పోతన సరస్వతి స్తూతి ..తెలుగు భాగవతం !

పోతన సరస్వతి స్తూతి ..తెలుగు భాగవతం !

.

పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్

నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ

దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ మేల్

పట్టున్ నా కగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!

భావము:--

అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్థాంగీ! సరస్వతీదేవి! *నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను; బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను (రెల్లుపొదలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను); పడవలో పుట్టిన వ్యాసుడను కాను; కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను; కాని మాతా! ఈ భాగవత పురాణ రచన కూడ వారి లాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడ వారి రచనల వలెనె శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లీ! నిన్నే నమ్ముకున్నానమ్మా. నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు. దయామయీ! 

{*‘పుట్టంబుట్టశిరంబునన్ మొలవ’ అనే పాఠ్యాంతరం ప్రకారం పుట్టలో పుట్టి శిరస్సున పుట్ట పుట్టిన వాల్మీకిని కాదు}

ఉ.

"శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా

హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం

దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మదిఁ గానగ నెన్నడు గల్గు, భారతీ!

.

భావము:--

భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!

ఉ.

"అంబ, నవాంబుజోజ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా

డంబర చారుమూర్తి, ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా

చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా

వాంబరవీధి విశ్రుతవిహారిణి, నన్ గృపఁ జూడు భారతీ!

భావము:--

తల్లీ! వికాస ప్రకాశాలకి ప్రతీకగా అప్పుడే వెల్లి విరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో, శరచ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూప మైన శ్వేత స్వరూపంతో, విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాల లోని మణి మాణిక్యాల కాంతులతో, వేదసూక్తులు వెల్లడిచేసే స్వీయ ప్రభావంతో, ఉత్తమతమ భావాల పరంపరలలో విస్త్రుతంగా విహారిస్తుండే భారతీదేవి! నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించమ్మా!

-ఉ.

"అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె

ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా

యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.!

.

భావము:--

దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; 

ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచిన యమ్మ; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయ్యి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

మ.

"హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం

దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా

మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా

సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.!

భావము:__

దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి; రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి; సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు; వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి; అరవిందాలు మందిరంగా గల జవరాలు; అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న; చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి; ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రొహించు గాక.

.

ఇలా ఇష్టదేవత లందరినీ స్తుతించి. సూర్యభగవానుడిని, కుమారస్వామిని స్మరించుకున్నాను. ముందుగా కవితాసరస్వతి విలాస విన్యాసాలను వెలయింప జేసిన వాల్మీకి మహర్షుల వారికి వందనం చేస్తున్నాను. హయగ్రీవాసురుని చేతిలో పడి చిక్కుపడిన వేదసమూహాన్ని మొక్కపోని ఓర్పుతో, నేర్పుతో చక్కదిద్దిన వ్యాస భగవానుల వారికి వంగి నమస్కరిస్తున్నాని. శ్రీ మహాభాగవతకథ అనే సుధారసాన్ని పంచి పెట్టిన శుకయోగికి తలవంచి నమస్కరిస్తున్నాను. అనంతరం తన మెత్తనైన తియ్యనైన పలుకుల కులుకులతో శిలల్ని సైతం చిగురింపజేసిన బాణకవికి ప్రణామం చేస్తున్నాను. ఎన్నదగిన కొన్ని శ్లోకాలతోనే భగవానుడైన భాస్కరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసికొన్న మయూరకవిని అభినందిస్తున్నాను. మహాకావ్యాలను నిర్మించే కళలో ఆరితేరిన కవి చంద్రుడు కాళిదాసుని కైవారం చేస్తున్నాను. కవుల హృదయాలను దోచుకున్న నన్నయ భట్టారకుని స్తుతిస్తున్నాను. హరిహరనాథుని చరణారవిందాలకు ఆనందాతిశయంతో మ్రొక్కుతున్న తిక్కనాచార్యుని కొనియాడుతున్నాను. తక్కిన పూర్వకవు లందరిని మనసారా భావించి సంభావిస్తున్నాను. ఈనాటి కవు లందరిని అభినందిస్తున్నాను. ముందు తరాలలో రాబోయే కవు లందరికీ శుభం పలుకుతున్నాను. ఆంధ్ర సంస్కృత ఉభయ భాషలలో గద్యపద్యాల (చంపూ) కావ్యాలు రచించే నైపుణ్యం అలవర్చుకున్నాను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!