మూడు మంచాల కథ!

మూడు మంచాల కథ!


"కళ్లు మండుతున్నాయమ్మా! ఇక నీళ్ళు పోసెయ్, త్వరగా!" అంటున్నాడు పిల్లాడు.


"మొహం బాగా కడుక్కోకపోతే గుల్లలు లేస్తాయిరా నాన్నా! కాస్త సహనం అలవరుచుకోవాలి, ఇక నుండి నువ్వు" అటోంది అమ్మ.


"సహనం అంటే ఏంటమ్మా?" అని అడిగాడు అబ్బాయి.


"సహనమంటే భూమాతరా నాన్నా!" అన్నది అమ్మ.


"భూమాతంటే ఎవరమ్మా?" అడిగాడు అబ్బాయి.


"భూమాతంటేనా!" అంటూ ఈ చక్కని కథను తన కొడుకుతో చెప్పింది తల్లి:


ఒక గదిలో ముగ్గురు స్నేహితులుండేవాళ్లు. ఒకనాటి మధ్యాహ్నం, వాళ్లంతా పనులమీద బయటికి వెళ్లిన సమయంలో, వాళ్ల మంచాలు మూడూ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి.


ఒక మంచం అన్నది " అబ్బా! ఎంత బరువున్నాడో వీడు. మొయ్యలేక చస్తున్నా, రెండేళ్ల నుండీ!. ఇలా ఎంత కాలంరా నాయనా?" అని. 

ఇంతలో రెండవ మంచం అందుకొని "ఇంతకీ వాడి బరువెంత?" అని అడిగింది.


"యాభై ఆరు కేజీలట. ఒకనాడు చెప్పుకుంటూంటే విన్నాను." అన్నది మొదటి మంచం. తన గొంతును చిన్నదిగా చేస్తూ.


రెండవ మంచం అన్నది "యాభై ఆరు కేజీలేనా? నువ్వే అలా అంటే మరి నేనేమనాలి? మూడేళ్ల నుంచి వీడి బారిన పడ్డాను. బరువును మోస్తూనే ఉన్నాను." అని.


మరి "వాడి బరువెంత?" అని అడిగింది మొదటి మంచం. "అరవై రెండు కేజీలు" దీర్ఘంగా రాగం తీస్తూ అన్నది రెండవ మంచం. 

"మేమిద్దరం మాట్లాడుతుంటే నువ్వేమీ మాట్లాడకుండా ఉన్నావేమిటి? నీకేమీ బరువులు లేవా?" అని అవి రెండూ మూడవ మంచాన్ని అడిగాయి. 

అందుకు మూడవ మంచం బదులిస్తూ, "బరువులేకుండా ఎలా ఉంటాడు? ఉన్నాడు. అయినా నాకేమీ ఇబ్బంది లేదు. మనమున్నది బరువును మోయడానికే కదా! చిన్న చిన్న బరువులను మోస్తున్న మనం ఈ పని చేయడానికి ఇలా బాధపడకూడదు. మనమే ఇలా అంటే మనందరినీ మోస్తున్న ఈ భూమాత ఏమనాలి మరి? ఏమీ అనకుండా ఎంతో సహనంగా మోస్తున్నది కదా! దేనికైనా ఓర్చుకుంటున్నది కదా! అలాంటి గొప్ప సహనమే మనం అలవరచుకోవాలి" అని మూడవ మంచం ఎంతో సహనంగా చెప్పింది.


"మూడవ మంచం చెప్పినట్టు, నిజంగానే గొప్ప సహనశీలిరా నాన్నా, భూమాత! ఆ సహనం మనందరికీ ఎంతో అవసరం. చిన్న చిన్న వాటన్నింటికీ పెద్దగా అరవకూడదు" అని చెప్తూ స్నానం అయిపోజేసిన ఆ అమ్మ, తన కొడుకును స్నానాలగది నుండి బయటికి ఎత్తుకొచ్చింది మురిపెంగా.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!