తెలుగు పత్రికలు : మహిళా సంపాదకులు....- రచన : - డా. శిరీష ఈడ్పుగంటి.

తెలుగు పత్రికలు : మహిళా సంపాదకులు....- రచన :  - డా. శిరీష ఈడ్పుగంటి.

తెలుగులో పత్రిక అనేది ఆధునిక సాహిత్య ప్రక్రియల వలె పాశ్చాత్య ప్రభావంతో వచ్చిన సారస్వత ప్రక్రియ. పత్రిక అనే పేరు పత్రం నుండి వచ్చింది. శబ్దరత్నాకర నిఘంటువులో పత్రికకు అర్థం "వ్యవహారము యొక్క చెల్లుబడికై యొకరొకరు వ్రాసికొనెడి పత్రము” అని ఉంది. పత్రం అనే ఆరోపం దగ్గర "వ్యవహారము యొక్క చెల్లుబడికై యొకరొకరు వ్రాసికొనెడి ఆకు”అని ఇచ్చారు. అదనంగా వార్తాపత్రిక అనే అర్థం కూడా ఇచ్చారు. తరువాత యాభైసంవత్సరాలకు వెలువడ్డ సూర్యరాయాంధ్ర నిఘంటువులో కూడా పత్రిక అంటే "వ్రాతకు ఆధారమగు తాటియాకు, కాగితము, వ్యవహారమున పరస్పరము వ్రాసికొనెడి పత్ర,ము అని వివరణ ఉంది. ’లేఖ అనే అర్థంలో పత్రిక అనేపదం మొట్టమొదటసారి ప్రభావతీప్రద్యుమ్నములో కనబడింది. ప్రభావతి పంపిన పత్రిక తీసుకుని శుచిముఖి ప్రద్యుమ్నుడికి చేర్చే సందర్భంలో తెలుస్తుంది’ (రామచంద్ర 1989:1). మద్రాసులో తెలుగు ముద్రాక్షరశాలలు వచ్చిన తర్వాత పత్రికలు రావడం మొదలైంది. ఆ రోజులలో తాళపత్ర గ్రంథాల సేకరణ, ప్రచురణలు ఒక్కసారిగా మొదలైనాయి. ఆనాటి పత్రికలు సహజంగానే భాషా, సాహిత్య, సాంస్కృతిక విషయాలకు పెద్దపీఠ వేశాయి. 


తొలి తెలుగువార్తాపత్రిక

భారతదేశంలో వచ్చిన తొలిపత్రిక ’దిగ్దర్శన్’1818 సంవత్సరంలో వెలువడింది. ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాలకు తెలుగులో తొలిపత్రిక వచ్చింది. తొలిపత్రిక ఏది అనే విషయంలో మాత్రం చాలామంది చాలా అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఆరుద్రగారి అభిప్రాయం ప్రకారం’తెలుగు జర్నల్(1831), డా.జి.ఎన్.రెడ్డిగారు ’కర్నాటిక్ క్రానికల్’(1832), డా. వి. సిమ్మన్నగారు ’పోర్టుసెయింట్ జార్జిగెజిట్’(1832), తెలుగుపత్రిక చరిత్రను చెప్పినవారంతా ’సత్యదూత’(1835), ఎక్కువ ఆధారాలతో లభించిన పత్రిక ’వృత్తాంతి’(1838). ఈ వృత్తాంతి పత్రికకు మండిగల వెంకట్రాయశాస్త్రిగారు సంపాదకత్వం వహించారు. దీనిలో ప్రచురించిన జాబులను బ్రౌన్ సేకరించినట్లుగా తెలుస్తుంది. గిడుగు రామమూర్తిపంతులుగారు ఈ పత్రికలోని లేఖను తన గద్యచింతామణిలో ఉదహరించారు. తర్వాత చాలాపత్రికలు వచ్చాయి. భాష, సాహిత్యం, ఇతర విషయాలకు సంబంధించినవన్నీ ఈ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. తొలితరం పత్రికలన్నీ కూడా స్వాతంత్ర్యోద్యమంలో ఉద్యమకారుని పాత్రను పోషించాయి. జాతీయ ప్రయోజనాలకు బాసటగా నిలిచాయి.


స్త్రీలకోసం నడిచిన తొలి తెలుగుపత్రిక 

తెలుగులో స్త్రీల కోసం నడిచిన తొలిపత్రిక ఏది అనే విషయంలో కూడా చాలా భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే స్త్రీల కోసం ప్రత్యేకంగా పత్రికలు నడపాల్సిన అవసరముందనే విషయాన్ని గుర్తించింది మాత్రం కందుకూరి వీరేశలింగంపంతులుగారు. ఈయన స్త్రీల కోసం స్థాపించిన సతీహితబోధిని పత్రికే మొదటి పత్రికగా చెప్పవచ్చు. ఇందులో స్త్రీవిద్య, ఆరోగ్యం, నీతిసూత్రాలు, భార్యగా స్త్రీ విద్యుక్తధర్మాలు మొదలైన వాటిపై వ్యాసాలు వచ్చేవి. అయితే కందుకూరివారికి స్త్రీల పట్ల గొప్ప భావాలేమి ఉండేవికావు. కేవలం స్త్రీని ఆదర్శగృహిణిగా నిలపడం గొప్ప సంస్కరణగా భావించారు. వీరి తర్వాత రాయసం వెంకటశివుడుగారి సంపాదకత్వంలో ’తెలుగు జనానా’(1893) పత్రిక వెలువడింది. ఈ పత్రికలో స్త్రీలకోసం పద్యాలు, పాటలు ప్రచురించేవారు. తదనంతరం ఎస్. సీతారామయ్యగారు ’హిందూసుందరి’(1902) పత్రికను కేవలం స్త్రీలకోసం ప్రారంభించారు. ఇందులో స్త్రీవిద్య, బాల్యవివాహాలు, స్త్రీల సంఘాల ఆవశ్యకత మొదలైన భిన్న అంశాల మీద వ్యాసాలు ప్రచురించారు. అంతేగాకుండా స్త్రీల కోసం నడిచే పత్రికలకు స్త్రీలే సంపాదకత్వం వహించాలని కోరుకున్నారు. స్త్రీల సంపాదకత్వంలో ఈ పత్రికలు మరింత విజయవంతం కాగలవని ఆశించారు. చివరికి వీరి కోరిక నెరవేరింది. వీరు ప్రారంభించిన ’హిందూసుందరి’(1902) పత్రికకే స్త్రీలు సంపాదకత్వం వహించారు. ఈ పత్రికే స్త్రీల సంపాదకత్వంలో వచ్చిన మొదటి పత్రిక అని చెప్పుకోవచ్చు.


మహిళా సంపాదకులు 

స్వాతంత్ర్యానికి పూర్వమే స్త్రీల సంపాదకత్వంలో పత్రికలు వెలువడ్డాయి. ఇవన్నీకూడా స్త్రీవిద్య, తద్వారా స్త్రీ చైతన్యానికి తోడ్పడిన పత్రికలే. ఆరోజులలో విద్యావంతులైన కొంతమంది స్త్రీలు సాటి స్త్రీలలో చైతన్యాన్ని కలిగించేందుకు స్వయంగా పత్రికలు స్థాపించి సంపాదకత్వం వహించారు.


హిందూసుందరి (1902)

ఈ పత్రికకు మొసలికంటి రమాబాయమ్మ, వెంపటి శాంతాబాయమ్మగార్లు సంపాదకత్వం వహించారు. తెలుగులో మొట్టమొదటి మహిళాసంపాదకులు వీరే. ఈ పత్రికలో స్త్రీలు రాసిన వ్యాసాలు, కథలు, ఉపన్యాసాలు, ఇతర రచనలు ప్రచురించబడేవి. తెలుగుసాహిత్యంలో తొలికథారచయిత్రి భండారు అచ్చమాంబ రాసిన కథ ’ధనత్రయోదశి’ఈ పత్రికలోనే ప్రచురించబడింది. స్త్రీని చైతన్యవంతురాలిగా, భర్తకి మార్గదర్శకురాలిగా చూపించిన కథ ఇది. అంతేగాకుండా స్త్రీవిద్య, ప్రేమపరీక్ష, ఎరువుసొమ్ము బరువుచేటు, బీదకుటుంబం మొదలైన అచ్చమాంబగారి ఎన్నో రచనలు ఈ పత్రికలో వచ్చాయి. అచ్చమాంబగారు చిన్నప్పుడు సోదరుడు చదువుకుంటుండగా విని వివిధ భాషలు కూడా నేర్చుకున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో ఈ పత్రిక స్త్రీల సంపాదకత్వంలో నడవడటం అనేది పెద్ద సంచలనాన్ని సృష్టించింది.


సావిత్రి (1910)

ఈ పత్రికను పులుగుర్త లక్ష్మీనరసమాంబగారు కాకినాడ నుండి సంపాదకత్వం వహించారు. ఈమె గొప్పవక్త. హిందీ, బెంగాలీ భాషలలో పాండిత్యం కలదు. స్త్రీలకూ విద్య అవసరం అని తన పత్రిక ద్వారా ప్రచారం చేసేవారు. ఈ పత్రికలో కూడా భండారు అచ్చమాంబ రాసిన అబలా సచ్చరిత్ర రత్నమాల రచన ప్రచురింపబడేది. ఇది తెలుగులో తొలి స్త్రీల చరిత్ర.


అనసూయ (1914)

కాకినాడ నుంచి వింజమూరి వెంకటరత్నమ్మగారు అనసూయ పేరుతో పత్రిక నడిపారు. మహిళా ఉద్యమాలకు ఈ పత్రిక ఎంతగానో తోడ్పడింది. స్త్రీలకు, బాలికలకు ఉపయోగపడే రచనలు ప్రచురించేవారు. గృహనిర్వహణ, ప్రకృతిశాస్త్రాలు, పురాణస్త్రీల చరిత్రలు, వివిధ రంగాలలో వన్నెకెక్కిన ప్రపంచ ప్రసిద్ధ మహిళల చరిత్రలు మొదలైన అంశాలకు సంబంధించిన విషయాల గూర్చి ఈ పత్రికలో ప్రచురించేవారు. ఈ పత్రిక తొలిసంచిక అభ్యుదయభావాలకు నాంది అని చెప్పవచ్చు. స్త్రీవిద్య, సమాజంలో ఆనాడు ఉన్న సంఘ దురాచారాల పైన వచ్చిన పత్రిక. అంతేగాకుండా హిందూసుందరి పత్రికకు అనసూయ పత్రికకు మధ్య పత్రికలు సావిత్రి, జననా, గృహలక్ష్మి (పురుష సంపాదకత్వం), ఈ మూడు కొంతకాలం నడిచాయి. ఇవికూడా స్త్రీలకు సంబంధించిన వాటిపై పత్రికలలో ప్రచురించేవి. కాని ఇవి కొంతకాలం మాత్రమే నడిచాయి. అనసూయ పత్రిక వచ్చేనాటికి ఈ పత్రికలు లేవు. కేవలం హిందూసుందరి పత్రిక మాత్రమే ఉంది. అనసూయ సంచికలలో "స్త్రీలు ఎచట ఉంటారో అచట దేవతలుంటారని, స్త్రీలు పురుషులతో అన్నింటా సమానమేననే భావాన్ని వ్యక్తం చేసేవారు. ఆరోజులలో సంపాదకులు ఈ భావాన్ని వ్యక్తం చేయగలగడం సాహసమే. ఒకరకంగా చెప్పాలంటే ఆరోజులలో స్త్రీని మేల్కొలిపిన పత్రిక అని చెప్పవచ్చు. 


సౌందర్యవల్లి (1918)

గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి భార్య రమాబాయిగారు ఈ పత్రికకు సంపాదకత్వం వహించారు. స్త్రీల సంక్షేమానికి సంబంధించిన రచనలు ఎక్కువగా వచ్చేవి. స్త్రీల కోసం ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని ప్రతిపాదించినవారు.


ఆంధ్రలక్ష్మి (1921)

బరంపురం నుండి కళ్ళేపల్లి వెంకటరమణమ్మ గారు ఈ పత్రికకు సంపాదకత్వం వహించారు. మహిళల సంక్షేమం కోసం, దేశవిదేశాలలోని స్త్రీలకు సంబంధించిన విశేషాలు ప్రచురించేవారు. కనుపర్తి వరలక్ష్మమ్మ గారి శారదలేఖలు రచన ఇందులో ప్రచురించబడింది. ఈవిడ స్త్రీలలో విజ్ఞాన వికాసానికి దోహదం చేసినవారు.


ఆంధ్రమహిళ (1943)

గుమ్మిడిదల దుర్గాబాయమ్మ ఈ పత్రికను రెండు దశాబ్దాలపాటు నడిపారు. మహిళల ఉన్నతి కోసం జీవితాన్ని అంకితం చేశారు. స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేసిన పత్రిక. మారుతున్న సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల పట్ల అవగాహనతో రచయితలు రాసే రచనలు ఇందులో ప్రచురించబడేవి. కనుపర్తి వరలక్ష్మమ్మ, మాలతీచందూర్, కె. రామలక్ష్మి, వంటి ఆధునిక రచయిత్రులు రాసే రచనలు ఇందులో వచ్చేవి. మహిళా అభ్యుదయానికి ప్రత్యేక విధానాన్ని రూపొందించవలసిందిగా సూచిస్తూ 1947 మార్చి సంపాదకీయంలో దుర్గాబాయ్ గారు రాశారు. 


తెలుగుతల్లి (1943)

రాచమళ్ళ సత్యవతీదేవి సంపాదకత్వంలో ఈ పత్రిక నడపబడింది. స్త్రీల కు సంబంధించిన వ్యాసాలు ప్రచురించబడేవి.


తెలుగుదేశం (1950)

సూర్యదేవర రాజ్యలక్ష్మి గారి సంపాదకత్వంలో నడిచిన పత్రిక. 


బాలలబాట

యస్వీ.వి. రమణమ్మ గారి ఆధ్వర్యంలో బాలలకు సంబంధించిన మాసపత్రిక వచ్చింది. 


వనిత (1956)

అబ్బూరి ఛాయాదేవిగారి సంపాదకత్వంలో తొమ్మిదినెలలు నడిచింది. ఇది తక్కువకాలమే అయినప్పటికి విలువైన సమాచారంతో నడిచింది. హైదరాబాదు నుండి వెలువడిన మొట్టమొదటి పత్రిక. మహిళల సమస్యల పై దృష్టి పెట్టిన పత్రిక. ఎంతోమంది ప్రసిద్ధుల రచనలు ఇందులో ప్రచురించబడేవి. స్త్రీలలో చైతన్యం కలిగించే రచనలు, పిల్లల వికాసం గురించి రచనలు ఇందులో ప్రచురితమయ్యేవి. పాఠకులు చాలారోజుల వరకు ఈ పత్రిక ప్రతులను దాచుకుని మరి చదువుకునేవారు. వీటి తర్వాత వచ్చిన పత్రికలు వనితాజ్యోతి, మహిళ, వనిత వంటివి స్త్రీల పత్రికలే అయినప్పటికీ వీటిని నిర్వహించినవారు పురుషులే. 


నూతన (1978)

ఎం. రత్నమాలగారి సంపాదకత్వంలో వచ్చిన ఈ పత్రిక కొత్త రచయిత్రులను ప్రోత్సహించేది. ఈ పత్రికలో స్త్రీ విముక్తి పేరుతో ప్రత్యేకించి ఒక పేజి ఉండేది.


వసుధ (1970)

ముపాళ్ళ రంగనాయకమ్మగారి సంపాదకత్వంలో వచ్చిన పత్రిక. మంచి ప్రమాణాలతో కూడిన వ్యాసాలుండేవి. ఇవి పాఠకులకు ఆసక్తిని కలిగించేవిధంగా ఉండేవి. 


స్త్రీస్వేచ్ఛ (1988)

మల్లాది సుబ్బమ్మగారి ఆధ్వర్యంలో వచ్చిన ఈ పత్రిక చాలా కాలం నడిచింది. స్త్రీల అంశాల మీద కథలు, వ్యాసాలు ఈ పత్రికలో ప్రచురించేవారు. స్త్రీ సంక్షేమం కోసం కృషి చేశారు. ఈమె ఆధ్వర్యంలో స్త్రీలకు సంబంధించిన అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. మహిళాభ్యుదయ సంస్థను స్థాపించి స్త్రీ జనాభివృద్ధి కోసం శ్రమించారు. నిజాన్ని నిర్భయంగా రాయగల్గిన రచయిత్రి. జీవితం మీద విరక్తి కలిగిన ఎందరో అభాగ్యులైన మహిళకు సుబ్బమ్మగారు అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. నేటి మహిళలు సుబ్బమ్మగారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వాసా ప్రభావతిగారు అన్నారు. మహిళల చైతన్యం కోసం అనేక పుస్తకాలు రాశారు. ఈ పత్రిక కంటే ముందే సుబ్బమ్మగారి ఆధ్వర్యంలో వికాసం అనే పత్రిక పదేళ్ళ పాటు నడిచింది.


లోహిత (1989)

కొండవీటి సత్యవతి, జయప్రభగార్ల సంపాదకత్వంలో హైదరాబాద్ నుండి వచ్చిన పత్రిక. ’శతాబ్దాలుగా అణగారిపోయి ఉన్న ఆడవాళ్ళ విముక్తి కోసం స్త్రీవాద సాహిత్య వేదికగా లోహితను వెలువరించినట్లు’ పేర్కొన్నారు. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రిక.


మాతృక (1992)

విజయవాడ నుండి కె. రమ సంపాదకత్వం వహించారు. సంపాదకవర్గంలో మరికొంతమంది మహిళలు ఉన్నారు. మహిళల హక్కుల కోసం పోరాడే ఉద్యమాలను ఈ పత్రిక సమర్థించేది. మహిళల పై జరిగే దౌర్జన్యాలను, అత్యాచారాలను గురించి తెలియజేసే త్రైమాసిక పత్రిక. 


ఆహ్వానం (1993) 

సామ్రాజ్యలక్ష్మి గారి సంపాదకత్వంలో వచ్చింది. ఇది కేవలం స్త్రీలకు సంబంధించిన పత్రిక కాకపోయినప్పటికి స్త్రీల ఆధ్వర్యంలో నడిచిన పత్రిక. ఉన్నత ప్రమాణాలతో కూడిన కథలు, ఆయా రంగాలలో ప్రముఖులతో పరిచయాలు, కవితలు ప్రచురించేవారు. పి. సత్యవతి, ఓల్గా లాంటి స్త్రీవాద రచయిత్రులు, ప్రముఖ కథకుల కథలు ఉండేవి.


చూపు

కాత్యాయనిగారి సంపదకత్వంలో వచ్చింది. స్త్రీ సమస్యల మీద, సామాజికాంశాల మీద పదునైన సంపాదకీయాలతో నడిచిన పత్రిక.


తర్జని

ఎం.ఏ. వనజగారి ఆధ్వర్యంలో వచ్చిన పత్రిక. బాలల, మహిళల, వికలాంగుల, అణగారిన వర్గాలవారి హక్కుల కోసం పోరాడుతూ వారిని చైతన్యపరిచేలా నడిచిన పత్రిక.


మహిళావిజయం

వాసిరెడ్డి కాశీరత్నంగారి సంపాదకత్వంలో వచ్చిన పత్రిక.


మహిళా స్వయంప్రభ

శివలెంక నాగ ఉదయలక్ష్మిగారి ఆధ్వర్యంలో ఈ పత్రిక నడిచింది.


భూమిక (1993) 

కొండవీటి సత్యవతిగారి సంపాదకత్వంలో ఇరవైసంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న పత్రిక. ఈ పత్రిక కోసం పనిచేయడానికి సత్యవతిగారు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఇందులో పనిచేసే వారంతా స్త్రీలే, అందరూ స్వచ్ఛందంగా పనిచేస్తున్నవారే. కేవలం స్త్రీల కోసం ఒక ప్రత్యేకమైన పత్రిక అవసరమనే ఉద్దేశ్యంతో ఎలాంటి జీతభత్యాలు లేకుండానే పనిచేస్తున్నారు. సమాజాన్ని, సాహిత్యాన్ని స్త్రీ దృష్టికోణంతో ఈ పత్రిక విశ్లేషిస్తుంది. స్త్రీవాద దృక్పథం నుండి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తుంది. గుర్తింపు పొందని స్త్రీల చరిత్ర, కళలు, సాహిత్యాలను వివిధ భాషల నుండి సేకరించి ప్రచురిస్తుంది. స్త్రీవాదపత్రిక అయినప్పటికీ సామాజికాంశాలను కూడా చర్చిస్తుంది. స్త్రీల, బాలికల విషయంలో, లింగవివక్ష విషయాల పట్ల ఎంతో నిష్టగా పనిచేస్తుంది. సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే ఈవ్ టీజింగ్, ఉద్యోగినుల సమస్యలు, కార్యాలయాలలో లైంగిక వేధింపులు, వరకట్నసమస్య, గృహహింస మొదలైన వాటిని స్త్రీలు మొన్నటివరకు మౌనంగానే భరిస్తూ వచ్చారు. ఇటువంటి వారికోసం సత్యవతిగారి ఆధ్వర్యంలో వచ్చిన "భూమిక సహాయకేంద్రం" ఎంతో ఉపయోగకరంగా ఉంది. వెన్నుతట్టి పీడిత స్త్రీల వెనుక తామున్నామనే భరోసా ఇచ్చింది. తెలుగులో ఇప్పటికీ నిరంతరం కొనసాగుతున్న ఏకైక స్త్రీవాదపత్రిక. ఉత్తమమైన సంపాదకీయం కోసం ప్రింటుమీడియాలో జాతీయ అవార్డు లభించింది. సత్యవతిగారి సంపాదకీయాలు చైతన్యాన్ని కలగజేసే విధంగా ఉంటాయి. వ్యవసాయ సంక్షోభం, ప్రపంచీకరణ పరిణామాలు, దళిత స్త్రీ సమస్య, చేనేత సంక్షోభం, పిల్లల ప్రత్యేకం, స్త్రీలు- మానసిక ఆరోగ్యం, హెచ్.ఐ.వి./ ఎయిడ్స్, ఇలా ఎన్నో అంశాల మీద ప్రత్యేక సంచికలు వచ్చాయి. కాలానుగుణంగా నడుస్తున్న అన్ని సమస్యల గూర్చి ఈ పత్రికలో సంపాదకీయాలు వస్తుంటాయి. ఇక భూమిక ప్రధాన ఆశయం మహిళాసమస్యలను చర్చించటం, వారిని చైతన్యవంతం చేయడం. వాటిలో భాగంగా స్త్రీలు తమ ప్రతిభా పాటవాలను ఇతరులతో పంచుకునేవిధంగా చేయడం, ప్రపంచసాహిత్యంలో స్త్రీల సాహిత్యాన్ని పరిచయం చేయటం, స్త్రీ వాస్తవ జీవితాశలను ప్రతిబింబించే వాటిని సేకరించడం, స్త్రీ విషయాల మీద ప్రభుత్వ ప్రణాళికలు, వాటి పనితీరు, స్త్రీ సంఘ కార్యకర్తల అభిప్రాయాలు మొదలైన వాటిని ప్రచురిస్తుంది. కావున ఈ పత్రిక మరింత ముందుకు సాగుతూ విజయవంతంగా నడవాలని కోరుకుందాం. 


మహిళావర్గం

తిరుపతి నుండి విష్ణుప్రియ సంపాదకత్వం వహించారు. కొంతకాలం తరువాత హైదరాబాద్ నుండి పి. పవన సంపాదకత్వంలో నడిచింది. వీరిద్దరితో పాటు కొంతమంది మహిళాసభ్యులు కూడా ఉన్నారు. స్త్రీని పురుషునికి బానిసగా మార్చే క్రమంలో నిర్వచనాలతో ప్రచురించేవారు. స్త్రీల పట్ల చూపించే వివక్షను గూర్చి రాసిన పత్రిక.


మహిళామార్గ్ & స్త్రీగర్జన

విష్ణుప్రియ గారి సంపాదకత్వంలో ఈ రెండు పత్రికలు వచ్చాయి. సాంఘిక సేవలో మహిళా ఉద్యమాలలో ఎన్నో యేళ్ళుగా పనిచేస్తున్నారు.


చైతన్యమానవి (2002)

స్త్రీల ఆధ్వర్యంలో వచ్చిన మరో పత్రిక. ఐద్వా (ఆలిండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్) ఈ పత్రికను ప్రచురిస్తుంది. ఎస్. పుణ్యవతి సంపాదకత్వం వహించారు. మరికొంతమంది మహిళలు సంపాదకవర్గంలో ఉన్నారు. కథలు, కవితలు, వ్యాసాలు, ఉద్యమవార్తలు ప్రచురించబడేవి. మహిళల్లో అభ్యున్నతి, చైతన్యం నింపేందుకు దోహదపడుతున్న పత్రిక. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగానూ, మహిళల హక్కుల కోసం పోరాడుతున్నది. వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలు, మహిళల ఆర్ధిక స్థితిగతులు, విద్య, వైద్య, మహిళాచట్టాలు, హింస, మీడియాపాత్ర తదితర అంశాలు పై చర్చించేది. 


నవోదయం

చిత్తూరు జిల్లా నుండి స్వయం సహాయక సంఘాలు తమ స్వశక్తితో నడుపుతున్న స్త్రీల పత్రిక. ఈ పత్రికకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. స్వయం సహాయక సభ్యులైన మహిళలు తమ ప్రతిభతో, స్వశక్తితో మహిళల కష్ట సుఖాలకు సంబంధించిన కథనాలు, డ్వాక్రా మహిళల ఎదుగుదల, వృత్తి నైపుణ్యశిక్షణా కార్యక్రమాలలో మహిళలకు ఈ పత్రిక ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మహిళల ఎదుగుదలకు దోహదం చేస్తున్నారు. ఆరోజులలో మైనర్ బాలికలపై జరిగిన అత్యాచారాలును కూడా మానవీయకోణంలో కథనం రాసి ప్రజల మనస్సులకు దగ్గరయ్యారు. మహిళలుగా వారికి తెలిసిన విషయాల పై వారు ఎదుర్కొంటున్న సమస్యల పై కథలు రాసి ప్రచురించేవారు. గ్రామీణ పేద మహిళలు రాసుకుంటున్నపత్రిక. గ్రామీణ స్త్రీలే ఎడిటర్లు, రిపోర్టర్లుగా ఉన్నారు. వారివారి గ్రామాల్లోని సమస్యలు గూర్చి తాము సాధించిన విజయాల గురించి, సారా సమస్యల గూర్చి రాస్తుంటారు. తమప్రాంతాలలోని ఉద్యోగుల అవినీతి గురించి, గ్రామాల్లోని ఆరోగ్య సమస్యల గురించి వచ్చిన రచనలను ప్రచురిస్తారు. గ్రామీణ స్త్రీల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళలచే నడపబడుతున్న పత్రిక. 


ముగింపు

పత్రికా నిర్వాహకులకు ఎంతో చారిత్రక అవగాహన ఉండాలి, మరెంతో దూరదృష్టి ఉండాలి. తెలుగులో పత్రికలకు మహిళలు ఒక శతాబ్ది కాలం (1902-2013 ప్రస్తుతం) కిందటినుంచి సంపాదకత్వం వహిస్తున్నారు. వీటిలో కొంతకాలం పనిచేసి ఆగిపోయిన పత్రికలు ఉన్నాయి, అలాగే నిరంతరం ఇప్పటికీ నడుస్తున్న పత్రికలు ఉన్నాయి. వీటన్నింటి ముఖ్య ఉద్దేశ్యం స్త్రీ చైతన్యం. ఇవన్నీ కూడా సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ఆడవారి అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తున్నాయి. ఒకప్పుడు మహిళా సంపాదకులు ఆరోజుల్లో ప్రధానంగా కనిపించే సమస్యలు బాల్యవివాహాలు, కన్యాశుల్కం, వేశ్యావృత్తి మొదలైన వాటిపై పత్రికలలో చర్చించేవారు. ఈరోజుల్లో ప్రస్తుతం బాలికలకు చదువుకునే అవకాశం లేకపోవడం, స్త్రీల పై అత్యాచారాలు, వరకట్నసమస్యలు మొదలైన వాటిపై చర్చించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా స్త్రీలు తమ సమస్యలను తామే పరిష్కరించుకునే విధంగా మనందరం సాహిత్య సృజన చేయాలి.

 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!