ఐహికం..ఆముష్మికం.!

ఐహికం..ఆముష్మికం.!

(విశ్వనాథ సత్యనారాయణ గారి నవల ' దేవతల యుద్ధం ' నుంచి) .

.

“నాటకం వాడికి రూపాయి ఇచ్చి టికెట్టు కొంటే వాడు 

సంతోషిస్తాడా? దానం అనుకుంటాడా?

ఇవన్నీ నీ సంతోషం కోసం చేసే పనులు. నీ వనుభవించే ఆ సంతోషం ఒక దర్జా కోసం, ఒక ఠీవి కోసం, ఒక బడాయి కోసం కలిగే సంతోషం. 

ఈ డబ్బు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? 

వాళ్ళ మనసంతా ద్రవీభూతం అవుతుంది. వాని సంసారం పరిస్థితి ఎట్లంటిది అంటే వాడికి నీవిచ్చిన నాలుగు రూపాయలకు వాడి వళ్ళు కోసి ఇచ్చినా నీ యందలి కృతజ్ఞత తీర్చుకోలేనేమో అనిపించేది. అప్పుడు వాడి మనసులో కలిగే ఆర్ద్రత లౌకికమైనది కాదు. నీకు ప్రత్యుపకారం చేద్దాం అనేది కాదు. ఇది ఐహికమైనది కాదు. ఆధ్యాత్మికమైనది. నీవు ఉద్యోగస్తులకి డబ్బిస్తే వాళ్ళు నీకు ఐహికంగా యెట్లా ఉపయోగపడతారో ఆ ఉపయోగాన్ని ఎలా వాంఛిస్తావో అల్లా అధ్యాత్మికమైనది ఒకటి ఉంది అని నీవు విశ్వసించి దాన్ని వాంఛిస్తే ఈ పేదవాళ్ళకు ఆ డబ్బు ఇస్తావు”

.

ఒకటి ఐహికం, రెండు ఆముష్మికం.

ఈ రెండు చెరి సగంగా మానవుడిలో .ఉంటాయి. 

పూర్వ సంఘ వ్యవస్థ ఐహికానికి జీవయత్రకు కావలసిన వెల కట్టి ఆముష్మికానికి ఎక్కువ వెల కట్టింది.

ఇప్పటి సంఘం ఆముష్మికం లేనే లేదంటోంది. 

ఆముష్మికం అనేది ఎక్కడో ఉందనుకోటంలో ఉంది. 

.

ఉద్యోగస్తుల యొక్కయు పేదవాళ్ళ యొక్కయు తృప్తి లక్షణం విచారిస్తే ఆముష్మికం ఈ సృష్టిలోనే, ఈ మానవులలోనే ఉంది అని తెలుస్తుంది. ఆ అముష్మికానికి గంత బొంత తొడిగి పసుపు పెట్టి, కుంకుమ పెట్టి, దానిని దేవుడని, క్షేత్రాలని, వ్రతాలని, చేసారు. అట్లా చేయకపోతే నీవు దాని వంక చూడవని. ఈ ఐహికం కన్నా ఆ ఆముష్మికం ఎంతో బలమైనది. 

ఐహికం యొక్క బలం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

నీవు ఉద్యోగస్తుడికి నిజంగా ఇచ్చేది లంచం. ఆ లంచానికి మర్యాద చొక్కా వేసి ఇస్తావు.

పేదవాడికి ఇచ్చేది దానం. దానికి మర్యాద చొక్కా లేదు. 

దయ అనేది నీ గుండెలో పుట్టాలి. పుడితే ఏది దైవం అని అంటున్నామో ఆ ఆముష్మికానికి సంబంధించిన బతుకు బతుకుతావు. 

ఉద్యోగస్తుడికి లంచం ఇవ్వవు. 

ప్రత్యక్షంగా నీ పని పాడవుతుంది. వాడికి నువ్విచ్చే లంచం, వాడు నీకు చేసే ఉపకారం, దాని వల్ల నీ ఆస్తిపాస్తులు సురక్షితంగా ఉండటం

ఇది ఒక లోకం. పేద వాడికి నీవిచ్చే దానం వాడు పొందే తృప్తి.

ఆ తృప్తి వల్ల వాడు నీకు మేలు కలుగవలెనని కోరటం,

దాని వల్ల ఈ దయాలోకాలలో కలిగే సంచలనం, 

ఆ సంచలనం నీకు ఈ దానానికి ప్రతి ఫలంగా 

ఏదో చెప్పరాని ఒక సుఖ హేతువుగా ప్రకాశించటం. ఇదంతా ఒక లోకం.

ఉద్యోగస్తుడికి డబ్బు ఇవ్వవు. వాడు నీకు అపకారం చేస్తాడు. పేదవాళ్ళయందు దయ చూపించవు. దానికి నీకపకారం జరుగుతుంది. నీకప్పుడూ పకారం జరుగుతుంది , ఇప్పు డూ అపకారం జరుగుతుంది. ఆ అపకారం ఎవడో చేసినట్టు కనిపిస్తుంది, తెలుస్తుంది. ఈ అపకారం చేసినవాడు కనిపించడు. ఇది దాని ఫలితమని తెలియదు”

-ప్రేరణ...శ్రీమతి Mythili Abbaraju గారు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!