-రాములవారు! - ఉత్తముని పేరేమి? ఊరి పేరేమి? సత్యపురుషులగన్న సాధ్వి పేరేమి? - ఉత్తముడు దశరథుడు, ఊరు అయోధ్య! సత్యపురుషులగన్న సాధ్వి కౌసల్య. - ఇల్లాళ్ళు ముగ్గురే ఈ దశరథునకు; పిల్లాళ్లు నలుగురే పేరు గలవారు. - అయ్యోధ్యలో వారు అంద రున్నారు; సయ్యోధ్యలో వారు సరిలేని వారు. - శ్రీరామ! జయరామ! శృంగారరామ! కారుణ్య గుణధామ! కల్యాణనామ! - జగతిపై రామయ్య జన్మించినాడు, సత్యమ్ము లోకాన స్థాపించినాడు. తల్లిదండ్రులమాట చెల్లించినాడు, ఇల్లాలితోపాటు హింసపడ్డాడు, - సీతామహాదేవి సృష్టిలోపలను, మాతల్లి వెలసింది మహనీయురాలు. అయ్యోధ్యరామయ్య అన్నయ్య మాకు, వాలుగన్నులసీత వదినమ్మ మాకు. రాములంతటివాడు రట్టుపడ్డాడు, మానవులకెట్లమ్మ మాటపడకుండ! - సీతమ్మ రామయ్య దారిగదిలీతె, పారిజాతపు పువులు పలవరించినవి. సీతపుట్టగనేల! లంకచెడనేల? లంకకు విభీషణుడు రాజుగానేల? - ఏడు ఏడూ యేండ్లు పదునాలుగేండ్లు, ఎట్టులుంటివి సీత నట్టడవిలోను? లక్ష్మయ్య నామరిది రక్షిస్తూఉండ, నాకేమి భయ మమ్మ, నట్టడవిలోను? - దేవునంతటివాడు జననింద పడెను, మానవుం డెంతయ్య మాటపడకుండ? ...