🔻మధ్య తరగతి మనో "గతం"

 

(

ఎవరో ఈల వేసి పిలిచినట్టు సెల్ ఫోను 

మోగగానేఆయనకేసి చూశాను

జాపుకున్న కాళ్ళకి పతంజలి నూని రాసుకుంటూ... 

"పార్వతీ ! నీ కొడుకు నీ అకౌంటకి 2000 డాలర్లు పంపాడట ,

 వ్వాట్సాప్ లో చెబుతున్నాడు" అన్నారు 

మావారు శంకర ప్రసాదు గారు. 

"డాలర్లలో చెప్పకండి, నాకర్ధమయ్యేట్టు రూపాయల్లో చెప్పండి" అన్నాను విసుగ్గా. 

"2000 ని 74 తో గుణించు... రూపాయల్లో వస్తుంది " అన్నారు విద్యార్థికి లెక్క ఇస్తున్నట్టుగా 

"ఆ గుణకారాలేవో  మీరే చెయ్యండి,

లెక్కల మాష్టారు కదా ?" అన్నాను తెలివిగా .

"లక్షా నలభై ఎనిమిది వేలవుతుంది" అని చెప్పేసి వ్వాట్సాప్ లోకి దూరిపోయారు యధాలాపంగా. 

🚩

చెప్పొద్దూ... అమెరికా వెళ్ళినప్పుడల్లా ఏ మాల్ కి వెళ్లినా ధరలు చూసి వెంటనే 70 తో గుడించేదాన్ని, 

నాకు ఏడో ఏకం బాగానే వచ్చు .

రూపాయిల్లోకి మార్చాక గుండె గుభేల్మనేది .

"ఇక్కడ రూపాయల్లో ఆలోచించ కూడదమ్మా"

అనేవారు పిల్లలు.

పుట్టుకతో వచ్చింది ఊరికినే పోతుందా ?

🚩

కరివేపాకు కట్ట 70 రూపాయలట !

అందుకే.. కూరల్లో,చారులో కొంచం తగ్గించే వేసేదాన్ని.

ఎప్పుడు ఏ సంఘటన జరిగినా ...

ఎందుకో పాత జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి. 

ఈయన మూడేళ్ళ కిందట రిటైర్ అయ్యాక మరీను !

🚩

ఇప్పుడు నా రెండో కొడుకు ప్రత్యేకం జ్ఞాపకంపెట్టుకుని, 

నాపుట్టిన రోజుకి ఏదైనా కొనుక్కోమని లక్ష చిల్లర డబ్బులు పంపిస్తే ఆనందమే ....కానీ....

అప్పట్లో మా మావయ్య నాపుట్టిన రోజుకని ఇచ్చిన యాభై రూపాయలకి ఎంత సంబర పడిపోయానో....

ఎంత మందితో చెప్పుకున్నానో !

అంత సంతోషించడానికి కారణం ఆ వయసా ?

అప్పటి పరిస్థితులా ? లేక అవసరాలా?  ఏమో!

🚩

ఇప్పుడు ఖరీదైన 4 బెడ్ రూముల అపార్టుమెంటు,

ఏసీలు,సోఫా సెట్లు,కింగ్ సైజు మంచాలు, అమెరికా పరుపులు, పేద్ధ టీవీ, ఖరీదైన కారు ...అన్నీ ఉన్నా.... 

ఎందుకో.. ఆ మూడు వరస గదుల అద్దె ఇంట్లో 

మా అత్త గారు,మేవిద్దరం,ముగ్గురు పిల్లల్తో ఉన్నా 

ఎంతో ఆనందంగా, కళ కళ్ళాడుతూ ఉండేది !

ఇరుకు అనిపించేదే కాదు. 

🚩

సెకండు హ్యాండు స్కూటర్  మీద ఆయన అలా ...

గోదారి గట్టు మీదకి తీసుకెడితే ...

ఆ ‘ఇదే’ వేరు !       

ఫ్రిజ్ కూడా లేదు, నలుపు, తెలుపు టీవీ లో చిత్ర లహరి చూస్తుంటే ఏమి ఆనందించాం !

🚩

మా ఆడపడుచులు వస్తే అందరం బరకం పరుచుకుని, పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే.. నిద్రే వచ్చేదికాదు !

మా అత్త గారు కూడా మధ్యలో కబుర్లు కలుపుతూ, కునికి పాట్లుపడుతూ,

"ఇంక చాలు, పడుక్కోండి, తెల్లారి పోతోంది, 

మళ్ళీ పెందలాడే లేవాలి" అనేవారు. 

🚩

మా కబుర్ల కంటే నవ్వులే ఎక్కువగా ఉండేవి,…

ఎవర్నీ నిద్దరోనీకుండా. 

మా ఆడపడుచులు ఎంతో మంచివాళ్ళు,

ఇప్పటి టీవీ, సినిమా ఆడపడుచుల్లా కాదు.

అప్పట్లో ఈయన పినతల్లి కొడుకు పెళ్లికి వెళ్ళాలంటే మంచి పట్టు చీరలే ఉండేవి కావు.

🚩

ఇప్పుడు మూడు బీరువాల నిండా ఎవరెవరో పెట్టినవి, పెట్టించుకున్నవి,కొనుక్కున్నవి చాలా ఉన్నాయి.

పట్టు చీరలైతే లెక్కే లేదు…. ఫాన్సీ చీరలు ఉన్నా ...

ఏం కట్టుకుంటాం ?

అటూ, ఇటూ అందరి పెళ్ళిళ్ళూ అయిపోయాయి. 

అందరి కుటుంబాల నించీ  ఒక్కళ్ళైనా అమెరికాయో,

లండనో చెక్కేశారు. 

మా రోజుల్లో కొంపకి ఒక్కళ్లు హైదరాబాద్ వెడితే ...

‘అబ్బో’ అనుకునే వాళ్ళం. 

శ్రావణ మాసం పేరంటంలో ఎవరైనా

"మావాడు హైడ్రాబాడ్ లో చార్మినారు,ట్యాంకు బండూ చూపించాడు" అంటే,

మనం ఎప్పుడు చూస్తామో అనుకునే వాళ్ళం. 

🚩

ప్రస్తుతం మా పిల్లలు, ఇద్దరబ్బాయిలూ, 

ఒకమ్మాయి అమెరికా లో స్థిరపడ్డారు...

"శతమానం భవతి" సినిమాలో లాగ.

నేనూ,ఈయనా ఇక్కడే భాగ్య నగరంలోనే ఉండిపోయాం...

జయ సుధా, ప్రకాష్ రాజుల్లాగా.

🚩

కొడుకులు ఫోను చేసినప్పుడల్లా "గ్రీన్ కార్డు" అంటూవుంటారు.... 

స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ మాటిమాటికి 

"నా ఉజ్జోగం?"  అన్నట్టు!

ఎందుకో అమెరికా వెళ్లాలంటే ఇంకా మనసు 

రావడం లేదు,    

🚩

ఇక్కడే పాత స్నేహితులు,చుట్టాలతో వాట్సాప్, ఫోనులతో కాలక్షేపం చేయడమే ఇష్టం. 

తరవాత్తరవాత భగవంతుడెలా నిర్ణయిస్తాడో మరి!

నాకు మాత్రం, ఆ టీవీ సీరియళ్లు, చాగంటి వారి ప్రవచనాలు  చూసుకుంటూ వేళకి ఇంత ఉడకేసిపడేస్తే 

హాయిగా గడిచిపోతుంది. 

🚩

అన్నట్టు మొన్న వేసంకాలం మా అమ్మాయి, పెద్ద మనవరాలు, మనవడు వచ్చినపుడు వేలకి వేలు తగలేసి నాకోసం ట 

స్మార్టు ఫోను,టాబ్ కొన్నారు.-....చెప్పాచెయ్యకుండా .

వాటిల్లో వాట్సాప్, యూట్యూబు పెట్టి నన్ను చూసుకోమన్నారు.

మా పెద్ద మనవరాలు మా హై స్కూల్  సైన్సు మాష్టారి లాగ అన్నీ నేర్పించి వెళ్ళింది. 

ఈయన నేర్పితే రాదుకానీ...

అది నేర్పితే బాగానే అలవడ్డాయి నాకు.

నిజంచెప్పొద్దూ... అవన్నీ నేర్చుకున్నాక, 

రోజూ పిల్లలందరి మెసేజీలు, ఫోటోలు, వీడియోలు,

రక రకాల విశేషాలు చూస్తుంటే ...మాటాడుతుంటే… 

టైమే తెలియడంలేదు. 

ఈమధ్య ‘భావుక’ మిత్ర బృందం తో చేరాక చిన్నప్పటి

నా క్లాసు  మేట్లు అందరూ కట్టగట్టుకుని వచ్చినట్టుంది.

పిల్లలు ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్నారనే భావమే రావడంలేదు. 

🚩

అదే నా పెళ్ళైన కొత్తలో నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న

మా అమ్మ కోసం ఎంత బెంగెట్టుకునేదాన్నో!

ఏమాటకామాటే  చెప్పుకోవాలి, పాపం ఈయన వారానికి రెండుసార్లు పుట్టింటికి పంపించేవారు

బడ్జెట్ ఇబ్బందులున్నా !

తనికెళ్ళ భరణి తీసిన "మిధునం" చూస్తుంటే మా కధే తీసినట్టు అనిపిస్తుంది. 

కాకపోతే లక్ష్మి, బాలు గార్లు పల్లెటూళ్ళో ఉంటారంతే. 

మా పిల్లలు వారానికి రెండు మూడు సార్లు వీడియో కాల్సు చేస్తే 

వంట డ్యూటీ తనదేనని పాపం శంకర ప్రసాద్ గారికి తెలుసు. 

🚩

ఆయనక్కూడా వాట్సాప్, యూట్యూబు,ఫేసు బుక్కు ఉన్నా,ఆయన రూటే ...సెపరేటు. 

ఎప్పుడూ రాజకీయాల గొడవే !

"వాడలా అన్నాడు, వీడిలా  అన్నాడు "

అని ఆవేశపడిపోతూ ఉంటారు. 

ఆ ఫేసు బుక్కులో వ్యాసాలకి వ్యాసాలు రాసేస్తుంటారు, 

తానే సమాజాన్ని మార్చెయ్యాలన్నట్టు !

ఇంక టీవీ చూడ్డం మొదలెడితే స్నానమవదు, 

అన్నానికి లేవరు. 

పొద్దుకుంగే దాకా ఆ దిక్కుమాలిన ఛానళ్ళ లో వాదనలే వింటుంటారు. 

పది మందీ కలిసి ఒక్క సారే అరిచేస్తుంటారు,

ఒకడు చెప్పీది  ఇంకోడు వినిపించుకోడు.

ఈయన,"నువ్వునోరుముయ్యరా" అని అరిచేస్తుంటారు !

రోజూ ఇదో ప్రహసనం !

🚩

నేను మాత్రం, నా గది లోకి వెళ్లి, ఏసీ వేసుకుని,

సుమ ఆడవాళ్ళ చేత ఆడించే  ఆటలు చూస్తూ,

 వాళ్ళు కట్టుకున్న పట్టుచీరలు, నగలు చూస్తూ, 

ఈటీవీ లో 'అభిరుచి' లోని రక రకాల వంటల  కార్యక్రమాలని ఎంజాయ్ చేస్తుంటాను. 

ఆయనకి ఇవేమీ నచ్చవు. 

ఎప్పుడూ రాజకీయాలు, వార్తలు, ట్రంపు, మోడీ, 

చంద్రబాబు,కేసీయారు, జగన్ను,పవన్ను......

లేక పోతే 

ఆ జంతువులు ఒకదాన్నొకటి పీక్కుతినే 'విజ్ఞాన' 

చానళ్ళు  ట.... అవే చూస్తుంటారు.

మా దాంపత్య జీవితం లో నగలు, చీరల కోసం ఎన్నడూ ఆయన్ని వేధించలేదు కానీ..

చిన్న టీవీ ఉన్నప్పుడు మాత్రం, సీరియళ్ల టైముకి ఛానల్ మారిస్తే మాత్రం గొడవలే. 

అందుకే మొన్నామధ్య  మా చిన్నబ్బాయి వచ్చినపుడు, రాజీమార్గం గా

నా కోసం ఒకటి, వాళ్ళ నాన్నకి ఒక పేద్ధ టీవీ కొని పారేశాక, కొంపలో శాంతి నెలకొంది... శ్రీలంక లో లాగ.. 

అప్పుడప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది,

ముగ్గురు పిల్లలు, నేను, మా ఆయన, మా అత్త గారు

ఉన్నపుడు ఇల్లు ఇరుకనిపించ లేదు, డబ్బు లేదనిపించలేదు. 

(ఈయన జీతం ఏ నెల్లో ఎంత వచ్చేదో నేను ఎప్పుడైనా పట్టించుకుంటేగా!)

🚩

చుట్టాలు, పక్కాలు వచ్చి మూడు,నాలుగు రోజులుండి పోయినా ఇబ్బందనిపించేది కాదు.

ఎన్నిసార్లు డికాషన్ తీసేదాన్నో..

ఎన్నిసార్లు కుక్కర్ పెట్టేదాన్నో !

సమయానికి గ్యాస్ అయిపోతే, పక్క వాటా వాళ్ళ 

సిలిండెర్ ఉమ్మడి ఆస్తి అయిపోయేది.

ఫ్రిజ్ లేని రోజుల్లో అధాట్టుగా ఎవరైనా వస్తే,

పాలు, పంచదార,కాఫీ పొడికి పక్కింటి

రాధమ్మ గారే మాకు క్రెడిట్ కార్డు. 

🚩

ఇప్పుడేమో లంకంత కొంపలో బిక్కు బిక్కుమంటూ మేమిద్దరమే….

అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయిలాగ.   

ఎవరి ఫోన్లు, డెబిట్ కార్డులు, బాంక్ అకౌంట్లు, 

ఫేసుబుక్ అకౌంట్ లు వాళ్లవే.

పిల్లలు వారంలో ఐదారు సార్లు ఫోను చేసినా ఆయనతో మాట్లాడేది తక్కువే .

ఎప్పుడైనా ఆయన ఫోను తీస్తే, "ఎలా ఉన్నార్రా ?" 

అంతే. మాటలే ఉండవు.

అదే మాకయితే డైలీ సీరియళ్ళే !

మా చిన్న కోడలు ఫోను చేసిందంటే బీబీసీ దగ్గరినించీ  అన్ని చానళ్ల  న్యూస్ చెప్పాక,

మా బుల్లి మనవడి  బొమ్మల టెంటు లోకి తీసుకెళ్లి వాడితో మాట్లాడించే లోపు 

వాడు "నానమ్మ, బాయ్" అంటాడు. 

వాడు బాయ్ ఎంత బాగా చెప్తాడో !

🚩

మాపెద్ద కోడలైతే వీకెండ్ లోనే మాట్లాడుతుంది, 

ఉద్యోగ భారం కారణంగా .

ఈ లోగా మా పెద్దాడు వచ్చి,

"అమ్మా,గ్రీన్ కార్డు విషయం  ఏంచేశారు?"అంటాడు 

సినిమా మధ్యలో వాణిజ్య ప్రకటన లాగ. 

"మీ నాన్ననడుగు" అని ఆయన మీదకి తోసేస్తాను. 

ఆయనతో ఈ విషయం మాట్లాడ్డానికి వాడికెందుకో

 చాలా 'ఇది'. 

🚩మా అమ్మాయి అయితే ఈటీవీ జబర్దస్తు లెవెల్లో

జోకులు వేస్తూనే ఉంటుంది. 

ఈ లోగా మా పెద్ద మనవడు, మనవరాలు వచ్చి,

వాళ్ళకొచ్చిన గిఫ్టులు,సర్టిఫికెట్లు చూపించేస్తారు. 

“అంతసేపు మాట్లాడ్డానికి ఏముంటాయి?"

అంటారీయన.!

ఈయనకేంతెలుసు, పిల్లల్తో మాట్లాడాక నాకు టానిక్ తాగినట్టుంటుందని ?

మా అబ్బాయిలు "అమ్మా, వచ్చే సమ్మర్ కి మీరు

ఇక్కడికి రావడానికి టికెట్లు బుక్  చేస్తున్నాం " అంటే 

"మీ నాన్న తో చెప్పండి" అని ముక్తాయిస్తా .

వాళ్ళ నాన్నని అడిగితే "మొన్ననే కదరా వచ్చాం" 

అంటారని వాళ్లకి తెలుసు. 

ఎందుకో రాను రాను అమెరికా ప్రయాణాలు బోరు  కొడుతున్నాయి .

అదే చిన్నప్పుడు విమానం శబ్దం వినిపిస్తే చాలు,

బయటికి పరుగెత్తి, 

విమానం కనుమరుగయ్యేదాకా చూస్తే ఎంత బాగుండేదో !

అదే ఇప్పుడు ..ఎయిరిండియాలూ, లుఫ్తాన్సాలు, 

ఎతిహాద్ లు ఆనట్లేదు. 

చిన్నప్పుడు పిల్లల్తో ఎర్ర బస్సెక్కి పుట్టింటికి వెడుతుంటే ...

కిటికీ లోంచి  ఆ పచ్చటి పొలాలు,కాలువలు,చెట్లు ఎంత అందంగా ఉండేవని !

(అప్పట్లో ఈయన జోకు...

నేను పుట్టింటికెళ్లేటప్పుడు

ఎర్ర బస్సు వికార పెట్టదుట

అదే బస్సు తిరుగు ప్రయాణంలో 

ఎంత వికార పెడుతుందోట!)

ఇప్పుడేంటి ?

హాంగ్ కాంగు, దుబాయి, ఫ్రాంక్ ఫర్టు,అబుదాబీ లు మామూలుగానే  కనిపిస్తున్నాయి?

పుట్టింటినుంచి వచ్చేస్తుంటే అమ్మ కొన్న చుక్కల

కాటన్ చీర ఎంత బాగుండేది !

(ఇప్పటికీ దాచుకున్నా)

🚩

ఇప్పుడు ఈయన, పిల్లలు ఎన్ని వేలో పోసి కొన్న పట్టు చీరలు ఎందుకు అంత గ్లామరస్ గా అనిపించట్లేదు?

ఇలా చెప్పుకుంటూ పోతే.... ఎన్నో,ఎన్నెన్నో!

మా చిన్నాడి పెళ్లికి మొదలయిన  టీవీ సీరియల్,

"జిగట కాంభోజి రాగాలు" ఇప్పటికీ మలుపుల మీద మలుపులు తిరుగుతూ పోతున్నట్టు, ఎప్పటికీ పూర్తి కాదు. 

నా ఈ మధ్య తరగతి మనోగతం లోని కొన్నిఅనుభవాలు 

మీవే అనిపిస్తే మాత్రం,

ఒక లైక్ వేసుకోండి.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!