పెద్దాపురం పెళ్లి .!

 పెద్దాపురం పెళ్లి .!

.

 నాకు ఎనిమిదేళ్ళ వయసులో జరిగిన ఆ పెద్దాపురం పెళ్లి నాకు బాగా జ్జాపకం ఉండడానికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి.

 ఒకటేమో పెళ్లి ముందు రోజు రాత్రి చిట్టెమ్మ బామ్మ గారు అనే వితంతువు ఒక విడిది గదిలో మూల తెల్ల ముసుగు వేసుకుని ముడుచుకుని పడుకుంది. నేను ఏదో పని మీద ఆ గది లోకి వెళ్లి ఆవిడని చూసి, హడిలి చచ్చి పోయి “బాబోయ్ దెయ్యం” అని అరుచుకుంటూ బయటకి పారిపోయాను. ఎందుకంటే అంతకు ముందు వారం పది రోజుల ముందు ఏ చందమామ లోనో దెయ్యాలు తెల్ల ముసుగులు వేసుకుని, అరికాళ్ళు వెనక్కి తిప్పి ముడుచుకుని మూల దాక్కుంటాయి అని చదివాను. అదీ సంగతి. అసలు సంగతి తెలుసుకుని అందరూ నన్ను చూసి కోప్పడ లేదు కానీ అందరిలోనూ నవ్వుల పాలు కావడం నాకు బాగా గుర్తు.

.

 మరొక విశేషం ఏమిటంటే చిన్న అమ్మలు  ..అంటే మా అక్క ….అదే గదిలో రాత్రి పడుకుంటే ఎవరో జడ కొంచెం కత్తిరించి, మా అక్క పెట్టుకున్న బంగారం పాపిడి పిందెలు, చేమంతి పువ్వు దొంగతనం చేశారు. మర్నాడు పొద్దున్న మా అమ్మ మా అక్కకి జడ వేస్తూ చూసి అనుమానం వచ్చి అందరి పెట్టెలూ చూస్తుంటే ఈ చిట్టెమ్మ బామ్మ గారి కూతురి పెట్టె లోపల సగం, పైన వేళ్ళాడుతూ సగం కత్తిరించిన జుట్టు కనిపించింది. అప్పుడు మా చిట్టెన్ రాజు బాబయ్య, మా నాన్న గారు పంచాయితీ పెట్టి, ఆ పెట్టె తాళం తీయిస్తే ఆ దొంగతనం బయట పడింది. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళలో అందరూ నగలు పెట్టుకుని వెళ్ళడం, ఇలా దొంగతనాలు జరగడం పరిపాటే !

.

ఇక …ముఖ్యమైనది అని చెప్పను కానీ ….మూడో కారణం నా జన్మలో నేను చూసిన మొట్ట మొదటి భోగం మేళం పెద్దాపురం పెళ్లి  లోనే! ఆ రోజుల్లో పెళ్లి అనగానే మొట్ట మొదట చూసేది ఏ ఊరి బేండ్ మేళం, ఏ ఊరి భోగం మేళం, ఏ ఊరి వంటవాళ్లు మొదలైన హంగులే.

 అందులో కాకినాడ లేదా రాజమండ్రి బేండ్ మేళం, కోనసీమ వంటవాళ్లు పేరున్న వాళ్ళు అయితే మా ప్రాంతాలలో పెద్దాపురం భోగం మేళం చాలా ప్రసిద్ధమైనది. పెళ్లి ముందు రోజు రాత్రి ఊరేగింపు లో పల్లకీ బోయీలు, బేండ్ మేళం లో ఉన్న మంగలి వారు చమ్కీ గుడ్డలు వేసుకుని హుషారైన పాటలు వాయిస్తూ ఉంటే పది, పది హేను మంది అమ్మాయిలు సినిమా పాటలకి డేన్స్ చేస్తూ పెళ్లి వారికి వినోదం కలిగించే వారు. ఇప్పుడు ఇదంతా ఏదో సినిమా సీను లా అనిపించ వచ్చు నేమో అది ఆ రోజుల్లో అక్షరాలా నిజంగా అలాగే జరిగేది.

.

ఇక పెళ్లి వారిలో వయసు లో ఉన్న యువకులు ఈ మేళం వాళ్ల లో బావున్న యువతుల చేత ప్రెవేటు గా రికార్డింగ్ డేన్సులు ..సినిమాల లో లాగా….చేయించుకునే వారుట…నేను అవేమీ చూడ లేదు కానీ, పెట్రోమేక్స్ లైట్ల వెలుగులో మేళం వాళ్ళ డేన్స్ లు అప్పుడే మొట్టమొదటి సారి చూశాను కానీ అంత కంటే ఎక్కువ విశేషాలేమీ ఇప్పుడు గుర్తు లేవు.

 ఆ పెళ్ళికి రెండేళ్ళ ముందు పోయిన మా తాత గారి కోరిక మీద మా పెద్దక్క  పెళ్ళీ, మా మేనత్తల అందరి కూతుళ్ళ పెళ్ళిళ్లూ మా అమ్మా, నాన్న గారి చేతుల మీదుగానే జరిగాయి. పెళ్లి కి కావలసిన దినుసులన్నీ మా పొలంలో పండినవే! 

అన్నట్టు అప్పుడు ధాన్యం ధర “అక్కుళ్ళు” కుంచం ఒక రూపాయి.. బస్తాకి 16 రూపాయల 2 అణాలు. వెల్లుల్లి పాయలు 2 వేసెలకి 2 రూపాయల 10 అణాలు. తాపీ మేస్త్రీ కూలి రోజుకి 2 రూపాయలు. మా పెద్దన్నయ్య నాకూ, మా తమ్ముడికీ కొనిపెట్టిన 4వ క్లాసు ఎక్సెర్సైజ్ పుస్తకాలు – 100 పేజీలు  – 4 పుస్తకాలు కలిసి 2 రూపాయల 3 అణాలు. 50 తారాజువ్వలు 1 రూపాయి 8 అణాలు. తాటాకులు వందకి 1 రూపాయి 10 అణాలు. అదే పెళ్లి లో గాడి పొయ్యి లోంచి కొన్ని పెద్ద నిప్పు కణికెలు పైకి ఎగరగానే పై కప్పు అంటుకుంది అనీ, వెంటనే బిందెలతో నీళ్ళు జల్లి మంటలు ఆర్పేశారు అనీ కూడా చూచాయగా నాకు జ్జాపకం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!