సుమతీ శతకము!




సుమతీ శతకము!

VINJAMURI VENKATA APPARAO·WEDNESDAY, 11 MARCH 2020·

సుమతీ శతకము!

-

తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానము ఉంది.

బహుజన ప్రియమైన శతాకాలలో సుమతీ శతకం ఒకటి. ఇది బద్దెన అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి.

"అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పద్యలు తెలియని తెలుగువారు అరుదు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలను సామెతలు లేదా జాతీయములుగా పరిగణించ వచ్చును.

-

సుమతీ శతకం వ్రాసినదెవరో కచ్చితమైన సమాచారం లభించడంలేదు. పలు రచనల్లో "సుమతీ శతక కర్త" అని ఈ రచయితను ప్రస్తావించడం జరుగుతుంది. క్రీ.శ. 1220-1280 మధ్య కాలంలో బద్దెన లేదా భద్ర భూపాలుడు అనే కవి సుమతీ శతకం రచించాడని సాహితీ చరిత్రకారుల అభిప్రాయం.

ఇతడు కాకతీయ రాణి రుద్రమదేవి (1262-1296) రాజ్యంలో

ఒక చోళ సామంత రాజు. ఈ రచయితే రాజనీతికి సంబంధించిన సూక్తులతో నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇతడు మహాకవి తిక్కనకు శిష్యుడు.

.

సుమతీ శతకాన్ని బద్దెనయే రచించినట్లయితే తెలుగు భాషలో వచ్చిన మొదటి శతకాలలో అది ఒకటి అవుతుంది.

(పాలకురికి సోమనాధుని వృషాధిప శతకము, యాతావక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వచ్చిన కాలంలోనిదే అవుతుంది.)

సుమతీ శతకమందు కొన్ని పద్యములు

సంస్కృత శ్లోకముల కాంధ్రీకరణములు.

ఉదాహరణ:-

.

శ్లో: కార్యేషుదాసీ కరణేషు మంత్రీ

రూపేచలక్ష్మీ క్షమయా ధరిత్రీ

భోజ్యేషు మాతా శయనేషు రంభా

షడ్ధర్మయుక్తా కులధర్మపత్నీ

.

పని సేయునెడల దాసియు

ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్

దనభుక్తియెడల దల్లియు

నన దనకుల కాంత యుండ నగురా సుమతీ.

అదే విధంగా భర్తృహరి శ్లోకములకు భాషాంతీకరణములు కూడా ఉన్నాయి.

పాలను గలసిన జలమును

బాలవిధంబుననె యుండు బరికింపంగా,

బాలచవి జెరుచు, గావున

తాలసుడగువానిపొందు వలదుర సుమతీ...!

పెట్టిన దినముల లోపల

నట్టడవులకైన వచ్చు నానార్థములున్

బెట్టని దినముల గనకపు

గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ.

.

శతాబ్దాలుగా సుమతీ శతకం పద్యాలు పండితుల, పామరుల నోళ్ళలో నానుతున్నాయి. సుమతీ శతకం పద్యాలలోని పాదాలు చాలా తేలికగా గుర్తుంటాయి. అనేక సందర్భాలలో ఇందులోని పదాలను ఉదహరించడం జరుగుయి. సుమారు ఏడు వందల ఏళ్ళ క్రితం వ్రాయబడినా దాదాపు అన్ని పదాలూ ఇప్పటి భాషలోనూ వాడుకలో ఉన్నాయి. ఇది పాతకాలం కవిత్వమని అసలు అనిపించదు. పండితులకు మాత్రమయ్యే పరిమితమైన భాష కాదు. పెద్దగా కష్ట పడకుండానే గుర్తు పెట్టుకొనే శక్తి ఈ పద్యాలలోని పదాలలోనూ, వాటిని కూర్చిన శైలిలోనూ అంతర్లీనమై ఉంది. అందుకే చదవడం రానివాళ్ళు కూడా సుమతీ శతకంలోని పద్యాలను ధారాళంగా ఉదహరించగలిగారు.

.

పూర్తి పద్యం రానివారు కూడా ఒకటి రెండు పాదాలను ఉట్టంకించడం తరచు జరుగుతుంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు

-అక్కరకు రాని చుట్టము

-అప్పిచ్చువాడు వైద్యుడు

-ఇత్తడి బంగారమగునె

-తను వలచినదియె రంభ

-ఖలునకు నిలువెల్లవిషము

-బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ

-కనకపు సింహాసనమున శునకము కూర్చుండ బెట్టి

-ఎప్పుడు సంపదలు గలిగిన నప్పుడు బంధువులు వత్తురు

-

తరతరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకూ, పంతుళ్ళు తమ శిష్యులకూ సుమతీ శతకంలోని నీతులను ఉపదేశిస్తున్నారు.

700 సంవత్సరాల తరువాత కూడా ఇందులోని సూక్తులు నిత్య జీవనానికి సంపూర్ణంగా వర్తిస్తాయి. చెప్పదలచిన విషయాన్ని సూటిగా, కొద్ది పదాలలో చెప్పిన విధానం అత్యద్భుతం.

మొదటి పద్యంలోనే కవి

"ధారాళమైన నీతులు నోరూరగ జవులుపుట్ట, ఔరా యనగా, నుడివెద"నని చెప్పుకున్నాడు.

ఇందుకు పూర్తి న్యాయం చేయగలిగాడు.

.

1840లో సి.పి.బ్రౌన్ సుమతీ శతకాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు.


సుమతీ శతకం ఒక సమీక్ష!

-

ఇప్పటి "సామాజి సృహ" పరంగా ఉన్న అవగాహనతో చూస్తే


కొన్ని పద్యాలలో కనిపించే ఆనాటి దృష్టి అసంబద్ధంగా కనిపిస్తుంది. . ముఖ్యంగా స్త్రీల పట్ల,


కొన్ని కులాల పట్ల వ్యక్తమైన అభిప్రాయాలు దురాచారాలుగా అనిపిస్తాయి.


(నమ్మకుమీ వామ హస్తుని",కోమలి నిజము, గొల్ల ని సాహిత్య విద్య" ఉండవని కవి వ్రాశాడు).


ఎవరైనా తమ కాలానికి సంబంధించిన అభిప్రాయాలకు బందీలే అని మనం గ్రహించాలి..

శ్రీరాముని దయచేతను

నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా

ధారాళమైన నీతులు

నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!

తాత్పర్యం: మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.

.

అల్లుని మంచితనంబును

గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్

బొల్లున దంచిన బియ్యముఁ

దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!

తాత్పర్యం: అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్యజ్ఞానం, ఆడదానియందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులూ లోకములో ఉండవు.


.

అడిగిన జీతంబియ్యని

మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్

వడిగల యెద్దుల గట్టుక

మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ!

తాత్పర్యం: అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే, వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకుని పొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది.

.

అక్కరకు రాని చుట్టము

మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా

నెక్కినఁ బారని గుర్రము

గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!

తాత్పర్యం: అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును.

.ఇప్పటి "సామాజి సృహ" పరంగా ఉన్న అవగాహనతో చూస్తే

కొన్ని పద్యాలలో కనిపించే ఆనాటి దృష్టి అసంబద్ధంగా కనిపిస్తుంది. . ముఖ్యంగా స్త్రీల పట్ల,

కొన్ని కులాల పట్ల వ్యక్తమైన అభిప్రాయాలు దురాచారాలుగా అనిపిస్తాయి.

(నమ్మకుమీ వామ హస్తుని",కోమలి నిజము, గొల్ల ని సాహిత్య విద్య" ఉండవని కవి వ్రాశాడు).

ఎవరైనా తమ కాలానికి సంబంధించిన అభిప్రాయాలకు బందీలే అని మనం గ్రహించాలి.

.


.

స్త్రీల ఎడ వాదులాడక

బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ

మేలైన గుణము విడువకు

ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!

తాత్పర్యం: స్త్రీలతో ఎప్పుడూ గొడవపడద్దు. చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను వదలవద్దు. యజమానిని దూషించవద్దు.

.


వెలయాలు సేయు బాసలు

వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్

గలలోఁన గన్న కలిమియు,

విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!

తాత్పర్యం: వేశ్య ప్రమాణాలు, విశ్వబ్రాహ్మణుని స్నేహం, వెలమదొరల జత, కలలో చూసిన సంపదలను స్పష్టంగా నమ్మరాదు.

.

బలవంతుడ నాకేమని

పలువురితో నిగ్రహించి పలుకుట మేలా

బలవంతమైన సర్పము

చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!

తాత్పర్యం: నేను చాలా బలవంతుడ్ని. నాకేమీ భయం లేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి విరోధం తెచ్చుకోవడం మంచిది కాదు. అది ఎప్పుడూ హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగిన సర్పం కూడా చలిచీమలకు లోబడి చావడం లేదా?

.

బంగారు కుదువబెట్టకు

సంగరమునఁ బారిపోకు సరసుఁడవగుచో

నంగడి వెచ్చములాడకు

వెంగలితో జెలిమి వలదు వినురా సుమతీ!

తాత్పర్యం: బంగారు నగలను తాకట్టు పెట్టవద్దు. యుద్ధభూమి నుంచి వెన్నిచ్చి పారిపోవద్దు. దుకాణం నుంచి సరకులు అరువు తెచ్చుకోవద్దు. మూఢునితో స్నేహం చేయవద్దు.

.


.

పెట్టిన దినములలోపల

నట్టడవులకైనవచ్చు నానార్థములున్

బెట్టని దినములఁ గనకపు

గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!

తాత్పర్యం: అదృష్టం కలసివచ్చిన రోజుల్లో అడవి మధ్యలో ఉన్నా అన్ని సంపదలూ అక్కడికే వస్తాయి. దురదృష్టం వెన్నాడేటపుడు బంగారు పర్వతాన్ని ఎక్కినా ఏమీ లభించదు.


.

పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా

పుత్రుని కనుగొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

తాత్పర్యం: కుమారుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుడ్ని మెచ్చిన రోజుననే నిజమైన సంతోషం కలుగుతుంది.

.

పురికిని బ్రాణము కోమటి

వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం

గరికిని బ్రాణము తొండము

సిరికిని బ్రాణము మగువ సిద్ధము సుమతీ!

తాత్పర్యం: ఈ లోకంలో పట్టణానికి వైశ్యుడు, వరిసస్యమునకు నీళ్లు, ఏనుగుకు తొండము, ఐశ్వర్యానికి స్త్రీ జీవం ఒసంగుదురు.

.

పిలువని పనులకు బోవుట

కలయని సతి రతియు రాజు గానని కొలువు

బిలువని పేరంటంబును

వలవని చెలిమియును జేయవలదుర సుమతీ

తాత్పర్యం: పిలవని కార్యక్రమాలకు వెళ్లడం, హృదయంతో కలవని స్త్రీతో సంభోగం, పాలకులు చూడని సేవ, పిలవని పేరంటం, కోరని స్నేహం చేయదగదు.

.

పరసతుల గోష్టినుండి

పురుషుడు గాంగేయుడైన భువి నిందబడున్

బరుసతి సుశీయైనను

బరుసంగతినున్న నింద పాలగు సుమతీ!

తాత్పర్యం: భూమిపై, పర స్త్రీలతో సరససల్లాపాలు ఆడితే భీష్ముడయినా నిందను ఎదుర్కొనవలసిందే. ఇతర స్త్రీ ఎంత మంచిదయినా పర పురుషునితో స్నేహం చేస్తే అపకీర్తి పాలగును.

.


పరనారీ సోదరుఁడై

పరధనముల కాసపడక పరులకు హితుడైఁ

పరుల దనుఁబొగడ నెగడక

పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ!

తాత్పర్యం: ఇతర స్త్రీలను తోబుట్టువులుగా చూసుకొంటూ, ఇతరుల ధనానికి ఆశపడకుండా, అందరికీ ఇష్టుడై, ఇతరులు పొగుడుతుంటే ఉప్పొంగక, కోపం ప్రదర్శించినప్పుడు బాధ పడకుండా ఉండేవాడే శ్రేష్టుడు.


.

నవ్వకుమీ సభలోపల

నవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్

నవ్వకుమీ పరసతితో

నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!

తాత్పర్యం: సభల్లో, తల్లిని, తండ్రిని, భర్తను, ఇతరుల భార్యను, బ్రాహ్మణులను చూసి నవ్వరాదు.

.


తలమాసిన నొలుమాసిన

వలువలు మాసినను బ్రాన వల్లభునైనం

గులకాంతలైన రోఁతురు

తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ!

తాత్పర్యం: భూలోకంలో... తలమాసినా, శరీరానికి మురికి పట్టినా, మట్టలు మాసిపోయినా చేసుకొన్న భర్తనయినా ఇల్లాళ్లు ఏవగించుకుంటారు.

.

తలనుండు విషము ఫణికిని

వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్

దలతోఁక యనక యుండును

ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

తాత్పర్యం: పాముకి విషము తలలోను, తేలుకు తోకలోనూ, దుష్టునకు నిలువెల్లా విషం ఉంటుంది.

.

తములము వేయని నోరును

విమతులతో జెలిమిసేసి వెతఁబడు తెలివిన్

గమలములు లేని కొలకుఁను

హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!

తాత్పర్యం: తాంబూలం వేయని నోరు, దుర్మార్గులతో స్నేహం చేసి బాధపడే బుద్ధి, తామరపూలు లేని చెరువు, చంద్రుడు లేని రాత్రి శోభిల్లవు.

.

తనవారు లేనిచోటను

జనవించుక లేనిచోట జగడముచోటన్

అనుమానమైన చోటను

మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ!

తాత్పర్యం: కావాల్సిన చుట్టాలు లేనిచోట, మాట చెల్లుబడికాని ప్రదేశంలో, తగవులాడుకొనేచోట, తనను అవమానించే ప్రదేశాల్లో మానవుడు నిలువరాదు.

.

తన కలిమి ఇంద్రభోగము

తన లేమియె సర్వలోక దారిద్య్రంబున్

తన చావు జతద్ప్రళయము

తను వలచినదియె రంభ తథ్యము సుమతీ!

తాత్పర్యం: తన ఐశ్వర్యమే దేవలోక వైభవం; తన దారిద్య్రమే సమస్తలోక దారిద్య్రం; తన చావే ప్రపంచానికి ప్రళయం; తాను ప్రేమించినదే రంభ; మనుషులు భావించేది ఈ విధంగానే... ఇది నిజము.

.

తనయూరి తపసితనమును

దనపుత్త్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్

దన పెరటిచెట్టు మందును

మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ!

తాత్పర్యం: తన ఊరివాళ్ల తపోనిష్ఠ, కుమారుని విద్యాధిక్యత, భార్య సౌందర్యం, ఇంటి వైద్యాలను ఎవ్వరూ కూడా గొప్పగా వర్ణించి చెప్పరు.

.

తన కోపమె తన శతృవు

తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ

తన సంతోషమె స్వర్గము

తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ!

తాత్పర్యం: తన కోపమే తనకు శతృవువలే బాధించును. తన శాంతమే తనను రక్షించును. దయయే చుట్టాలవలే సాయపడును. ఆనందమే ఇంద్రలోక సౌఖ్యము. దుఃఖమే నరకం అగును. ఇది నిజం.

.

తడ వోర్వక యొడలోర్వక

కడువేగం బడచిపడినఁ గార్యంబగునే

తడవోర్చిన నొడలోర్చినఁ

జెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!

తాత్పర్యం: ఆలస్యాన్ని, శరీర శ్రమను సహించకుండా తొందరపడినా కార్యం కాదు. ఆలస్యాన్ని, శరీర శ్రమను ఓర్చుకొన్నప్పుడే చెడిపోయిన కార్యం కూడా నెరువేరుతుండును.

.

.


కొరగాని కొడుకు పుట్టినఁ

కొరగామియె కాదు తండ్రి గుణముల జెరచుం

జెరకు తుద వెన్నుఁపుట్టిన

జెరకునఁ దీపెల్ల జెరచు సిద్ధము సుమతీ!

తాత్పర్యం: చెరకుగెడ చివర వెన్ను పుడితే అది చెరకులోని తీయదనాన్ని ఏ విధంగా పాడు చేస్తుందో అలాగే అప్రయోజకుడైన కుమారుడు పుట్టడం వల్ల ఆ కుటుంబానికి ఉపయోగ పడకపోగా తండ్రికి ఉన్న మంచి పేరును కూడా చెడగొడతాడు.

.

కోమలి విశ్వాసంబును

బాములతోఁ జెలిమి యన్యభామల వలపున్

వేముల తియ్యఁదనంబును

భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ!

తాత్పర్యం: స్త్రీల పట్ల విశ్వాసం, పాములతో స్నేహం, పరస్త్రీల ప్రేమ, వేప చెట్లలో తీయదనం, రాజుల పట్ల నమ్మకం అన్నీ అసత్యాలు.

.


చీమలు పెట్టిన పుట్టలు

పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్

హేమంబుఁ గూడఁబెట్టిన

భూమీశులపాఁ జేరు భువిలో సుమతీ!

తాత్పర్యం: చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైనట్లు అజ్ఞాని కూడబెట్టిన బంగారమంతా రాజుల వశమై పోతుంది..

.

కులకాంత తోడ నెప్పుడుఁ

గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ

కలకంఠి కంట కన్నీ

రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!

తాత్పర్యం: భార్యతో ఎప్పుడూ తగాదా పడవద్దు. ఆమెపై లేనిపోని నేరాలను ఆరోపించవద్దు. ఉత్తమ ఇల్లాలు కంట నీరు కింద పడిన ఇంటిలో లక్ష్మిదేవి ఉండదు.

.


కూరిమిగల దినములలో

నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా

కూరిమి విరసంబైనను

నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!

తాత్పర్యం: పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో నేరాలు ఎప్పుడూ కనిపించవు. ఆ స్నేహం చెడగానే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. ఇది నిజం.

.


.

కమలములు నీడఁ బాసినఁ

గమలాప్తుని రశ్మి సోకి కమలినభంగిన్

దమ దమ నెలవులు దప్పినఁ

దమ మిత్రులు శతృలౌట తథ్యము సుమతీ!

తాత్పర్యం: కమలములు పుట్టిల్లయిన నీటిని విడిచిపెట్టి మిత్రుడు అయిన సూర్యుని ఎండ తాకిన వెంటనే కమిలిపోతున్నాయి. అలాగే, మానవులు తమ నివాసాలను విడిచిపెడితే స్నేహితులే శతృలవుతారు.

.

కప్పకు నొరగాలైనను

సప్పమునకు రోగమైన సతి తులువైనన్

ముప్పున దరిద్రుడైనను

దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!

తాత్పర్యం: కప్పకు కాలు విరిగినా, పాముకు రోగం వచ్చినా, భార్య దుష్టురాలైనా, ముసలితనంలో దారిద్య్రం సంభవించినా ఎక్కువ దుఃఖప్రదాలు అవుతాయి.

.

కనకపు సింహాసనము

శునకముఁ గూర్చుండబెట్టి శుభలగ్నమునఁ

దొనరఁగ బట్టముగట్టిన

వెనకటి గుణమేల మాను వినరా సుమతీ!

తాత్పర్యం: శుభ ముహూర్తంలో కుక్కను తీసుకొచ్చి బంగారు సంహాసనంపై కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా, దాని నిజనైజాన్ని ఎలా మానలేదో అల్పునికి ఎంత గౌరవం చేసి మంచి పదవి ఇచ్చినా తన నీచత్వాన్ని వదలలేడు.

.

కడు బలవంతుడైనను

బుడమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం

దడవుండనిచ్చె నేనియు

బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ!

తాత్పర్యం: ఎంత సమర్థత కలవాడైనా యవ్వనంలో భార్యను చిరకాలం పుట్టింట ఉండనిచ్చినచో తానే స్వయంగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడగును.

.

ఓడల బండ్లును వచ్చును

ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును

ఓడలు బండ్లును వలెనే

వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ!

తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చునట్లే, భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం పర్యాయంగా వస్తూంటాయి.

.

ఒల్లనిసతి నొల్లనిపతి

నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే

గొల్లండు గాక ధరలో

గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!

తాత్పర్యం: తన్ను ప్రేమించని భర్యను, యజమానిని, స్నేహితుడ్ని విడిచి పెట్టడానికి అంగీకరించనివాడే వెర్రి గొల్లవాడు గానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు.

.


ఏరకుమీ కసుగాయలు

దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ

పారకుమీ రణమందున

మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!

తాత్పర్యం: భూమిపై... పచ్చికాయలు ఏరి తినకు. చుట్టాలను దూషించకు. యుద్ధం నుంచి వెనుతిరిగి పారిపోకు. పెద్దల ఆజ్ఞలను జవదాటకు సుమా!

.

ఎప్పుడు సంపద కలిగిన

అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్

దెప్పలుగ జెరువునిండిన

గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!

తాత్పర్యం: చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు.

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!