విష్ణువు ఆగమనము! (గజేంద్ర మోక్షం - పోతానా మాత్యుడు)

విష్ణువు ఆగమనము!

(గజేంద్ర మోక్షం - పోతానా మాత్యుడు)

-ఆ.

"విశ్వమయత లేమి వినియు నూరక యుండి

రంబుజాసనాదు లడ్డపడక

విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు

భక్తియుతున కడ్డపడఁ దలంచె!

భావము:

ఆ సమయంలో బ్రహ్మదేవుడు మొదలగు వారికి విశ్వమంతా నిండి ఉండే గుణం లేకపోవుటచేత గజరాజు మొర వినబడినా వారు అడ్డుపడకుండ ఊరికే ఉండిపోయారు. విశ్వమంతా వ్యాపించే వాడు, ప్రభువు, విజయశీలి ఐన విష్ణువు భక్తుడైన గజరాజును రక్షించాలని నిశ్చయించుకొన్నాడు.

.

-మ.

"అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా

పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో

త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై !

భావము:

ఆపదలలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక పక్కన ఉండే మేడకు సమీపంలో ఒక అమృత సరస్సుంది. దానికి దగ్గరలో చంద్రకాంతశిలల అరుగుమీద కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. అప్పుడు భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు కాపాడమని పెట్టే మొర విన్నాడు. గజరాజుని కాపాడడానికి వేగిరపడ్డాడు.

.

-మ.

"సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే

పరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాం

తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో

పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై !

భావము:

గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలనే వేగిరపాటుతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలను చేతులలో ధరించలేదు. సేవకులను ఎవరిని పిలవలేదు. వాహనం ఐన గరుత్మంతుని పిలవలేదు. చెవికుండలాల వరకు జారిన జుట్టుముడి కూడ చక్కదిద్దుకోలేదు. ఆఖరికి ప్రణయ కలహంలో పట్టిన లక్ష్మీదేవి పైటకొంగు కూడ వదలి పెట్టలేదు.

.

-వచనం 

హరి భక్తులను ప్రోచుట యందు అనురక్తి గలవాడు. సర్వ ప్రాణుల హృదయాలనే పద్మాలలో నివసించేవాడు. ఆయన గజేంద్రుని మొరలన్నీ విన్నాడు. లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చాలించాడు. ఆత్రుత చెంది అటునిటు చూసి గజేంద్రుని కాపడుట అనే బరువైన బాధ్యత తీసుకొని అటుపిమ్మట ఆయుధాలను అవధరించి ఆకాశమార్గాన బయలుదేరాడు. ఆ సమయంలో.

-మ.

తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వె

న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ

క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ

య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.

భావము:

అలా విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించటం కోసం లక్ష్మీదేవి కొంగు వదలను కూడ వదలకుండా తటాలున బయలుదేరటంతో – విష్ణువు వెనుక లక్ష్మీ దేవి, ఆమె వెనకాతల అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుడుడు, ఆయన పక్కనే విల్లూ గదా శంఖచక్రాలు నారదుడు విష్వక్సేనుడు వస్తున్నారు. వారి వెనువెంట వరసగా వైకుంఠపరంలో ఉన్న వాళ్ళందరు కూడా వస్తున్నారు.

.

-వ.

అప్పుడు పద్మం వంటి లక్ష్మీదేవి ముఖంలో చిందుతున్న మకరందం బిందువులు వంటి తియ్యటి చెమట బొట్లకు తుమ్మెదలు ఆనందంతో ముసిరాయి. విష్ణుమూర్తి తన పైట కొంగు పట్టుకొని లాక్కుపోతుంటే వైకుంఠుని వెన్నంటి పోతూ ఇలా అనుకుంది.

.

-మ.

తన వేంచేయు పదంబుఁ బేర్కొనఁ; డనాథస్త్రీ జనాలాపముల్

వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్? 

దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో? భక్తులం

గని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో? దుర్జనుల్.

భావము:

“ఎందుచేతనో విభుడు తాను వెళ్ళే చోటు చెప్పటం లేదు. దిక్కులేని స్త్రీల దీనాలాపాలు విన్నాడో ఏమో? దుర్మార్గులు ఐన దొంగలు ఎవరైనా వేదాలను దొంగిలిచారేమో? దేవతల రాజధాని అమరావతిపై రాక్షసులు దాడి చేసారేమో? విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అంటు దుర్మామార్గులు భక్తులను బెదిరిస్తున్నారో ఏమో?” అని అనేక విధాలుగా లక్ష్మి సందేహపడసాగింది.

-వ.

.

అని అనేక విధాలుగా లక్ష్మి సందేహపడసాగింది.

-క.

అడిగెద నని కడువడిఁ జను

నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్

వెడవెడ సిడిముడి తడఁబడ

నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్

భావము:

అప్పుడు లక్ష్మీదేవి భర్తను అడుగుదా మని వేగంగా అడుగులు వేసేది. అడిగితే మారు పలుకడేమో అని అడుగుల వేగం తగ్గించేది. చీకాకుతో తొట్రుపాటుతో అడుగులు వేసేది. మళ్ళీ ఆగేది. 

అడుగులు కదిలించలేక తడబాటుతో నడిచేది.కరిని కాపాడలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదల లేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి –

.

ఈ పద్యంచూస్తున్నామా వింటున్నామా చదువుతున్నామా అనిపిస్తుంది. సందర్భానికి తగిన పలుకుల నడకలు. భావాన్ని స్పురింపజేసే పద ధ్వని. ఇంకా ఆపైన సందర్భశుద్ధికేమో బహు అరుదైన సర్వలఘు కంద పద్యం ప్రయోగం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!