నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి (1)🌷

నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి (1)🌷


🏵️


👉🏿గంగాతీరమందు సకలసంపదలు గలిగి పాటలీపుత్రమను పట్టణము గలదు.

ఆ పట్టణమును సుదర్శనుఁడను రాజు పాలించుచుండెను.

అతఁడొకనాఁడు వినోదార్థము విద్వాంసులతో సల్లాపములు జరుపుచుండఁగా 

నొక బ్రాహ్మణుఁడు

క. పరువంబు కలిమి దొరతన

మరయమి యనునట్టి వీనియందొకఁడొకఁడే

పొరయించు ననర్థము నాఁ

బరఁగినచో నాల్గుఁ జెప్పవలయునె చెపుమా?

క. పలు సందియములఁ దొలఁచును

వెలయించు నగోచరార్థ విజ్ఞానము లో

కుల కక్షి శాస్త్రమయ్యది

యలవడ దెవ్వనికి వాఁడె యంధుఁడు జగతి\న్‌

అని ప్రస్తావవశముగాఁ జదివెను.

ఆ పద్యములు రాజు విని చదువు లేక మూర్ఖులయి సదా క్రీడాపరాయణులయి తిరుగుచున్న తన కొడుకులఁ దలఁచుకొని యిట్లని చింతించె:

🏵️

"తల్లిదండ్రులు చెప్పినట్టు విని చదువుకొని లోకుల చేత


మంచివాఁడనిపించుకొన్నవాఁడు బిడ్డఁడు గాని తక్కిన వాఁడు బిడ్డఁడా?


మూర్ఖుఁడు కలకాలము తల్లిదండ్రులకు దుఃఖము పుట్టించుచున్నాఁడు.


అట్టివాఁడు చచ్చెనా తల్లిదండ్రులకు దుఃఖము నాఁటితోనే


తీఱుచున్నది. కులమునకు యశము తెచ్చినవాఁడు పుత్రుఁడు

గాని తల్లికడుపు చెఱుపఁ బుట్టినవాఁడు 

పుత్రుఁడు గాఁడు. గుణవంతులలోఁ బ్రథమగణ్యుఁడుగాని కొడుకును గన్నతల్లికంటె వేఱు గొడ్రాలు గలదా? 

గుణవంతుఁడయిన పుత్రుఁడొకఁడు చాలును. మూర్ఖులు నూఱుగురవలన ఫలమేమి? ఒక రత్నముతో గులకరాలు గంపెడయినను సరిగావు.


🏵️🏵️🏵️

విద్యావంతులయి గుణవంతులయిన పుత్రులను జూచి సంతోషించుట యను సంపద మహాపుణ్యులకుఁ గాని యెల్లవారికి లభింప" దని కొంత చింతించి, యుంకించి, తల పంకించి "యూరక యీ చింత యేల? నా పుత్రులు చదువమనిరా? పరామరిక మాలి తగిన విద్యాభ్యాసము చేయింపనయితిని. బిడ్డలకు విద్యాభ్యాసము చేయింపమి తల్లిదండ్రుల దోషము. తల్లిదండ్రులచేత శిక్షితుండయి బాలుఁడు విద్వాంసుఁడగును గాని, పుట్టగానే విద్వాంసుఁడు గాఁడు. పురుషకారముచేతఁ గార్యములు సిద్ధించును. రిత్తకోరికలచేత సిద్ధింపవు. నిద్రించు సింహము నోరమృగములు తమంత వచ్చి చొరవు. కాఁబట్టి యిప్పుడు 

నాపుత్రులకు విద్యాభ్యాసముకయి వలయు ప్రయత్నము చేసెద" నని చింతించి యచటి విద్వాంసులతో నిట్లనియె:


👉🏿"నా పుత్రులు విద్యాభ్యాసములేక క్రీడాసక్తులయి తిరుగుచున్నవారు. ఎవ్వరయిన వీరిని నీతిశాస్త్రము చదివించి మంచి మార్గమునకుఁ ద్రిప్పఁజాలినవారు కలరా?" అనిన విష్ణుశర్మయను బ్రాహ్మణుఁడిట్లనియె:


👉🏿"రాజోత్తమా! యిది ఎంతపాటి పని? మహావంశజాతులయిన దేవర పుత్రులను నీతి వేదులను జేయుట దుష్కరము గాదు. కొంగను మాటలాడించుట దుష్కరము కాని చిలుకను బలికించుట దుష్కరము గాదు. సద్వంశమందు గుణహీనుండు పుట్టడు. పద్మరాగముల గనిలో గాజు పుట్టునా? ఎట్టి రత్నమయినను సానపెట్టక ప్రకాశింపనట్లు బాలుఁడెట్టి వాఁడయిన గురుజనశిక్ష లేక ప్రకాశింపడు. కాబట్టి నే నాఱు మాసములలో దేవర పుత్రులను నీతికోవిదులను జేసి మీకు సమర్పించెదను" అనిన రాజు సంతోషించి యిట్లనియె.


👉🏿"పూవులతో గూడిన నారకు వాసన గలిగినట్లు సజ్జనులతోడ సావాసించు మూర్ఖునకు మంచి గుణము గలుగుట సాజము. అంతేకాదు. సాధుసాంగత్యము సర్వశ్రేయములకు మూలము." అని సాదరముగా వచియించి యాతనికిఁ బసదనమిచ్చి తన కొడుకులను రప్పించి చూపి

"విద్యాగంధములేక జనుషాంధుల వలె నున్నారు. వీరిని గన్ను దెఱపి రక్షించుట మీ భార"మని చెప్పి యొప్పగించెను. 

👉🏿అనంతర మా బ్రాహ్మణుండు వారల నొక రమణీయ సౌధమునకుఁ దోడుకొనిపోయి కూర్చుండఁ బెట్టుకొని యిట్లనియె.


"మీకు వినోదార్థమొక కథ చెప్పెద. అది మిత్రలాభము, మిత్రభేదము, విగ్రహము, సంధి నని నాలుగంశములచేత నొప్పుచుండును. వినుండు."

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!