“పోతన్న తెలుగుల పుణ్యపేటి.”

“పోతన్న తెలుగుల పుణ్యపేటి.”

.

“నా గీతం జాతిజనుల గుండెలలో ఘూర్ణిల్లా”లని ఆకాంక్షించాడు ఆధునిక కవి..

.

ఆ కొలబద్దకు సరిగ్గా అతికిపోయే కవి పోతన.

.

ఆయన పద్యాలు జాతిజనుల గుండెల్లోనే కాదు రసనల మీద కూడా నివసిస్తున్నాయి

.. విశ్వనాథ వారన్నట్లు “పోతన్న తెలుగుల పుణ్యపేటి.”

.

సీ. కమనీయ భూమి భాగములు లేకున్నవే

పడియుండుటకు దూది పరుపులేల?

సహజంబులగు కరాంజలులు లేకున్నవే

భోజన భాజన పుంజమేల?

వల్కలాజిన కుశావళులు లేకున్నవే

కట్టదుకూల సంఘంబులేల?

గొనకొని వసియింప గుహలు లేకున్నవే

ప్రాసాద సౌధాది పటల మేల?

తే. ఫలరసాదులు కురియవే పాదపములు

స్వాదుజలముల నుండవే సకల నదులు

పొసగ భిక్షము బెట్టరే పుణ్య సతులు

ధన మదాంధుల కొలువేల తాపసులకు

ఈ పద్యం బమ్మెర పోతనామాత్యునిది. ఆయన ఆంధ్రీకరించిన మహాభాగవతం ద్వితీయ స్కంధం .

పడుకోడానికి ఇంత నేల ఉండగా తల్పాలూ శయ్యలూ కావాలా? తినడానికి దేవుడిచ్చిన చేతులుండగా బంగారూ, వెండీ పళ్ళాలు కావాలా? నార చీరలూ, పట్టలూ ఉండగా పీతాంబరాలు అవసరమా? ఉండటానికి గుహలుండగా ఆశ్రమాలూ ప్రాసాదాలూ అవసరమా? తినేందుకు చెట్లు పండ్లిస్తుండె, తాగేందుకు నదులు నీరిస్తుండె. ఇంటింటా ఉండే పుణ్య గృహిణులు భిక్ష పెడతారాయె. తపసు చేసుకునే వారికి ఇంకేం కావాలి? ధనమదంతో కళ్ళు కనిపించని వారిని ఎందుకు ఆశ్రయించాలి? ఇదీ పద్య భావం.

ధనమదాంధుల కొలువేల తాపసులకు? అన్నాడు పోతన. తాపసులకేనా? సాధారణ జనులకు మాత్రం ఎందుకు? ఆత్మగౌరవం కలవాడు ఇతరులను ఎందుకు ఆశ్రయించాలి? సహజంగా స్వేచ్చగా బ్రతకడానికి ఈ ప్రపంచంలో లేనిది ఏమున్నది? పరిమళవంతంగా బ్రతుకును పండించుకోడానికి ఎంత అనువు లేదు?స్నానానికీ పానానికీ భుక్తికీ నిద్రకూ అన్నిటికీ అవకాశాలున్నపుడు ధనాధిపుల కాళ్ళ వద్ద ఉండాల్సిన అవసరమేముంది? ఈ అభిప్రాయాన్ని ఎంతో చక్కగా చెబుతుందీ పద్యం.

ఈ పద్యం చదవగానే ముందు స్ఫురించేది ఓహో ఎంత అందంగా చెప్పాడో అనే భావన. ఒక ఆత్మగౌరవం కలిగిన మనిషి, వ్యర్థాడంబరాలకు వ్యామోహం చెందని మనిషి, శరీర పోషణ మాత్రాన్ని ఎంత సులభంగా నిర్వహించుకోవచ్చునో ఎంత బాగా చెప్పాడో అనే మెప్పు కలుగుతుంది. ఆ చక్కటి భావం వల్ల ప్రసన్నతా పూర్వకమైన పరిసరాలు ఆ పద్యం చుట్టూ ఆవరించుకున్నాయి. అయితే, తాత్పర్యపు వెలుగులో పద్య నిర్మాణం లోని సొగసును నిర్లక్ష్యం చేయనక్కర లేదు. పద్యం చెప్పడంలోని అలవోక తనము, సహజత్వము అంతే అందంగా ఉన్నాయి. పోతన సహజపాండిత్యం కలిగిన వాడుగా పేరున్నవాడు. గణాలు కిట్టించుకుంటూ రాయడం గానీ, ఒక భావం ఒక పాదంలో పట్టక పైపాదంలో ఇరికించడం గానీ, యతిప్రాసల కోసం ఏవో పదాలను కృతకంగా తెచ్చిపెట్టుకోవడం గానీ ఆయన చాలా పద్యాల్లో కనపడదు. అంత్య ప్రాసలు ఆయన బలహీనతా – బలమూ కూడా. సాధారణంగా పోతన అన్ని పద్యాల్లో ఉండే ప్రసన్నత పై పద్యం లోనూ ఉన్నది. ధారాశుద్ధీ, శ్రవణ సుభగతా, భావం ఏ పాదానికి ఆ పాదం విరగడమూ, ఒక్క వ్యర్థ పదమూ లేకపోవడమూ – నిర్మాణ దృష్ట్యా ఈ పద్యానికి అందం సంతరించి పెట్టాయి. పద్య సౌందర్యమూ, భావ సౌందర్యమూ కలగలిసిన అందం ఈ పద్యం.

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!