ఇందఱికి అభయాలని ఇచ్చే చేయి. 🌷 ( అన్నమాచార్యుఁడు )

ఇందఱికి అభయాలని ఇచ్చే చేయి. 🌷

( అన్నమాచార్యుఁడు )


🏵️🏵️🏵️


👉సంకీర్తన:

ఇందఱికి నభయంబు లిచ్చు చేయి

కందువగు మంచి బంగారు చేయి


🏵️

వెల లేని వేదములు వెదకి తెచ్చిన చేయి

చిలుకు గుబ్బలి క్రిందఁ జేర్చు చేయి

కలికియగు భూకాంతఁ గౌగిలించిన చేయి

వలనైన కొనగోళ్లవాఁడి చేయి

🏵️🏵️

తనివోక బలిచేతఁ దాన మడిగిన చేయి

వొనరంగఁ భూదాన మొసఁగు చేయి

మొనసి జలనిధి యమ్ము మొనకుఁ దెచ్చిన చేయి

యెనయ నాఁగేలు ధరియించు చేయి

🏵️🏵️🏵️

పురసతుల మానములు పొల్లసేసిన చేయి

తురగంబుఁ బరపెడి దొడ్డ చేయి

తిరువేంకటాచలాధీశుఁడై మోక్షంబు

తెరువు ప్రాణులకెల్లఁ దెలిపెడి చేయి

🌈🌈🌈🌈

అర్థాలు:

కందువ - నేర్పు। చిలుకుగుబ్బలి - మంథరపర్వతం (చిలుకు - మథించు, గుబ్బలి - కొండ)। కలికి - చక్కటి స్త్రీ। వలను - నేర్పు। తనివోవు - తనివి పోవు (తనివి - సంతుష్టి)। ఒనరు - కలుగు। మొనయు - యుద్ధానికి పూనుకొను (మొనగాడు అంటే యుద్ధం చేయడానికి సిద్ధమైనవాడు)। అమ్ము - బాణం। మొన - కొస। ఎనయు - సరిపడు। నాఁగేలు - నాగలి। పొల్ల - పొల్లు (వ్యర్థం)। తురగము - గుఱ్ఱం। పరపు - తోలు। దొడ్డ - గొప్ప। తెరువు - దారి।

🌷🌷🌷🌷

తాత్పర్యం:

ఇందఱికీ అభయాలను ఇచ్చే చేయి. అలా అభయాన్ని ఇవ్వడంలో బాగా నేర్పు కలిగిన గొప్ప బంగారుచేయి (బంగారుతల్లి అన్నప్పుడు బంగారు ఎలా విశేషణంగా వాడుతామో అలాగ).


వెలకట్టడానికి సాధ్యం కాని వేదాలని మత్స్యావతారమూర్తియై వెదికి తెచ్చి బ్రహ్మగారికి ఇచ్చినది ఈ హస్తమే. కూర్మమూర్తియై మంథరపర్వతం క్రింద చేరి తన చేతితో వహించే చేయి. చక్కటి భూకాంతను వరాహమూర్తియై సముద్రంనుండి ఉద్ధరించి కౌగిలించిన చేయి. హిరణ్యకశిపుణ్ణి చంపగల నేర్పు కలిగిన కొనగోళ్లు కలిగిన నరసింహావతారుని చేయి.

🙏

తను సాక్షాత్తూ లక్ష్మీదేవికే భర్త ఐనా అంతటితో తృప్తి పడక ఇంద్రుడి కోసమై బలి చేతినుండి దానం పుచ్చుకున్న వామనుని చేయి. పరశురాముడై సమస్త భూమండలాన్ని జయించి, అంత భూమినీ కలిగియున్నప్పుడు, యాగం చేసి ఆ ఋత్విక్కులకు సమస్తభూమినీ దానంగా ఇచ్చిన చేయి. రామావతారంలో సముద్రముపై యుద్ధానికి బయలుదేరి తన బాణాన్ని కొసకు తెచ్చిన చేయి. చక్కగా సరిపడేలా నాగలిని ధరించే బలరాముని చేయి.

🙏

గొల్లకాంతలందఱికీ వారి మానము తనే అనే అవగాహన కల్పించడానికై వారి మానములను అపహరించిన కృష్ణుని చేయి. గుఱ్ఱాన్ని తోలుతూ ధరావలయమునందు ధర్మస్థాపన చేసే కల్కిమూర్తి యొక్క గొప్ప చేయి. అలాగే, శ్రీవేంకటాచలానికి అధిపతియై తన పాదములే మోక్షపు మార్గము అని తెలిపే చేయి.🌷


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

  1. good devotional poetry
    https://goo.gl/Ag4XhH
    plz watch our channel

    ReplyDelete
  2. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!