పూజ కొద్ది పురుషుడు.. పుణ్యం కొద్ది పిల్లలు ...

పూజ కొద్ది పురుషుడు.. పుణ్యం కొద్ది పిల్లలు ...

"అదృష్టం కొద్ది ఆలి(భార్య)" చెబుతారు. .

గతంలో వధువుల తరఫు పెద్దలే పురుషులను ఎంచుకునే వారు. (నిజానికి ఇప్పుడూ అమ్మాయిలే కాబోయే వారిని రకరకాల పరరీక్షలు రపెట్టి మరీ యెంచుకుంటారని వినికిడి.) కనుక వారే పురుషులను చూసి యెంచుకుంటారు కావున మనం చేసే మంచి పనులే మనలను వారి దృష్టిలో పడవేస్తాయనీ, మనంగా వేరే వ్రతాలూ గట్రా చేయాల్సిన పని లేదనీ, చేయాల్సిందల్లా 

ఆ యొక్క "ఏడు" బాధ్యతలను చక్కగా నెరవేర్చడమేననీ...నా అభిప్రాయం.

.

నిజానికి కొత్తగా వివాహం అయిన అబ్బాయికి జీవితం కత్తి మీద సాము లాంటిదే. ఉమ్మడి కుటుంబం అయితే మరీను. భరించువాడు భర్త అనే సామెత ఉండనే ఉంది. వివాహం అయిన కొత్తల్లో అబ్బాయి చాలా చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. నొప్పించకుండా తన నిర్ణయాలు ఉండాలి. ముఖ్యంగా అబ్బాయిలు గుర్తుంచుకోవలసింది ఏంటంటే, తల్లి మరియు భార్య, ఇద్దరూ కూడా రెండు కండ్లలాంటి వారు. కొత్తల్లో ఏదైనా సమస్య వస్తే తల్లిని, తల్లే కదా అని భార్య ఎదుట చిర్రుబుర్రు లాడటం, నీకేం తెలియదులే అమ్మా అనడం చేయకూడదు. తల్లి ఎదుట భార్యని, నువ్వు ఈ పని సరిగ్గా చేయచ్చు కదా. అని ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యకి చెప్పుకోవాలి. మా అమ్మ పెద్దది కదా పాపం, మమ్మల్ని పెంచడానికి ఎంత కష్టపడిందో. నిన్ను ఒక మాట అంటే నష్టం ఏమిటి చెప్పు. నా కోసం సర్దుకుపోవే! మా అమ్మ బాధ పడితే నేను బాధ పడతాను. నేను బాధ పడితే నువ్వు బాధ పడతావు. ఎందుకు ఇవన్నీ చెప్పు, అని లాలనగా భార్యకి చెప్పుకోవాలి. అలాగే తల్లికి కూడా, భార్య ప్రక్కన లేనప్పుడు, ఏదో కొన్ని విషయాలలో అది తొందరపడుతుంది. కాని, నువ్వు అంటే అమితమైన ప్రేమ. అమ్మా!మేమిద్దరం బయటికి వెళ్ళినా అత్తయ్యగారికి ఇది కొందాం అని చెపుతూ ఉంటుంది. అని, మెల్లిగా తల్లిని కూడా సర్దుకుపో అని ప్రేమగా చెప్పాలి. పురుషుడు వివాహానంతరం తన బలాలు, బలహీనతలు అన్నీ కూడా భార్యకి చెప్పుకోవాలి. ఈ రోజు కాకపోయినా రేపయినా నీ బలాలు, బలహీనతలు తెలియాల్సింది ఆ అమ్మాయికే కదా! పైగా మన వివాహ క్రతువుల్లో కూడా భార్య అంటే ఎవరో కాదు, భగవంతుడు ఇచ్చినటువంటి నెచ్చెలి. మరి భగవంతుడు ఇచ్చిన ఈ నెచ్చెలిని ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రేమగా చూసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. శాస్త్ర ప్రకారం అయితే వివాహానంతరం భర్తే భార్య ఇంట్లో ఉన్నట్లు. నిన్ను చేసుకున్నందుకు నేను నిన్ను నా ఇంటిలోనికి అనుమతిస్తున్నాను అని. వివాహ మంత్రాలు కూడా అలానే నడుస్తాయి. అంటే ఆ ఇల్లు ఇల్లాలిదే అని అర్ధం. కన్యాదానం చేసేటప్పుడు కూడా చతుర్ధీవిభక్తి వెయ్యకుండా కన్యాదానం చేస్తారు. అందుకే కన్యాదాత ప్రతిపాదయామి అంటాడు. వెంటనే వరుడు 'ఓం స్వస్తి' అని అంటాడు. కన్యాదానం అనే మిషతో దానం చేసినప్పటికీ పూర్తిగా చతుర్ధీవిభక్తి వెయ్యకపోయినా, ఆ అమ్మాయి ఇప్పటి వరకు నీవు సంపాదించిన ఆస్తికి, ఇక ముందు సంపాదించబోయే ఆస్తికి ఆవిడే సర్వాధికారిణి. ఎందుకంటే, వేదం అంగీకరించింది కాబట్టి కొన్ని ప్రమాణాలలో వరుడికి సమానం అయిన అధికారాలన్నీ ఆవిడకి కూడా ఉంటాయి. మరి ఆడపిల్ల తన ఇంటిపేరు వదిలేసింది, గోత్రాన్ని వదిలేసింది, తన వారినందరినీ వదిలేసి ఈయన నా భర్త అన్న ఒకేఒక్క ధైర్యంతో, ఈయన నన్ను మా నాన్నలా లాలిస్తాడు, అన్నలా ఆదరిస్తాడు, తమ్ముడిలా ప్రేమిస్తాడు, చెల్లెలిలా పరాచకాలాడుతాడు, అక్కలా మంచి మాటలు చెపుతాడు, తల్లిలా కడుపులో పెట్టుకుంటాడు అని తన చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతుంది. భర్త అంటే భరించువాడు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. తనకి మరణసదృశం అని తెలిసినప్పటికీ, నీ ప్రతిరూపాన్ని నీకు బహుమతిగా ఇవ్వాలని ఆరాటపడిపోతుంది స్త్రీ మనసు. మరి ఇంత త్యాగం చేసే భార్యని నువ్వు ఏ రకంగా సంతోష పెట్టగలవు. భార్య సంతోషపడాలంటే ఏమీలేదు. నా అదృష్టం కదా, నువ్వు నాకు భార్యవి అయ్యావు, అంటే ఆవిడకి గజారోహణం చేయించినట్లుగా ఆనందపడిపోతుంది. అలా కాకుండా ఛీఛీ ఏ ముహూర్తాన నిన్ను చేసుకున్నానో కాని, అని ఈసడిస్తే కృంగిపోతుంది. కుటుంబంలో ఎవరు ఆదరించినా, ఆదరించకపోయినా భర్త ఒక్కడు ఆదరిస్తే కష్టాలన్నీ దిగంమింగుతూ ధైర్యంతో పయనించగలుగుతుంది. అలా కాకుండా, నువ్వు నాకు అఖ్ఖర్లేదు ఫో అంటే కృంగిపోతుంది. కాబట్టి ఒక్కసారి వివాహం

చేసుకున్నాక నువ్వు నాకు అఖ్ఖర్లేదు అనడానికి వీల్లేదు. మనకి ఒక పాట కూడా ఉంది, 'మగడు మెచ్చిన చాలు కాపురంబులోనా మొగలిపూలా వాన ముత్యాలవాన' అని. కాబట్టి భర్తగా మారేముందే పురుషుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మన విలువైనటువంటి హారాన్ని ఎంత భద్రంగా బీరువాలో ఉన్న లోపలి సొరుగులో ఉన్న సొరుగులో పెడతామో, భార్యని కూడా పురుషుడు తన హృదయంలో పొదివి పెట్టుకోవాలి. సముద్రుడిని పురుషుడితో పోలుస్తారు. సముద్రుడు తనకి తానుగా ఒక చెలియలికట్ట విధించుకున్నాడు. నేను ఈ గీత దాటకూడదు అని. అదే సముద్రుడు ఉప్పొంగి ఊరి మీదకి వస్తే, ఊరు ఊరు మునిగిపోతుంది. సముద్రుడు ఎలాగైతే తనకు తాను చెలియలికట్ట విధించుకున్నాడో, పురుషుడు కూడా తనకి తాను తన మనసుకి ఒక చెలియలికట్ట విధించుకోవాలి. మన ఇంట్లో చేసుకునే పరమాన్నానికి, ఎదుటి వారి ఇంట్లో చేసిన పరమాన్నానకి వ్యత్యాసం ఏమీ ఉండదు కదా? ఇది పురుషుడు గ్రహించాలి. వివాహానికి ముందు ఎన్నో రకాల అందాలను చూసి, ఆ అందం తనకి సొంతం అయితే బాగుండును అని అనుకుని ఉండవచ్చు. కాని వివాహం తరువాత అన్ని అందాలను తన భార్యలోనే వెతుక్కోవాలి. స్త్రీ దేనినైనా సహిస్తుంది కాని, తనతో సమానంగా ఇంకో స్త్రీకి కూడా తన భర్త హృదయంలో స్థానం ఉంది అంటే మటుకు ఏ స్త్రీ కూడా సహించలేదు. అంతటి అమ్మవారు కూడా ఏదైనా ఉత్సవం జరుగుతుంటే, నా భర్త అని తన భర్త వైపు గర్వంగా చూస్తుందిట. ఇంతలో పైన ఉన్న గంగమ్మకి, నేనుకూడా అంటే, వెంటనే ఆవిడ కనులు ఎర్రబడతాయట. భరించాడు కాబట్టి నీకు భర్త ఏమో, శాస్త్రోక్తంగా తాళి కట్టింది నాకు, అని గంగవైపు గర్వంగా చూస్తుందిట. మనకి పెద్దలు ఒక నానుడి చెబుతూ ఉంటారు. ఎవరైతే తలికి, భార్యకి Thanks చెబుతారో, వాడంత మూర్ఖుడు ఇంకొకడు లేడు. తల్లికి, భార్యకి ఏ రకంగాను కృతజ్ఞతలను తెలియజేయలేము. ఒకరు తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీకు జన్మనిచ్చినవారు. ఇంకొకరు వారి సర్వస్వం నీకు అర్పించి, నీ అభ్యున్నతికోసం ఆరాటపడేవారు. కాబట్టి, భార్యాస్థానం యొక్క విలువ తెలుసుకుని ప్రవర్తిస్తే వారి దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా సాగిపోతుంది.

సర్వేజనాసుఖినోభవంతు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!