🙏🙏🙏దేవీ స్తుతి.🙏🙏🙏



🙏🙏🙏🙏🙏🙏🙏దేవీ స్తుతి.🙏🙏🙏🙏🙏🙏🙏


👉ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ, పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. 

సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి"


సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం.


పోతనగారి తెలుగు భాగవతం ప్రధమ స్కందం లో 8 వ పద్యం ఇది.


"శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా 

హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మం

దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడుగల్గు భారతీ "


బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించారు. సరస్వతీ మాత దర్శనం పోతనకింకా కాలేదు. ఆ దర్శనంకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఆ మాతృ మూర్తి రూపాన్ని ఊహించుకుంటున్నాడు. అందరూ అనుకునే మాట సరస్వతి తెలుపు రంగులో ఉంటుందని. పోతన గారు తన ఊహలకు పదును పెడుతున్నారు.


శారద = శరదృతు; నీరద = మేఘము; ఇందు = చంద్రుడు; ఘనసార = కర్పూరం; పటీర = మంచిగంధం; మరాళ = హంస; మల్లికా = మల్లిపువ్వుల; హార = దండ; తుషార = మంచు; ఫేన = నురుగు; రజత = వెండి; అచల = కొండ; కాశ = రెల్లుపువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = అడవిమల్లె; మందార = కల్పవృక్షము; సుధా = పాల; పయోనిధి = సముద్రము; సిత = తెల్లని; తామరస = తామరపువ్వు; అమర వాహినీ = ఆకాశ గంగ ; శుభ = శుభకర మైన; ఆకారతన్ = ఆకారముతో; ఒప్పు = అమరు; నిన్ను = నిన్ను; మదిన్ = మదిలో; కానగ = చూచుట; ఎన్నడు = ఎప్పుడు; కల్గు = కలుగుతుంది; భారతీ = సరస్వతీదేవీ.


భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!