పులి ముగ్గు” - (విశ్వనాథ సత్యనారాయణ రాసిన గ్రాంథిక నవల .)

పులి ముగ్గు” 

-

(విశ్వనాథ సత్యనారాయణ రాసిన గ్రాంథిక నవల .)


🏵️

ఈ నవలకు విశ్వనాథ ఎన్నుకున్న అంశం వింతైనది, కొత్తది, పైగా జానపదం!! మనిషి పులిగా మారే విద్య మీద రాసిన నవల.


ఖడ్గ విద్య లో ఎదురు లేని ఒక క్షత్రియ తాపసి, అంతులేని స్త్రీ వాంఛతో అసంబద్ధమైన శృంగార పరమైన కోరిక కోరి నాశనమైన రాజు.., నీచుడైన తండ్రికి తగిన పాఠం చెప్పిన కొడుకు… ఇలాటి పాత్రలతో  ఆద్యంతం ఉత్కంఠ గా సాగే నవల పులి ముగ్గు!


కథ ప్రారంభమే మగధ సామ్రాజ్య సేనాధిపతి శ్రీముఖ శాతకర్ణీ, అతనికి పరిచయస్తుడైన తోహారు అనే ఒక ఆటవికుడూ కలిసి, సగం మనిషీ సగం పులి గా మారిన ఒక ప్రాణి కోసం అన్వేషణ సాగిస్తూ ఒక కారడవి లో పయనించడం తో మొదలౌతుంది. నిజానికి వాళ్ళు అన్వేషిస్తున్న వ్యక్తి వెనుక కాళ్ళు మనిషి కాళ్ళు గా ఉంటాయి తప్ప మిగతా మొత్తం పులిగా మారగలడు. మరి కొంత సాధన మిగిలి పోయి వెనుక కాళ్ళు మాత్రం మనిషి కాళ్ళుగానే ఉండి  పోయిన మనిషి  .అంటే మనిషీ పులీ కలగల్సిన ఒక వింత వ్యక్తి కోసం వాళ్ల అన్వేషణ


ఆ జీవి కోసం ఓపిగ్గా తిరిగి తిరిగి  అలసిన  ఇద్దరూ ఒక పెద్ద తటాకం ఒడ్డున పులి,మనిషి పాదాల గుర్తులు గమనించి, అక్కడ ఒక చెట్టెక్కి మాటు వేస్తారు. తెల్లవారు జామున వాళ్ళెదురు చూస్తున్న పులి రానే వస్తుంది. తుప్పల్లో దాచిన కొయ్య తెప్పను తీసి, దాన్ని తోసుకుంటూ నీళ్ళలో ప్రయాణం ప్రారంభిస్తుంది.శ్రీముఖుడు (ఇతన్ని నవల్లో సిముఖ శాతకర్ణి గా సంబోధిస్తాడు రచయిత) అలా మైళ్ళ కొలదీ నీళ్ళలో తెప్ప నడుపుకుంటూ పోతున్న పులిని నిశ్శబ్దంగా ఈదుతూ అనుసరిస్తాడు. చివరికి తెల్లవారాక పులి ఆ తెప్పను ఒడ్డున వదిలి సమీపంలోని గుహ లోకి పోతుంది. దాని వెనకాలే వెళ్ళిన సిముఖ శాతకర్ణికి అక్కడ పులి కనిపించదు కానీ నేల మీద తీర్చి దిద్ది ఉన్న వింత రంగు రంగుల ముగ్గులో పడుకుని ఉన్న ఒక మనిషి కనిపించి “ఎవర్నువ్వు? ఎందుకొచ్చా”వని ప్రశ్నిస్తాడు.


“మనిషి కాళ్ళున్న పులిని చూశాను, దాని కోసమే వచ్చాను”


“ఇక్కడే పులీ , గిలీ లేదు లేదు, చుశావు గా, నేనే ఉన్నాను, వెళ్ళొచ్చు”


“లేదు, ఆ పులి ఈ గుహలోకే వచ్చింది, నేను చూశాను”


ఇలా కొంత సేపు వాదన జరిగాక ఆ పులి వ్యక్తి శ్రీముఖుడి చరిత్ర గురించి మొత్తం చెప్పడం తో, శ్రీముఖుడు అతడిని చిన్నపుడే నగర బహిష్కరణకు గురై వెళ్ళి పోయిన తన గురువు జయద్రధుడి గా గుర్తిస్తాడు. అతడే పులిగా మారే విద్యను అభ్యసించి దాన్ని సాధించాడని గ్రహిస్తాడు. కానీ ఎందుకు? ఎందుకు పులిగా మారడం? ఎవరికి ప్రయోజనం ? ఏమిటీ వింత పని?


***


 



కథా కాలం నాటికి చంద్ర శేఖర శాతకర్ణి ఆంధ్ర రాజు. అతని తాతా సహోదరుడు గోముఖ శాతకర్ణి (అంటే గోముఖ శాతకర్ణి తాత, చంద్ర శేఖర శాతకర్ణి తాతా అన్నదమ్ములు). గోముఖ శాతకర్ణికి ఒక్కడే కొడుకు శ్రీముఖ శాతకర్ణి. చంద్ర శేఖర శాతకర్ణి కి పిల్లలు లేరు. వేటకెళ్ళిన చంద్ర శేఖర శాతకర్ణికి జయద్రధుడు మొదటి సారి అడవిలో కలుస్తాడు. ఇద్దరి మధ్యా కత్తియుద్ధం జరుగుతుంది.  రాజు ఓడాడు.జయద్రధుడి షరతు, తాను రాజ్యానికి వచ్చి రాజ్యంలోని రాజ కుటుంబాల పిల్లలందరికీ ఖడ్గవిద్య నేర్పిస్తాననీ,అందుకు రాజు ఒప్పుకోవాలనీ! పలు విధాలుగా ఆలోచించినా దాని వల్ల ప్రమాదమేమీ కనపడదు రాజుకు. తనేదైనా తప్పు చేస్తే రాజ్య బహిష్కరణ చెయ్యొచ్చని జయద్రధుడే రాజుకి సూచిస్తాడు.


తాను ప్రయోగించిన రహస్య విద్యకు కూడా తిరుగుడు ప్రయోగించిన జయద్రధుడు గొప్ప ఖడ్గ విద్యా పారంగతుడు కాబట్టి వాడు తన రాజ్యానికి వచ్చినా నష్టం లేదని, రాజ కుమారులందరికీ విద్య నేర్పవచ్చని రాజ్యానికి తీసుకొస్తాడు చంద్ర శేఖర శాతకర్ణి


రాజ యువకులందరికీ విద్య నేర్పిన జయద్రధుడికి శ్రీముఖ శాతకర్ణి ప్రియ శిష్యుడయ్యాడు. అతడిలో ఉన్న అహంకారాన్ని, కొంత నాస్తిక దృక్పథాన్నీ జయద్రధుడు పెంచి పోషించాడు. దాంతో శ్రీముఖుడు మరింత అహంకారిగా తయారై, రాజుని లెక్క చేయకుండా తిరగడం మొదలు పెట్టాడు.వాడి నిర్లక్ష్య ధోరణి ని రాజు సహిస్తూ వచ్చాడు చాలా రోజులు!


ఆ రాజ్యంలోనే నీలాంబర శాతకర్ణి అనే రాజ కుటుంబీకుడున్నాడు. అతనికి జయద్రధి అనే కూతురుంది. ఆమె కూడా జయద్రధుడి వద్ద ఖడ్గ విద్య నేర్చుకుంది. జయద్రధుడు ఆమెతో ప్రేమాయణం నడిపి ఆమె గర్భానికి కారణమవుతాడు. ఆమెను వివాహం చేసుకోమని ఆమె తండ్రి కోరితే జయద్రధుడు తిరస్కరిస్తాడు, తాను తాపసినే తప్ప సంసారిని కాలేనని చెబుతాడు!


గురువు అండతో రెచ్చి పోతున్న శ్రీముఖుడిని అణచడానికి చంద్ర శేఖర శాతకర్ణికి ఒక అవకాశం దొరింది. అతడు జయద్రధుడు చేసిన తప్పుకు దేశ బహిష్కరణ విధించాడు. ఆ కారణంగా విప్లవాన్ని లేవదీసిన శ్రీముఖుడికి కూడా దేశ బహిష్కరణ విధించి ఇద్దరి పీడా ఒకటే సారి వదుల్చుకున్నాడు.


శ్రీముఖుడు వెళ్ళి మగధ సైన్యంలో చేరి సేనాధిపతి అయి, సుశర్మ రాజయ్యాక తనే మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు. రాజంటే విపరీతమైన భక్తి.


ఇలా ఉండగా, ధాన్యకటకంలోని ఉత్తమ రాజ కుటుంబీకుల్లో ఒకడైన గంగాధర శాతకర్ణి కి శ్రీముఖుడి కార్యకలాపాల పట్ల ఆందోళన కలుగుతుంది. అతడికి జయద్రధుడంటే ఏ మాత్రం గౌరవమూ లెక్కా జమా లేదు! వాడొక క్షుద్ర విద్యోపాసకుడని, మంత్రాలతో ఖడ్గ విద్యను అనుసంధానం చేసే క్షుద్రుడని భావిస్తాడు. శ్రీముఖుడు మగధ కు మంత్రయ్యాక అతడికి ఆందోళన పెరుగుతుంది.


సుశర్మ సర్వ భారత చక్రవర్తి. సుశర్మ  తర్వాత శ్రీముఖుడు రాజైతే , కేవలం రాజై వూరుకుంటాడా? తప్పక ధాన్యకటకం మీద దాడి చేసి తమ కుటుంబాలన్నిటి మీదా పగ సాధిస్తాడు. కాబట్టి వాడిని ఎదుర్కోవాలంటే సుశర్మ దగ్గర తమ మనిషి ఎవరైనా ఉండాలి” అని ఆలోచించి, తన ఏకైక కుమార్తె, అందాల బొమ్మ పద్మ రాణిని సుశర్మ వద్దకు పంపిస్తాడు. సుశర్మ చూస్తే బ్రాహ్మణ రాజు, తాము క్షత్రియులు! అందుకే వివాహం పేరు ఎత్తకపోయినా “వివాహం జరగాలనే” ఆకాంక్ష తోనే పద్మ రాణిని, సకల సంభారాలతో, వివాహానికి కావలసిన వస్తువులతో సుశర్మ దగ్గరికి పంపుతాడు.


సుశర్మ, పద్మ రాణి పీకల్లోతు ప్రేమలో మునిగి పోతారు


పద్మ రాణి అతనికి ప్రియురాలై పోయింది. వివాహం కాలేదు. కానీ వారిద్దరీ ఆ తేడాయే లేదు. ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉన్నారు


శ్రీముఖుడు పద్మ రాణిని గుర్తించినా పెద్ద ప్రమాద కారిగా భావించడు. సుశర్మ అంటే అతనికి ఎనలేని గౌరవం. అతనికి ద్రోహం తలపెట్టే ఆలోచన ఏ కోశానా లేదు!


పద్మరాణి వచ్చాక సుశర్మ రాజ్య పరిపాలన మొత్తం శ్రీ ముఖుడికి వదిలి రాణితో గడపటమే లోకంగా ఉన్నాడు


ఇవన్నీ పరిశీలించిన జయద్రధుడు చక్రం తిప్పదల్చాడు. అతడి ప్రకృతి విచిత్రమైంది. అతడు, అతడి పూర్వీకులు వేద మత విరోధులు. దాని కోసమే వాళ్ళు ఖడ్గ విద్యా సాధన కూడా చేస్తారు ప్రస్తుత ఆంధ్ర పాలకులు బౌద్ధులు.వాళ్లకి వేదాల మీద అంత గౌరవమేమీ లేదు. వాళ్లని సర్వ భారత చక్రవర్తులు  గా ప్రతిష్టిస్తే దేశన్ని మొత్తాన్ని వేద విరోధంగా తయారు చేయొచ్చు!


అతడి ఆలోచన ఇదీ!


కానీ అందుకు చంద్ర శేఖర శాతకర్ణి పనికి రాడు. అందుకే తాను ఖడ్గవిద్యతో పాటు నాస్తిక భావనలని శ్రీముఖుడి లో నాటి పెంచాడు. ఎలాగూ వాడు ఈనాటికి మగధ రాజ్యానికి మంత్రిగా ఉన్నాడు. కాబట్టి వాడిని రాజును చెయ్యాలి . వాడు రాజు కావాలంటే సుశర్మను చంపాలి.


చంపాలనుకుంటే ఏదో ఒక రకంగా చంపవచ్చు జయద్రధుడు. కానీ అతగాడి ప్రవృత్తి విచిత్రమైంది కదా! అందుకే ఎత్తు వేసి పద్మరాణిని చూసే నెపంతో మగధకు వచ్చాడు.


రాణి ద్వారా రాజుని కలిశాడు. రాజుతో చెప్తాడు”నా శిష్యుడు శ్రీముఖుడిని మంత్రిగా చేసి ఆదరించావు కాబట్టి నీకు రహస్యమైన తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పు! నేను తీరుస్తాను” అని


రాజు అంతకంటే మూర్ఖుడు. “నాకు ఎంతమంది భార్యలూ, ప్రియురాళ్ళూ, పరిచారికలూ ఉన్నా, ఎంతమంది కొత్తగా వస్తున్నా, ఈ స్త్రీ వాంఛ తీరడం లేదు. అసలు ఈ శృంగారం విషయంలో విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి. నా సహచరి జంతువై, నేను మనిషిగానే ఉండి ఆమెతో కూడితే ఎలా ఉంటుందో అనుభవంలోకి తెచ్చుకోవాలని ఆశగా ఉంది. నా పద్మ రాణిని పులిగా మార్చి నన్ను మనిషిగానే ఉంచండి. ఆ అనుభవం ఎలా ఉంటుందో చూడాలని ఉంది” అని అభ్యర్థిస్తాడు


నిజానికి జయద్రధుడు వాంఛిస్తున్నదీ ఇదే! వెంటనే ఒప్పుకుని, బలిమఠం (తన గుహ ఉన్న అడవి) అడవిలో ఒక పెద్ద భవనం నిర్మించమని, దీనికి సంబంధించిన సాధన మొత్తం అక్కడే జరగాలనీ, రాజ్యం శ్రీముఖుడికి అప్పగించి రమ్మనీ రాజునీ, పద్మ రాణినీ కోరతాడు. పద్మరాణి మొదట భయపడుతుంది. “నేను పులిగా మారాక జ్ఞానం లేక  రాజుని, చంపితే?” అనడుగుతుంది.” చంపవు, నీకు మనిషిని అనే జ్ఞానం ఉంటుంది. అది లేక పోతే తిరిగి మనిషిగా ఎలా మారగలవు?” అని ఒప్పిస్తాడు జయద్రధుడు.


రాజు తల్చుకుంటే దేనికైనా కొదవా? భవనం సిద్ధం! పరిచారికలతో సహా రాజు రాణి అక్కడికి పయనం



ఈ లోపు కథలో మరో పాత్ర పరిచయం అవుతుంది. జయద్రధుడి వల్ల నీలాంబర శాతకర్ణి కుమార్తె జయద్రధికి పుట్టిన కొడుకు. తమ ఇద్దరి పేర్లు గుర్తుగా వాడికి కూడా  జయద్రధుడనే పేరు పెట్టింది తల్లి. పద్ధెనిమిదేళ్ళ ఆ యువకుడు తండ్రి గురించి తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచీ ఎంత ప్రయత్నించినా లాభం లేక పోయింది. అతడొక మార్మికుడు, సిద్ధుడు, ఖడ్గవిద్యలో తిరుగు లేదు అంతకంటే ఏమీ తెలీదు, అని చెప్పిన వారే అంతా! తల్లేమీ చెప్పదు. తాతగారి వద్ద నేర్చిన శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపాసిస్తూ, స్వచ్చంగా పెరుగుతాడు. తండ్రి జాడ కనుక్కోవాలని ఎవరికీ చెప్పకుండా బయలు దేరి చూచాయ గా విన్న సమాచారాన్ని బట్టి ఫలానా అడవుల్లో వెదకాలని బయలు దేరతాడు. అనుకోకుండా వాడికి తోహారు జతపడతాడు. ఇద్దరూ కల్సి తండ్రి జాడ వెదకాలని నిశ్చయించుకుంటారు. ఎందుకంటే శ్రీముఖ శాతకర్ణికి జయద్రధుడే పులి అని తెలిశాక తోహారుతో ఇదీ విషయం అని చెప్పడు. కాబట్టి తోహారు చిన్న జయద్రధుడితో కల్సి పెద్ద జయద్రధుడిని వెదకడానికి బయలు దేరతాడు.


ఈ లోపు వాళ్ళిద్దరికీ అడవిలో నిర్మితమైన భవనం, అందులో ఏదో మార్మికంగా జరుగుతున్న సంగతీ తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి వాకబు చేస్తే ఎవరో సిద్ధుడు వచ్చి వెళ్తున్న సంగతి తప్ప ఇంకేమీ తెలీదు. పద్మరాణి పుట్టింటి చెలికత్తె చంద్ర రేఖ చిన్న జయద్రధుడిని గుర్తించి “ఆ తండ్రే ఏదో మాయ చేసి రాజును చంపాలని చూస్తున్నాడేమో అని భయంగా ఉంటే, ఈ కొడుకు కూడా వచ్చాడే! ఇదేదో వినాశనానికే దారి తీస్తుంది లా ఉంది” అని పద్మరాణి తో చెబుతుంది.


అసలు ఈ పులిగా మారి శృంగారం నెరపడం పద్మరాణికి సుతరామూ ఇష్టం లేక పోయినా రాజు మీద ప్రేమతో అంగీకరించిదాయె! ఏదైనా  కీడు జరుగుతుందేమో అని లోలోపల భయపడుతూనే ఉంటుంది. కానీ కొడుకు తండ్రి వంటి వాడి కాదనీ, మంచివాడనీ గ్రహించిన మీదట చంద్ర రేఖ ఎలాగైనా రాజునీ రాణినీ ఈ మాయోపాయం నుంచి రక్షించడానికి వాడి సాయం కోరుతుంది.


తోహారు తో కలిసి చిన్న జయద్రధుడు తటాకం వద్ద మాటు వేసి , పులిగా మారి తెప్ప ఎక్కి పోతున్న తండ్రి ని అనుసరించి పోయి అతన్ని కలుసుకుంటాడు. పెద్ద జయద్రధుడు కొడుకుని చూసి ఏమీ స్పందించడు. పైగా కొంత శక్తి తగ్గినట్టు, సూటిగా చూస్తూ మాట్లాడక, మాట తప్పించి డొంక తిరుగుడు గా మాట్లాడతాడు. ఎంతటివారినైనా మాటలతో తలొగ్గేలా చేసే అతడు కొడుకుతో మాత్రం వాదన పెట్టుకోడు. కొంత లొంగుబాటు స్వభావంతో ప్రవర్తిస్తాడు. అదంతా తన కృష్ణ మంత్ర జప ఫలితమేనని భావిస్తాడు చిన్న జయద్రధుడు.


చివరికి ఆ రోజు రానే వస్తుంది. దీపాలు ఆర్పేసిన ఆ భవనంలోకి ఆ క్షుద్ర కార్యం జరగకుండా అడ్డుకోడానికి చిన్న జయద్రధుడు అత్యంత శక్తివంతమైన గ్రాహక శక్తితో ప్రవేశిస్తాడు. చంద్ర రేఖ చెప్పిన ప్రకారం రాజు, రాణి,తన తండ్రి ఏ యే గదుల్లో ఉన్నారో ఆయా గదుల్లోకి ప్రవేశించి అటకమీద చేరి గమనిస్తాడు. రాణి గదిలో రాణి వివస్త్రగా మారి జయద్రధుడు వేసిన పులిముగ్గులో పడుకుని పులిగా మారి మారి రాజు గదిలో ప్రవేశిస్తుంది. అక్కడ రాజు ఉండడు. కానీ, జయద్రధుడు మాత్రం ఆమె తిరిగి తన గదిలోకి వెళ్ళే మార్గం లేకుండా మధ్య తలుపు మూసేసి, ఆమె గదిలో వేసి ఉన్న పులిముగ్గుని చెరిపేస్తాడు. అంటే ఆమె తిరిగి మనిషిగా మారలేకుండా! నిర్ఘాంత పోయిన రాణి చాలా సేపు అటూ ఇటూ తిరిగి, నిర్ణీత సమయం మించి పోవడం తో  ఏమీ చేయలేక పులి రూపంలోనే శాశ్వతంగా అడవిలోకి పారిపోతుంది కిటికీ లోంచి దూకి. రాజ్య బహిష్కరణ విధించిన శాతకర్ణులమీద పగతో తనను నిత్య వ్యాఘ్రంగా మార్చాడనీ, నాస్తికుడైన శ్రీముఖుడికి రాజ్యాన్ని కట్టబెట్టడానికి సుశర్మను చంపబోతున్నాడనీ తెలిసినా, గ్రహించినా ఏమీ చేయలేని నిస్సహాయ.. పైగా జంతువు గా ఉంది తానప్పుడు. గత్యంతరం లేని స్థితిలో అడవిలోకి వెళ్ళి పోతుంది.


జరిగింది చూసిన చిన్న జయద్రధుడికి తండ్రి పథకం అర్థమవుతుంది. వాడు తన తండ్రి గదిలోకి వెళ్ళి అక్కడ వేసి ఉన్న పులిముగ్గుని చెరిపి వేస్తాడు. పెద్ద జయద్రధుడు రాజ సంహారం రం తర్వాత తిరిగి వచ్చి, జరిగింది గ్రహించి నిర్విణ్ణుడవుతాడు. తాను పద్మ రాణిని నిత్య వ్యాఘ్రంగా మారిస్తే , తనను ఇంకెవడో నిత్య వ్యాఘ్రంగా ఉంచేశాడని అర్థమవుతుంది.


అంతటి కఠినుడూ, మాయలమారీ తన దుస్థితి తల్చుని దుఃఖంతో గర్జిస్తాడు. సమయం మించి పోతే తానికి ఎప్పటికీ పులిగా ఉండిపోవలసిందే పద్మరాణి లాగే! మతి పోయి కోపంతో గర్జిస్తున్న తండ్రిని చూసి చిన్న జయద్రధుడికి మెరుపు లా ఒక ఆలోచన వస్తుంది. తోహారు తో పాటు ఆపకుండా తటాకం వైపు పరుగు తీస్తాడు. అతడు చేయదల్చుకున్న పనొక్కటే అతడి తండ్రిని నిత్య వ్యాఘ్రంగా ఉంచెయ్యడానికి మార్గం దొరికించుకోడమే! అతను తోహారుతో కల్సి తటాకం వైపు ఎందుకు పరిగెత్తాడో ఊహించి చూడండి. సమాధానం తెలుస్తుంది. పద్మరాణి ఏమైంది? జయద్రధుడికి ఎదురు పడిందా? పడితే ఏమి జరిగి ఉండొచ్చు?


ఇంతకీ చిన్న జయద్రధుడు చేసిందేమిటి? ఇవన్నీ ఊహించి చూడండి!  ఈ నవల ప్రస్తుతం ఎక్కడా అందుబాటు లో లేదు. మహా అయితే విజయవాడ పాత పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. నాకు అక్కడే దొరికింది.


పావని శాస్త్రి విషయానికొస్తే, ఆయన సహజంగానే హాస్య ప్రియుడు, చమత్కారంగానూ రాస్తారూ కనుక, గ్రాంథికంలోని నవలను అతి సరళమైన తెలుగులోకి అద్భుతంగా మార్చారు .


జయద్రధుడి పాత్ర మొదట మొదట్లో నిజంగా గొప్ప వాడా, లేక దుష్టుడా వీడు అన్న ధోరణి లో కొంత తికమక పెట్టేలా నడుస్తుంది. వాడి ఆహార్యం, వ్యవహారం మొత్తం పులితో పోలిక తో సాగుతుంది. అడవిలో రాజు కి ఎదురు పడినపుడు ఎంతో దర్పంతో లెక్క లేనట్టు ప్రవర్తిస్తాడు. “ఏమోయ్, నేను చంద్ర శేఖర శాతకర్ణిని,ఇటొక పులి వచ్చింది చూశావా?” అని అడిగితే “ఆంధ్ర క్షమా మండల భర్త అయినా, సర్వ భారత చక్రవర్తి అయినా, వాడి బాబైనా తన రాజధానిలో ఉన్నపుడు, సైన్యమూ పరివారమూ వెంట ఉన్నపుడే రాజు, నట్టడవిలో ఏకాకిగా ఉన్నపుడు ఒట్టి మనిషే! రాజువి కదాని ఈ క్షణం లో పంచ భ్యక్ష్య పరమాన్నాలు తినగలవా? వృధాగా ఏమోయ్ గీమోయ్ అని నీ బోడి రాచఠీవి ప్రదర్శించకు” అని దులిపేస్తాడు.


ఆ తర్వాత అదే రాజు “మీ రాజ్యానికి వచ్చి మా రాజకుమారులందరికీ విద్య నేర్పాలన్న కోరిక మీకెందుకు కల్గింది?” అనడిగితే “మీ(ఆంధ్రులు) జాతి వివక్ష లేని జాతి! దేని వెంటబడితే దాని వెంటబడి పోయే జాతి. సృష్టిలోని సర్వ వివేకమూ,సర్వ అవివేకమూ కూడా మీ జాతిలోనే ఉంది” అంటాడు ఎటూ తేల్చకుండా


నవల ప్రారంభం నుంచీ, చివరి వరకూ ప్రతి సూక్ష్మనైన అంశాన్నీ రచయిత ఎంత వివరంగా విశ్లేషించుకుంటూ పోతాడంటే, కథను విజువలైజ్ చేసుకోకుండా చదవలేం!నవల మొదట్లో శ్రీముఖుడూ, తోహారూ కల్సి నది దాటే సన్నివేశం, చివర్లో పులి ముగ్గు వేసి పద్మ రాణిని పులిగా మార్చేటపుడు చిన్న జయద్రధుడు దాన్ని భంగ పరిచే పతాక సన్నివేశమూ ఇందుకు రెండు ఉదాహరణలు.


భవనం డిజైన్ ఎలా ఉంది, ఆ కటిక చీకట్లో జయద్రధుడు ఏ గదిలోంచి ఏ గదిలోకి ఎలా వెళ్ళాడన్నదీ అంగుళం కూడా వదలకుండా వర్ణిస్తూ ఆ చీకటిలోనే వాడితో పాటు మనమూ శ్రమించి ఆ దృశ్యాన్ని మొత్తం గాంచేలా చేస్తాడు రచయిత.


జయద్రధుడు పులిగా మారే విద్యను అభ్యసించాడని తెలుసుకున్న శ్రీముఖుడు అంతకు మించి వివరాలు తీసుకోడు. తను సుశర్మను వధించి రాజునయ్యే ప్రసక్తి లేదని స్పష్టంగా చెప్పేస్తాడు జయద్రధుడికి!అయితే జయద్రధుడు తన రాజ్యానికి వచ్చి రాజుతో పద్మరాణి తో మంతనాలు జరుపుతున్నా, అడవిలో సౌధం నిర్మించి ప్రయోగాలు జరుగుతున్నా శ్రీముఖుడేమయ్యాడో ఆచూకీ ఉండదు. రాజ్య పరిపాలన చూస్తున్నాడనుకోవాలి!


అందుకు సాక్ష్యంగా రచయిత ముందుగానే శ్రీముఖుడి ప్రకృతి గురించి కొంత వివరిస్తారు కూడా! మరెవరి కోసమో వడ్డించిన విస్తరి మీద శ్రీముఖుడికి ఆశ లేదు. దాని కోసం ఇక మరెవరూ రారు, అది తనదే అన్న భరోసా కలిగితే తప్ప దానికేసి చూడనైనా చూడడు అని!


puli1నవల ముగిశాక చివరి మాట గా పావని శాస్త్రి (దీనికి ఆయన “పులి ముగ్గింపు” అని పేరు పెట్టారు) పులిగా మారే విద్య అనేది ఒకప్పుడు నిజంగానే జరిగిందనడానికి  ప్రచారం లో ఉన్న ఒక కథని కూడా చెప్తారు. ఒంగోలు ప్రాంతంలో పెద్ద ఆరకట్ల, చిన్న ఆరకట్ల అనే రెండు గ్రామాల్లో దాదాపు మూడొందల యేళ్ల క్రితం పులిగా మారే విద్య తెలిసిన కుటుంబాలుడేవట. అలాటి కుటుంబాల్లో ఒకాయన కూతురు పురిటికి వచ్చింది. బిడ్డ పుట్టాక తిరిగి భర్తతో అత్తారింటికి వెళ్లే సమయంలో బండి అడవి దారిన పోతుండగా భర్త అడిగాడు “మీ ఇంట్లో పులిగా మారే విద్య తెలుసటగా ? నీకూ తెలుసేంటి?” అని! ఆమె  నోరు జారి “తెలుసు” అన్నది


ఇంకేముంది? ఎలా మారతారో చూపించమని పీకల మీద కూచున్నాడు! ఎంత చెప్పినా వినక ఏం చెప్పినా వినక మారి చూపించక పోతే చస్తానని బెదిరించాడు. పులిగా మారాక నాకు మనిషిననే జ్ఞానం ఉండదన్నా వినిపించుకోలేదు.  విధి లేక  కొంచెం విభూది మంత్రించి ఇచ్చి, పిల్లాడితో చెట్టెక్కి కూచోమనీ, కాసేపయ్యాక విభూది తన మీద చల్లమని చెప్పి పొదల్లోకి వెళ్ళి పులిగా మారి గర్జిస్తూ బయటకు వచ్చింది. ఆయన ఎన్నడూ పులిని గానీ, పులి చేసే హడావుడి గానీ చూసిన వాడు కాదు. హడలి పోయి విభూది సంగతి మర్చిపోవడమే కాక పిల్లాడిని జారవిడిచాడు. పులి కాస్తా పిల్లాడిని నోట కరుచుకుని అడవిలోకి పారి పోయింది.


కొంత సేపయ్యాక చెట్టు దిగి ఏడ్చుకుంటూ మామగారింటికి పోయి ఈ విషయం చెప్పగా మావగారు ,”ఎంత పని చేశావు రా మూర్ఖుడా? పులిగా మారాక ఆహారం స్వీకరిస్తే ఇహ మళ్ళీ మనిషిగా మారే అవకాశం లేదు” అంటూనే అడవికి వచ్చి ఎంత వెదికినా కూతురు పులి కనిపించలేదు. చేసేది లేక అల్లుడిని కూడా పులిగా మార్చి అడవికి పంపాడట. ఇంటికి వచ్చి కూతురి కథ చెప్పి ఇక పైన ఆ విద్య  తాలూకు మంత్రోపదేశం ఎక్కడా ఎవరూ ఎవరికీ  చేయ  కూడదని ఆంక్ష విధించి మరణించాడు. ఈ కథ ఆధారంగానే విశ్వనాథ  పులి ముగ్గు వేశారని పావని శాస్త్రి చెప్తారు. అంతే కాదు, తెలుగులో తొలి “హ్యూమన్ మెంటమార్ఫసిస్ ” నవల ఇదేననీ, తొలి రీటోల్డ్ నవల కూడా ఇదేననీ అంటారు. 1960 లో విశ్వనాథ రాసిన పులి మ్రుగ్గుని పావని శాస్త్రి 1985,86 లో పల్లకి వార పత్రిక కోసం సీరియల్ గా అందించారు.


మనిషి వాస్తవంలో పులిగా మారగలడా లేదా అనేది సత్యం కాక పోయినా, పులుల కంటే  కౄర ప్రవృత్తి గల మనుషుల్ని నిత్యం వార్తల్లో దర్శిస్తూనే ఉన్నాం. జాన పద నవలగా పులి ముగ్గుని హాయిగా ఆస్వాదించవచ్చు


ఇంతకీ, చిన్న జయద్రధుడు, తోహారు కల్సి తటాకం వైపు ఎందుకు పరిగెత్తారో, పెద్ద జయద్రధుడు, పద్మ రాణి ఏమయ్యారో ఊహించారా?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!