గరికపాటి వరలక్ష్మి(జి.వరలక్ష్మి) (27-09-926 & 26-11-2006) గారి విశేషాలు:-

గరికపాటి వరలక్ష్మి(జి.వరలక్ష్మి) (27-09-926 & 26-11-2006) గారి విశేషాలు:-


(Anappindi Suryalakshmi Kameswara Rao)


ఆంధ్రప్రదేశ్‌ ఒంగోలులో 1926లో జన్మించిన వరలక్ష్మి తన పదకొండవ ఏటనే నాటకల్లో నటించాలన్న ఉత్సాహంతో ఇంట్లో చెప్పాపెట్టకుండా పారిపోయారు.


ఆ రోజుల్లో తుంగల చలపతి, దాసరి కోటిరత్నం ఇద్దరూ ప్రసిద్ధ రంగస్థల నటులు. ''రంగూన్‌ రౌడీ, సక్కుబాయి'' చిత్రాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్న సందర్భం అది. వారి ప్రభావం జి. వరలక్ష్మి మీద పడింది. తన పన్నెండవ ఏటనే బారిస్టరు పార్వతీశం, బొండాం పెళ్లి చిత్రాల్లో నటించారు. హెచ్‌.ఎమ్‌.రెడ్డి, రఘుపతి ప్రకాశ్‌ ఈమెను ప్రోత్సహించారు. అప్పట్లో నౌషద్‌ గారి పాటలంటే పడిచచ్చేవాళ్ళు. జి. వరలక్ష్మి 'నౌషద్‌' ట్రూపులో చేరి పాటలు పాడేసి గొప్ప గాయనీమణి అయిపోవాలన్న కలలు కనేది. అనుకున్నదే తడవుగా బొంబాయి వెళ్ళిపోయింది.


అతి చిన్న వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశం... పైగా తప్పొప్పులు చేప్పేవాళ్ళు ఎవరూ లేరు. తన మనసులో మెదిలే ఏ పనైనా దూకుడుగా చేసెయ్యడం... ఎదురు దెబ్బ తగిలితే రాటుదేలడం... ఇదే నేర్చుకుంది. అయితే దేవుడిచ్చిన గొప్పవరం తెగింపు, సాహసం.. నిర్మొహమాటం..ఈ త్రిగుణాలు ఆమెను ఆకాశానికి ఎత్తాయి. పాతాళానికి తొక్కాయి. బొంబాయిలో కోరస్‌ పాడే అవకాశాలను కూడా చేజిక్కించుకోలేక 1946లో తిరిగి చెన్నపట్నం వచ్చేసింది.జి.వరలక్ష్మిలోని అమాయకత్వం, పొగరు, ధైర్యం ఇవన్నీ కె.యస్‌.ప్రకాశరావుని ఆకర్షించాయి. కె.యస్‌ ప్రకాశరావుతో (ప్రకాశ్‌ స్టూడియో అధినేత, రాఘవేంద్రరావు తండ్రి, దర్శకుడు) కలిసి ''ద్రోహి'' చిత్రంలో నటించింది. ఇందులో జి. వరలక్ష్మి స్వభావానికి తగ్గ పాత్ర అది. యూనిట్‌లో వారందర్నీ ఏడిపించేది. ఒక్కోసారి తనకు కావల్సింది ఇవ్వకపోతే మొండిగా వ్యవహరించి మంకు పట్టు పట్టేది. ఇది ప్రకాశరావు మనసుని హత్తుకుంది. జి.వరలక్ష్మితో పెళ్ళికి దారి తీసింది. జి.వరలక్ష్మికి స్టార్‌డమ్‌ వచ్చేసింది.


జి.వరలక్ష్మిని ఒక పాత్రకి ఎంపిక చేసుకున్నారంటే దానికి రీప్లేస్‌మెంట్‌ లేదు. కీలుగుర్రం, శ్రీలక్ష్మమ్మ కథ చిత్రాలలో ఆ విషయం తేటతెల్లమైంది. ఆ రోజుల్లో శ్రీలక్ష్మమ్మ కథ ఘన విజయం సాధించిన చిత్రంగా చెప్పుకొనేవారు. స్వప్న సుందరి, దీక్ష (ప్రకాశరావు దర్శకత్వం), నిరపరాధి, పెళ్ళి చేసి చూడు చిత్రాలతో స్టార్‌డమ్‌ వచ్చింది. కన్నతల్లి, నా చెల్లెలు, జ్యోతి, మా గోపి, మేనరికం, గులేబకావళి, దొంగల్లో దొర, రాజనందిని, మాంగల్య బలం, ఇద్దరు మిత్రులు, కులగోత్రాలు, భీష్మ, అంతస్తులు, సుమంగళి, ఆస్తిపరులు, లేత మనసులు, బంగారు పిచుక, బుద్దిమంతుడు, నిండు హృదయాలు, సంసార సాగరం, గంగ- మంగ, అత్తవారిల్లు, గోరంత దీపం,


ఈ చిత్రాలను చూసిన ప్రేక్షకులెవరూ జి.వరలక్ష్మి నటనను మరిచిపోలేరు. దర్శక నిర్మాతలూ ఆమె మనసుని అర్ధం చేసుకొనే పాత్రలు ఆఫర్‌ చేసేవారు. ఒకసారి కమిట్‌ అయితే జి.వరలక్ష్మి అంకిత భావం ఇంతా అంతా కాదు. ప్రొడ్యూసర్‌ కష్టసుఖాల్లో పాలు పంచుకొనేది. ఆమె మాటకి ఎవరూ ఎదురు చెప్పరు. ఒకవేళ చెప్పినా ఆమె వినదు. ఈ విషయంలో ప్రకాశరావు గారికి జి.వరలక్ష్మికీ మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయి. అయినా ఒకరికొకరు సంపూర్ణంగా గౌరవించుకునేవారు.


యాభయ్యవ దశకంలో కమ్యూనిస్టు పార్టీ తరపున గట్టిగా నిలబడిన నటి జి.వరలక్ష్మి. ఎల్డామ్స్‌ రోడ్‌లో పెద్ద భవనం. అందులో గొప్పవారికి ఎంత స్థానం వుందో పేదవారికీ అంతే స్థానం వుండేది. పేద, ధనిక, కుల, మత తారతమ్యాలుండేవి కావు. ఎదుటి మనిషిని ఇట్టే స్కాన్‌ చేసేయ్యగల శక్తి సంపన్నురాలు జి.వరలక్ష్మి. ఎవరు ఎంతటి ప్రమాద స్థితిలో ఉన్నా వారికి అభయమిచ్చి బాధల్ని కొని తెచ్చుకొనేది. అలాగే ఆమె జీవితంలో చేసుకున్న స్వయం కృతాపరాధాలెన్నో. తను చేసిన తప్పుని నిర్భయంగా ఒప్పుకొనేది. ఇదే ఆమెలో అరుదైన వ్యక్తిత్వం. తనతో సరిసమానంగా అందర్నీ గౌరవించడం ఆమె ప్రత్యేకత.


తన మనుసులో రగులుతున్న భావాలన్నింటిని నిక్షిప్తంగా కథలల్లి ''బంగారు సంకెళ్ళు, మూగజీవులు'' చిత్రాలను నిర్మించింది. బంగారు సంకెళ్ళు చిత్రానికి బి.రామినీడు దర్శకత్వం వహించగా, మూగజీవులు చిత్రానికి జి.వరలక్ష్మి దర్శకత్వం వహించింది. ఈ చిత్రాలు ఆ రోజుల్లో భారీ వ్యయంతో నిర్మించినా మూస కథలతో వచ్చిన చిత్రాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు ఈ రెండు చిత్రాలూ రుచించలేదు. బంగారు సంకెళ్ళు చిత్రంలో బుర్రకథ సన్నివేశంలో జి.వరలక్ష్మి ప్రదర్శించిన నటన మరిచిపోలేం.


జి.వరలక్ష్మి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వచ్చింది. కుటుంబ కలహాలు... బక మాటిస్తే ప్రాణం పోయినా ఆ మాటని నిలబెట్టుకోవడం... తను నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడేందుకు వెనుకాడకపోవడం ఆమె జీవిత గమనంపై ప్రభావం చూపేవి. ఈ నేపథ్యంలోనే విక్టరీ భార్య సరోజినితో కథ, ఆత్రేయ గారితో విప్లవాత్మక పాటలు రాయించి ''పోరాటం'' అని ఆ చిత్రానికి నామకరణం చేసింది (మాటలు తనే రాసుకొంది). ఇది 2000లో మాట. అప్పటికే చిత్ర నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. మంచి సాంకేతిక నిపుణులు అందుబాటులో లేరు. మంచినీళ్ల ప్రాయంగా డబ్బు ఖర్చయిపోతుంది. పోరాటం సినిమా మొదలుపెట్టినా అది నిర్విఘ్నంగా జరగదు. అలాగని ఒకరిని సాహాయం అడగటం అస్సలు ఇష్టముండేది కాదు. కొంత కాలం మానసికంగా సంఘర్షణ అనుభవించింది. ఆమెకు అతి ముఖ్యమైన స్నేహితుల మాట మీద పోరాటం చిత్రాన్ని అర్ధాంతరంగా ఆపేయవలసి వచ్చింది.


జి.వరలక్ష్మి అంటేనే నిర్భయం. జి. వరలక్ష్మి అంటేనే నిజాయితీ. మాట తేడా వస్తే ఎంతటి వాడ్నయినా కాలరు పట్టుకొని నలుగురిలో ప్రశ్నించేది. ఆర్థికంగా ఎంత చితికిపోయినప్పటికి భర్త కూడా ఆమెను ఆదరించలేదు. ఆమె తరుచూ ఆత్మీయులతో...అంటుండేది. 'నాలాంటి మనస్తత్వం ఆడవాళ్లకి వుండకూడదు. ఈరకమైన మొండితనం అన్ని వేళ్ళలా మంచిది కాదు. ఒక్కోసారి ఊహించని ప్రమాదంలో పడతాము. అది చూసి పది మంది సహచరులు పండగ చేసుకుంటారేగాని చేయూతనివ్వరు. అయితే నిప్పులా బతికాను. నిజాయితీగా వున్నాను. బతికినంతకాలం నిర్భయంగా వున్నాను. ఈ జీవితానికి ఈ తృప్తి చాలు!'.


(- ఇమంది రామారావు, 9010133844, ప్రజా శక్తి, 29-08-2015)


"పెళ్లి చేసి చూడు" చిత్రం షూటింగ్ వాహినీ స్టూడియోలో నిర్మించబడుతున్న సమయంలో సావిత్రి, జి. వరలక్ష్మి ఇద్దరూ కూచుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారట. ఇంతలో ప్రొడక్షన్ బాయ్ క్యాంటీన్ నుంచి కాఫీ తీసుకుని వచ్చి ఇద్దరు నటీమణులకు అందించాడట. అయితే కాఫీ ఇచ్చిన పాత్రల్లో తేడా ఉంది.


జి. వరలక్ష్మికి కప్పు-సాసరులో కాఫీ ఇస్తే... సావిత్రికి గ్లాసులో ఇచ్చాడట. అంటే జి.వరలక్ష్మి ఆ చిత్రంలో కథానాయిక కనుక ఆమె హోదాకు తగ్గట్లు అతను అలా ఇచ్చి ఉంటాడని వేరే చెప్పక్కర్లేదు. అయితే అది చూడగానే జి. వరలక్ష్మి అతనిపై మండిపడి, గ్లాసుతో ఉన్న కాఫీని తిరిగి అతనికి ఇచ్చేసి, మేం ఇద్దరం దీంతోనే తాగుతామని కప్పులోని కాఫీని సావిత్రికి పంచి ఇచ్చిందట.


ఆ రోజుల్లో వింతగా చెప్పుకున్న విషయం ఒకటుంది. విలన్‌ పాత్రధారి ఆర్‌.నాగేశ్వరరావు గుండె జబ్బుతో చనిపోతే, సినిమావారు చాలా మంది వెళ్లి అంతిమ దర్శనం చేసుకున్నారు. సావిత్రి, జి.వరలక్ష్మి, జానకి మొదలైన నటీమణులు కూడా చాలాసేపు కూచున్నారు. ఎల్డామ్స్‌ రోడ్డులోని అతని నివాసం నుంచి శ్మశానానికి బయల్దేరుతున్నప్పుడు సినిమా ప్రముఖులు అనేకులు వెంట వెళ్లారు. స్త్రీలు శ్మశానానికి వెళ్లకూడదు. కానీ, జి.వరలక్ష్మి మాత్రం ఒక్కతే వెళ్లింది! భౌతిక కాయాన్ని చితి మీద పడుకోబెట్టి, ఉన్నవాళ్లంతా నోట్లో బియ్యంగింజలు వెయ్యవలసివచ్చినప్పుడు వరలక్ష్మి కూడా వెళ్లి బియ్యం గింజలు వేసింది. ఈ విషయం గురించి ఆ మర్నాడు అందరూ ఆశ్చర్యంగా చెప్పుకున్నారు.


జి వరలక్ష్మి గారి గురించి మరిన్ని వివరాలు కామెంట్లలో చూడ వచ్చు.


******


పెళ్ళీ చేసి చూడు 29-02-1952


ఎవరో ఎవరో, చారుకేశి రాగం, పింగళి, ఘంటసాల, లీల, ఎన్ టి ఆర్, గి వరలక్ష్మి, ఎల్ వి ప్రసాద్


సాధారణం గా మనం విన్నపం, విజ్ణాపన మొదలైన వానికి బహు వచనం గా విన్నపాలు, విజ్ణాపనలు అని వాడతాము. మనవికి బహు వచనం గా పింగళి వారు మనవులుగా అన్నారు. అలాగే ఉదయము చేసినదెవరో కూడా పింగళి వారి ప్రయోగమే. ఈ రాగంలోనే రాజ మకుటం సినిమాలోని ఊరేది పేరేది పాట కూర్చేరు మాస్టర్ వేణు. అన్నట్టు పెళ్ళి చేసి చూడు ఆర్కెస్ట్రా మాస్టర్ వేణు గారే.


ఎవరో ..ఎవరో.. ఈ నవ నాటక సూత్రదారులు ఎవరో .. ఎవరో


ఎవరా .. ఎవరా .. ఎవరా ..ఎవరా


మంచి వారు మా మామగారిని వంచన చేసీంది ఎవరో వారే


మనవులుగా అమాయక చూపుల మనసును లాగినది ఎవరో


నిను విడజాలా నీదాన నేనని నను నిలవేసినదెవరో ..ఎవరో వారే


ప్రియ సఖి పై గల ప్రేమను చాటి భయమును విడచినదెవరో


న్యాయవాది అన్యాయవాదియై మాయలు నేర్చినదెవరో .. ఎవరో వారే


హృదయములో విశాల భావం ఉదయము జేర్చినదెవరో


చదువుల సారము సంసారమునకే పదిలము చేసినదెవరో.. ఎవరో.. వారే..


వారే..వీరు..


వీరే వారు .. వారే వీరు


https://www.youtube.com/watch?v=dVJMgAKqiiM


పెళ్ళి చేసి చూడు 29-02-1952


ఏడు కొండల వాడ, చక్రవాకం రాగం, పింగళి, ఘంటసాల, లీల, ఎన్ టి ఆర్, జి వరలక్ష్మి


ఏడుకొండలవాడ వెంకటారమణా..


సద్దు సేయక నీవు నిదుర పోవయ్యా


పాల సంద్రపుటలలు పట్టె మంచముగా


పున్నమీ వెన్నెలలు పూలపానుపుగా


కనులనొలికే వలపు పన్నీరు జల్లుగా


అన్ని అమరించె నీ అలివేలుమంగా - ఏడుకొండలవాడ


నాపాలి దైవమని నమ్ముకున్నానయ్య


నా భాగ్యదేవతా నను మరువకయ్య


బీబినాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య


చాటు చేసుకు ఎటులో చెంత చేరెదనయ్య


https://www.youtube.com/watch?v=I5sbke7Utuc(

Watch Evaro Evaro Video Song From Telugu Pelli Chesi Choodu movie. Starting N.T. Rama Rao, G. Varalakshmi, Savitri And S. V. Ranga Rao. Directed by L. V. Pra...


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!