🔻-బాబోయ్ చలం " - " స్త్రీ ✍️🔻

🔻-బాబోయ్ చలం " - " స్త్రీ ✍️🔻


🚩ఈమధ్య మళ్ళి చలం రాసిన " స్త్రీ " పుస్తకం చదివాను,,


చదవడం అయ్యాక " బాబోయ్ చలం " అని అనిపించింది.


చలం నవలలన్నింటిలోనూ స్త్రీ ఒక ప్రేరక శక్తి, శృంగారం మూర్తీభవించిన లోకాతీతమైన వ్యక్తి. ఒక మానసిక శక్తి. ఒకళ్ళు ఆరాధించతగిన వ్యక్తే కానీ, కామించదగ్గది కాదు.


ఆయన స్త్రీలందరూ, జీవితంలో ఏ ఆదర్శం కోసం తను వేదన


చెంది, తపించి విసిగి వేసారి, ఒంటరితనం, బాధ అనుభవించాడో, ఆ ఆదర్శం కోసం అంతే బాధపడి ఆఖరవుతాడు.


🚩ఆంధ్రలో బ్రహ్మ సమాజం 1864లో ప్రారంభమయింది. 1916 ప్రాంతంలో చలం బ్రహ్మ సమాజంలో చేరాడు (ఆంధ్రలో చలం పే.604). దాదాపు 1920ల వరకు అందులో పనిచేశాడు. బ్రహ్మ సమాజంలో చేరకముందే తన ఇంట్లో ఆడవాళ్ళనీ, పిల్లల్నీ పొట్టి నిక్కర్లేయించి బాడ్మింటన్‌ ఆడటానికి తీసుకెళ్ళడం లాంటి పనులు చేశాడు. ఈనాడవి అంత గొప్ప విషయాలనిపించక పోవచ్చు. కానీ అప్పటి వాళ్ళకవన్నీ విపరీతంగా కనిపించాయనటంలో ఆశ్చర్యం లేదు. వీళ్ళు బజార్ల గుండా వెళ్తుంటే ఎంతో మంది విపరీత వ్యాఖ్యానాలు చేసేవారు,ఉమ్ములూసేవారు. అట్లా చలం తన వ్యక్తిగత జీవితంలోనే సమాజాన్నెదిరించి తాను చెప్పింది చేశాడు.


🚩”కుటుంబ జీవితంలోనూ, స్త్రీ విషయంలోనూ, సాంఘిక నీతుల విషయంలోనూ, చాలా సంకుచితంగా, దుర్మార్గంగా ప్రవర్తించేవారినీ, కులమత భావాల్ని వదలని వారినీ, వ్యక్తిగతంగా నిజాయితీ లేని వారినీ, అవకాశవాదులనూ, జాతీయోద్యమంలో ఎక్కువ చూసి ఆ ఉద్యమ రాజకీయాల వల్ల ప్రభావితుడు కాలేకపోయారు . దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్త్రీకి సంపూర్ణ స్వాతంత్య్రం ప్రభుత్వపు కాగితాలలో మాత్రమే ఉండటాన్ని గురించి 52లో రాశాడు చలం. (1952 సంపుటిలో స్త్రీకి రాసిన ముందు మాట ”ఇంకోసారి మళ్ళీ తప్పలేదు” పేజీ 20-25).


🚩”ఆస్తినంతా లాగేస్తూ, ఆస్తి హక్కుని స్త్రీకి ఇచ్చి ఏం లాభం? బతుకంతా బానిసత్వం చేసి, భర్తనుంచి స్వేచ్ఛనిచ్చి ఏం లాభం?” అంటూ ఆస్తి హక్కు, విడాకుల చట్టాలకున్న పరిమితులను బయటపెట్టాడు.


ఇదివరకు భర్తను వదిలి స్త్రీ ఇంకొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకోవచ్చని చట్టం చెప్పగానే ఇంత వరకు ఆ స్త్రీని వ్యభిచారిగా లెక్క గట్టిన సంఘం ఒక్కసారి ఆమెను పతివ్రతనెట్లా చేసిందని ఎద్దేవా చేశాడు. వ్యక్తి జీవితాన్ని సంఘం అదుపు చేయడం చలానికి ఆమోదయోగ్యం కాదు.


🚩ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి, ఎంతమంది పిల్లల్ని కనాలి,


ఎప్పుడు కనాలనే ప్రశ్నలన్నీ కూడా ”జాతీయం” అయిపోయాయని బాధపడ్డాడు. మనం ఈ రోజు చర్చిస్తున్న సాంఘిక వ్యవస్థ, నీతి, ధర్మాలు, ప్రభుత్వం/రాజ్యం-నీతి, ధర్మాలు – వాటిలో వ్యక్తికున్న స్వేచ్ఛ అనే అంశాలన్నీ స్ఫురిస్తాయనడం అతిశయోక్తి కాదు.


తన స్వంత చెల్లెలు అమ్మణ్ణి విషయంలో తాను పడ్డ బాధ, ఎదుర్కొన్న వైరుధ్యాల గురించి ఆత్మకథలో రాశాడు. తన చెల్లెలి అనుభవమైన మొదలు ”అత్తవారింట స్త్రీ ఏం బాధలు పడుతుందో, ఏ విధంగా వాళ్ళ మెదళ్ళని అత్తవారు ఎలా నడిపించేస్తారో అర్థమయింది. ఆ రోజున స్త్రీ జనరక్షణోద్యమానికి ప్రారంభోత్సవం జరిగింది. స్త్రీ సంస్కరణ అంటే ఏమిటో తెలిసి వచ్చింది నాకు” (ఆత్మకథ పేజీ-23) అంటూ రాశాడు


🚩మగవాళ్ళ లాగానే స్త్రీలూ గొప్ప, మధ్య తరగతి, బీద అనే మూడు వర్గాలనీ మొదటి రెండు వర్గాలూ తమ స్వంత సంపాదనైనా లేకుండా భర్తల మీద ఆధారపడతారనీ, బీద వర్గం స్త్రీకి ఆ సంపాదన ఉన్నా అది భర్త అజమాయిషీలో ఉంటుందనీ, భర్త ఆధీనంలో స్త్రీ శ్రమ, సంపాదన ఉన్నంత వరకూ బీద స్త్రీకైనా స్వతంత్రత లేదనీ వాదించాడు. ఇంటి దగ్గర మగవాళ్ళ అవసరాలు తీరుస్తూ స్త్రీలు వాళ్ళని ప్రపంచంలోకి వెళ్ళే స్వేచ్ఛను కలిగిస్తున్నారన్న మాట ఆనాడే (1924) చలం చెప్పాడు.


🚩పిల్లల్ని కనడం అనే ప్రకృతి సహజమైన అంశం కోసం స్త్రీ తన ఇతర బాధ్యతలు (పని, ఉద్యోగం) వదులుకోవడం కృత్రిమమని అందుకే పిల్లల్ని చూసే కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ కూడా చెప్పాడు. ”బిడ్డలు అఖ్ఖర్లేదనుకుంటే గర్భ నిరోధక సాధనాలు ఉపయోగించడం న్యాయం కాని, గర్భం కలుగుతుందేమోనని భయంతో బతకడం ఘోరం… బిడ్డలు అఖ్ఖర్లేదనుకున్న వాళ్ళకు గర్భం కలిగితే, తగిన డాక్టర్ల చేత అది తీయించుకోవడం ఉత్తమం – కనడం కన్నా” (బిడ్డల శిక్షణ పే.130) అని గర్భనిరోధం, అబార్షన్ల గురించి చట్టవిరుద్ధమని తెలిసే ధైర్యంగా సూచనలిచ్చాడు. ”


స్త్రీ స్థానానికి సంబంధించి మతాన్ని, కులాన్ని, సంప్రదాయాన్ని, సంఘాన్ని అన్నింటినీ తప్పుపట్టాడు చలం. ఆమెని తన స్వంతం చేసుకోవడానికి పురుషుడు ఎట్లా ప్రయత్నిస్తాడో ఎద్దేవా చేశాడు.


🚩ఒక గార్డియన్‌గా రక్షకుడు అనే పేరుతో, నిజానికి సిఐడి ఆఫీసరుగా, పోలీసువాడిగా, మేజిస్ట్రేట్‌గా చివరికి హయ్యస్ట్‌ కోర్ట్‌ ఆఫ్‌ అపీల్‌గా, జైలరుగా, ఉరి తీసేవాడిగా అన్ని రూపాల్నీ భర్త ఎట్లా ధరిస్తాడని చాలా వ్యంగ్యంగా చెప్పాడు. ఆమె మీద తాను చెలాయించే పెత్తనాలన్నింటినీ వదిలేయాలని (మాన్‌ అండ్‌ ఉమెన్‌) ఆయన చెప్పాడు. ఆ జ్ఞానం ఇప్పటికి మాత్రం ఎంత మందిలో ఉంది? కాలక్రమంలో మారిన పురుషులకి అనుగుణంగా మాత్రమే స్త్రీ కూడా మారుతూ వచ్చిందని చలం చెప్పింది ఈనాటికీ నిజమే.


🚩పూర్వం పురుషుడికి ”పొట్టి చేతుల రవిక, కొప్పూ, అందెలూ, రాగిడీ ఇష్టమైతే ఆ వేషమే వేసింది స్త్రీ. ఇంగ్లీషు విద్య నేర్చిన పురుషుడికి జాకెట్టు, నాగరం, గాజులు, చిన్న బొట్టూ, కొంచెం సంగీతం, ఇంగ్లీషు ముక్కలు ఇష్టమైతే ఆ స్వరూపమే దాల్చింది” (స్త్రీ పేజి-43) అంటూ పెళ్ళయిన మరుక్షణం నుంచే భర్త తన భార్యను తన ఇష్టానుసారంగా ఎట్లా మలచుకుంటాడో చక్కగా రాశాడు. ”ఆమె ఊహలకి తను ఆకారమిస్తాడు. ఆమె అభిరుచులకి తను రంగులేస్తాడు. ఆమె ఏ పుస్తకాలు చదవాలో… అసలు చదవాలో లేదో, ఆమె ఎవరితో మాట్లాడాలో, అసలు మాట్లాడాలో లేదో, ఎట్లా కూచోవాలో, ఎన్ని గంటలకి లేవాలో, పడుకోవాలో ఆజ్ఞాపిస్తాడు. ఆమెకిదివరకే ఉన్న పాత అభిప్రాయాలలో తనకి నచ్చనివి ఉంటే వాటిని వెక్కిరించి, ఏడిపించి వదిలేస్తాడు…” చివరికి అతని మాటలు పలికే చిలుకగా, గ్రామ్‌ఫోన్‌ ప్లేటుగా మారుతుంది. చీర కొనేటప్పుడు కూడా ఆ రంగు అతనికిష్టమేనా, పచ్చడి చేసేటప్పుడు ఆ రుచి అతనికి సయిస్తుందా, ఈ కొత్త ఊహ అతనికి నచ్చుతుందా అని ఆలోచిస్తుంది…”. ఈ విధంగా మలచిన స్త్రీ ఆత్మ ఎలా ఉంటుంది? ”హత్య చేసేవాడు శరీరాన్ని చంపుతాడు. ఈ భర్త ఆత్మని నాశనం చేస్తాడు” అన్నాడు చలం ఆనాడు.


🚩🚩 ఇప్పటికీ ఈ స్థితే కొనసాగుతోంది. పుట్టినప్పటి నుంచి మనం పెరిగిన పద్ధతీ, వాతావరణం, పొందిన జ్ఞానం, మన పైన సమాజపు పోలీసింగ్‌ పెళ్ళి కాగానే మారిపోతాయి. ఇంటి పేరుతో సహా ఎగిరిపోతాయి. మనకున్న వ్యక్తిత్వాన్ని, ఉనికినీ, గతాన్ని భార్యలుగా, తల్లులుగా కావటానికి ప్రోత్సహించే పరిస్థితులు ఊపిరాడనివ్వవు.


🚩🚩ఇవే అంశాలను తన రచనలలో ప్రధానంగా తీసుకున్న చలాన్ని అర్థం చేసుకోవడానికి విశ్లేషణ చాలా అవసరమని తిరిగి చెప్పాల్సిన అవసరం ఉండదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!