కైకవిలాపం!

కైకవిలాపం!

.

దశరథుడు కైకతో కోపముతో,నిస్సహాయత తో అన్న పద్యాలు !

(విశ్వనాథ వారి ' 'రామాయణ కల్ప వృక్షం' లోనివి)


"వరమిచ్చిన ప్రభువగు శం 

కరు నెత్తిని చేయి పెట్టు కరణిని నాచే

వరముఁగొని హరీ! హరి! నా 

వరమున నన్నణఁగద్రొక్కు పాతాళమునన్. "

.

(కల్పవృక్షం/అయోధ్య/అభిషేక/207)

.

“శంకరుని నెత్తిన చేయి పెట్టిన భస్మాసురుని వలె” అనే

ఈ ఉపమానం గొప్పగా ఉన్నది. సారస్వతములో ఇంత గొప్ప ఉపమానాలరుదు.

.

"ఇషువుల నొడ్డుచున్ నిలిపి యేటికిఁ గోటికిఁ లాగు వాజులన్

గృషి మెయి మూర్ఛితున్ నిను భరించిన దానికి వైజయంతపున్

విషమ మహాహవ క్షితిని వేడక యిచ్చి వరద్వయంబు పౌ 

రుష మిది గాక యిప్పటికి రూపముఁదాల్ప వహో! వరంబులున్."

.

(కల్పవృక్షం/అయోధ్య/అభిషేక/189)

.

“(ఇషువు) బాణములను అడ్డుకొనుచు, దేవాసుర యుధ్ధభూమిలో నిన్ను (భరించిన) రక్షించి నందులకు నీవిచ్చిన వరములు ఇప్పటికీ రూపము దాల్చలేదు’ అంటోంది కైక. పైగా, 

“వేడక” అనే పదం విశ్వనాథ వారు గొప్పగా ప్రయోగించారు. 

ప్రమాణాలు చేసి, పరిణామాల నెదుర్కోవటం త్రేతాయుగ రాజ లక్షణం! 

రాజులు చేసిన ప్రమాణాల పరిణామాలను ప్రజలెదుర్కోవటం కలియుగ లక్షణం!

.

ఉ.

"తల్లినిబోలెఁ జూచును గ దా నిను రాఘవుఁడెల్ల వేళలం

దుల్లములోన నీచెనఁటి యుద్యమ మేటి కొనర్పఁ బూనితే;

పెల్లు విషంపుఁ బాము నిటు వీఱిఁడి నై నృపకన్య యన్భ్రమం

బొల్లువడంగ నాదుగృహ ముం జొర నిచ్చితిఁ జేటు దెచ్చితిన్".

.

( మందరము - అయోధ్య - 311 )

.

చెనఁటి యుద్యమము - చెడు ప్రయత్నము

వీఱిఁడి నై - బుద్ధిమాలిన వాడినై 

పొల్లు వడంగన్ - చెడి పోవుటకు

రాజకన్య అనే భ్రమతో పామును యింటిలో పెట్టుకొని చేటు తెచ్చుకున్నాను అని కైక ను నిందిస్తున్నాడు దశరథుడు.

.

విశ్వనాథ వారి రామయణ కల్పవృక్షము లో కైకయి 

వరములు తెలపగనే దశరథుడు 

.

ఉ.:

"పచ్చని చెట్టుపై బిడుగుపడ్డవిధంబున గుప్పకూలి రా

జచ్చెరువున్ భయంబు హృదయంబునయం దసమప్రచారవా

యూచ్చలదుగ్రతాడన రయోద్ధతి నొప్పగ మేథ, దృష్టి, మ

త్యుచ్చమనీషలున్ స్మృతిక్రతుల్ వశజాతులు లేక ఱాయియై

.

ప్రతిక్రియలు:

1 అశనిపాతంతో కుప్ప కూలుట. పచ్చని జీవితము దగ్ధమగుట.

2 ఆశ్చర్యము భయము-"నయము భయము విస్మయము గదుర"

అన్నట్టు. దాని వలన గుండెలొ రక్తప్రసారము అతలాకుతలమగుట.

౩.శ్వాస క్రమము, తాపములలో మార్పులు

4.మేధ, దృష్టి, మతి, ఉచ్చ(రణ),మనీష,స్మృతి, క్రతుల్, వశము తప్పి 

ఈ 8 లక్షణాలు దశరథుని మతి పోవుట సూచించును.

5. శిల గా స్పందన లేకుండుట

విశ్వనాథ వారు బుద్ధి గురించి 8 విశేషణాలు ఎందుకు వాడేరా

అని ఆలోచించ వలసినది. 

యుద్ధాకాండలో హనుమంతుడు విజయ వార్త చెప్పినప్పుడు 

సీతాదేవి హనుమంతుని ప్రశంసిస్తూ;

"బుద్ధ్యా హ్యష్టాజ్గ్ యా యుక్తం త్వమేవార్హసి భాషణమ్ 116-27

కం: అతి లక్షణసంపన్నం బతిమాధుర్య గుణభూషణాంచితమును స/

మ్మత మష్టాంగయుతం బగు మతి యొప్పగ నీవనేర్తు మాటాడంగన్

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణము -యుద్ధ కాండ- 2618 

శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు అష్టాంగ లక్షణములను వివరించారు:

" గ్రహణం ధారణంచైవ స్మరణం ప్రతిపాదనం ఊహాపోహార్థ విజ్ఞానం 

తత్త్వజ్ఞానంచ ధీగుణాః" 

గ్రహించుట, ధరించుట,స్మరించుట,బోధించుట,ఊహించుట, 

అపూర్వము నూహించుట,అర్థముతెలియుట, తత్త్వము తెలియుట

ననునవి యష్టాంగములు

విశ్వనాథులకు నమస్సులు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!