పోతనగారి మహా భాగవతం ! (కృతిపతి నిర్ణయము.)

పోతనగారి మహా భాగవతం !

(కృతిపతి నిర్ణయము.)

"ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్

సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే

సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ

బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.!

భావము:

విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్ధంగా రాసిన భాగవతాన్ని మానవమాత్రులు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖాలలో మైమరచి ఈ లోకంలో అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిదెబ్బలు తప్పవని తెలుసు. అందుకే బమ్మర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను.

.

తే 

చేతులారంగ శివునిఁ బూజింపఁడేని,

నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని,

దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ, 

గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.

..

భావము:

ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా కేశవుణ్ణి కీర్తించాలి, సత్యం కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టటం దేనికి తల్లి కడుపు చెడగొట్టటం దేనికి

.

క.

పలికెడిది భాగవత మఁట, 

పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ

బలికిన భవహర మగునఁట, 

పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?

భావము:

వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను.

.

-ఆ.

భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, 

శూలికైనఁ దమ్మిచూలికైన, 

విబుధజనుల వలన విన్నంత కన్నంత

దెలియ వచ్చినంత దేటపఱతు.!

భావము:

అయితే చిత్రమేమంటే భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నాం అని ఎవరు చెప్పలేరు. ఆఖరికి ఆ త్రిశూలధారి పరమశివుడైనా సరే, పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా. అయినా పెద్దల వల్ల ఎంత విన్ననో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్ననో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్ల మయ్యేలా చెప్తాను.

-క.

కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ 

గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం

గొందఱికి గుణములగు నే 

నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్.!

భావము:

తెలుగు పదాలతో కూర్చి రాసినవి కొంతమందికి నచ్చుతాయి. సంస్కృత పదాలుతో కూర్చి రాసిన రచనలను మరికొంతమందికి నచ్చుతాయి. ఇంకొంతమందికి రెండు రకాల పదప్రయోగాలు నచ్చుతాయి. నేను అందరు మెచ్చుకొనేలా భాగవతం ఆంధ్రీకరిస్తాను.

మ.

"ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్

తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో

తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా

జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.!

భావము:

సంస్కృతంలో ఉన్న పురాణగ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ భట్టారకుడూ, తిక్కన సోమయాజి మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు. నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు. బహుశః నా కోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మహాగ్రంథాన్ని తెలుగులోకి వ్రాసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను.

-మ.

"లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం

జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో

జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై

వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.!

భావము:

బ్రహ్మదేవుడికైన పరమశివునికైన భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించేది. ఏమాత్రం సందేహం లేదు. దీనిని రెండు రకాల అన్వయార్థాలు గల పదప్రయోగాలతో ఇలా వివరించారు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞ మైంది అయితే భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహర మైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి మూలం భగవాను డైన శ్రీకృష్ణుడుగా కలది. కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది, అలాగే భాగవతం శుకమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది. కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింప బడినది, మరి భాగవతం మనోహర మైన వాక్కులుతో అలరారేది. కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లు తుంటుంది, అదేవిధంగా భాగవతం అక్షర సార్థక మై సజ్జనుల మనసులు అలరించేది. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తు గుండ్రంగా ఉంటుంది, అదే మరి భాగవతమో సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్య వృత్తాలు గలది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా అందిస్తుంది, అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మాను కలిగినది, అలాగే భాగవతం స్వచ్చమైన వ్యాస కృత వ్యాసాలతో నిండినది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లు తుంది, మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది. కల్పవృక్షం శుక పికాది పక్షులకు సైతం శ్రేయస్కర మైనది, అదే భాగవతం అయితే ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయక మైనది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!