నీతి చంద్రిక/మిత్రలాభము🚩\
నీతి చంద్రిక/మిత్రలాభము🚩\ నీతి చంద్రిక రచించినవారు పరవస్తు చిన్నయ సూరి "ధన సాధన సంపత్తి లేని వారయ్యు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని కాక, కూర్మ, మృగ, మూషికనుల వలె స్వకార్యములు సాధించుకొందురు." అనిన రాజపుత్రులు విని "యే కార్యములు కాక, కూర్మ, మృగ, మూషికములు సాధించెను? మాకు సవిస్తరముగ వినిపింపు" డనిన విష్ణుశర్మ యిట్లని చెప్ప దొడంగె. లఘు పతనకము హిరణ్యకుని యొద్దకేగుట గోదావరి తీరమందు గొప్ప బూరుగు వృక్షము గలదు. అందు నానా దిక్కుల నుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును. ఒకనాడు వేకువ లఘుపతనక మను వాయసము మేలుకొని రెండవ యముని వలె సంచరించుచున్న కిరాతుని జూచి, "వఱువాత లేచి వీని మొగము చూచితిని, నేడేమి కీడు రాగలదో తెలియదు. వీడు వచ్చినచోట నిలువదగదు. జాగుసేయక యీచోటు విడచి పోవలె" నని యత్నము సేయుచుండగా వాడా వృక్షమునకు సమీప మందు నూకలు చల్లి, వలపన్ని పోయి చేరువ పొదలో దాగి పొంచి చూచుచుండెను. అనంతరము చిత్రగ్రీవుడను కపోతరాజు నింగిని సంచరించుచు నేలమీది నూకలు చూచి, తన తోడి కపోతములతో నిట్లనియె: "ఈ నిర్జన వనమందు నూకలు రా నిమిత్తమేమి? మన మీ నూకల కాసపడర...