చిలుక రక్తి!

చిలుక రక్తి!

చూచాయగా చిలుకలకు తెలిసింది రామచంద్రమూర్తి కష్టపడుతున్నాడనీ దుఃఖపడుతున్నాడనీ!

వానరులు వారధి కడుతూనే ఉన్నారు! ఊరుకోక ఉడుతలూ పనిజేస్తూనే ఉన్నాయి! ఐనా రామచంద్రమూర్తి కష్టపడుతూనే ఉన్నాడు! దుఃఖపడుతూనే ఉన్నాడు!

వారధి కట్టటం లంకకు చేరటం సీతను తేవటం ఎప్పుడో! ఆలస్యాని కాగలేక పోతున్నాడు రామచంద్రమూర్తి!

కాలపురుషుడు రామచంద్రమూర్తి కాలయాపనానికి ఆగలేక పోతున్నాడు!

చూచాయగా తెలుసుకున్నవి ఇదంతా చిలుకలు, వాటి గుండెలు కళక్కుమన్నవి! చళక్కున లేచినవి రామచంద్రమూర్తికి సాయం చేయటానికి.

ఎగిరి లంకలో వాలినవి చిలుకలు! చూసుకో ఏంచేస్తామో! ఏంతెస్తామో! అని పోతూ అన్నవి చిలుకలు రామచంద్రమూర్తితో! లంకకైపోతూ దార్లో వానరులను చూచి నవ్వుకున్నవి. ఉడుతలను చూచి నవ్వుకున్నవి. నవ్వుతూనే పోయి సీత ముందర వాలి పక్కున నవ్వినవి!

ఎత్తుకెళ్తాము సీతా మా అందరి రెక్కల మీద ఎత్తుకెళ్తాము కూర్చో! రామచంద్రమూర్తి వారధి కడుతున్నాడు గాని ఎంత కష్టపడుతున్నాడే! సీతా నీకోసం ఎంత ఆరాటమే! సీతా నీకోసం ఎంత పంతమే! అంత ఎందుకే సీతా మా రెక్కల మీద కూర్చోరాదూ గడియలో పోదాము అన్నవి! మూణ్ణాళ్ళ ముచ్చటయ్యెనేమే నీకాపురము సీతా అన్నవి చిలుకలు! అమ్మ అమ్మ! వద్దు వద్దు! రామచంద్రమూర్తి మహిమ తెలియవద్దా! ఆపని మాత్రం వద్దు! అంతపని ఎందుకు, వద్దు! అన్నది సీత. అంటూ చిలుకలకు పండ్లిచ్చి అవ్వి తింటుంటే చెరువు గట్టున నలుగు పెట్టుకున్నది నీళ్లు పోసుకోటానికి.

సీత యిచ్చిన పండ్లు గనకనే అవ్వి సీతాఫలాలైనవి.

సీత మాటలు విని చిన్న బుచ్చుకున్నవి చిలుకలు! ఇదీ బాగానే ఉన్నది. రామచంద్రమూర్తి మాటలు తెలియగానే ఇన్నాళ్ళూ స్నానం చెయ్యని సీత ఇవ్వాళ నలుగు పెట్టుకున్నది. ఈ నలుగు వృథా పోగూడదు అనుకున్నవి చిలుకలు. నలుగును అన్ని చిలుకలూ ముక్కున కఱచుకొని వస్తాము సీతా మళ్ళీ వస్తాము తొందరగానే. అని రివ్వున, చివ్వున రామచంద్రమూర్తి దగ్గరకు పోయినవి!

ఉడుతలది ఉడుత భక్తి: చిలుకలది చిలుక రక్తి!

చిలుకల జాలికి జావై పోయాడు రామచంద్రమూర్తి. సీత నలుగును సీతగానే శిల్పితం చేశాడు. ఆ నాటినుంచి గుండె నిబ్బరంతో ఉన్నాడు.

ఆనాటినుంచీ యీనాటి వరకూ చిలుకలను రామచిలుక లంటున్నారు!

నవమినాడు ఈపలుకులు విన్నా, చదివినా నవ్య నవ్య కవులవుతారు అందరూ!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!