🚩మాయాబజార్ కథా కమామీషు.🌹

🚩మాయాబజార్ కథా కమామీషు.🌹


☘️🍂☘️


నేటికి63 ఏళ్ళ క్రితం భారత చలనచిత్ర చరిత్రలోనే ఓ అద్భుతం విజయా వారి 'మాయాబజార్' రిలీజ్ అయింది.ఈ చిత్ర చరిత్రను చూస్తే....

ఈ సినిమా ఇప్పటికి పదకొండు సార్లు( ఒకసారి సాంఘీకం) తీశారు.

తొలిసారిగా 1925 లో 'మాయాబజార్ ఉరఫ్ సురేఖా హరణ్'అనే పేరుతో దర్శకుడు బాబూరావ్ పెయింటర్ మూకీగా తీశాడు. ఇందులో విఖ్యాత దర్శకుడు వి.శాంతారాం శ్రీకృష్ణ పాత్రధారి. టాకీ గా హిందీలో 1932 లో వానుభాయ్ వకీల్ దర్శకత్వంలో వచ్చింది. తరువాత ఆర్. పద్మనాభన్ దర్శకత్వంలో'మాయాబజార్ ఉరఫ్ వత్సలా కల్యాణం' గా 1935 లో తమిళంలో వచ్చింది. తర్వాత పి.వి.దాస్ దర్శకత్వంలో 'మాయాబజార్ ఉరఫ్ శశిరేఖా పరిణయం' గా తెలుగులో వచ్చింది. దీనిలో శాంతకుమారి శశిరేఖ. ఆతర్వాత మరాఠీ లో జి.పి.పవార్ దర్శకత్వంలో 1939 లో 'మాయాబజార్'గానూ,'మాయాబజార్ ఉరఫ్ వత్సలా హరణ్' పేరుతో మళ్ళీ హిందీ,మరాఠీ లలో దత్తా ధర్మాధికారి దర్శకత్వంలోనూ,1949 లో 'వీర ఘటోత్కచ్ ఉరఫ్ సురేఖా హరణ్' పేరుతో నానాభాయ్ భట్ దర్శకత్వంలోనూ,విడుదల అయ్యింది. దీనిలో మీనాకుమారి హీరోయిన్.

1957 లో తెలుగు, తమిళాలలో విజయా వారి 'మాయాబజార్' విడుదలైంది. దీనికి 'శశిరేఖా పరిణయం','వత్సలా కల్యాణం' లలో ఏదో పేరు పెట్టాలనుకున్నారు.కాని 'మాయాబజార్' అనే పేరునే పెట్టారు. దీనినే 1971 లో అదేపేరుతో హిందీలో డబ్ చేశారు.1958 లో బాబూభాయ్ మిస్త్రీ 'మాయాబజార్' పేరుతో తీశాడు. ఈ చిత్రం 'వీర ఘటోత్కచ' గా తెలుగు, తమిళ, కన్నడ భాషలలోకి డబ్ అయింది.1970 లో 'వీరఘటోత్కచ' పేరుతో శాంతిలాల్ సోనీ హిందీలో తీశాడు. తరువాత మళ్ళీ బాబూభాయ్ మిస్త్రీ 'మాయాబజార్' పేరుతో 1984లో హిందీ, గుజరాతీ లలో తీశాడు. ఆతర్వాత తెలుగులో దాసరి నారాయణరావు మరో మాయాబజార్ తీశారు.

అసలు ఈ కథను 1930 ప్రాంతాల్లో ధార్వాడ,పార్శీ కంపెనీలు హిందీ, గుజరాతీ భాషలలో నాటకంగా ప్రదర్శించేవారు.తరువాతి రోజులలో 'సురభి సంస్థ' ఈ నాటకాన్ని తెలుగులో విరివిగా ప్రదర్శించారు.చక్రావధానుల మాణిక్య శర్మ ఈ నాటకాన్ని సురభి వారికి వ్రాశారు.

ఇలా ఇన్ని మార్లు ఒకే కథను సినిమాగా మలచబడ్డది ప్రపంచ చరిత్రలోనే "మాయాబజార్" మాత్రమే!ఈ చిత్రాలన్నీ దాదాపుగా హిట్లే!! కాని విజయా వారి "మాయాబజార్" మాత్రమే 'ఎవర్ గ్రీన్ క్లాసిక్'!!!


ఉత్తమమైన అభిరుచితో, విశిష్టమైన చిత్రాలు నిర్మించిన నాగిరెడ్డి, చక్రపాణి "మాయాబజార్" చిత్రాన్ని 'నభూతో న భవిష్యతి' గా చిత్రీకరించారు.10-12 లక్షలలో సినిమాలు తీసే ఆ రోజుల్లో ఈ సినిమాను 30 లక్షలతో తీశారు.పూర్తిగా మమేకమై తీశారు కాబట్టే నేటికీ "విజయ ఢంఖా" మ్రోగిస్తూనే ఉంది.


పౌరాణిక చిత్రాలలో ఇంత అద్భుతమైన స్క్రీన్ ప్లే మరే చిత్రానికి లేదంటే అతిశయోక్తి కాదు.ఇంత పెద్ద కథను ఎటువంటి గందరగోళం లేకుండా కథను నడిపించారు రచయిత పింగళి నాగేంద్ర రావు,దర్శకుడు కె.వి.రెడ్డి.చిత్రంలో అడుగడుగునా పాండవుల ప్రస్థావన వచ్చినా పాండవులు మాత్రం ఎక్కడా కనబడరు!!!.'ఒకసారి1976లో గుంటూరులో జరిగిన ఇంటర్ కాలేజియెట్ క్విజ్ లో 'మాయాబజార్ లో ధర్మరాజు పాత్ర పోషించిన నటుడు ఎవరు 'అనే ప్రశ్న కూడ అడిగారు. అదీ ఈ చిత్ర రూపకల్పన లో పింగళి, కె.వి.రెడ్డి ల ప్రతిభ.


ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు. కాని మొదట్లో ఎస్.రాజేశ్వరరావు గారిని అనుకున్నారు. ఆయన 'లాహిరి లాహిరి లాహిరిలో','నీవేనా నను తలచినది','చూపులు కలసిన శుభవేళ','నీకోసమే నే జీవించునది'పాటల పల్లవులను స్వరపరిచారు. కాని తరువాత ఆయన బదులుగా ఘంటసాల సంగీతదర్శకులయ్యారు.ఘంటసాల మాస్టారు రాజేశ్వరరావు గారి అనుమతితో ఆ పల్లవులను వాడుకుని వాటికి చరణాలను కంపోజ్ చేసి ,మిగతా పాటలను స్వరపరచి ఆర్కెస్ట్రైజేషన్ ను,రికార్డింగ్ ను చేశారు.


మాయాబజార్ పేరు చెబితే గురుతొచ్చే టెక్నీషియన్ ఛాయాచిత్రగ్రాహకుడు 'మార్కస్ బార్ ట్లీ'.

'అల్లిబిల్లి ఆటలే లల్లిలలా పాటలే'అన్న పాటలో చిన్న శశిరేఖ(సచ్చు) పెద్ద శశిరేఖగా(సావిత్రి)మారుతుంది. ఓ కొలను ఒడ్డున చిన్న శశి కూచుని ఉంటుంది. ఆమె నీడ మీదకు కెమేరా 'పాన్'అవుతుంది. నీళ్ళు మెల్లిగా సుడితిరిగి వాటిమీదుగా ఆమె రూపం మీదకు 'పాన్'అవుతుంది. చిన్న శశి కూచున్న అదే ఫోజులో పెద్ద శశి కూచుని ఉంటుంది. షాట్ కట్ చేయకుండా, మిక్స్ చేయకుండా ఒకే షాట్ లో బార్ ట్లీ ఎట్లా తీశారన్పది ఇవాల్టికీ చర్చనీయాంశంగా మిగిలిపోయింది.

ఇక లాహిరి పాటయితే పగటివేళలో నదిపైన వెన్నెల కిరణాలను సృష్టించిన ఘనుడు. తళతళలాడి పోతున్న రెల్లు గడ్డి ని ఫోర్ గ్రౌండ్ లోనూ, బాక్ ప్రొజక్షన్స్ తో క్లోజప్ లనూ మేళవించి వెండితెరపై వెన్నెల ను కురిపించాడు. అన్నట్టు ఆ 'గింబళి' చుట్టుకోవడం ఎలా తీశాడండీ బాబో....(ఈ ట్రిక్ ను సురభి కళాకారులు స్టేజీ మీద చేస్తారు.నమో నమః)


కళాదర్శకులు మాధవపెద్ది గోఖలే,కళాధర్ లు దాదాపుగా30 సెట్స్ వేసి ద్వారకా నగరాన్ని, ద్వైతవనాన్ని అపూర్వంగా సృష్టించారు.(ఆ సెట్ డిజైన్లలో కొన్నింటిని పొందుపరుస్తున్నాను)


నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి సమకూర్చిన నాట్యాలలో "మోహినీ భస్మాసుర" నృత్య రూపకం అనన్య సామాన్యం.ఇందులో భస్మాసురినిగా ప్రఖ్యాత నర్తకులు గోపీనాథ్, మోహిని గా లలితారావులు నర్తించారు.


ఈ చిత్రంలో మరో చెప్పుకోతగ్గ కళాకారులు మాధవపెద్ది సత్యం.ఆయన పాడిన'వివాహ భోజనంబు'పాట అజరామరం.(దీని ఇంగ్లీష్ మాతృక ఈ మధ్యన సోషల్ మీడియాలో వైరలయ్యింది).ఈ పాటకు వారంరోజుల పాటు రిహార్సల్స్ చేశారు.'అహ్హహ్హహ్హ' అనే మాటను ఒత్తుత్తూ పాడడంలో పాట ప్రాణమంతా ఉంది.ఈ పాటను తమిళంలో తిరుచ్చి లోకనాధన్ పాడారు.రికార్డింగ్ అయిపోయిన తర్వాత పదిరోజుల పాటు మాట్లాడలేకపోయారట.సత్యం గారు ఈ చిత్రంలో'దారుకుని'వేషం కూడ వేశారు.


ఇక నటీనటుల ప్రసక్తి తీసుకురావడం నావల్ల అవుతుందా.....

నా ఆరేళ్ళ వయసులో నేను ఎస్.వి.రంగారావు గారిని చూశాను. ఆయన

నీకు నేనెవరో తెలుసునా అని అడిగారు.

నేను తడుముకోకుండా ఘటోత్కచుడు అని చెప్పాను.

ఆయన ఒక్కసారిగా నవ్వుతూ నా భుజం తట్టారు.

ఇది చాలదండీ నా జీవితానికి!!!!!

#####చక్రావధానుల రెడ్డప్ప ధవేజి####

నరసాపురం


☘️🍂☘️🍂☘️🍂☘️🍂🍂🙏☘️🍂☘️🍂☘️☘️☘️🍂☘️













Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!