కుమార శతకము! (ఫక్కి వేంకటనరసింహ కవి)

కుమార శతకము!

(ఫక్కి వేంకటనరసింహ కవి)

.

.క. శ్రీభామినీ మనోహర

సౌభాగ్యు దయాస్వభావు సారసనాభున్‌

లో భావించెద నీకున్‌

వైభవము లొసంగుచుండ వసుధ కుమారా! 1

.

క. ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల

లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్‌

బ్రాజ్ఞతను గలిగి యున్నన్‌

బ్రాజ్ఞులలోఁ బ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా! 2

.

క. అతి బాల్యములోనైనను

బ్రతికూలపు మార్గములఁ బ్రవర్తింపక స

ద్గతిమీఱ మెలఁగ నేర్చిన

నతనికి లోకమున సౌఖ్యమగును ముమారా! 3

.

క. వృద్ధజన సేవ చేసిన

బుద్ధి విశేషజ్ఞుఁడనుచుఁ బూతచరితుఁడున్‌

సద్ధర్మశాలి యని బుధు

లిద్ధరఁ బొగడెదరు ప్రేమ యెసఁగఁ గుమారా! 4

.

క. పెద్దలు వద్దని చెప్పిన

పద్దులఁ బోవంగరాదు పరకాంతల నే

ప్రొద్దే నెదఁ బరికించుట

కుద్దేశింపంగఁ గూడ దుర్విఁ గుమారా! 5

.
క.తనపై దయ నుల్కొనఁగను
గొన నేతెంచిన సుశీల గురుమతులను వం
దనముగఁ బూజింపఁ దగు
మనమలరఁగ నిదియ విబుధ మతము కుమారా!6

.

క.ఉన్నను లేకున్నను పై
కెన్నఁడు మర్మంబుఁ దెలుప నేగకుమీ నీ
కన్న తలిదండ్రుల యశం
బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁ గుమారా!7

.

క.పెద్దలు విచ్చేసినచో
బద్దకముననైన దుష్ట పద్ధతి నైనన్‌
హద్దెఱిఁగి లేవకున్నన్‌
మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా!8

.

క.సతతముఁ బ్రాతఃకాలో
చిత విధులను జరుపు మరసి శీఘ్రముగ నహః
పతి పూర్వపర్వతాగ్రా
గతుఁడగుటకు మున్నె వెరపు గల్గి కుమారా! 9

.

క.పోషకుల మతముఁ గనుఁగొని
భూషింపక కాని ముదముఁ బొందఁడు మఱియున్‌
దోషముల నెంచుచుండును
దోషివయిన మిగులఁ గీడు దోఁచుఁ గుమారా!10

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!