🥀 శ్రీ రమణ మహర్షి పలుకులు. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

🌹శుభోదయం .🌹

🥀
శ్రీ రమణ మహర్షి పలుకులు.
🙏🏿🙏🏿🙏🏿🙏🏿

1. జీవాత్మ - మనస్సు

ప్రాణము అభివ్యక్తమయ్యే మార్గములలో మనస్సొకటి. ప్రాణ శక్తియే జీవనవ్యాపారముగా, దానిని తెలుసుకొను చైతన్యముగా (మనస్సుగా) వ్యక్తమౌతుంది. తలపు, గ్రహణా మనో వ్యాపారములే.

తలపు వ్యక్తిత్వములో ఒక దశ.

మనస్సు తలపు రూపు. జీవుడే, జీవ భావమే వ్యక్తి, వ్యక్తిత్వమూను. వ్యక్తిత్వానికి జీవుడని వ్యవహారము. మనస్సు జీవ శక్తి యొక్క రూపు. హృదయములో వసిస్తుంది. ఆత్మ చేతన మేధలో ప్రచలితము అవడమే మనకు మెలకువ రావడము, తలపులు, గ్రహించడము మొదలవడమూను.

జీవాత్మ తన్ను ఆవిష్కరించే పలురూపాల్లో తలపు ఒకటి.

శరీరములో మానసికముగా ఏర్పడిన "ఆసామీ" యే జీవాత్మ.

శరీరంలో ఏర్పడిన "ఆసామీ" నిదురిస్తూ ఉండడమే మోక్షము. ఆసామీ రహితమైన (బంధ, సంబంధ రహితమైన) గమనించే తెలివియే ఆత్మ.

ఆత్మ నీకు ఎఱుకయే. ఆత్మ నీ ఎఱుకయే.
🥀
2. నిర్మల కాసారము - నివాత దీపము - నిస్తరంగ జలధి

ఎప్పుడూ ఉన్న, ఉండే చైతన్యము ఆత్మ. ఉదయించే చైతన్యము మనస్సు. లయమయ్యే చైతన్యమూ మనసే.

అన్నీ తెలుస్తూనే, అన్నీ తెలుసుకుంటూనే, అన్నిటినీ తెలుపుతూనే, చెదరని శాంత స్థితిని అనుభవిస్తూ తామరాకుపై నీటిబొట్టు మాదిరి జీవన పథములో చరించవచ్చు.

ఏ ఇతరమూ అక్కర లేకుండా తనంత తానుగా తెలిసే జ్ఞానము అపరోక్ష జ్ఞానము.

మరియొక దాని ద్వారా తెలిసే జ్ఞానము పరోక్ష జ్ఞానము.

మౌనము నిత్య వాక్కు. నిష్క్రియ. నిరంతర క్రియ.

మెట్లు గమ్యాన్ని చేరడానికి ఉపయోగిస్తాయి. గమ్యము చేరాక వాటి స్పృహ అనవసరము. వాటి ప్రమేయము ఇక ఉండదు. శాస్త్రజ్ఞానము అంతే. ఆత్మానుభవము అయ్యే వరకే దాని ఉపయోగము. ఆపై శాస్త్రజ్ఞానము ఉపయోగము లేదు. అన్నము తినివేసిన తరువాత విస్తరితో పని లేనట్టు. ఆ విస్తరిని విసిరి పారేసినట్టు.

గుణములూ, వృత్తులూ మిథ్యాహమునకు (వ్యక్తికీ/జీవాత్మకు) చెందుతాయి. ఆత్మకు కాదు. ఎవడు యత్నించినా, అవిద్యను తొలగించడానికే. ఆ తర్వాత ఏ సందేహములు కలుగవు. సత్యమైన ఆత్మ నిత్య స్థితము. ఆత్మస్థితిని పొందడానికి ప్రయత్నమేమీ అక్కరలేదు.

మౌనము ఎడతెగని వచస్సు. అస్తమానూ మాట్లాడే మాట. వచస్సు సశబ్దమైనపుడు అది మౌన వచస్సుకు అడ్డు వస్తుంది. స్వరయుత వచస్సుకు వాగావయవాలవసరం. కాని మౌన వచస్సు తలపులకి అవ్వలిది. అది వాగతీతము. పలుకని పదము. పరా వాక్కు.

ఉన్న జ్ఞానములు మూడు:

అజ్ఞానము (తెలియమి; నిద్ర - జ్ఞాత - జ్ఞానముల లేమి)

సాపేక్ష జ్ఞానము : జ్ఞాత - జ్ఞానము - జ్ఞేయము ల తో కూడిన త్రిపుటీ యుతము.

జ్ఞానము: శుద్ధ జ్ఞానము. ప్రజ్ఞానము. జ్ఞేయము లేమి.

మనసు, జగత్తు వ్యక్తాత్మ. ఆత్మ వ్యక్తమైనా, కాకున్నా జ్ఞాని స్థితి స్థిరముగా ఉంటుంది. నిర్మల కాసారము వలె. నివాత దీపము వలె
3. శ్రీ రమణ మహర్షి పలుకులు
వాసనా క్షయము
విషయానుభవములను వాసనలు అంటారు. ఇవి మనలో విషయ గ్రహణము జరుగుతున్నప్పుడు అప్పుడే ఏర్పడి జ్ఞాపకములుగా స్థిరపడి ఉంటాయి.
మెలకువ అంటే అహంకారము లేవడమే. వాసనలు ప్రేరేపింప బడిన పిదపే అహంకారము లేస్తుంది.
వాసనలంటని, వాసనలు ప్రేరేపింప బడని ఆ తొట్ట తొలి స్థితే; నిత్యమూ, శుద్ధమూ అయిన సంస్థితి. ఆత్మ స్థితి.
గుర్వనుగ్రహము వలన వాసనలు (విషయానుభవములు) క్షయించే కొద్దీ, క్రమముగా ధ్యానము కుదురునేగాని, మరో విధముగా కాదు.
గురువు మూడురకములు : మన ఇష్ట దైవము, మానుష గురువు, మన స్ఫురణా శక్తి [ఈశ్వరో గురు: ఆత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్య దేశాయ (దేహాయ) దక్షిణామూర్తయే నమ:]. "వాక్ మనసి సంపద్యతే, మన: ప్రాణే, ప్రాణాత్తేజసి, తేజ: పరస్యామ్ దేవతాయాం ఇతి.
ఇలా జరిగే వాసనా క్షయము తో ఆత్మా దృష్టి అవుతుంది. దీనిని విశ్రాంత దృష్టి అంటారు.
ఆత్మ కన్నుగా , చూపుగా అనుభవానికి రావడమే వాసనా క్షయము.
వాసనా క్షయము పూర్తిగా అయితేనే జ్ఞానము సుస్థిరమవుతుంది.
మనిషి నిజ స్వభావము నిర్విషయానుభవము. వాసనా (విషయానుభవ) రాహిత్యము.
విషయ గ్రహణము [దృశ్యము-కన్ను , శబ్దము-చెవి, రుచి-నాలుక, వాసన (ఘ్రాణము) - ముక్కు, స్పర్శ - చర్మము], విషయానుభవ (విషయములు కలిగించిన అనుభవములు జ్ఞాపకములుగా స్థిరపడి ఉంటాయి) ప్రేరణ విరమింప బడిన స్థితి వాసనా క్షయ స్థితి. బ్రహ్మ స్థితి. ఆత్మ స్థితి.

🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!