చన చెయ్యడం మొదలు పెట్టింది. అయితే ఏనుగు మరుసటి రోజు వచ్చేసరికి మారేడు దళాలన్నీ కిందపడిపోయి ఉండేవి. అది చూసి ఏనుగు అసంతృప్తి చెందేది. సర్పం కూడా తాను దేవుడికి అర్పిస్తున్న మణి కింద పడిపోయి ఉండటం వల్ల ఎందుకిలా జరుగుతోందని ఆలోచించింది. విషయం తెలుసుకుందామని ఓరోజు లింగాన్ని చుట్టుకుని పడుకుంది. ఆ సమయంలో ఏనుగు రావడం, పూజ చేసేందుకు మణిని పక్కకు తొయ్యడం చూసిన పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరింది. దాంతో బాధను తట్టుకోలేక ఏనుగు తన శిరస్సును కొండకు ఢీ కొట్టడంతో రెండు జీవులూ శివైక్యం పొందాయి. అలా ఈ క్షేత్రం శ్రీ కాళహస్తి అయింది.
మహా భక్తుడైన కన్నప్ప ఏకంగా తన కళ్లనే తీసిచ్చింది ఇక్కడి శివుడికే. అందుకే, కాళహస్తిలో తొలి పూజను అందుకుంటున్నాడు భక్త కన్నప్ప.
రాహు కేతు పూజలతో ఖ్యాతి
పుత్ర శోకానికి గురైన వశిష్ఠ మహర్షికి దక్షిణకైలాసంలోనే పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనిమిచ్చాడట శివయ్య. ఆ నాగరూపం కారణంగానే కాళహస్తి ‘రాహు కేతు క్షేత్రం’గా కూడా వర్ధిల్లుతోంది. సర్ప దోషం, రాహు కేతు గ్రహ దోషాల నుంచి నివారణ కోసం దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. క్రీస్తు శకం మూడో శతాబ్దం నుంచే అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలున్న ఈ ఆలయానికి వెళ్తే మహాదేవుడి దర్శనంతో పాటు అలనాటి శిల్పకళా వైభవాన్నీ దర్శించుకోవచ్చు. పాతాళ వినాయకుడు, శ్రీకృష్ణ దేవరాయల విజయస్తంభం, జలవినాయకుడి ఆలయం, భరద్వాజ తీర్థం, వేయి లింగాల తీర్థం, ఆలయానికి దక్షిణం వైపున ఉన్న బ్రహ్మ గుడి... ఇలా దర్శించుకోదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కాళహస్తిలో.
Comments
Post a Comment