🌹💥 శ్రీరామచంద్రుడు పోషించిన -నవరసాలు💥🌹

🌹💥 శ్రీరామచంద్రుడు పోషించిన -నవరసాలు💥🌹


🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥


👉🏿కావ్యం లో నవరసాలకూ సమాన ప్రాతినిధ్యం వుండాలి అది అప్పుడే పాఠక హృదయాలను ఆకట్టుకుంటుంది.


ఇది రామాయణం లో వివిధ ఘట్టాల నేపధ్యంతో శ్రీరాముడు నవరసాలూ పోషించి నట్లు వివరిస్తుంది.

నవరసాలతో అల్లిన సీస మాలిక ఇది.


కడునొప్పు జానకీ కళ్యాణ శుభలగ్న 

కాలోత్సవంబు శృంగార రసము 

పట్టాభిషేక సంభ్రమ వేళ ముని వృత్తి జనుమన్న 

జనుటయే శాంత రసము

తను నరమాత్రునిగా దలచు తాటకనేయు 

నట్టపహాసస్ఫూర్తి హాస్యరసము,

పాదరేణువు సోకి పాషాణ మెలమి పొలతి యై 

నిల్చుటద్భుత రసంబు 

మాయా మృగంబైన మారీచు కనుగొని భయ

దాస్త్ర మేయుట భయరసంబు 

కడగి వారిధి మీద గదిసి లక్ష్మణు చేతి

విల్లందుకొను వేళ వీర రసము

తన బాణ హతి బడ్డ దైత్యుల వికృతాంగ 

భావంబు జూడ భీభత్సరసము

రాణివాస ద్రోహి రావణాసురు బట్టి 

రణ వీధి ద్రుంచుట రౌద్రరసము 

అల విభీషణుని లంకాధిపు జేయుచో 

రూడికి నెక్కు కారుణ్య రసము


నవరసంబులు నీయెడ నాటు కొనియె 

దశరథేశ్వర పుత్ర! సీతా కళత్ర 

తారక బ్రహ్మ! కౌసల్య తనయ! రాజ 

రాజ దేవేంద్ర! పట్టాభి రామచంద్ర!


1). రామా!సీతాదేవితో కళ్యాణ మప్పుడు నువ్వు శృంగార మూర్తిగా 

గోచరించావయ్యా.


2). పట్టాభిషేకం జరిగి రాజువు కావాల్సిన నువ్వు తండ్రి ఆజ్ఞ మేరకు

నారచీరలు ధరించి మునిలా అడవులకు బయల్దేరినప్పుడు నీ రూపం లో 

శాంత రసం కురిసిందయ్యా.


3). నిన్నేదో సాధారణ మనిషిగా భావించి నీ మీదికి దాడికి వచ్చిన తాటకను 

సంహరించే టప్పుడుహాస్య రసం ద్యోతక మైంది.


4) ఇంక నీ పాద ధూళి సోకి రాయి అహల్యగా మారినప్పుడు అద్భుతంగా

అనిపించింది.అప్పుడు నీవు అద్భుత రస మూర్తివి.


5) మాయలేడి రూపంలో వచ్చిన మారీచుడి మీదికి బాణం వేసినప్పుడు

భయానక రసం గోచరించింది.


6) లంకకు వెళ్ళే సందర్భం లో నీ దర్శన భాగ్యం కలిగిన సంతోషం తో సముద్రుడు

వుప్పొంగితే అతని మీదికి విల్లు ఎక్కు పెట్టినప్పుడు, వీర రసం కనిపించింది

.

7) యుద్ధము లో రాక్షసులని చంపగా చెల్లా చెదరుగా పడిపోయినవారి దేహాల్ని

చూసినప్పుడు భీభత్స రసాలు కళ్ళకు కట్టాయి.


8). రావణుడిని చంపేటప్పుడు రౌద్రం ఎలా వుంటుందో తెలిసింది.


9) విభీషణు డిని లంకకు రాజుగా కూర్చో బెడుతున్న సందర్భం లో కరుణ రసం

గోచరించింది.


ఓ దశరధ నందనా,సీతాపతీ, తారకరామా, కౌసల్య తనయా,పట్టాభిరామా నీలోనే నాకు నవరసాలూ గోచరించాయి.అంటూ ఒక అజ్ఞాత కవి శ్రీరాముడిని తాను దర్శించడమే కాక తెలుగు వాళ్ళందరికీ దర్శింప జేశాడు.


కంటిన్ జానకి బూర్ణ చంద్ర వదనన్, గల్యాణిఁ నా లంకలో 

గంటిన్ మీపద పంకజాతము మదిన్ కౌతూహలం బొప్పగా 

గంటిన్ మీ కరుణావ లోకనము విఖ్యాతంబుగా గీర్తులం

గంటిన్ మా కపివీర బృందములలో గాంభీర్య వారాన్నిధీ!


గాంభీర్యములో సముద్ర సమానుడవైన వాడా శ్రీరామా! ఆ లంకలో చంద్రబింబము వంటి ముఖము కలది యైన సీతాదేవిని చూశాను.నీవు చెప్పిన పనిని పూర్తి చేసి తిరిగివచ్చి ఉత్సుకతతో నీ పాదపద్మాలను చూశాను. దయా

పూరితములైన నీ చూపులను చూశాను.మా వానరకులములో గొప్ప కీర్తులను పొందాను.

తెలుగులో రామాయణ రచన చేసిన కవయిత్రులలో ఆతుకూరి మొల్ల ప్రథమురాలు. ఈమె ఆతుకూరి కేసన పుత్రిక. నెల్లూరి సమీపంలోని గోపవరం ఈమె నివాస స్థలం.


' తేనె సోక నోరు తీయన యగు రీతి' మొల్ల రామాయణ రచన చేసింది. రామాయణంలో సుందరకాండ బహు సుందరమైనది. శ్రీరామునితో చెలిమి చేసిన సుగ్రీవుడు, సీతాన్వేషణ కోసం వానర సేనను నేల నాలుగు చెరగులా పంపించాడు. మహాశక్తిశాలి యైన హనుమంతుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ సముద్రాన్ని లంఘించి లంకలో అడుగు పెట్టి, అక్కడ అశోక వనంలో సీతా దేవిని చూసి, ఆమెకు శ్రీరాముని యోగ క్షేమాలను తెలియజేశాడు. ఆమెను విడిపింౘడానికి త్వరలో రాముడు రానున్నాడని ఆ తల్లికిచెప్పి ఊరట కలిగించాడు.శ్రీరాముడు యిచ్చి పంపిన అంగుళీయకాన్ని ఆనవాలుగా చూపాడు. శ్రీరాముని రూపలావణ్యాలను, గుణగణాలనూ వర్ణించి ఆమె అభిమానాన్ని ౘూరగొన్నాడు. తర్వాత లంకను గాల్చి తిరిగి వచ్చాడు. సీత జాడ కనుగొని వచ్చి ఆ వార్త రామచంద్రుని చెవిన వేసిన సందర్భములోనిదీ పద్యం.


దీర్ఘకాలం సీతజాడ తెలియక దుఃఖ సముద్రములో మునిగి యున్న శ్రీరాముని వస్తూనే ముందు "కనుగొంటిన్ జానకిని---" అంటూ రాముడికి ఆ వార్త తెలియజేశాడు. కనుగొంటిన్ జానకిని అని మొదులు పెట్టడం మొల్ల అపూర్వ శిల్ప నిర్వహణకు ఒక మచ్చుతునక. హనుమ బుద్ధికుశలతకీ, వాక్చాతుర్యానికి ఈ ఘట్టం ప్రబల తార్కాణం. స్వామికార్యం చక్కగా నెరవేర్చిన ఆ భక్తుని గుండెలో సదా శ్రీరామచంద్రుడు కొలువై వుంటాడు!


"రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్" 

(ఆంధ్రభూమి మాస పత్రిక సౌజన్యముతో)


🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!