కుంభ సంభవులు .! .

కుంభ సంభవులు .!

శివుని తపో వేడిమికి ఆయన త్రిశూలం నుండి జారి పడిన స్వేదం ఒక కన్యగా అవతరించింది. ఆమె శివ పుత్రిక. 

శివానుగ్రహంతో నదిగా మారి ఆమె నర్మద అయినది. ఇలాగే మరో సందర్భంలో శివుని స్వేదం నుండి చర్చిక అనే కన్య పుడుతుంది.

మన పురాణాలు, ఇతిహాసాల గాధల్లో మరో విధమైన పునరుత్పత్తి పద్ధతి కన్పిస్తుంది.

కుంభ సంభవులు అనగా కుండ నుండి పుట్టిన వారని అర్థం. కుండ నుండి మనిషి పుట్టడం ఏమిటి? ఇది మనకు విడ్డూరంగా వుండొచ్చు. కానీ`

విచ్ఛిన్నమైన గాంధారి గర్భస్థ పిండాన్ని వ్యాసుల వారు తన తపోశక్తితో నూరు కుండల్లో భద్రం చేయగా వాటి నుండి దుర్యోధనితో సహా నూరుగురు సోదరులు జన్మించారు. వీరంతా కుంభ సంభవులే.

కురు పాండవులకు విద్య నేర్పిన ద్రోణా చార్యుడున్నాడు. ద్రోణము అంటే కుండ. ఈయనా కుంభ సంభవుడే. ఇలాంటివి మరి కొన్ని వున్నా ముఖ్యంగా చెప్పుకోవలసిన కుంభ సంభవు ఇద్దరున్నారు. సప్తర్షుల్లోని వశిష్టుడు, అగస్థ్యుడు వీరిద్దరూ కవల సోదరులు కుంభ సంభవులు. అదో ఆసక్తి కరమైన గాధ.

ఒకప్పుడు నారాయణాంశతో జన్మించిన నర నారాయణులనే సోదరులు మహాభక్తులు. తపస్సంపన్నులు. ఇరువురు బదరికా వనంలో ఘోర తపస్సు చేస్తున్నారు. ఆ తపో వేడిమికి ముల్లోకాలు తల్లడిల్లాయి. తన ఇంద్ర పదవి కోసమే వాళ్ళు తపస్సు చేస్తున్నారని భ్రమ పడ్డాడు మహేంద్రుడు. వెంటనే ఆ సోదరులకు తపో భంగం కలిగించమని అప్సర భామలను పంపిస్తూ తోడుగా మన్మథుడ్ని, వసంతుడ్ని కూడా పంపించాడు.

బదరికా వనంలో అకాలాన వసంతం వెల్లి విరిసింది. అప్సర భామలు ఆడి పాడారు. మరుడు సుమశరాలు కురిపించాడు. కాని చెరకు విలుకాని సుమ శరాలు గాని బదరికా వనంలోని వసంతశోభ గాని, అప్సరసల సరస శృంగార నాట్య గీతాలు గాని నర నారాయణులను తపో భంగం కలిగించలేక పోయాయి. అప్పుడు కనులు తెరిచిన నర నారాయణులు అప్పటి కప్పుడు తమ ఊరువుల నుండి (తొడలు) అప్సర కామినులకు మించిన ఒక అద్భుత సౌందర్య రాశిని సృష్టించారు. ‘‘ఓ అప్సరలారా! మా తపోశక్తి మీకు తెలియదు. తలచుకుంటే మిమ్ము మించిన మదవతులైన మోహనాంగిలను సృష్టించ గలము. ఇదో... మా ఊరువుల నుంచి ఆవిర్భవించిన ఈ సౌందర్య వతి పేరు ఊర్వశి. ఈమెను మా కానుకగా మహేంద్రునికి వప్పగించండి. మా తపస్సు మహేంద్ర పదవి కోసం కాదని మా మాటగా చెప్పండి’’ అన్నారు.

అలా అప్సరల వెంట స్వర్గం వైపు వెళ్తున్న ఊర్వశిని సూర్య దేవుడు చూసి, మోహించి తన సూర్యా లోకానికి ఆహ్వానించాడు. సరేనని సూర్య లోకం వైపు వెళ్ళింది ఊర్వశి. దారిలో అగ్ని దేవుడు ఆమెను చూసి మోహించి తన కోరిక తీర్చమన్నాడు. ముందు సూర్యునికి మాటిచ్చినట్టు చెప్పింది ఊర్వశి. అయితే నన్ను తులుచుకుంటూ వెళ్ళు చాలు అన్నాడు అగ్ని. ఊర్వశి అలాగే చేసింది. అంతలో వాయు దేవుడు ఆమెను గాంచి మోహితుడై తన కోరిక చెప్పగా అదే సమాధానం చెప్పింది ఊర్వశి. వాయు దేవుడు కూడ తనను తలచుకొంటూ వెళ్ళమని కోరాడు. ఆ విధంగా మనసులో అగ్నిని, వాయు దేవుని తలచుకొంటూ సూర్య లోకం చేరింది ఊర్వశి. సూర్యుడు విషయం తెలుసుకొని ఆగ్రహించి` ‘‘నీవు ఇరువుర్ని తలచుకొంటూ నా వద్దకొచ్చావు. నీకు సూర్య లోక ప్రవేశం లేదు. మహేంద్రుడి వద్దకే వెళ్ళమన్నాడు.

ఆ విధంగా తన వద్ద కొచ్చిన ఊర్వశికి సముచిత స్థానమిచ్చి తన అప్సరగా చేసుకున్నాడు ఇంద్రుడు. అయితే ఇది ఇంతటితో అయి పోలేదు. ఊర్వశి సౌందర్యాన్ని చూసిన మోహంలో తాపం భరింప లేని అగ్ని, వాయువు ఇరువురూ తమ తేజస్సును ఒక కుండలో భద్రపర్చి వెళ్ళి పోయారు. ఆ కుంభంలో నుండి ఇరువురు కవలు బయటి కొచ్చారు. ఆ శిశువులే వశిష్టుడు, ఆగస్త్య మహర్షులు.

పార్వతి నందునుడు గణేశునికి ఏనుగుతల చేర్చబడింది. త నరక బడిన దక్షునికి మేకతల అతికించబడింది. అలాగే మృగ శీర్షంతో సహజంగా అవతరించిన దేవతలున్నారు. వారిలో నరశింహుని ముందుగా చెప్పుకోవాలి. తురగ ముఖులు మనకు ఇద్దరు కన్పిస్తారు. ఒకరు గాన గంధర్వుడు తుంబురుడు, రెండవది సాక్షాత్తూ నారాయణావతారమైన హయగ్రీవుడు. ఇంకా భైరవుడు కుక్క మొఖం కలిగిన వాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!