మను చరిత్ర - ఒక ఆలోచన!

మను చరిత్ర - ఒక ఆలోచన!


(From -Vision of Indian philosophy)

శ్రీ సరస్వత్యై నమః



ఆరజ నీరజ ప్రతిమమైన ముఖంబున పండు వెన్నియల్


చారుతర ప్రచారగతి సాప్తపదీనత జూపి సుస్మితో


దార సుధాతరంగిణి విధంబున నర్తన సేయ సత్కృపా


శారద; శారదా జనని సన్మతి యేలుత  నిల్చి ఈసభన్


తల్లి దండ్రులకు, గురుపరంపరకు, సభా సదులకు నమస్సులు.


ప్రబంధ సాహిత్యంలో మను చరిత్రకు సమున్నత స్థానం ఉంది. కృతి కర్తగా అల్లసాని వారికి అలాగే కృతి భర్తగా కృష్ణరాయలకు ఆ కావ్యం అజరామర కీర్తి ప్రతిష్ఠలను అందించింది. మార్కండేయ పురాణాంతర్గతమైన ఈ కథను వర్ణనా చాతుర్యంతో మహాప్రబంధంగా తీర్చి దిద్దిన మహాకవి అల్లసాని.


అల్లసాని వారు తన గురువు శఠగోపయతి వద్ద "అజప" దీక్ష తీసుకున్నవాడు.


ఇది ఎవరి కథ: ఈ ప్రభంధం స్వారోచిష మను సంభవాన్ని గూర్చి చెప్పబడింది. స్వారోచిషుడు రెండవ మనువు కాగామొత్తంగా 14 మంది మనువులు ఉన్నారు.


1) స్వాయంభువు, 2) స్వారోచిషుడు 3) ఉత్తముడు 4) తామసుడు 5) రైవతుడు 6) చాక్షసుడు 7) వైవస్వతుడు 8) సూర్య సావర్ణి. ఇతడే బలి చక్రవర్తి 9) మేరు సావర్ణి 10) కక్ష్య సావర్ణి 11) రుద్ర సావర్ణి 12) ఇంద్ర సావర్ణి 13) రౌక్ష్య సావర్ణి 14) బౌద్ధ సావర్ణి


కథగా చెప్పుకోవలసి వస్తే.....


ప్రవరుడు అందమైన యువకుడు. అతిథి సేవా తత్పరుడు. ఒకనాడు ఒక సిద్ధుడు ప్రవరుని ఇంటికి వస్తాడు. ఆతిథ్యం ఇచ్చిన ప్రవరుడాతనిని తాను తిరిగిన ప్రదేశాలలలోని విశేషాలను చెప్పమని కోరడం, సిద్ధుడు చెప్పడం జరుగుతుంది. చిన్న వయసులో ఇన్ని ప్రదేశాలను చుట్టిరావడమెలాగా అనే ప్రశ్నను ప్రవరుడు వేయడం, దానికి సిద్ధుడు తన దగ్గర ఉండే పసరు మహిమను చెప్పడం జరుగుతుంది. ఆ పసరును అడిగి కాలికి పూయించుకున్న ప్రవరుడు హిమాలయాలను దర్శించడం, ఆ నీటికి పసరు కరగిపోవడం, అక్కడ వరూధిన్ మను చరిత్రలో ముచ్చటించడానికి ముఖ్యంగా మూడుపాత్రలను తీసుకోవచ్చు. ప్రవరుడు, సిద్ధుడు మరియు వరూధినిని చూడడం, ఆమె అతనిని మోహించడం, కామించడం జరుగుతుంది. ఆమె కామానికి సంబంధించిన ప్రలోభాలకు దూరంగా ధర్మానికి కట్టుబడిన ప్రవరుడు అగ్నిని స్మరించి ఆ అగ్ని సహాయంతో ఇల్లు చేరడం జరుగుతుంది. తదుపరి గంధర్వుడు ఒకడు మాయాప్రవరునిగా వరూధినిని కలవడం వారి సంగమ ఫలితంగా స్వరుచి జననం, స్వరుచి వనదేవతల సంగమం ఫలితంగా స్వారోచిషుడు జన్మించడం జరుగుతుంది. సూక్ష్మంగా ఇది కథ.


అల్లసాని వారు కావ్యారంభంలో.....


శ్రీ వక్షోజ కురంగ నాభ మెదపై చెన్నొంద విశ్వంభరా


దేవిన్ దత్కమలా సమీపమున ప్రీతిన్ నిల్పినాడో యనం


గా వందారు సనందనాది నిజ భక్త శ్రేణికిన్ దోచు రా


జీవాక్షుండు కృతార్థు జేయు శుభదృష్టిన్ కృష్ణ రాయాధిపున్!


సనకసనందనాదులు శ్రీమన్నారాయణుని దర్శించేందుకు వెళ్ళారట. వారికి ఆయన ఎలా కనబడ్డాడంటే... లక్ష్మీ దేవిని కౌగిలించిన విష్ణుమూర్తి ఎదపై లక్ష్మీదేవి తన వక్షస్థలానికి రాసుకున్న కస్తూరి అంటుకున్నదట. కస్తూరి నల్లగా ఉంటుంది కాబట్టి దానిని చూచి విష్ణువు వక్షస్థలముపై లక్ష్మీదేవితోపాటుగా భూదేవినీ నిలిపాడని సనకసనందనాదులు భ్రాంతి చెందారట. అలాంటి రాజీవాక్షుడు కృష్ణరాయలను శుభదృష్టితో చూచుగాక అంటాడు, కవి.


సనకసనందనాదులు ఎప్పుడూ 5 సంవత్సరాల వయస్సులోనే ఉంటారట. అంటే వారిలో అనింటినీ ఆశ్చర్యంగా, ఆనందంగా స్వీకరించే మానసిక స్థితి ఉన్నదని అర్ధం. దీనినే Childlikeness {Bliss in innocence) అంటాం. Childishness (Immature and irresponsible) అది మూర్ఖత్వం.


ఇక రాజీవాక్షుడు అన్నాడే కాని విష్ణువని అనలేదు. వైష్ణవ సంప్రదాయంలో వారు విష్ణువు కన్నులనే ఎక్కువగా ఆరాధిస్తారట. అందుకే రాజీవాక్షుడు అంటే విష్ణువనే అర్థం రూఢి అయింది.


విష్ణువుకు ఇరువురు భార్యలు అలాగే కృష్ణరాయలకూ భార్యలిరువురే. దానితో కృష్ణరాయల బహుభార్యత్వాన్ని సమర్ధించిన విధం కూడ ఈ పద్యంలో ధ్వనిగా కనిపిస్తుంది.


నిజానికి మను చరిత్రకు ప్రాణం లాంటిది వరూధినీ ప్రవరుల సంవాదం. ఇద్దరూ తమ కోణాలలో నుండి వాదనలను సమర్ధవంతంగా వినిపించారు. అయితే, చివరకు ఈ చర్చ సమాజానికి ప్రతిపాదించింది  ఏమిటి? అంటే మానవ జీవన లక్ష్యాలను, మూల్యాలను మాత్రమే. అందులో సమకాలీన పరిస్థితులను తొలగిస్తే నికార్సయిన సర్వకాలీన, సర్వజనీన సత్యాన్ని ఆవిష్కరించడం జరిగింది.


ధర్మార్ధకామమోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. ధర్మ మార్గంలో అర్థాన్ని కామాన్నీ సాధించి మోక్ష మార్గంలో సాగిపోవడం జీవుని కర్తవ్యంగా ప్రతిపాదన జరిగిందీ కావ్యంలో.


ప్రవరుడు అరుణాస్పదమనే పట్టణంలో ఉండేవాడు. ఏ నాడు ఊరిని దాటి వెళ్ళలేదాతడు. "ఆపురిబాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి"....... అంటాడు ప్రవరుని గూర్చి చెపుతూ....


ముందుగా అరుణాస్పద పట్టణాన్ని వర్ణించాడు తరువాతి పద్యంలో "ఆపురి బాయకుండు" అని ఎత్తుకున్నాడు. ఆపురి బాయకుండు అంటే సాధారణంగా వచ్చే ప్రశ్న "ఏ పురి" అనే. అందుకే అరుణాస్పదాన్ని ముందు చెప్పి ఆపురి బాయకుండు అని తదుపరి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరొక ప్రశ్న.... ఎందుకని "ఆపురి బాయకుండు" అన్నాడు. అంటే తాను కొన్ని నియమాలు ఏర్పరచుకున్నాడు... తలిదండ్రుల సేవ, త్రికాలాలలో అగ్నినారాధించడం, అతిథి సేవ, అధ్యయన అధ్యాపనల లాంటివి... వీటికి అంతరాయం లేకుండా నిరంతరం నడవాలంటే తన ఉనికి అక్కడ తప్పనిసరి. ముఖ్యంగా మూడు కాలాల యందు అగ్నిని ఆరాధించాలి కాబట్టి అతడు ఆపురిని బాయకుండు.


అంతే కాదు, సహజంగా ధనవంతుడు. తన మాన్యక్షేత్రాలు చక్కగా పంటల నందిస్తున్నాయి. కాబట్టి పరుల ముందు చేయి చాచాల్సిన అవసరం రాలేదు, ఊరు దాటాల్సిన అవసరమూ రాలేదు.


ఇక్కడ మరొక్క విషయం ప్రస్తావించాలి. గృహస్థుకు కొన్ని ధర్మాలు నిర్దేశించబడ్డాయి. ముఖ్యంగా ఉత్పత్తిని పెంచి ధనార్జన చేయాలి. సంతానాన్ని కనాలి, అతిథి అభ్యాగతులను సేవించాలి. ఎందకివన్ని చేయాలి అంటే గృహస్థే సమాజానికి ఆధారం కాబట్టి. ఏ కారణం చేతనైనా గృహస్థు తన ధర్మం తప్పితే సమాజ జీవనం అస్తవ్యస్తం అవుతుంది.  కాబట్టి అతడా పురిని విడవడు.


అయితే అతనికి తీర్థయాత్రలు చేయాలని, దేశవిదేశాల విశేషాలు తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం ఉంది. ఎందుకని? ఎందుకంటే తన ఇంట ఆతిథ్యం తీసుకున్న యాత్రికులు తాము చూచి వచ్చిన ప్రదేశాలలోని వింతలు విశేషాలు కంటికి గట్టినట్లుగా చెప్పడం వల్ల వాటిపై “ఆసక్తి పెరిగి అది వ్యాసక్తి”గా మారింది. ఈ అమితమైన వ్యాసక్తియే అతనిలో లేకపోయినట్లైతే అతడా ఊరిని విడవడు, హిమాలయాలకు చేరడు, వరూధిని తనను చూడదు...దానితో ముందు కథయే లేదు.


అతను అగ్నిని ఆరాధిస్తాడు. అంటే సమాజంలో ఉన్న జీవకోటిలో ఆకలి రూపంలో ఉన్న అగ్నిని ఆరాధించడం చేసాడు. అంటే సమాజంలోని అన్నార్తుల ఆకలి తీరుస్తూ వారిని పోషించే నియమం అతనిది. అదే అతని అగ్ని ఉపాసన.


ఇక అతని భార్య..... "వండ నలయదు వేవురు వచ్చిరేని, అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి" అంటాడు... అలాంటి సహధర్మచారిణి ఉన్నది కాబట్టే అతని ధర్మ దీక్ష నిరంతరాయంగా సాగిపోతున్నది. ఇలా అన్నీ తనకు కలసిరావడం వల్ల అతనా పట్టణాన్ని విడిచి ఎక్కడకూ వెళ్ళడు.


ఇలా ఉండగా, ఒకనాటి కుతపకాలంలో అంటే మధ్యాహ్నం దాటాక, ఒక సిద్ధుడు అతని ఇంటికి వచ్చాడు. సహజంగానే ప్రవరుడా సిద్ధునికి భోజనాదికాలు సమకూర్చి సిద్ధుడు విశ్రమిస్తున్న సమయంలో అతనిని ఎక్కడి నుండి వచ్చారని ఏయే దేశాలు చూచారని ఆయా ప్రదేశాలలోని వింతలు విశేషాలు చెప్పమని అడిగాడు.


ప్రవరుని ఆతిథ్యానికి సంతసించిన సిద్ధుడు... జవాబిస్తూ కేదారేషుడిని చూచానంటాడు. హింగుళాదేవి పాదపద్మాలను కొలిచానంటాడు. అలా చెపుతూ మలయ పర్వతం నుండి పూర్వ పశ్చిమ హిమాచల పర్వతాల పర్యంతం అన్ని ప్రదేశాలను చూచానని, ఆ విశేషాలను వినమని చెపుతాడు..


అలా ఉత్సాహంగా చెపుతున్న సిద్ధుడిని చూచి ప్రవరుడు "ఈషదంకురిత హసన గ్రసిష్ట గండ యుగళుండై" అయ్యా! భయపడుతూ నైనా మీకు చిన్న విన్నపం చేస్తాను అంటూ.... మీరు చూస్తే చిన్న వయస్కులుగా కనిపిస్తున్నారు. మీరు వర్ణిస్తున్న ప్రదేశాలు చూడాలంటే పెక్కు సంవత్సరాలు పడతాయి. మీ మహిమలు అనల్పాలు కాబట్టి మీరు చూచి యుండవచ్చు. అయినా చాపల్యంతో అడుగుతున్నాను. మీకిది ఎలా సాధ్యపడిందో దయచేసి సెలవీయండి, అంటాడు.


అందుకు సిద్ధుడు ఇది పరమ రహస్యం అయినా నీకు చెపుతాను వినమని ఇలా అంటాడు. నా వద్ద పాదలేపనమనే దివ్యౌషధము ఒకటున్నది. దాని ప్రభావం వల్ల వాయు వేగంతో సూర్య చంద్రుల సంచారం ఎందాకా ఉంటుందో అందాకా వెళ్ళి రాగలుగుతాము అంటాడు.


దానితో "కౌతుక భర వ్యగ్రాంతరంగుడై" (కుతూహలంతో నిండి తొందరపెడుతున్న మనస్సు గలవాడై) ఆ లేపనాన్ని తన కనుగ్రహించమని సిద్ధుడిని అభ్యర్ధించడం, దానికి సమ్మతించిన సిద్ధుడు ఆ లేపనాన్ని ప్రవరుని కాళ్ళకు పూసి తనదారిన తాను వెళ్ళి పోతాడు. ప్రవరుడూ హిమాలయాలను దర్శించాలని సంకల్పించి హిమాలయాల వైపు వెళతాడు. అక్కడ చూడవలసిన ప్రదేశాలను చూస్తుండగానే మధ్యాహ్నం అయింది. ఈ రోజుకు ఇక చాలు మిగిలిన విశేషాలను రేపు చూద్దాం అనుకుంటూ ఇంటికి వెళ్ళాలని సంకల్పిస్తాడు. కాని నీటిలో పసరు  కరిగిపోవడం వల్ల తన ప్రయత్నం సఫలంకాదు.


ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి చర్చించాలి. వ్యగ్రాంతరంగుడు కాబట్టి ప్రవరుడు మహిమాన్వితమైన పసరు పూయగానే హిమలయాలకు వెళ్ళాడు. అది సరే. మరి సిద్ధునికి పసరు కరిగిపోతుందనే విషయం తెలుసుకదా. ఇది అది అని చెప్పక పసరు పూసి తనంత తాను వెళ్ళడం ఎంతవరకు సమంజసం? అందునా ఆతిథ్యం ఇచ్చిన వానికి కీడు తలపెట్టేంత కృతఘ్నుడా, సిద్ధుడు?


కాదనేది ముందు వారి సంభాషణను గ్రహిస్తే తెలుస్తుంది. ప్రవరుని లాంటి గృహస్థులే సమాజానికి మూలస్తంభాలనీ, గృహస్థులు ఇచ్చే ఆతిథ్యమే  తనలాంటివారు తీర్థయాత్రలు చేయడానికి ఉపయోగపడుతుందనీ గృహస్థులు సుఖజీవనులై ఉండడమే సమాజానికి మేలు చేస్తుందని అంటాడు, సిద్ధుడు. దానిని బట్టి సిద్ధుడు కృతఘ్నుడు కాదని తెలుస్తుంది. మరలా ఎందుకు జరిగింది?


వచ్చిన వాడు సిద్ధుడు. అతనికి భవిష్యత్తు తెలుసు. ప్రవరుని శక్తి సామర్ధ్యాలు అంచనా వేయగలిగాడు. ప్రాకృతిక ధర్మం తెలుసు. "స్వారోచిష మను సంభవం" అనబడే దైవకార్యానికి కావలసిన కారణం తెలుసు.


వరూధిని గర్భంలో స్వరుచి జన్మించాలి. కాని ఆమెలో జడత నిండి ఉంది. యక్షరాక్షస గంధర్వ మానవ యువకులు ఎందరో ఆమెను చూచి మోహించారు. కాని ఆమె అందరినీ తిరస్కరించింది. వారెవరూ ఆమె మనసును ఆకర్శించలేకపోయారు. సిద్ధుడు ప్రవరుని అందాన్ని చూచాడు, అతని తపో దీక్షను, ధర్మ దీక్షను అంచనా వేసాడు. ప్రవరుడామె మనసును తప్పక మోహింప చేయగలడని నిశ్చయం చేసుకున్నాడు. అయితే ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళాలి, వరూధిని కళ్ళలో పడాలి. అందుకే ఇది అది అని చెప్పక పసరు పూసి వెళ్ళిపోయాడు. ఆ ప్రయాణంలో ఎప్పుడైనా ప్రవరునికి అనుకోని ఆపద లెదురైతే? నిత్యాగ్నిహోత్రుడైన ప్రవరుని అగ్ని తప్పక రక్షిస్తాడని యెరింగిన సిద్ధుడు ఏ జాగ్రత్తలు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. పసరు ప్రభావం చెపితే ఏమవుతుంది? ప్రవరుడు జాగ్రత్త పడేవాడు. వరూధిని కంటబడేవాడు కాదు. ఇక కథేలేదు. భవిష్యద్దర్శకుడైన సిద్ధుడు అందుకే రహస్యం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. దైవ్యకార్య నిర్వహణలో అతడు అతని పాత్రను పోషించాడు. కాబట్టి అతనికి కృతఘ్నాతా దోషం అంటగట్టలేము.


ఇప్పుడు, సిద్ధుని కారణంగా ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళాడు. దీనితో దైవకార్యంలో సిద్ధుడు తాను నిర్వహించ వలసిన కర్తవ్యం అయిపోయింది. అందుకే కావ్యంలో మరెక్కడా సిద్ధుని ప్రసక్తి  రాదు.


ప్రవరుడు హిమాలయాలను దర్శిస్తూ తన్మయాత్ముడౌతున్నాడు. కాలం గూర్చిన పట్టింపు లేదు. ఒక్కొక్కటిగా హిమగిరి సొగసులు చూస్తూ పరవశించిన అతనికి సూర్య కిరణాల వేడికి కరిగిన మంచు సూర్యకాంత శిలలపైబడి చటఛ్ఛటాశబ్దాలను చేయడం వినిపించింది. మాధ్యాహ్నికాలను నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తుచేసుకున్నాడు. ఈ విశేషాలు రేపు మళ్ళీ వచ్చి చూస్తాను. ఈ నాటికి వెళతా ననుకున్నాడు.  కాని హిమస్పర్శచే పసరు ప్రభావం పోయింది. ఆ కారణంగా ఔషధహీనుడైన తాను, తన పట్టణానికి ఎలా వెళ్ళాలో తెలియని  అయోమయ స్థితిలో ఎవరైనా సహాయం చేస్తారా అని చుట్టుప్రక్కల చూస్తూ వెళుతున్న సమయంలో ఒక లోయ కనిపించింది. ఆ లోయలో నుండి క్రిందికి దిగుతూ ఉండగా అప్పుడే పగిలిన కస్తూరి, పచ్చకర్పూరము మున్నగు పరిమళ ద్రవ్యాలు కలిపిన కమ్మని వాసనలు ముక్కు రంధ్రాలను తాకాయట. ఆ వాసనను బట్టి ఇక్కడెవరో స్త్రీ ఉంది ఆమెను అడుగుదామని ముందుకు వెళ్ళగా అతనికి వరూధిని కనిపించింది.


అత్యంత సౌందర్యవంతుడైన ప్రవరుని చూచి వరూధిని ఆతనిని మోహిస్తుంది. ఆమె అపురూప సౌందర్య రాశి. బహువిధాలుగా అతనిని కవ్విస్తుంది. నీతులు చెపుతుంది, లాలిస్తుంది. అతను సమ్మతింపకపోవడంతో ... మీరు చేసే యజ్ఞయాగాదికాల ఫలితం స్వర్గంలో మా కౌగిళ్ళలో సుఖించడమే కదా... ఆసుఖమేదో నేనిక్కడే ఇస్తారమ్మని ప్రలోభ పెడుతుంది. అతడు సమ్మతింపడు. ఆమె దూషిస్తుంది. చివరగా మోహాన్ని దాచుకోలేక అతడిని కౌగిలిస్తుంది. అది భరించలేని ప్రవరుడు "హా శ్రీహరీ" అంటూ ముఖాన్ని తిప్పుకొని వరూధినిని త్రోసివేసి, అగ్ని నారాధించి, అగ్ని అనుగ్రహం చేత తన పట్టణానికి చేరుకుంటాడు.


అయితే ఇక్కడొక అనుమానం ఏమిటంటే.... ప్రవరుడు విరాగా... భోగాసక్తిలేని వాడా? అంటే.....


"వీటీ గంధ స్థగితేతర పరిమళమై మగువ పొలుపు తెలుపు నొక్క మారుతమెసగెన్" తాంబూలంలో ఒక పాలు కస్తూరి రెండుపాళ్ళు పచ్చకర్పూరం వేసి స్త్రీలు సేవిస్తారు. పురుషులు రెండుపాళ్ళు కస్తూరి ఒకపాలు పచ్చకర్పూరం వేసి సేవిస్తారు. మగువ పొలుపు తెలపడం అంటే మగువలు సేవించే తాంబూలం ఎలాంటిదో అతనికి బాగా తెలుసు. అంతేకాక ఆమెతో మాట్లాడే సమయంలో "కామశాస్త్రోపాధ్యాయిని నా వచించెదవు" అంటాడు. అంటే కామశాస్త్రం తనకు తెలుసని ధ్వనిగా చెపుతూ తన ఏకపత్నీ వ్రతాన్ని ధ్వనింపచేసాడు. ఇవి  అతనికి శృంగారం పట్ల ఉన్న అభినివేశానికి గుర్తు్లు. అత్యుత్తమ భగవత్తత్వంలో ఆనందాన్ని అనుభవించే తనకు పరస్త్రీ పొందు మీసాలపై తేనె లాంటిదంటాడు. కౌగిలించుకున్న ఆమెను త్రోసివేసి అగ్నినారాధించి తన గృహాన్ని చేరుకుంటాడు.  అంతటి నిగ్రహం కలిగిన వాడు కాబట్టే అగ్ని ప్రవరునికి సహాయం చేసాడు.


"దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని".... అనే పద్యం తదుపరి "అని సంస్తుతించిన నగ్నిదేవుండు అమ్మహీదేవు దేహంబున సన్నిహితుం డగుటయు" అనే  వచనాన్ని పరిశీలిస్తే....


అగ్నినారాధించి ప్రవరుడు తన పట్టణానికి చేరగలిగాడు. అగ్నినారాధించేవానిలో అగ్ని ప్రతిష్ఠితమౌతుంది. గార్హపత్యాగ్ని అతని హృదయంలో , దక్షిణాగ్ని అతని మనస్సులో, ఆహవనీయాగ్ని అతని ముఖముపై  ప్రకాశిస్తుంది అంటారు.


"హవ్యవాహనా" అంటూ అగ్నిని ప్రార్థిస్తాడు. సాధారణంగా దేవతలను మంత్ర సహితంగా ఆహ్వానించి హవిస్సులను అగ్నిలో వ్రేలుస్తాము. అగ్ని ఆ హవిస్సులను తీసుకువెళ్ళి ఆయా దేవతలకు అందిస్తాడు. అంటే అగ్నికి వహన శక్తి ఉందన్నమాట. ఇప్పుడు ప్రవరుడు కాలాతీతం కాకుండా తన స్థానానికి చేరాల్సిన అవసరం ఉంది. తాను ఆరాధించేది అగ్నిని హవ్యవాహనా అంటూ సంబోధించాడు, అగ్ని తనను తన స్థానానికి చేర్చాడు.


అలా కాక ఒకవేళ తానా వరూధిని ముందు అగ్నిలో దగ్ధమైనట్లయితే మాయాప్రవరుని ఆగమనం ఉండేది కాదు. తరువాతి కథ ఉండేది కాదు.


ప్రవరునికి ఈ శక్తి ఎలా సమకూరింది? ప్రవరుడు తల్లిదండ్రుల సేవలో తరించినవాడు, భోగాలపై ఆసక్తిలేనివాడు, అతిథి సేవా తత్పరుడు ముఖ్యంగా నిత్యాగ్నిహోత్రుడు: నిత్యాగ్ని హోత్రం వల్ల ప్రయోజనం ఏమిటి? అగ్ని ఆరాధన వల్ల శ్రేయస్సు కలుగుతుంది. హిమాలయాలలో వరూధిని రూపంలో ప్రవరునికి ఎదురైన అత్యంత క్లిష్టపరిస్థితులలో అగ్ని సహకారంతోనే అతను ఇల్లు చేరగలిగాడు.


సాధారణంగా యజ్ఞాలు 5 రకాలుగా చెపుతారు. 1) దేవయజ్ఞము ... దేవతలను మంత్ర సహితంగా ఆహ్వానించి ఆహుతుల ద్వారా ఆరాధించడం; 2) భూతయజ్ఞం... భూమి నీరు వాయువు ఇలాంటి వాటిపై ఉన్న జీవులకు ఆహారం అందించడం; 3) పితృ యజ్ఞం.... తర్పణాలు విడవడం, శ్రాద్ధాదులు నిర్వహించడం; 4)మనుష్య యజ్ఞం.... అతిథి సత్కారం చేయడం. అందుకే నీవు భోజనం చేసేముందు ఎవరైనా అతిథులు వచ్చారేమో చూడమంటూ గృహస్థును వేదం శాసిస్తుంది; 5) బ్రహ్మ యజ్ఞం.... బ్రహ్మానందాన్ని ఉపాసించడం


ఈ వరూధిని ఎవరు? దక్షప్రజాపతి సంతానంలో "ముని"  మరియు "అరిష్ట" అనే అప్సరోజాతి పుత్రికలు ఉన్నారు. అందులో “ముని” ఒక గంధర్వునిని వివాహమాడడం వల్ల కలిగిన సంతానం ఈ వరూధిని. ఈమెనే "మౌనేయ" అనికూడా పిలుస్తారు. ప్రవరుడు హిమాలయాలలో తిరుగాడాడు. ఆ సౌందర్యాన్ని ఆస్వాదించాడు. అది తపోభూమి సౌందర్యం.


మంచు కొండలపై తిరుగాడే సమయంలో తన కాలికి రాసుకున్న పసరు కరిగి పోయి ఎవరైనా కనిపిస్తారేమోనని తిరుగాడుతూ అడుగిడిన "సౌందర్య భూమి"లో భోగానుభవ స్పురణ స్పష్టమైంది. నిజానికి ఈ రెండూ సౌందర్యాలే. ఒకటి ప్రవరుడు కావాలనుకున్నాడు మరొక దానిని వరూధిని కావాలనుకుంది.


ఈ సంఘటననే మరొక కోణంలో పరిశీలిస్తే....


ప్రవరుడు ఒక నిరంతర తపస్వి. అతని వద్దకు సిద్ధుడు వచ్చాడు. అంటే ప్రవరుని తమస్సు సిద్ధిపొందే స్థితికి చేరుకుందన్నమాట. తపస్సు పరాకాష్టకు చేరుకున్నా అతనిలో అంతర్నిబిడీకృతమైన కోరికలు అల్లకలోలం చేస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా అతిథులు పుణ్యక్షేత్రాలను గూర్చి, నదీనదాలను గూర్చి, హిమాలయ సౌందర్యాలను గూర్చి వర్ణించిన విషయాలు అతని అంతరంగంలో జీర్ణించుకొని పోయాయి. ముఖ్యంగా హిమాలయ దర్శనాభిలాశ మరీ బలోపేతమైంది. ఎలాగైనా ఆ కోరిక తీర్చుకోవాలనే తపన అతనిలో అధికమైంది. బలీయమైన కోర్కె లక్ష్యంవైపు నడిపించింది. భౌతిక మైన లక్ష్యం తన తపో సిద్ధికి అడ్డంకిగా మారింది. తపో సిద్ధి కావాలంటే కోర్కెలు జయింపబడాలి లేదా ఆ కోరికలు యోగాగ్నిలో దగ్ధమవ్వాలి. (యోగాగ్ని దగ్ధ కర్ములు భగవంతుడిని చేరుతారని భాగవతం చెపుతుంది) ఆ ప్రక్రియ సిద్ధుని ఆగమనంతో జరిగిపోయింది.


ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాడు. పసరు ప్రభావంతో వెళ్ళాడు. వింతలు చూచాడు. సంతృప్తి చెందాడా? లేదే. ఈ నాటికి ఇక చాలు రేపు వచ్చి మళ్ళీ చూస్తానని అనుకున్నాడు. అంటే కోర్కెలు సంపూర్ణంగా జయింపబడలేదు. కోర్కెలు తీర్చుకోవడం సాధ్యపడదు కాని తాను పసరు ప్రభావం పోవడంతో హిమాలయాలపై పడ్డ కష్టాలను తలచుకొని విరక్తుడయ్యాడు. హిమవన్నగ సౌందర్యాన్ని అనుభవించినా పడిన కష్టాలిచ్చిన విరక్త భావన వల్ల అగ్నిసహాయం అతనికి లభించింది.


మరొక కోణంలో దీనిని విశ్లేషిస్తే.....


ప్రాకృతిక ధర్మాలను మూడుగా విభజించవచ్చు. మొదటిది భౌతిక ధర్మాలు, రెండవది మానసిక ధర్మాలు, మూడవది ఆధ్యాత్మిక ధర్మాలు. మంచు చల్లగా ఉంటుంది, దానిని తాకలేము.  ఇది భౌతిక ధర్మం. అయితే హిప్నటైజ్ చేయబడిన వ్యక్తి ఆ మంచు గడ్డలపై హాయిగా పడుకోగలుగుతాడు. ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే... తన మానసిక అతీంద్రియ శక్తులను స్వయంగా మేల్కొల్పుకునే విధంగా మనసుకు తగిన సూచనలు ఇచ్చుకోవడం ద్వారా సాధ్యపడుతుంది. మనం స్వయంగా ఇచ్చుకున్న సలహాలు, సూచనలు (affirmations) అంతశ్ఛేతనలో ముద్రితమౌతాయి. ఆ సూచనల కనుగుణంగా మనసు పనిచేస్తుంది. అంతశ్చేతనలో ముద్రింపబడిన ఈ సూచనలు మనకు తెలియకుండానే మనం కోరుకున్న ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరింప చేయగలుగుతాయి. ఆ స్థితిలో చక్కని ఆనందాన్నీ పొందగలుగుతాము.


ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళాలని సంకల్పించాడు. భౌతికంగా అది సాధ్యపడదు కాని వెళ్ళాలనే బలీయమైన కోరిక వల్ల తనకు తెలియకుండానే తన మనస్సులో ఒక ఊహా ప్రపంచం ఆవిష్కృతం అయింది. తాను హిమాలయాలలో ఉన్నట్లు ఊహించుకున్నాడు. అతనికి ఆ హిమాలయాలలోని ప్రకృతి సుపరిచితమైనదే. తన ఆతిథ్యాన్ని స్వీకరించిన మహానుభావులెందరో అక్కడి విశేషాలను, ఆ సౌందర్యాలను తన మనసుకు హత్తించారు. తద్వారా అంతశ్ఛేతనలో కోరిక బలీయమైంది. తన కాసక్తి కలిగిన ప్రతి అంశాన్ని తన మనసులో Affirmations లాగా పదిలపరచుకున్నాడు. అతని మనసులో ఒక విశాల విశ్వ సృజన జరిగింది. ఆ ప్రపంచంలో ఎక్కడ చూచినా హిమాలయాలలో కనిపించే వింతలు విశేషాలే ఆవిష్కరించ బడ్డాయి. అతనికి తెలియకుండానే అతని సంకల్పబలం అతనికా అనుభవాన్నిచ్చింది. అంతరంగంలో తాను చూస్తున్న హిమాలయాలకు భౌతిక ప్రపంచంలో తానున్న స్థితికి మధ్య భేదం కనిపించని అద్వైత స్థితి కలిగిందతనికి.


అతనిలో మరొక కోణంలో; తాను చదివిన పురాణాలు, కావ్యాలలోని స్వర్గ సుఖాలు, అప్సరాభామినుల అందచందాలు, వారి నటనా  విన్యాసాలు,వారు సాగించే కామకేళీ విలాసాలు... ఇలా ఒకటేమిటి వర్ణితాంశాలన్నీ మనసులో ఆవిష్కరింపబడ్డాయి. వాటిపై సహజ మానవ నైజంతో ఏర్పరచుకున్న ఆసక్తీ కనుల ముందు సాక్షాత్కరించింది. తనకు తెలియకుండానే తన అంతశ్ఛేతనలో ముద్రితమైన కోరికలు, భావనలు వాటిపై తనకున్న అనురక్తి కనులముందు కదలాడడం ఆరంభించింది. ఇది బలీయమైన అంతర్మనస్సు యొక్క విన్యాసం. పరవశ స్థితిలో ఆ యా అనుభూతులనాస్వాదిస్తున్నాడు, ప్రవరుడు.  బాహ్య ప్రపంచంతో సంబంధం లేని అంతర్ముఖుడైనాడు. అంతటి పరవశ స్థితిలోనూ తనకు మాధ్యాహ్నికాలు నిర్వహించాలనే సూచన మనసు నుండి అందింది. మనసు సమయాన్ని జ్ఞాపకం చేస్తున్నా తానా పరవశ స్థితి నుండి రావడానికి ఇష్టపడడంలేదు. తనలో ఆ కోరికల ప్రభావం అంత బలీయంగా నాటుకు పోయింది. మనసులో ఒక సంఘర్షణ. భౌతిక జగత్తులో అగ్నినారాధించాలనే సూచన ఒకవైపు.... కాదు ఈ పరవశ స్థితిలోనే మరింత సమయం గడపాలనే భావన మరొకవైపు. ఘర్షణ తీవ్రమైంది. ఇంతలో తనలోని మరొక కోణం వెలుగు చూసింది. తనలోని సుఖవాంఛ నేనున్నానని వెలుగు చూచింది.  ఇదివరకు సౌందర్యానికి ప్రతీకగా మనసులో తానావిష్కరించుకున్న అపురూప సౌందర్యం వరూధిని రూపంలో కనుల ముందు ఆవిష్కృతమై అతడిని ప్రలోభపెట్టింది. స్వర్గ సుఖాలు ఎరగా వేసింది. నర్మోక్తులు పలికింది, అలిగింది, నిష్టూరాలాడింది. అయినా అతని చలనం లేదు. అపుడా వాంఛ కాముక స్త్రీ రూపంలో ఆవేశింపబోయింది. దానితో అతనిలోని వివేకం వెలుగు చూసింది. అంతస్సంఘర్షణ అంతమైంది. నిల్పోపమి లేని కాముకత్వానికి లొంగని ధీరోదాత్త వ్యక్తిత్వం ప్రదర్శించాడు. తనలోని వికృత కాముక భావనలను అగ్నిలో ప్రక్షాళన చేసుకున్నాడు. ఊహా ప్రపంచం నుండి భౌతిక ప్రపంచం లోకి వచ్చాడు. 


ధ్యాన సాధనలో కలిగిన పరవశస్థితి సమాధి స్థితిగా పిలవబడుతుంది. ఇంద్రియ ప్రపంచానికి దూరంగా తానున్నా మనసుకు ఇదివరకు ఇచ్చుకున్న సూచనల కనుగుణంగా మనసు పనిచేస్తుంది. గాఢ మైన హిప్నోసిస్ లో ఉన్న వ్యక్తి కూడా ఫలానా సమయంలొ ఉదాహరణకు 11.00 గంటలకు ఫలానా పని చేయాలని సూచన నిచ్చుకుంటే ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నా కూడా ఆ సమయానికి ఆ పని గుర్తుకొస్తుంది. అది నెరవేర్చేంత వరకు పదే పదే గుర్తుచేస్తుంది. ప్రవరుని అంతరంగంలో జరిగినదీ అదే. ఒకవైపు కోరికల తీవ్రత రెండవ వైపు ధర్మ దీక్ష వెరసి తనలో జరిగిన సంఘర్షణకు తెరలేపాయి. చివరకు అతనిలోని వివేకం అతడిని పతనావస్థకు చేరకుండా రక్షించింది.


            ప్రవరుని అంతరంగంలో ఎక్కడో ఒక మూల నిక్షిప్తమైన భోగాసక్తి, స్వర్గ సుఖాలపై అతని మనసులో ఏర్పడిన భ్రాంతి వరూధిని రూపంలో స్పష్టమైంది. అందువల్లే వరూధిని తనను కౌగిలించుకున్నట్లుగా అతడు భ్రమించాడు.


అంతశ్చేతనలో చెలరేగే కోరికలకు, సంస్కారానికి జరిగే ఘర్షణ ఇది. మంచి చెడ్డల మధ్య పోరాటమిది.వ్యక్తి సమున్నత స్థానం చేరుకోవాలంటే అంతరంగంలో ఘర్షణ అనివార్యం. ఈ ఘర్షణలో కోరికలను గెలవకూడదు అవి సంపూర్ణంగా జయింపబడాలి. గెలవబడిన కోరికలు సమయం కోసంచూస్తుంటాయి. అవకాశం వచ్చినప్పుడు ద్విగుణీకృత ఉత్సాహంతో పెల్లుబ్బుతాయి. గెలుపు అశాశ్వతమైనది కాగా విజయం శాశ్వతమైనది. ఉమ్మడిగా లభించేది విజయం. ఆధిపత్యాన్ని చూపేందుకై పరులపై సాధించేది గెలుపు. విజయంలో అందరి భాగస్వామ్యం ఉంటుంది. ఈ రెంటి మధ్య భేదాన్ని గుర్తించి కోరికలను జయిస్తేనే విజయం సాధించగలుగుతాము.


"పగ యడిగించు టెంతయు శుభంబది లెస్స, యడంగునే పగన్ పగ మదిగొన్న" అంటారు తిక్కన గారు. పగచే పగను ఎలాగైతే సాధింపలేమో అలాగే కోరికలచేత కోరికలను గెలవలేమి. కోరికలను శాశ్వతంగా తుడిచి వేసుకోవడమో, కడిచి వేసుకోవడమో, యోగాగ్నిలో దహించుకోవడమో చేయాలి. అది మాత్రమే దీనికి పరిష్కారం.


ప్రవరుని మనస్సులో కోరికల తీవ్రత యొక్క పరాకాష్టయే వరూధిని ప్రవరుని కౌగిలించుకోవడం. అక్కడే ప్రవరునికి జ్ఞానోదయమైంది. తల్లిదండ్రుల బోధలు, గురువులు అనుగ్రహించిన విజ్ఞానం, సమాజం అందించిన సంస్కారం, మానవ విలువల పట్ల తానేర్పరచుకున్న అవగాహన, ధార్మిక చింతన అలా ఒకటేమిటి... అప్పటి వరకు తన అంతశ్చేతన కిచ్చుకున్న సూచనలన్నీ అతనికి కర్తవ్యాన్నుపదేశించాయి. భద్రలోకం నుండి భవ్యలోకంలోకి నడిపించే క్రియాశీలన ఆలోచనా తరంగాలను అందించగలిగాయి. దానితో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. భగవంతుడిని తలచాడు. "హా శ్రీహరీ" అంటూ ఆమెను నెట్టివేశాడు. అంటే మోహాన్నీ భ్రమలనూ మనసు లోతులలో నుండి నెట్టి వేసుకున్నాడు. తనలోని మాలిన్యాన్ని కడిగి వేసుకున్నాడు.


అయితే మరి కోరికల మాటేమిటి? కోరికలను అగ్నిలో వ్రేల్చాడు. గృహస్థు ఆరాధించే అగ్నిని గార్హపత్యాగ్ని అంటాము. అందులో నుండి వైశ్యదేవాది క్రియలకు అగ్నిని గైకొని క్రియా పరిసమాప్తికై హోమము చేసే అగ్నిని ఆహానీయాగ్ని అంటాము. ఆ ఆహ్వనీయాగ్నిలో కోరికలను వ్రేల్చి క్రియా పరిసమాప్తి చేసుకున్నాడు. అలాగే ప్రాయశ్చిత్తాది కార్యాలకు వేదికకు దక్షిణ భాగంలో ఉండే అగ్నిని వాడుతారు. దానిని దక్షిణాగ్ని అంటాము. ఆ అగ్నిలో తన తప్పుడు భావనలు కడిగివేసుకున్నాడు. దానితో పునీతుడయ్యాడు. ప్రలోభాలనుండి, ప్రమాదాల అంచులనుండి, పతనావస్థ అంచుల నుండి బయటపడ్డాడు.


            కోర్కులను పంచాగ్నులలో వ్రేల్చి ఉంటే శరీరం మనస్సు కూడా హుతమయి ఉండేది. కాని అతడు నిర్వహింపవలసిన ధర్మం ఇంకా ఉండడం వల్ల కావచ్చు, అతని సంస్కారాలు పరిసమాప్తి కాకపోవడం వల్ల కావచ్చు, అతను యథాస్థితికి మచ్చాడు. ఒకవేళ వరూధిని ముందు అతని శరీరం హుతమై ఉంటే మాయా ప్రవరుని ఆగమనానికి అవకాశం ఉండేది కాదు. తరువాతి కథ ఉండేది కాదు. దైవకార్యం నిర్వహింపబడేది కాదు.


            సాధనలో జరిగే పరిణామాలు సాధకునికి తెలియవలసిన అవసరం లేదు. అంతశ్ఛేతనలో వాటికవే జరిగిపోతాయి. దహరాకాశంలో అంటే హృదయ ప్రపంచంలో ఎవరెవరి సాధన ననుసరించి తగిన వైశాల్యాన్ని సంతరించు కుంటుంది. బలీయమైన కోర్కి అంతశ్ఛేతనలో నిండి పోవడం, సిద్ధునిపై అచంచల విశ్వాసం, హిమాలయాలను దర్శించాలనే తీవ్రమైన పట్టుదల, నిశ్చలమైన సంకల్పం అతని సాధనను తీవ్రతరం చేసాయి.


            అనుకున్న విధంగానే అంతః ప్రపంచంలో తాను దర్శించాలనుకున్న వైభవాన్ని దర్శించాడు, ప్రవరుడు. ఆకర్శణలను అధిగమించాక, ప్రలోభాలను జయించాక ప్రవరునికీ ప్రపంచంతో సంబంధంలేదు. అందుకే కావ్యంలో మరెక్కడా అతని ప్రసక్తి రాదు.


ఇక వరూధిని విషయంలో.... కాముకత్వం పడగ విప్పిన విధంగా కనిపిస్తుంది. ఆమె అంతశ్ఛేతనలో ఆమె పెరిగిన వాతావరణం స్పష్టమౌతుంది. ఆమె స్వతహాగా అందగత్తె. పైగా ఎందరో యక్షరాక్షస గంధర్వ రాజకుమారులు ఆమెపై మనసు పడ్డారు, ఆమెను మోహించారు, ఆమె అందాన్ని పొగిడారు. వారు పొగిడిన కొద్దీ ఆమెలో అహంభావం పెరిగిపోయింది. ఎవరినీ మెచ్చకపోవడం, పట్టించుకోక పోవడం ఆమె ప్రవృత్తిగా మారింది. దానికి తోడు ఆమె అప్సరస జాతి స్త్రీ. దేవ వేశ్య కాబట్టి వేశ్యగా పరాయి పురుషుని కోరడం తప్పు కాదనే భావన చిన్నప్పటి నుండే ఆమెకు బోధింప బడింది. చుట్టూ ఉన్న మిత్రులు (మేనక లాంటివారు) ఆమెకు ఆదర్శప్రాయులయ్యారు. కోరిక సహజమైనది, ఏ విధంగానైనా కోరిక తీర్చుకోవడం దేవతలకు సమంజసమే, అది తప్పుకాదు అనే భావన ఆమె మనసులో సమాజం ద్వారా బలంగా ముద్రింపబడింది. అలా అంతశ్చేతనలో నిక్షిప్తమైన సూచనలు ఆమెను కార్యోన్ముఖురాలిని చేసాయి. దానికి తోడుగా తన అందంపై తనకున్న నమ్మకం, ప్రవరుని లాంటి మానవ మాత్రుడు తనను తిరస్కరించడం ఆమెను అయోమయంలో పడవేసింది. విచక్షణా జ్ఞానం కనుమరుగయింది. మనుష్యుని భావించడంలో ఆమెలో మానుషత్వం, తద్భావం నిండిపోయింది. ఆ మానుష భావం పశుభావాన్ని ఆశ్రయించింది. ఎలాగయినా సాధించాలనే తపన, ఆ తపనచే పొందిన ప్రేరణల కనుగుణంగా నిల్పోపమి లేక ప్రవరుని కౌగిలించుకుంది. ఆపుకోలేని మోహం కన్ను గప్పడంతో తన దివ్యత్వాన్ని కూడా విస్మరించడం ఆమె పతనావస్థను సూచిస్తుంది.


            సైకాలజిస్టులు మనసును నియంత్రించేది ID, EGO మరియు SUPER EGO లుగా వ్యవహరిస్తారు. ID యొక్క తత్త్వం అనుకున్న దానిని లేదా కోరుకున్న దానిని ఏ విధంగా నైనా అనుభవించాలనే తపనను ప్రేరేపిస్తుంది. ఆ కామనకు మంచి చెడ్డలు, సమయ సందర్భాలతో పని లేదు. యుక్తాయుక్త విచక్షణ లేదు. తన కాముకత్వం తీరాలి. ఈ ID ను Furness of Desires గా పేర్కొంటారు. దీనిని నియంత్రించేది EGO. దీనినే Reality principle గా అంటారు. కాముకత్వాన్ని తీర్చుకొమ్మని ఒత్తిడి చేసే ID తో, ఇది సమయం కాదు, సమాజం నీ ప్రవర్తనను సమ్మతింపదు, నీవు మనిషివి, నీ కోరిక పశు ప్రవర్తన, ఇలాంటి ప్రవర్తన వల్ల అప్రతిష్ట పాలవుతావు. ఈ విధంగా ప్రవర్తిస్తే నీ గౌరవం పోతుంది. వృత్తి పరంగా నష్టపోతావు. సంఘం చేసిన కట్టుబాటులను గౌరవిస్తూ నీలోని కాముకతను జయించు. ఐహిక, ఆముశ్మిక విజయాలను మామూలు కాముకత కోసం బలిచేసుకోవద్దు..... అని సూచిస్తూ, సన్మార్గంలో పెడుతుంది EGO.


            అంతశ్ఛేతనలో ఒక విశయంపై మనం ఇచ్చుకున్న సూచనలు వాటినే Suggestions  అంటాము, అవి ఎంత బలీయంగా నాటుకు పోతే విషయంపై అంత తీవ్రమైన స్పందన ఉంటుంది. మనిషిలో ఉండే పశు ప్రవర్తన అంటే కంటికి కనిపించిన దానినెల్లా స్వంతం చేసుకోవాలనే కోరిక, మనసుకు నచ్చిన విధంగా ప్రవర్తించాలనే తపన అధికంగా ఉంటే ID మనల్ని Dominate చేస్తుంది.


            ఇక మనసులో మరోమూల నిక్షిప్తమై EGO ను మరింత బలోపేతం చేసేది SUPER EGO. పెద్దలు, సమాజం గురువులు చిన్నప్పటి నుండి మనకిచ్చిన సూచనలు సలహాలు తనలో నిక్షిప్తం చేసుకొని విచక్షణాయుతంగా ప్రవర్తించే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, Super Ego. Sub-conscious  Mind లో నిక్షిప్తమైన ఈ సూచనల వల్ల ID ను జయింపగలుగుతాము. అందుకే ఈ సూచనలు నిర్మాణాత్మకంగా ఇవ్వబడాలి. 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!