Skip to main content
చదువుల తల్లి సరస్వతీ !
శుభోదయం!
.
పోతన భాగవత ప్రారంభంలో సరస్వతీ మాత దయాబిక్ష కోరుతూ కొన్ని పద్యాలు అమోఘంగా రచించాడు .
అందులో ” తల్లీ ,నిన్ను దలంచి ” , “క్షోణితలంబునన్ ” , శారద నీరదేందు ” , కాటుక కంటి నీరు ” లాంటి పద్యాలు విద్యార్థులకు ప్రేమతో నేర్పించేవారు గురువులు — మొన్న మొన్నటి వరకూ .
ప్రస్తుతం అవి కనుమరుగవుతున్నాయి . మాతృమూర్తి కరుణించినవారి రచనలు కలకాలం నిలిచాయి . పోతనే అందుకు ఉదాహరణ . చదువులు నిజంగా వంటి కబ్బాలంటే , చదువుల తల్లి కరుణ కావాలి . బిడ్డలందరికీ ఈ పద్యాలు నేర్పించి , వల్లె వేయించి సరస్వతీ మాత దయకు పాత్రులను చేయడం మన ధర్మం.
.
ఈ క్రింది పద్య సరస్వతీ మాత అనుగ్రహం కోరి పోతన రచించిన పద్యం .
రమ్యం గా ఉంటుంది మరి చదవండి -పిల్లలతో చదివించండి .
పుణ్యమూ , పురుషార్థమూ , చదువుల తల్లి అనుగ్రహమూ లభిస్తాయి .
.
పుట్టం బుట్ట శరంబునన్ మొలవ , నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను , గాళి గొల్వను , బురాణింపన్ దొరంకొంటి మీ
దెట్టే వెంట జరింతు దత్సరణి నా కీవమ్మ ! యో యమ్మ ! మేల్
పట్టున్ నాకగుమమ్మ ! నమ్మితి జుమీ బ్రహ్మీ ! దయాంభోనిధీ!
.
తలపై పుట్ట పెరిగింది వాల్మీకికి . ఆ వాల్మీకిగా నేను పుట్టలేదు .
వ్యాస భగవానుని లాగా పడవలో పుట్టలేదు .
కవికులతిలకుడై కాళిని కొల్చిన కాళిదాసునూ కాదు .
అయినా భాగవతాన్ని తెలుగు భాషలో రచించడానికి పూనుకున్నాను . అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాను .
నాకు మార్గాన్ని నిర్దేశించి , చేయూత నిచ్చి నడిపించవమ్మా .
నీవే తప్ప ఇతఃపరంబెరుగను తల్లీ . అనుగ్రహించవమ్మా .
నిన్నే నమ్ముకున్నానమ్మా ! చదువుల తల్లి సరస్వతీ !
నను కరుణించవమ్మా ! బ్రాహ్మీ ! నీవు దయా సముద్రురాలవు కదమ్మా .
Comments
Post a Comment