భాగవతము - రుక్మిణీ కల్యాణము

భాగవతము - రుక్మిణీ కల్యాణము

క. ఆ వనజగర్భు పంపున

రైవతుఁడను రాజు దెచ్చి రామున కిచ్చెన్‌

రేవతి యనియెడు కన్యను

భూవర! మును వింటి కాదె బుద్ధిం దెలియ\న్‌. 1

వ. తదనంతరంబున. 2

మ. ఖగనాథుం డమరేంద్రుఁ గెల్చి సుధ ము\న్‌ గైకొన్న చందంబున\న్‌

జగతీనాథులఁ జైద్య పక్షచరులన్‌ సాళ్వాదులం గెల్చి భ

ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుత\న్‌ రాజీవగంధి\న్‌ రమా

భగవత్యంశభవ\న్‌ మహాగుణమణి\న్‌ బాలామణి\న్‌ రుక్మిణి\న్‌. 3

వ. అనిన రా జిట్లనియె. మున్ను రాక్షస వివాహంబున స్వయంవరంబునకు వచ్చి,

హరి రుక్మిణిం గొనిపోయె నని పలికితివి. కృష్ణుం డొక్కరుం డెవ్విధంబున

సాళ్వాదులం జయించి, తన పురంబునకుం జనియె? అదియునుం గాక. 4

శా. కల్యాణాత్మక మైన విష్ణుకథ లాకర్ణింపుచు\న్‌ ముక్త వై

కల్యుం డెవ్వఁడు తృప్తు డౌ, నవి వినంగాఁ గ్రొత్త లౌచుండు సా

కల్యం బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే రుక్మిణీ

కల్యాణంబు వినంగ నాకు మదిలోఁ గౌతూహలం బయ్యెడి\న్‌. 5

క. భూషణములు సెవులకు బుధ

తోషణము లనేక జన్మ దురితౌఘ విని

శ్శోషణములు మంగళతర

ఘోషణములు గరుడగమను గుణ భాషణముల్‌. 6

వ. అని, రా జడిగిన శుకుం డిట్లనియె. 7

చ. వినుము విదర్భదేశమున వీరుఁడు కుండినభర్త భీష్మకుం

డను నొక దొడ్డరాజు గలఁ డాతని కేవురు పుత్రు లగ్రజుం

డనఘుఁడు రుక్మి నాఁ బరఁగు నందఱకుం గడగొట్టు చెల్లెలై

మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణి నాఁ బ్రసిద్ధ యై. 8

క. బాలేందు రేఖ దోఁచిన

లాలితయగు నపరదిక్కు లాగున ధరణీ

పాలుని గేహము మెఱసెను

బాలిక జన్మించి యెదుగ భాసుర మగుచు\న్‌. 9

వ. మఱియును, దినదిన ప్రవర్ధమాన యై. 10

సీ. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు సేయుచు నబలలతోడ వియ్యంబు లందు

గుజ్జనగూళ్లను గొమరొప్ప వండించి చెలులకుఁ బెట్టించుఁ జెలువుమెఱయ

రమణీయ మందిరారామ దేశంబులఁ బువ్వుఁదీఁగెలకును బ్రోదిసేయు

సదమల మణిమయ సౌధభాగంబుల లీలతో భర్మడోలికల నూఁగు  

తే. బాలికలతోడఁ జెలరేఁగి బంతులాడు

శారికా కీర పంక్తికిఁ జదువుచెప్పు

బర్హిసంఘములకు మురిపములు గఱపు

మదమరాళంబులకుఁ జూపు మందగతులు. 11

వ. అంత. 12

సీ. దేవకీ సుతుకోర్కె తీఁగెలు వీడంగ వెలఁదికి మైదీఁగె వీడఁ దొడఁగెఁ

గమలనాభుని చిత్తకమలంబు వికసింపఁ గాంతి నింతికి ముఖకమల మొప్పె

మధువిరోధికి లోన మదనాగ్ని పొడచూపఁ బొలఁతికిఁ జనుదోయి పొడవుసూపె

శౌరికి ధైర్యంబు సన్నమై డాయంగ జలజాక్షి మధ్యంబు సన్నమయ్యె  

ఆ. హరికిఁ బ్రేమబంధ మధికంబు గాఁ గేశ

బంధ మధిక మగుచు బాల కమరెఁ

బద్మనయను వలనఁ బ్రమదంబు నిండార

నెలఁత యౌవనంబు నిండియుండె. 13

వ. ఇట్లు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలి యను నేవురకుం

జెలియ లైన రుక్మిణీదేవి దన యెలప్రాయంబున. 14

క. తన తండ్రి గేహమునకుం

జనుదెంచుచునున్న యతిథిజనులవలనఁ గృ

ష్ణుని రూప బల గుణాదులు

విని కృష్ణుఁడు దనకుఁ దగిన విభుఁ డని తలఁచె\న్‌. 15

క. ఆ లలన రూపు బుద్ధియు

శీలము లక్షణము గుణముఁ జింతించి తగన్‌

బాలారత్నముఁ దన కి

ల్లాలుగఁ జేకొందు ననుచు హరియుం దలఁచె\న్‌. 16

వ. అంత. 17

ఉ. బంధువు లెల్లఁ గృష్ణునకు బాలిక నిచ్చెద మంచు శేముషీ

సింధువు లై విచారములు సేయఁగ వారల నడ్డపెట్టి దు

స్సంధుఁడు రుక్మి కృష్ణునెడఁ జాల విరోధముఁ జేసి మత్త పు

ష్పంధయవేణి నిత్తు శిశుపాలున కంచుఁ దలంచె నంధుఁడై. 18

ఉ. అన్న తలంపుఁ దా నెఱిఁగి య న్నవనీరజగంధి లోన నా

పన్నత నొంది యాప్తుఁ డగు బ్రాహ్మణు నొక్కనిఁ జీరి గర్వసం

ఛన్నుఁడు రుక్మి నేఁడు ననుఁ జైద్యున కిచ్చెద నంచు నున్న వాఁ

డెన్ని విధంబులం జని బుధేశ్వర! చక్రికి విన్నవింపవే! 19

క. అయ్యా! కొడుకు విచారము

లయ్యయు వారింపఁ జాలఁ డటు గాకుండ\న్‌

నెయ్య మెఱిఁగించి చీరుము

చయ్యన నిజ సేవకానుసారి\న్‌ శౌరి\న్‌. 20

వ. అని కొన్ని రహస్యవచనంబులు సెప్పిన విని బ్రాహ్మణుండు ద్వారకానగరంబు

నకుం జని, ప్రతీహారులవలనఁ దనరాక నెఱింగించి, య న్నగధరుం డున్న

నగరుఁ బ్రవేశించి, యందుఁ గనకాసనాసీనుండైయున్న పురుషోత్తముం

గాంచి, పెండ్లికొడుకవు గమ్మని దీవించిన, ముసిముసినగవులు నగుచు,

బ్రహ్మణ్య దేవుండైన హరి, తన గద్దియ దిగ్గన డిగ్గి, బ్రాహ్మణుం గూర్చుండ

నియోగించి, తనకు దేవతలు సేయు చందంబునం బూజలు సేసి, సరస పదార్థ

సంపన్నం బైన యన్నంబు పెట్టించి, రెట్టించిన ప్రియంబున నయంబున

భాసురుండైన భూసురుం జేరి, లోకరక్షణ ప్రశస్తం బైన హస్తంబున నతని

యడుగులు పుడుకుచు, మెల్లన నతని కి ట్లనియె. 21

సీ. జగతీసురేశ్వర! సంతోషచిత్తుండ వై యున్న నీ ధర్మ మతిసులభము

వృద్ధసమ్మత మిది విత్త మెయ్యది యైనఁ బ్రాపింప హర్షించు బ్రాహ్మణుండు

తనధర్మమున నుండుఁ దరల డా ధర్మంబు గోరిక లతనికిఁ గురియుచుండు

సంతోషి గాడేఁని శక్రుఁ డైన నశించు నిర్ధనుం డయినను నిద్రఁ బోలు  

ఆ. సంతసించె నేని, సర్వభూత సుహృత్త

ములకుఁ బ్రాప్తలాభ ముదితమాన

సులకు శాంతులకును సుజనులకును గర్వ

హీనులకును వినతు లే నొనర్తు. 22

ఉ. ఎవ్వని దేశమం దునికి యెవ్వనిచేఁ గుశలంబు గల్గు మీ

కెవ్వనిరాజ్యమందుఁ బ్రజ లెల్ల సుఖింతురు వాఁడు మత్ప్రియుం

డి వ్వనరాశిదుర్గమున కె ట్లరుదెంచితి వయ్య! నీవు లే

నవ్వులు గావు నీ తలఁపునం గల మే లొనరింతు ధీమణీ! 23

వ. అని యిట్లు లీలా గృహీతశరీరుం డైన య ప్పరమేశ్వరుం డడిగిన, ధరణీసుర

వరుం డతని కిట్లనియె. దేవా! విదర్భదేశాధీశ్వరుం డగు భీష్మకుం డను రాజు

గలండు. ఆ రాజుకూఁతురు రుక్మిణి యను కన్యకామణి గలదు. అ య్యిందువదన

నీకుం గైంకర్యంబు సేయం గోరి, వివాహమంగళ ప్రశస్తం బైన యొక్క

సందేశంబు విన్నవింపు మని పుత్తెంచె. అవధరింపుము. 24

సీ. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక దేహతాపంబులు దీఱిపోవు

నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల కఖిలార్థలాభంబు గలుగుచుండు

నే నీ చరణసేవ లే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబుఁ బొందఁగలుగు

నే నీ లసన్నామ మేప్రొద్దు భక్తితోఁ దడవిన బంధసంతతులు వాయు  

తే. నట్టి నీయందు నా చిత్త మనవరతము

నచ్చియున్నది నీ యాన నానలేదు

కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి!

శ్రీయుతాకార! మానినీచిత్తచోర! 25

శా. ధన్యున్‌ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ

జన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితు\న్‌ నిన్ను నే

కన్యల్‌ గోరరు? కోరదే మును రమా కాంతాలలామంబు రా

జన్యానేకప సింహ! నావలననే జన్మించెనే మోహముల్‌. 26

ఉ. శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహము పాలి సొమ్ము గో

మాయువు గోరుచందమున మత్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ

ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ

డా యధమాధముం డెఱుఁగఁ డద్భుత మైన భవత్ప్రతాపముల్‌. 27

మ. వ్రతముల్‌ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్‌ దానధర్మాదులు\న్‌

గతజన్మంబుల నీశ్వరు\న్‌ హరి జగత్కల్యాణుఁ గాంక్షించి చే

సితి నేని\న్‌ వసుదేవనందనుఁడు నా చిత్తేశుఁ డౌఁగాక ని

ర్జితు లై పోదురు గాక సంగరములోఁ జేదీశ ముఖ్యాధముల్‌. 28

ఉ. అంకిలి సెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లి యో

పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్‌ జయించి నా

వంకకు వచ్చి రాక్షసవివాహమునన్‌ భవదీయ శౌర్య మే

యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెద\న్‌. 29

సీ. లోపలి సౌధంబులోన వర్తింపంగఁ దేవచ్చునే నిన్నుఁ దెత్తునేనిఁ

గావలివారలఁ గల బంధువులఁ జంపి కాని తేరా దని కమలనయన!

భావించితేని నుపాయంబు చెప్పెద నాలింపు కులదేవయాత్రఁజేసి

నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కఁ బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతు  

తే. నెలమి మావారు పంపుదు రేను నట్లు

పురము వెలువడి యేతెంచి భూతనాథు

సతికి మ్రొక్కంగ నీవు నా సమయమునకు

వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత! 30

మ. ఘను లాత్మీయ తమోనివృత్తి కొఱకై గౌరీశుమర్యాద నె

వ్వని పాదాంబుజ తోయమందు మునుఁగ\న్‌ వాంఛింతు రే నట్టి నీ

యనుకంపన్‌ విలసింప నేని వ్రతచర్య\న్‌ నూఱు జన్మంబుల\న్‌

నినుఁ జింతించుచుఁ బ్రాణముల్‌ విడిచెదన్‌ నిక్కంబు ప్రాణేశ్వరా! 31

సీ. ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమి యేల

పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని తనులతవలని సౌందర్య మేల

భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని చక్షురింద్రియముల సత్త్వ మేల

దయిత! నీ యధరామృతం బానఁగా లేని జిహ్వకు ఫలరససిద్ధి యేల  

ఆ. నీరజాతనయన! నీ వనమాలికా

గంధ మబ్బలేని ఘ్రాణ మేల

ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని

జన్మమేల యెన్ని జన్మములకు. 32

వ. అని యిట్లు రుక్మిణీ దేవి పుత్తెంచిన సందేశంబును, రూప సౌందర్యాతి విశేషంబు

లును, బ్రాహ్మణుండు హరికి విన్నవించి, కర్తవ్యం బెద్ది సేయ నవధరింపు మని,

సవరణగా ని ట్లనియె. 33

సీ. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారు లూరు

లరుణప్రభా మనోహరములు కరములు కంబుసౌందర్య మంగళము గళము

మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు చక్షు రుత్సవదాయి చన్నుదోయి

పరిహసి తార్ధేందు పటలంబు నిటలంబు జిత మత్తమధుకర శ్రేణి వేణి  

ఆ. భావజాశుగముల ప్రాపులు చూపులు

కుసుమశరుని వింటి కొమలు బొమలు

చిత్తతోషణములు చెలువభాషణములు

జలజనయనముఖము చంద్రసఖము. 34

ఉ. ఆ యెలనాఁగ నీకుఁ దగు నంగనకుం దగు దీవు మా యుపా

ధ్యాయుల యాన పెండ్లి యగుఁ దప్పదు జాడ్యము లేల నీవు నీ

తోయమువారుఁ గూడుకొని తోయరుహాననఁ దెత్తుగాని వి

చ్చేయుము శత్రులన్‌ నుఱుముసేయుము సేయుము శోభనం బిలన్‌. 35

వ. అని యిట్లు పలికిన బ్రాహ్మణునివలన విదర్భరాజతనయ పుత్తెంచిన సందేశం

బును, రూప సౌందర్యాది విశేషంబులును విని, యవధరించి, నిజకరంబున నతని

కరంబుఁ బట్టి నగుచు, న య్యాదవేంద్రుం డి ట్లనియె. 36

చ. కన్నియమీఁద నా తలఁపు గాఢము కూరుకురాదు రేయి నా

కెన్నఁడు నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడు నే

మున్నె యెఱుంగుదు\న్‌ బరులమూఁక లడంచి కుమారిఁ దెత్తు వి

ద్వన్నుత! మాను ద్రచ్చి నవవహ్నిశిఖ\న్‌ వడిఁ దెచ్చుకైవడిన్‌. 37

క. వచ్చెద విదర్భభూమికిఁ

జొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీల\న్‌

దెచ్చెద బాల\న్‌ వ్రేల్మిడి

వ్రచ్చెద నడ్డంబు రిపులువచ్చినఁ బోర\న్‌. 38

వ. అని పలికి రుక్మిణీదేవి పెండ్లి నక్షత్రంబు తెలిసి, తన పంపున రథ సారథి యైన

దారుకుండు శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకంబు లను తురంగంబులం గట్టి,

రథ మాయత్తంబు చేసి తెచ్చిన, నమోఘ మనోరథుం డైన హరి తానును,

బ్రాహ్మణుండును, రథారోహణంబు సేసి, యేకరాత్రంబున నానర్తక దేశం

బులు గడచి, విదర్భదేశంబునకుం జనియె. అందుఁ గుండిన పురీశ్వరుం డైన

భీష్మకుండు కొడుకునకు వశుం డై, కూఁతు శిశుపాలున కిత్తు నని తలంచి,

శోభనోద్యోగంబు సేయించె. అప్పుడు. 39

సీ. రచ్చలుఁ గ్రంతలు రాజమార్గంబులు విపణిదేశంబులు విశదములుగఁ

జేసిరి చందనసిక్త తోయంబులు గలయంగఁ జల్లిరి కలువడములు

రమణీయ వివిధతోరణములు గట్టిరి సకలగృహంబులుఁ జక్కఁజేసి

కర్పూర కుంకుమాగరు ధూపములు వెట్టి రతివలు పురుషులు నన్నియెడల  

ఆ. వివిధ వస్త్రములను వివిధ మాల్యాభర

ణాను లేపనముల నమరియుండి

రఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి

రుత్సవమున నగర మొప్పియుండె. 40

వ. అంత నా భీష్మకుండు విహిత ప్రకారంబులం బితృదేవతల నర్చించి, బ్రాహ్మణులకు

భోజనంబులు వెట్టించి, మంగళాశీర్వచనంబులు చదివించి, రుక్మిణీదేవి

నభిషిక్తం జేసి, వస్త్రయుగళ భూషితం గావించి, రత్నభూషణంబు లిడంజేసె.

ఋ గ్యజు స్సామ మంత్రంబుల మంగళాచారంబు లొనరించి, భూసురులు రక్షా

కరణంబు లాచరించిరి. పురోహితుండు గ్రహశాంతికొఱకు నిగమనిగదిత

న్యాయంబున హోమంబుఁ గావించె. మఱియు నా రాజు దంపతుల మేలు

కొఱకు తిల ధేను కలధౌత కనక చేలాది దానంబులు ధరణీ దేవతల కొసంగె.

అ య్యవసరంబున. 41

మ. భటసంఘంబులతో రథావళులతో భద్రేభ యూధంబుతోఁ

బటు వేగాన్విత ఘోటకవ్రజముతో బంధుప్రియ శ్రేణితోఁ

గటు సంరంభముతో విదర్భతనయం గైకొందు నంచున్‌ విశం

కటవృత్తిన్‌ జనుదెంచెఁ జైద్యుఁడు గడు\న్‌ గర్వించి య వ్వీటికి\న్‌. 42

ఉ. బంధులఁ గూడి గృష్ణ బలభద్రులు వచ్చినఁ బాఱఁదోలి ని

ర్మంధరవృత్తిఁ జైద్యునికి మానినిఁ గూర్చెద మంచు నుల్లసత్‌

సింధుర వీర వాజి రథ సేనలతోఁ జనుదెంచిరా జరా

సంధుఁడు దంతవక్త్రుఁడును సాల్వ విదూరథ పౌండ్రకాదులు\న్‌. 43

వ. మఱియు, నానాదేశంబుల రాజు లనేకు లేతెంచిరి. అందు శిశుపాలు నెదుర్కొని,

పూజించి, భీష్మకుం డొక్క నివేశంబున నతని విడియించె. అంతఁ దద్వృత్తాం

తంబు విని. 44

చ. హరి యొకఁ డేగినాఁడు మగధాదులు చైద్య హితానుసారు లై

నరపతు లెందఱేనిఁ జనినారు కుమారికఁ దెచ్చుచోట సం

గర మగుఁ దోడు గావలయుఁ గంసవిరోధికి నంచు వేగఁ దా

నరిగె హలాయుధుండు కమలాక్షునిఁ జాడ ననేకసేనతో\న్‌. 45

క. ఆలోపల నేకతమున

నాలోలవిశాలనయన యగు రుక్మిణి త

న్నా లోకలోచనుఁడు హరి

యాలోకము చేసి కదియఁడని శంకిత యై. 46

శా. లగ్నం బెల్లి వివాహముం గదిసె నేలా రాఁడు గోవిందుఁ డు

ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతము\న్‌ బ్రాహ్మణుం

డగ్నిద్యోతనుఁ డేటికిం దడసెనో యత్నంబు సిద్ధించునో

భగ్నం బై చనునో విరించి కృత మె బ్భంగి\న్‌ బ్రవర్తించునో! 47

మ. ఘనుఁడా భూసురుఁ డేఁగెనో నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో

విని కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో విచ్చేయునో యీశ్వరుం

డనుకూలింపఁ దలంచునో తలపఁడో యార్యా మహాదేవియు\న్‌

నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో నా భాగ్య మె ట్లున్నదో. 48

వ. అని వితర్కింపుచు. 49

ఉ. పోఁడను బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి వాసుదేవుఁడు\న్‌

రాఁడను నింకఁ బోయి హరి రమ్మని చీరెడి యిష్టబంధుఁడు\న్‌

లేఁ డను రుక్మికిం దగవు లే దిటఁ జైద్యున కిత్తు నంచు ను

న్నాఁ డను గౌరి కీశ్వరికి నావలనం గృప లేదు నేఁడను\న్‌. 50

ఉ. చెప్పదు తల్లికిం దలఁపుఁ జిక్కు దిశల్‌ దరహాస చంద్రిక\న్‌

గప్పదు వక్త్ర తామరస గంధసమాగత భృంగసంఘము\న్‌

రొప్పదు నిద్రఁ గైకొన దురోజ పరస్పరసక్త హారముల్‌

విప్పదు కృష్ణమార్గగత వీక్షణపంక్తులఁ ద్రిప్ప దెప్పుడు\న్‌. 51

చ. తుడువదు కన్నుల\న్‌ వెడలు తోయకణంబులు కొప్పుఁ జక్కఁగా

ముడువదు నెచ్చెలిం గదిసి ముచ్చటకుం జన దన్న మేమియు\న్‌

గుడువదు నీరము\న్‌ గొనదు కూరిమి కీరముఁ జేరి పద్యము\న్‌

నొడువదు వల్లకీగుణ వినోదము సేయదు డాయ దన్యులన్‌. 52

సీ. మృగనాభి యలఁదదు మృగరాజమధ్యమ జలకంబు లాడదు జలజగంధి

ముకురంబుఁ జూడదు ముకురసన్నిభముఖి పువ్వులు దుఱుమదు పువ్వుఁబోడి

వనకేళిఁగోరదు వనజాతలోచన హంసంబుఁ బెంపదు హంసగమన

లతలఁ బోషింపదు లతికా లలితదేహ తొడవులు దొడవదు తొడవుతొడవు  

ఆ. తిలక మిడదు నుదుటఁ దిలకినీతిలకంబు

గమల గృహముఁ జొరదు కమలహస్త

గారవించి తన్నుఁ గరుణఁ గైకొన వన

మాలి రాఁడు తగవుమాలి యనుచు. 53

వ. మఱియును. 54

మ. మలఁగు\న్‌ మెల్లనిగాలికిన్‌, బటు నట న్మత్త ద్విరేఫాళికి\న్‌

దలఁగు\న్‌, గోయలమ్రోఁత కై యలఁగు, నుద్యత్కీరసంభాషల\న్‌

గలఁగు\న్‌, వెన్నెలవేఁడికిన్‌ నలఁగు, మాకందాంకుర చ్ఛాయకున్‌

దొలఁగు\న్‌, గొమ్మ మనోభవానల శిఖా దోదూయమానాంగి యై. 55

వ. ఇట్లు హరిరాక కెదురుచూచుచు, సకల ప్రయోజనంబులయందును విరక్త యై,

మనోజానలంబునం బొగిలెడి మగువకు శుభంబు చెప్పు చందంబున వామోరు

లోచన భుజంబు లదరె. అంతఁ గృష్ణు నియోగంబున బ్రాహ్మణుండు సను

దెంచిన, నతని ముఖలక్షణం బుపలక్షించి, యా కలకంఠకంఠి మహోత్కంఠతోడ

నకుంఠిత యై, మొగంబునం జిఱునగవు నిగుడ, నెదురు సని నిలువంబడిన,

బ్రాహ్మణుం డి ట్లనియె. 56

ఉ. మెచ్చె భవద్గుణోన్నతి కమేయ ధనాదుల నిచ్చె నాకుఁ దా

వచ్చె సుదర్శనాయుధుఁడు వాఁడె సురాసురు లెల్ల నడ్డ మై

వచ్చిన నైన రాక్షసవివాహమున\న్‌ గొనిపోవు నిన్ను నీ

సచ్చరితంబు భాగ్యమును సర్వము నేఁడు ఫలించెఁ గన్యకా! 57

వ. అనిన వైదర్భి యి ట్లనియె. 58

మ. జలజాతేక్షుణుఁ దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి నన్‌

నిలువం బెట్టితి నీ కృపం బ్రతికితి\న్‌ నీయట్టి పుణ్యాత్మకుల్‌

గలరే దీనికి నీకుఁ బ్రత్యుపకృతి\న్‌ గావింపఁగానేర నం

జలి గావించెద భూసురాన్వయమణీ! సద్బంధు చింతామణీ! 59

వ. అని నమస్కరించె. అంత రామకృష్ణులు దన కూఁతు వివాహంబునకు వచ్చుట

విని, తూర్యఘోషంబులతో నెదుర్కొని, విధ్యుక్త ప్రకారంబునఁ బూజించి,

మధుపర్కంబు లిచ్చి, వివిధాంబరాభరణంబులు మొదలైన కానుక లొసంగి,

భీష్మకుండు బంధుజన సేనాసమేతు లైన వారలకుం దూర్ణంబున సకల సంప

త్పరిపూర్ణంబు లైన నివేశంబులు గల్పించి, విడియించె. ఇట్లు కూడిన రాజుల

కెల్లను వయో వీర్య బలవిత్తంబు లెట్లట్ల కోరిన పదార్థంబు లెల్ల నిప్పించి,

పూజించె. అంత విదర్భపురంబు ప్రజలు హరిరాక విని, వచ్చి చూచి, నేత్రాం

జలులం దదీయ వదనకమల మధుపానంబు సేయుచు. 60

మ. తగు నీ చక్రి విదర్భరాజసుతకు\న్‌ దథ్యంబు వైదర్భియుం

దగు నీ చక్రికి నింత మంచి దగునే దాంపత్య మీ యిద్దఱిం

దగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహతారాతి యై

మగఁ డౌఁ గావుతఁ జక్రి యీ రమణికి\న్‌ మా పుణ్య మూలంబున\న్‌. 61

వ. అని పలికిరి. ఆ సమయంబున. 62

సీ. సన్నద్ధులై బహు శస్త్ర సమేతులై బలసి చుట్టును వీరభటులు గొలువ

ముందఱ నుపహారములు కానుకలుఁ గొంచు వర్గంబు లై వారవనిత లేఁగఁ

బుష్ప గంధాంబర భూషణ కలిత లై పాడుచు భూసుర భార్య లరుగఁ

బణవ మర్దల శంఖ పటహ కాహళ వేణు భేరీ ధ్వనుల మిన్ను పిక్కటిలఁగఁ  

ఆ. దగిలి సఖులు గొలువఁ దల్లులు బాంధవ

సతులు దోడ రాఁగ సవినయమున

నగరువెడలి నడచె నగజాతకును మ్రొక్క

బాల చికుర పిహిత ఫాల యగుచు. 63

వ. మఱియు, సూత మాగధ వంది గాయక పాఠక జను లంతంత నభినందించుచుం

జనుదేర, మందగమనంబున ముకుంద చరణారవిందంబులు డెందంబునం దలం

చుచు, నిందుధరసుందరీ మందిరంబు చేరి, సలిల ధారా ధౌత చరణ కరారవింద

యై, వార్చి, శుచియై, గౌరీసమీపంబునకుం జనియె. అంత ముత్తైదువ లగు

భూసురోత్తముల భార్యలు భవసహిత యైన భవానికి మజ్జనంబు గావించి,

గంధాక్షతంబు లిడి, వస్త్ర మాల్యాది భూషణంబుల నలంకరించి, ధూప దీపంబు

లొసంగి, నానావిధోపహారంబులు సమర్పించి, కానుకలిచ్చి, దీపమాలికల

నివాళించి, రుక్మిణీదేవిని మ్రొక్కించిరి. అప్పుడు. 64

ఉ. నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశుల\న్‌

మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె

ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిసేయుమమ్మ! ని\న్‌

నమ్మిన వారి కెన్నఁటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ! 65

వ. అని గౌరీదేవికి మ్రొక్కి, పతులతోడం గూడిన బ్రాహ్మణభార్యలకు లవణా

పూపంబులును, దాంబూల కంఠసూత్రంబులును, ఫలంబులు, నిక్షుదండంబులు

నిచ్చి రుక్మిణీదేవి వారల\న్‌ బూజించిన. 66

ఆ. వార లుత్సహించి వలనొప్ప దీవించి

సేస లిడిరి యువతి శిరము నందు

సేస లెల్లఁ దాల్చి శివవల్లభకు మ్రొక్కి

మౌననియతి మాని మగువ వెడలె. 67

వ. ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెఱుంగు తెఱంగున,

మృగధరమండలంబు నిర్గమించి చరించు మృగంబు చందంబునఁ, గమలభవనర్తకుం

డెత్తిన జవనికమఱఁగు దెరలి పొడసూపిన మోహినీదేవత కైవడి, దేవ దానవ

సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాణ పన్నగేంద్ర పాశ పరివలయిత

పర్యాయ పరిభ్రాంత మందరాచల మంథాన మధ్యమాన ఘూర్ణిత ఘుమ

ఘుమాయిత మహార్ణవ మధ్యంబున నుండి చనుదెంచు నిందిరాసుందరీ వైభ

వంబున, బహువిధ ప్రభాభాసమాన యై, యిందుధరసుందరీ మందిరంబు వెడలి,

మానసకాసార హేమకమల కానన విహారమాణ మత్తమరాళంబు భంగి, మంద

గమనంబునఁ గనకకలశయుగళ సంకాశ కర్కశ పయోధర భార పరికంప్య

మాన మధ్య యై, రత్నముద్రికాలంకృతం బైన కెంగేల నొక్క సఖీలలామంబు

కైదండ గొని, రత్ననివహ సమంచిత కాంచన కర్ణపత్ర మయూఖంబులు

గండభాగంబుల నర్తనంబులు సలుప, నరవింద పరిమళ కుతూహలావతీర్ణ మత్త

మధుకరంబుల మాడ్కి నరాళంబు లైన కుంతలజాలంబులు ముఖమండలంబునఁ

గ్రందుకొన, సుందర మందహాస రోచులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబు

నావహింప, నధరబింబ ఫలారుణమరీచి మాలికలు వదన కుందకుట్మలంబుల కను

రాగంబు సంపాదింప, మనోజాతకేతన సన్నిభం బైన పయ్యెదకొంగు దూఁగ,

సువర్ణ మేఖలాఘటిత మణికిరణపటలంబు లకాల శక్రచాప జనకంబు లై మెఱయ,

జెఱకువిలుతుం డొఱవెఱికి, వాఁడియిడి, ఝళిపించిన ధగద్ధగాయమానంబు లగు

బాణంబులపగిది, సురుచిర విలోకననికరంబులు రాజవీరుల హృదయంబులు

భేదింప, శింజాన మంజు మంజీరనినదంబులు చెవులపండువులు సేయఁ, బాద

సంచారంబున హరి రాక కెదురుసూచుచు, వీర మోహిని

యై చనుదెంచుచున్న సమయంబున. 68

మ. అళినీలాలకఁ బూర్ణచంద్రముఖి నేణాక్షిం బ్రవాళాధర\న్‌

గలకంఠి\న్‌ నవపల్లవాంఘ్రియుగళన్‌ గంధేభకుంభస్తని\న్‌

బులినశ్రోణి నిభేంద్రయాన నరుణాంభోజాతహస్త\న్‌ మహో

త్పలగంధి\న్‌ మృగరాజమధ్యఁ గని విభ్రాంతాత్ములై రందఱు\న్‌. 69

వ. మఱియు, న య్యింతి దరహాస లజ్జావలోకనంబులఁ జిత్తంబు లేమఱి, ధైర్యం

బులు దిగనాడి, గాంభీర్యంబులు విడిచి, గౌరవంబులు మఱచి, చేష్టలు మాని,

యెఱుక లుడిగి, యాయుధంబులు దిగవైచి, గజ తురగ రథారోహణంబులు

సేయనేరక, రాజు లెల్ల నేలకు వ్రాలిరి. ఆ యేణీలోచన తన వామకర

నఖంబుల నలకంబులు దలఁగం ద్రోయుచు, నుత్తరీయంబు చక్కనొత్తుచుఁ,

గడకంటి చూపులం గ్రమంబున నా రాజలోకంబు నాలోకింపుచు. 70

చ. కనియె\న్‌ రుక్మిణి చంద్రమండల ముఖుం గంఠీరవేంద్రావల

గ్ను నవాంభోజదళాక్షుఁ జారుతర వక్షున్‌ మేఘసంకాశ దే

హు నగారాతి గజేంద్రహస్త నిభ బాహుం జక్రిఁ బీతాంబరు\న్‌

ఘన భూషాన్వితుఁ గంబుకంఠు విజయోత్కంఠు\న్‌ జగన్మోహనున్‌. 71

వ. కని తదీయ రూప వయో లావణ్య వైభవ చాతుర్య తేజోవిశేషంబు

లకు సంతసించి, మనోభవ శరాక్రాంత యై, రథారోహణంబు గోరుచున్న

వరారోహం జూచి, పరిపంథి రాజలోకంబులు సూచుచుండ, మందగమనంబున

గంధసింధురంబులీలఁ జనుదెంచి, ఫేరవంబుల నడిమిభాగంబు గొని చను

కంఠీరవంబు కైవడి, నిఖిల భూపాలగణంబుల గణింపక, తృణీకరించి, రాజకన్యకం

దెచ్చి, హరి తన రథంబుమీఁద నిడుకొని, భూ నభోంతరాళంబులు నిండ,

శంఖంబు పూరించుచు, బలభద్రుండు తోడ నడవ, యాదవ వాహినీ పరివృతుం

డై, ద్వారకానగర మార్గంబు వట్టి చనియె. అంత జరాసంధ వశు లైన రాజు

లందఱు హరి పరాక్రమంబు విని సహింపనోపక. 72

మ. ఘన సింహంబుల కీర్తి నీచమృగముల్‌ గైకొన్న చందంబున\న్‌

మన కీర్తుల్‌ గొని బాలఁ దోడ్కొనుచు నున్మాదంబుతో గోపకుల్‌

సనుచున్నా రదె శౌర్య మెన్నఁటికి మీ శస్త్రాస్త్రముల్‌ గాల్పనే

తనుమధ్యన్‌ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్‌ గ్రంతల\న్‌. 73

వ. అని యొండొరులఁ దెల్పుకొని, రోషంబులు హృదయంబుల నిల్పుకొని,

సంరంభించి, తనుత్రాణంబుల వహియించి, ధనురాది సాధనంబులు ధరియించి,

పంతంబు లాడి, తమతమ చతురంగబలంబులం గూడి, జరాసంధాదులు యదు

వీరులవెంట నంటందాఁకి, నిలు నిలుండని ధిక్కరించి పలికి యుక్కుమిగిలి,

మహీధరంబులమీఁద సలిలధారలు గురియు ధారాధరంబుల చందంబున, బాణ

వర్షంబులు గురిసిన, యాదవసేనలం గల దండనాధులు కోదండంబు లెక్కిడి,

గుణంబులు మ్రోయించి, నిలువంబడిరి. అప్పుడు. 74

క. అరి బలభట సాయకముల

హరిబలములు గప్పఁబడిన నడరెడి భీతి\న్‌

హరిమధ్య సిగ్గుతోడను

హరివదనముఁ జూచెఁ జకితహరిణేక్షణ యై. 75

వ. ఇట్లుచూచిన. 76

క. వచ్చెద రదె యదువీరులు

వ్రచ్చెద రరిసేన లెల్ల వైరులు పెలుచన్‌

నొచ్చెదరును విచ్చెదరును

జచ్చెదరును నేఁడు చూడు జలజాతాక్షీ! 77

వ. అని రుక్మిణీదేవిని హరి యూఱడించె. అంత బలభద్రప్రముఖు లైన యదు

వీరులు ప్రళయవేళ మిన్నునం బన్నిన బలిపిడుగుల నడరించు పెను మొగుళ్ళ

వడువున, జరాసంధాది పరిపంథి రాజ చక్రంబుమీఁద నవక్ర పరాక్రమంబున

శిఖిశిఖా సంకాశ నిశిత శిలీముఖ నారాచ భల్ల ప్రముఖంబు లైన బహువిధ

బాణపరంపరలు గురియ, నదియును విదళిత మత్త మాతంగంబును, విచ్ఛిన్న

తురంగంబును, విభిన్న రథవరూథంబును, వినిహిత పదాతియూధంబును,

విఖండిత వాహ వారణ రథారోహ మస్తకంబును, విశకలిత వక్షో మధ్య కర్ణ

కంఠ కపోల హస్తంబును, విస్ఫోటిత కపాలంబును, వికీర్ణ కేశజాలంబును,

విపాటిత చరణ జాను జంఘంబును, విదళిత దంతసంఘంబును, విఘటిత వీర

మంజీర కేయూరంబును, విభ్రష్ట కుండల కిరీట హారంబును, విశ్రుత వీరాలాపం

బును, విదార్యమాణ గదా కుంత తోమర పరశు పట్టిస ప్రాస కరవాల శూల

చక్ర చాపంబును, వినిపాతిత కేతన చామర చ్ఛత్రంబును, విలూన తనుత్రాణం

బును, వికీర్యమాణ ఘోటకసంఘ రింఖా సముద్ధూత ధరణీపరాగంబును, వినష్ట

రథవేగంబును, వినివారిత సూత మాగధ వంది నాదంబును, వికుంఠిత హయ

హేషా పటహ భాంకార, కరటిఘటా ఘీంకార, రథనేమి ఫటాత్కార, తురగ

నాభిఘంటా ఘణఘణాత్కార, వీర హుంకార, భూషణ ఝణఝణాత్కార,

నిస్సాణ ధణధణాత్కార, మణినూపుర క్రేంకార, కింకిణీ కిణకిణాత్కార,

శింజినీ టంకార, భట పరస్పర ధిక్కార నాదంబును, వినిర్భిద్యమాన రాజ

సమూహంబును, విద్యమాన రక్తప్రవాహంబును, విశ్రూయమాణ భూత బేతాళ

కలకలంబును, విజృంభమాణ ఫేరవ కాక కంకాది సంకులంబును, బ్రచలిత

కబంధంబును, బ్రభూర పలలగంధంబును, బ్రదీపిత మేదో మాంస రుధిర ఖాదం

బును, బ్రవర్తిత డాకినీ ప్రమోదంబును నై యుండె. అప్పుడు. 78

చ. మగిడి చలించి పాఱుచును మాగధముఖ్యులు గూడి యొక్కచో

వగచుచు నాలిఁ గోల్పడిన వానిక్రియ\న్‌ గడు వెచ్చ నూర్చుచున్‌

మొగమునఁ దప్పి దేఱఁ దమ ముందఱఁ బొక్కుచు నున్న చైద్యుతోఁ

బగతుర చేతిలోఁ బడక ప్రాణముతోడుత నున్నవాఁడవే. 79

ఆ. బ్రతుక వచ్చు నొడలఁ బ్రాణంబు లుండిన

బ్రతుకు గలిగెనేని భార్య గలదు

బ్రతికి తీవు భార్యపట్టు దైవ మెఱుంగు

వగవవలదు చైద్య! వలదు వలదు. 80

వ. వినుము. దేహధారి స్వతంత్రుఁడు గాడు. జంత్రగానిచేతి జంత్రపుబొమ్మ కైవడి

నీశ్వరతంత్ర పరాధీనుం డై, సుఖదుఃఖంబులందు నర్తనంబులు సలుపు. తొల్లి

నేను మధురాపురంబుమీఁదఁ బదియేడుమాఱులు పరాక్రమంబున\న్‌ విడిసి, యా

సప్తదశవారంబులును జక్రిచేత నిర్మూలిత బలచక్రుండ నై, కామపాలుచేతం బట్టువడి,

యీ కృష్ణుండు కరుణతో విడిపించి పుచ్చిన వచ్చి, క్రమ్మఱ నిఱువదిమూ డక్షౌహిణులం

గూడుకొని, పదునెనిమిదవమాఱు దాడిచేసి, శత్రువులం దోలి, విజయంబుఁ జేకొంటిని.

ఇట్టి జయాపజయంబులందు హర్షశోకంబుల నెన్నండును జెంద. నేఁటి దినంబున

నీ కృష్ణుని కెదిరిపోర మనరాజలోకంబు లెల్ల నుగ్రాక్షుం గూడుకొని, యెదిరి

పోరిన నోడుదుము. ఇంతియ కాక దైవయుక్తం బైన కాలంబునం జేసి, లోకంబులు

పరిభ్రమించుచునుండు. అదియునుం గాక. 81

మ. తమకుం గాలము మంచి దైన మనలం ద్రైలోక్య విఖ్యాత వి

క్రములం గెల్చిరి యాదవుల్‌ హరి భుజాగర్వంబునన్‌ నేఁడు కా

లము మేలై చనుదెంచె నేని మనము\న్‌ లక్షించి విద్వేషుల\న్‌

సమరక్షోణి జయింత మింత పనికై శంకింప నీ కేటికిన్‌. 82

వ. అని ఇట్లు జరాసంధుండును, అతని యొద్ది రాజులును, శిశుపాలుని పరితాపంబు

నివారించి, తమతమ భూములకుం జనిరి. శిశుపాలుండు ననుచర సేనాసమేతుం

డై, తన నగరంబునకుం జనియె, నంత రుక్మి యనువాఁడు కృష్ణుండు రాక్షస

వివాహంబునం దన చెలియలిం గొనిపోవుటకు సహింపక, యేకాక్షౌహిణీ

బలంబుతోడ సమరసన్నాహంబునం గృష్ణుని వెనుదగిలి పోవుచుఁ, దన సారథితో

ని ట్లనియె. 83

ఉ. బల్లిదు నన్ను భీష్మజనపాల కుమారునిఁ జిన్న జేసి నా

చెల్లెలి రుక్మిణిం గొనుచుఁ జిక్కక నిక్కపు బంటువోలె నీ

గొల్లఁడు వోయెడి\న్‌ రథము గూడఁగఁదోలుము తేజితోల్లసత్‌

భల్లపరంపరన్‌ మదముఁ బాపెదఁ జూపెద నా ప్రతాపమున్‌. 84

వ. అని ఇట్లు రుక్మి హరి కొలంది యెఱుంగక సారథి నదలించి, రథముఁ గూడ

దోలించి, "గోపాలక! వెన్నమ్రుచ్చ! నిమిషమాత్రంబు నిలు నిలు" మని తిరస్క

రించి, బలువింట నారి సైరించి, మూఁడు వాఁడితూపుల హరి నొప్పించి,

యి ట్లనియె. 85

సీ. మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ నేపాటి గలవాఁడ వేది వంశ

మెందు జన్మించితి వెక్కడఁ బెరిఁగితి వెయ్యది నడవడి యెవ్వఁ డెఱుఁగు

మానహీనుఁడ వీవు మర్యాద లెఱుఁగవు మాయఁ గైకొనికాని మలయరావు

నిజరూపమున శత్రునివహంబు పైఁ బోవు వసుధేశుఁడవు గావు వావి లేదు  

ఆ. కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు

విడువు విడువవేని విలయకాల

శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల

గర్వమెల్లఁ గొందుఁ గలహమందు. 86

వ. అని పలికిన, నగధరుండు నగి, యొక్క బాణంబున వాని కోదండంబు ఖండించి,

యాఱుశరంబుల శరీరంబు దూఱనేసి, యెనిమిది విశిఖంబుల రథ్యంబులం గూల్చి,

రెం డమ్ముల సారథిం జంపి, మూఁడు వాఁడితూపులం గేతనంబు ద్రుంచి,

మఱియు నొక్క వి ల్లందినం ద్రుంచి, వెండియు, నొక్కధనువు వట్టిన విదళించి,

క్రమంబున పరిఘ పట్టిస శూల చర్మాసి శక్తి తోమరంబులు ధరియించినం,

దునుకలు సేసి, క్రమ్మఱ నాయుధంబు లెన్ని యెత్తిన నన్నియు శకలంబులు

గావించె. అంతటం దనివి సనక వాఁడు రథంబు డిగ్గి, ఖడ్గహస్తుం డై, దవాన

లంబు పైఁ బడు మిడుతచందంబునం గదిసిన, ఖడ్గకవచంబులు చూర్ణంబులు

చేసి, సహింపక మెఱుంగులు చెదర నడిదంబు వెఱికి ఝళిపించి, వాని శిరంబుఁ

దెగవ్రేయుదు నని, గమకించి, నడచుచున్న, నడ్డంబువచ్చి, రుక్మిణీదేవి హరి

చరణారవిందంబులు పట్టుకొని, యి ట్లనియె. 87

మత్తకోకిల. నిన్ను నీశ్వరు దేవదేవుని నిర్ణయింపఁగ లేక యో

సన్నుతామల కీర్తిశోభిత! సర్వలోక శరణ్య! మా

యన్న యీతఁడు నేఁడు చేసె మహాపరాధము నీయెడ\న్‌

నన్ను మన్నన చేసి కావు మనాథనాథ! దయానిధీ! 88

మత్తకోకిల. కల్ల లేదని విన్నవించుటకాదు వల్లభ! యీతని\న్‌

బ్రల్లదుం దెగఁజూచి తేనియు భాగ్యవంతుల మైతి మే

మల్లుఁ డయ్యె ముకుందుఁ డీశ్వరుఁ డంచు మోదితు లైన మా

తల్లిదండ్రులు పుత్రశోకముఁదాల్చి చిక్కుదు రీశ్వరా! 89

మ. అని డగ్గుత్తికతో మహాభయముతో నాకంపితాంగంబుతో

వినత శ్రాంత ముఖంబుతో శ్రుతిచల ద్వేణీ కలాపంబుతోఁ

గనుదోయి\న్‌ జడిగొన్న బాష్పములతోఁ గన్యాలలామంబు మ్రొ

క్కిన రుక్మిం దెగవ్రేయఁ బోక మగిడె\న్‌ గృష్ణుండు రోచిష్ణుఁ డై. 90

వ. ఇట్లు చంపక, బావా! రమ్మని చిఱునగవు నగుచు, వానిం బట్టి బంధించి,

గడ్డంబును, మీసంబునుం, దలయును నొక కత్తివాతి యమ్మున రేవులువాఱఁ

గొఱిగి, విరూపిం జేసె. అంతట యదువీరులు పర సైన్యంబులం బాఱఁదోలి,

తత్సమీపంబునకు వచ్చిరి. అప్పుడు హతప్రాయుం డై, కట్టువడియున్న రుక్మిం

జూచి, కరుణచేసి, బలభద్రుండు వాని బంధంబులు విడిచి, హరిని డగ్గఱి, యి ట్లనియె. 91

క. తల మనక భీష్మనందను

తలయును మూతియును గొఱుగఁ దగవే! బంధుం

దలయును మూతియుఁ గొఱుగుట

తల దఱుగుటకంటెఁ దుచ్ఛతరము మహాత్మా! 92

క. కొందఱు రిపు లని కీడును

గొందఱు హితు లంచు మేలు గూర్పవు నిజ మీ

వందఱియందును సముఁడవు

పొందఁగ నేలయ్య! విషమబుద్ధి ననంతా! 93

వ. అని వితర్కించి పలికి, రుక్మిణీదేవి నుపలక్షించి యి ట్లనియె. 94

శా. తోడంబుట్టినవాని భంగమునకు\న్‌ దుఃఖించి మా కృష్ణు నె

గ్గాడం జూడకుమమ్మ! పూర్వభవ కర్మాధీన మై ప్రాణుల\న్‌

గీడు\న్‌ మేలును జెందు లేఁ డొకఁడు శిక్షింపంగ రక్షింప నీ

తోడంబుట్టువు కర్మశేష పరిభూతుం డయ్యె నేఁ డి య్యెడ\న్‌. 95

క. చంపెడిదోషము గలిగినఁ

జంపఁజనదు బంధుజనులఁ జను విడువంగాఁ

జంపిన దోషము సిద్ధము

చంపను మఱి యేల మున్న చచ్చినవాని\న్‌. 96

ఆ. బ్రహ్మచేత భూమిపతుల కీ ధర్మంబు

కల్పితంబు రాజ్యకాంక్షఁ జేసి

తోడిచూలు నైనఁ దోడబుట్టినవాఁడు

చంపుచుండుఁ గ్రూరచరితుఁ డగుచు. 97

క. భూమికి ధనధాన్యములకు

భామలకును మానములకుఁ భ్రాభవములకుం

గామించి మీఁదు గానక

శ్రీమదమున మానధనులు చెనకుదు రొరుల\న్‌. 98

వ. వినుము. దైవమాయంజేసి, దేహాభిమాను లైన మానవులకు\న్‌ బగవాఁడు, బంధుడు,

నుదాసీనుండు నను భేదంబు మోహంబు సిద్ధం బై యుండు. జలాదులయందుఁ

జంద్రసూర్యాదులును, ఘటాదులయందు గగనంబును, బెక్కులై కానంబడు భంగి,

దేహధారుల కందఱికి నాత్మ యొక్కం డయ్యును, బెక్కం డ్రై తోఁచు.

ఆద్యంతంబులు గల యీ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకం బై, యాత్మ

యందు నవిద్యచేతఁ గల్పితం బై, దేహిని సంసారంబునం ద్రిప్పు. సూర్యుండు

తటస్థుం డై యుండ, బ్రకాశమానంబు లైన దృష్టిరూపంబులఁ బోలె నాత్మ

తటస్థుం డై యుండ, దేహేంద్రియంబులు ప్రకాశమానంబు లగును. ఆత్మకు

వేఱొక్కటితోడ సంయోగవియోగంబులు లేవు. వృద్ధిక్షయంబులు చంద్ర

కళలకుం గాని, చంద్రునికి లేనికైవడి, జన్మనాశంబులు దేహంబునకుఁ గాని,

యాత్మకుఁ గలుగనేరవు. నిద్రవోయినవాఁ డాత్మను విషయఫలానుభవంబులు

సేవించు తెఱంగున, నెఱుకలేనివాఁడు నిజముగాని యర్థమునందు ననుభవంబు

నొందుచుండుఁ గావున. 99

క. అజ్ఞానజ మగు శోకము

విజ్ఞాన విలోకనమున విడువుము నీకుం

బ్రజ్ఞావతికిం దగునే

యజ్ఞానుల భంగి వగవ నంభోజముఖీ! 100

వ. ఇట్లు బలభద్రునిచేతఁ దెలుపంబడి, రుక్మిణీదేవి దుఃఖంబు మాని యుండె. అట

రుక్మి యనువాఁడు ప్రాణావశిష్టుం డై, విడువఁబడి, తన విరూప భావంబునకు

నెరియుచు, హరిం గెల్చి కాని కుండినపురంబుఁ జొర నని ప్రతిజ్ఞ సేసి, తత్సమీ

పంబున నుండె. ఇ వ్విధంబున. 101

క. రాజీవలోచనుఁడు హరి

రాజసమూహములఁ గెల్చి రాజస మొప్ప\న్‌

రాజిత యగు తనపురికిని

రాజాననఁ దెచ్చె బంధురాజి నుతింప\న్‌. 102

వ. అంత న య్యాదవేంద్రుని నగరంబు సమారబ్ధ వివాహకృత్యంబును, బ్రవర్తమాన

గీత వాద్య నృత్యంబును, బ్రతిగృహాలంకృత విలసితాశేష నర నారీవర్గంబును,

బరిణయ మహోత్సవ సమాహూయమాన మహీపాల గజఘటా గండమండల

దానసలిలధారా సిక్త రాజమార్గంబును, బ్రతిద్వార మంగళాచార సంఘటిత క్రముక

కదళికా కర్పూర కుంకుమాగరు ధూప దీప పరిపూర్ణ కుంభంబును, విభూషిత

సకల గృహవేదికా కవాట దేహళీస్తంభంబును, విచిత్ర కుసుమాంబర రత్నతోరణ

విరాజితంబును, సముద్ధూత కేతన విభ్రాజితంబును నై యుండె. అ య్యవసరంబున. 103

మ. ధ్రువకీర్తి\న్‌ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణి\న్‌ మాన వై

భవ గాంభీర్య విహారిణి\న్‌ నిఖిల సంపత్కారిణి\న్‌ సాధు బాం

ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి\న్‌

సువిభూషాంబర ధారిణి\న్‌ గుణవతీ చూడామణి\న్‌ రుక్మిణి\న్‌. 104

క. సతులుం దారును బౌరులు

హితమతిఁ గానుకలు దెచ్చి యిచ్చిరి కరుణో

న్నత వర్ధిష్ణులకును మా

నిత రోచిష్ణులకు రుక్మిణీకృష్ణులకు\న్‌. 105

క. హరిపెండ్లికిఁ గైకేయక

కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్‌

పరమానందముఁ బొందిరి

ధరణిలోన గాఢ తాత్పర్యముల\న్‌. 106

క. హరి యీ తెఱఁగున రుక్మిణి

నరుదుగఁ గొనివచ్చి పెండ్లి యాడుట విని దు

ష్కరకృత్య మనుచు వెఱఁ గం

దిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్ల\న్‌. 107

ఆ. అనఘ! యాదిలక్ష్మి యైన రుక్మిణితోడఁ

గ్రీడ సలుపుచున్న కృష్ణుఁ జూచి

పట్టణంబులోని ప్రజ లుల్లసిల్లిరి

ప్రీతు లగుచు ముక్త భీతు లగుచు. 108

వ. అని చెప్పి. 109

క. కువలయ రక్షాతత్పర!

కువలయదళ నీలవర్ణ కోమలదేహా!

కువలయనాథ శిరోమణి!

కువలయజన వినుత విమలగుణ సంఘాతా! 110

మాలిని. సరసిజనిభ హస్తా! సర్వలోక ప్రశస్తా!

నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢ కీర్తీ!

పరహృదయ విదారీ! భక్త లోకోపకారీ!

గురు బుధజన తోషీ! ఘోర దైతేయ శోషీ! 111

గద్య. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రి పుత్ర సహజ

పాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీ మహాభాగవతం బను మహా

పురాణమునంబు రుక్మిణీ జన్మంబును, రుక్మిణీ సందేశంబును, వాసుదేవా

గమనంబును, రుక్మిణీగ్రహణంబును, రాజలోక పలాయనంబును, రుక్మియను

వాని భంగంబును, రుక్మిణీకల్యాణంబును, నను కథలుగల దశమస్కంధంబునందుఁ

బూర్వభాగము సంపూర్ణము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!