🔻-గుణనిధి కథ.-🔻 (కాశి ఖండం-శ్రీనాధుడు (క్రీ.శ 1360 - 1450))

🔻-గుణనిధి కథ.-🔻

(కాశి ఖండం-శ్రీనాధుడు (క్రీ.శ 1360 - 1450))

🚩దారితప్పిన యువకులను పాత్రలుగా మార్చి... అంతర్గతంగా వ్యక్తిత్వ వికాసానికి దారిచూపే రచనలు చేసినవారిలో ఆద్యుడు శ్రీనాథుడు. ఆయన గుణనిధి, సుకుమారుడు అనే రెండు పాత్రలను సృష్టించాడు. ఈ వరుసలో అందరికంటే ముందు పుట్టింది ‘గుణనిధి’. అయినా తెనాలి రామకృష్ణుని ‘నిగమశర్మ’కు అధిక ప్రాచుర్యం లభించింది. ఎవరైనా దుర్వ్యసనాల పాలైతే ‘‘వాడా! వాడు నిగమశర్మ’’ అంటాం. అయితే మన సాహిత్యంలో మదాలసుడు, నిరంకుశుడు, నాగదత్తుడు అనే మరో మూడు భ్రష్ట యువకుల పాత్రలూ కనిపిస్తాయి. ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డా చివరికి అప్రయత్నంగా దేవుని మహిమతో మోక్షాన్ని పొందిన ఇలాంటి కథలను తామస కథలు అంటారు. వాటిలో మొదటిది ‘గుణనిధి కథ’. ఇది శ్రీనాథుడు రచించిన ‘కాశీఖండం’లోనిది.

పేరుకు పెద్దన్న...

🚩కాంపిల్యనగరంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడి కుమారుడే గుణనిధి. చాలా అందగాడు. కానీ, చదువు వదిలిపెట్టి పేకాట నేర్చాడు. విటులతో స్నేహం పెంచుకొన్నాడు. ఆచారాలను వేళాకోళం చేయడం, హోమాలంటే మండిపడటం, గీత వాద్య వినోదాల్లో కాలం గడపడం, అనకూడని మాటలను పదే పదే ఉచ్చరించడం చేసేవాడు. కోడిపందేలు, పాచికలాటల్లో ఆరితేరిపోయాడు. ఓడిన ప్రతీసారి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కుదువ పెట్టేవాడు.

యజ్ఞదత్తుడికేమో పనుల కారణంగా కుమారుని గురించి తెలుసుకొనే తీరిక ఉండదు పాపం! కానీ అప్పుడప్పుడు కొడుకు గురించి భార్యను విచారించేవాడు. తల్లి ఏమో ఒక్కగానొక్క కొడుకు... అదీ ‘గొడ్డు వీగి కన్నబిడ్డడు’ కావటంతో వెనకేసుకొచ్చేది. కొడుకుతో మాత్రం ‘‘నాయనా! మీ నాయన చెప్పినట్లు నడుచుకోరా. జూదరులతో సావాసం మానుకో. మంచివాళ్ల పరిచయం పెంచుకో. సత్పురుషులు, పండితులైన మీ పూర్వీకులను, రాజమాన్యుడు, నిర్మలాచారవంతుడైన నీ తండ్రిని, పతివ్రతల్లో ఎన్నదగిన దాన్నయిన నన్ను, వేద పురాణాల్లో ఆరితేరిన నీ తోటివాళ్లని, పదహారేళ్ల నీ భార్యను తలచుకొనైనా ఈ చెడ్డపనులు మానుకో. మీ నాయనకు తెలిస్తే నన్ను కోప్పడతారు. ఇక, రాజు గారికి తెలిస్తే మీ తండ్రి పరువేం కాను’’ అంటూ బుద్ధులు చెప్పేది. గుణనిధి ఆ మాటలు పట్టించుకోడు.

ఓనాడు తనకు ఎంతో ఇష్టమైన, రాజుగారు తనకు దానంగా ఇచ్చిన ఉంగరం ఓ జూదరి వేలికి ఉండగా చూస్తాడు యజ్ఞదత్తుడు. ‘ఇదెక్కడిది నిజం చెప్పమ’ని నిలదీస్తాడు. అప్పుడు ఆ జూదరి ‘‘నీ కొడుకు జూదంలో ఓడి ఈ ఉంగరాన్ని పణంగా పెట్టాడు. నీ పుత్రుడు మహా జూదగాడయ్యా’’ అని అసలు విషయం చెబుతాడు. దిగ్భ్రాంతికి లోనైన దీక్షితులు ఉన్నఫళంగా ఇంటికి వెళ్లి భార్యను తాను అప్పుడెప్పుడో ఇచ్చిన నవరత్నమయమైన ఉంగరం ఉండాలి కదా, తీసుకురా అంటాడు. ఆమె ఏవో సాకులు చెబుతుంది. ఆగ్రహం కట్టలు తెంచుకున్న దీక్షితులు భార్యతో ‘‘గుణనిధి గురించి నాకు చెప్పినవన్నీ అబద్ధాలే. నీ మాటలు నమ్మి బంగారంలాంటి కొడుకును పాడుచేసుకొన్నాను. నువ్వూ నీ సుపుత్రుడూ కలిసి ఇల్లంతా భ్రష్టుపట్టించారు కదా!’’ అని ఆవేదన చెందుతాడు. విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి తిరిగిరాడు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఆకలికి తాళలేక...

అరుణగభస్తిబింబ ముదయాద్రిపయిం బొడతేర గిన్నెలోఁ

బెరుగును వంటకంబు వడపిందియలుం గుడువంగఁబెట్టు ని

ర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లియున్నదే?

హరహర! యెవ్వరింక కడు పారసిపెట్టెదరీప్సితాన్నముల్‌!!


తెలతెలవారుతూ ఉండగానే గిన్నెలో పెరుగు వడపిందెలు కలిపి కడుపునిండా తినబెట్టేది అమ్మ. ఎంతో కరుణ కలిగిన మనిషి. ప్రాణానికి ప్రాణం వంటిదైన తల్లిలాంటిది ఈ భూమి మీద ఇంకేదైనా ఉందా? ఇక నా ఆకలి తెలుసుకొని అన్నం పెట్టేదెవరు? హర హరా! అని బాధపడతాడు. తల్లిపేగు బంధం గొప్పదనాన్ని చెప్పే విశిష్ట పద్యం ఇది.

ఓ రోజు గుణనిధికి కడుపు నకనకలాడుతుంటుంది. ఎక్కడా అన్నం దొరకదు. ఆరోజు శివరాత్రి కావడంతో ఒక శైవుడు నైవేద్యం తీసుకుని శివాలయానికి వెళ్తుంటాడు. అతని తలమీదున్న పాత్రల్లోని వంటకాల ఘుమఘుమలు గుణనిధికి నోరూరించాయి. ఎలాగైనా వాటిని తినాలనుకున్నాడు గుణనిధి. భక్తులందరూ జాగారం చేసి నిద్రపోయే వరకు వేచి ఉండి, తర్వాత దొంగచాటుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాడు. దీపం కొడిగడుతూంటే తన ధోవతిని చింపి వత్తిగా చేసి ప్రమిదలో వేస్తాడు. అన్నపు గిన్నెను తీసుకొని బయటకు వస్తూంటే గుణనిధి కాలు ఒకనికి తాకుతుంది. వాడు మేల్కొని ‘దొంగ దొంగ’ అని అరుస్తాడు. గుణనిధి పాత్రతో సహా పరుగెత్తుతాడు. వెంట తరుముతూ వచ్చిన తలారులు గుణనిధిని చంపుతారు. అతణ్ని తీసుకుపోవడానికి యమభటులు, శివకింకరులు ఇద్దరూ వస్తారు. యమభటులు గుణనిధి పాపాలన్నీ ఏకరువు పెట్టి, వీడు కైలాసానికి వచ్చేందుకు అర్హుడు కాడంటారు. దానికి శివకింకరులు, ‘ఏదైనా పుణ్యకార్యం చేద్దామనుకొని చేయడం ఎంత పుణ్యమైందో- ఎంతటి పాపి అయినా అనుకోకుండా పుణ్యకార్యాన్ని చేయడమూ అంతే పుణ్యాన్నిస్తుంది. ఈశ్వర భక్తి తెలిసినట్లే ఉంటుంది. కానీ, దాని లోతు బ్రహ్మాదులకు కూడా అంతుపట్టదు. వీడు శివరాత్రినాడు అన్నం దొరకక పస్తులున్నాడు. శివాలయంలో మేల్కొని ఉన్నాడు. దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుగులో శివుణ్నీ చూశాడు. ఉపవాసం, జాగరణ, దీపారాధన, శివసందర్శన అన్నీ క్రమంలో- అదీ శివరాత్రి నాడే- జరగడం అతని పూర్వజన్మ ఫలితం కాక మరేమిటి? శివసాయుజ్యం పొందేందుకు ఇంతకంటే ఇంకేం కావాలి?’’ అని యమభటులను ప్రశ్నిస్తారు. చివరికి గుణనిధికి కైలాసప్రాప్తి కలుగుతుంది.

ఆతని కంటెను ఘనులు

గుణనిధిలాంటి పాత్రే శ్రీనాథుడి ‘శివరాత్రి మాహాత్మ్యం’లోనూ ఉంటుంది. అది సుకుమారుడు. ఇతను నిగమశర్మ రెండో అన్న. తల్లిదండ్రులకు లేకలేక కలిగిన సంతానం. లక్షణాల్లో గుణనిధికి తమ్ముడు. గుణనిధికి తల్లి ఒక్కతే బుద్ధులు చెబితే, సుకుమారునికి తల్లిదండ్రులు ఇద్దరూ చెబుతారు. వాడు ఆ మాటలు విన్నట్లే వింటాడు. తన మార్గాన్ని మాత్రం వదులుకోడు. తప్పుదారిన నడుస్తున్న సుకుమారుడికి రాజు దేశ బహిష్కారం విధిస్తాడు. అడవిలో సుకుమారుడు ఓ మాతంగ కన్యను మోహించి పెళ్లి చేసుకొని ఇద్దరు కుమార్తెలను కంటాడు. వాళ్లతోనూ కాని పనులు చేస్తాడు. దాంతో ఊరి వాళ్లు వెలివేస్తారు. ఓ రోజు శివాలయానికి తాగి వెళ్తాడు. అది శివరాత్రి పర్వదినం. శివదర్శనం అవుతుంది. కొన్నాళ్లకు మరణించిన సుకుమారుడికీ శివసాయుజ్యం లభిస్తుంది.

తెనాలి రామకృష్ణుడు శివభక్తునిగా ఉన్నప్పుడు రచించిన ‘ఉద్భటారాధ్య చరిత్ర’లోని పాత్ర మదాలసుడు. ధీనిధి అనే పండితునికి లేకలేక పుట్టిన కొడుకు మదాలసుడు. ఇతనికి వేదాదికాలు చెప్పిస్తారు. యుక్తవయసు రాగానే చంద్రకళ అనే కన్యతో పెళ్లిచేస్తారు. అయితే యవ్వన గర్వం మదాలసుణ్ని దారితప్పేలా చేస్తుంది. విలాసాలకు మరుగుతాడు. ఒక్కగానొక్క బిడ్డ అని తల్లి మిన్నకుంటుంది. వద్దంటే మొండికేస్తాడేమోనని తండ్రీ చూడనట్లు ఉంటాడు. దాంతో మదాలసుడు పేట్రేగిపోతాడు. చివరికి తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లగొడతారు. శివాలయంలో ఉన్న నగలన్నీ దొంగిలించి కన్యాకుబ్జం వెళ్తాడు. అక్కడ వేశ్యల సావాసం ఇతని సంపదను హరిస్తుంది. అయినా మదాలసుడిలో మార్పు రాదు. ఒక పండితుణ్నీ, అతని కొడుకునూ చంపి వారి సంపదను దోచుకుంటాడు. కాశీకి పారిపోతాడు. అక్కడ పాముకాటుకు గురై మరణిస్తాడు. మదాలసుణ్ని నరకానికి తీసుకెళ్లడానికి వచ్చిన యముడితో, శివుడు ‘తుమ్మెద ముక్కు అంటితే పువ్వు అపురూపమవుతుంది. సిద్ధరసం తాకితే ఇనుము బంగారం అవుతుంది. అట్లాగే ఎంత పాపి అయినా సరే కాశీలో చనిపోతే శివుడంత వాడవుతాడు. ముక్తి పొందుతాడు’ అంటాడు. ఇదీ మదాలసుడి కథ.

తనకు తానే సాటి

రామలింగడు రామకృష్ణుడై... వైష్ణవునిగా రాసిన ‘పాండురంగ మాహాత్మ్యం’లో పై ముగ్గురికి ఏమాత్రం తీసిపోని పాత్రను సృష్టించాడు. అది నిగమశర్మ.

పిఠాపురంలో ఒక సభాపతి ఉండేవాడు. అతను వేదాలకు నిలయం. శాస్త్రాల పుట్టిల్లు. అహితాగ్ని. అలాంటి పండితుడి పుత్రుడు నిగమశర్మ. తండ్రి దగ్గర సకల శాస్త్రాలు అధ్యయనం చేస్తాడు. అందగాడు. మాటకాడు. అతనికీ రావాల్సిన అలవాట్లన్నీ వచ్చేశాయి. పైగా వనితా మానస సూనసాయకుడు. నిగమశర్మ పేరు నేతి బీరకాయ అయింది. అతనికి ఓ అక్క ఉంది. పేరులేని ఆమెను రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ ‘వేదవతి’ అన్నారు. అయితే తెలుగునాట ఆమె ‘నిగమశర్మ అక్క’గానే ప్రసిద్ధి. ఆమెది ఇందులో కీలకమైన పాత్ర.

తమ్ముడు వచ్చాడని తెలిసి చంకలో బిడ్డతో సహా పుట్టింటికి వస్తుంది. తమ్ముని తలవెంట్రుకలను సాపుచేసి దువ్వి పూలతో అలంకరిస్తుంది. అలంకారం చేస్తున్నంతసేపూ తమ్ముడికి బోధచేస్తూనే ఉంటుంది. ఆ పద్యాలను రామకృష్ణుడు రసవత్తరంగా రాశాడు. వాటి కారణంగానే నిగమశర్మ కథ ఎంతో ప్రాచుర్యం పొందింది. ‘మనుచరిత్రలో వరూధినీ ప్రవరుల ఘట్టం, పారిజాతాపహరణంలో సత్యభామ అలుక, పాండురంగ మాహాత్మ్యంలో నిగమశర్మ కథ, ప్రబంధ అరణ్యాల్లో ఉంచిన పచ్చని పొదరిళ్లు’ అంటారు సినారె. అతనికి అలంకారాలు చేశాక, దాసి తెచ్చిన పీటమీద పద్మంలో ఆసీనురాలైన లక్ష్మీదేవిలా కూర్చుని తమ్మునికి బుద్ధులు చెబుతుంది.

‘‘ఏరా తమ్ముడూ! వేదపాఠానికి విఘ్నం ఏర్పడుతుందనా నన్ను చూడటానికి ఇంతకాలం నుంచి రాలేదు. మీ బావగారు కూడా నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సముద్రంలాంటి తండ్రికి చంద్రుడు పుట్టాలి గానీ, సాలగ్రామాల గనిలో గులకరాయి లాంటి నువ్వు పుట్టావేంరా? పరిశుద్ధమైన నీ బ్రాహ్మణ వంశాన్ని గురించి ఆలోచించలేదెందుకు? తల్లిదండ్రులను, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను సంతోషపెట్టలేకపోయావు. ఎందుకురా నీ చదువు? నీది పిల్లిశీలంరా? ఏడుస్తున్న నీ భార్యను చూడరా! మూడు కాలాలు పంటలు పండే భూములను గొప్పకోసం తెగనమ్మావు. భోగం స్త్రీలు మనల్ని సర్వనాశనం చేస్తారురా’’ అంటూ మంచి మాటలు చెబుతుంది. ఇంటి ఆడపడుచుగా నిగమశర్మ అక్క ఎంత మర్యాదను, ఎంత దర్జాను కోరుకుందో...

నాదు సహోదరుండు సుజనస్తవనీయనయః ప్రశస్తి బ్ర

హ్మాదుల మెచ్చఁడేనతని యజ్ఞమునంగడుఁ బూజ్యురాలనై

వేది నలంకరింతునని వేవురి ముందర నాడుకొందు నీ

వేదియులేక సర్వగుణహీనుఁడవౌఁట యెఱుంగఁదమ్ముఁడా

నా తమ్ముడు గుణవంతుడై కీర్తి పొందాలనుకుంటే... నువ్వేమో ఇలా తయారయ్యావేంటిరా అంటుంది. తమ్ముడు విన్నట్లే విన్నాడు! ఆ రాత్రి అందరి నగలు ఒలుచుకొని పడుకున్న పడకకు కూడా చెప్పకుండా పారిపోయాడు. అడవిలో దొంగలు నిగమశర్మను కొట్టి ధనాన్నంతా దోచుకున్నారు. ఒక కాపు అతణ్ని కాపాడి సపర్యలు చేస్తాడు. ఆ కాపు కోడలుతో కాపురాన్ని ప్రారంభిస్తాడు నిగమశర్మ. ఆమె మరణిస్తే, మరో కన్యను చేరదీసి ఆమె వల్ల ఓ కొడుకును కంటాడు. దురదృష్టవశాత్తూ అతని ఇల్లు తగలబడి భార్యా పుత్రులు చనిపోతారు. అప్పుడు నిగమశర్మ, ‘నీ శరీరం నల్లనిదైనా శాశ్వతమని నమ్మి నా వంశాన్ని పణంగా పెట్టి నీ చెంతచేరాను. కానీ క్షణంలో నాశనమైపోతుందని నేను తెలుసుకోలేకపోయాను’ అని ఏడుస్తూ, పశ్చాత్తాపంతో దేశదిమ్మరై ఒక నరసింహ ఆలయంలోకి వెళ్తాడు. అక్కడి పుష్కరిణిలో స్నానం చేసి గుడిలో ప్రాణాలు విడుస్తాడు. విష్ణుదూతలు నిగమశర్మను గరుడవాహనం మీద వైకుంఠానికి తీసుకొనిపోతారు. అది ఆ తీర్థక్షేత్ర మాహాత్మ్య ఫలితం.

నిగమశర్మ తమ్ముళ్లు...

వాళ్లు నిరంకుశుడు, నాగదత్తుడు. కందుకూరి రుద్రకవి రాసిన ‘నిరంకుశోపాఖ్యానం’లోని పాత్ర నిరంకుశుడు. అచ్చం నిగమశర్మ తోవలోనే నడచిన భ్రష్టుడితను. ఇందులో నిగమశర్మ అక్క పాత్రను నిరంకుశుని తల్లి పోషిస్తుంది. తల్లి సుద్దులను పెడచెవిన పెట్టి, పెళ్లాం నగలను దోచుకుపోతాడు నిరంకుశుడు. వేశ్యల కోసం బయలుదేరుతూ నిరంకుశుడు చల్లడం (లాగు) తొడుక్కున్నాడట! దాన్ని నిరసిస్తాడు రుద్రకవి. చిత్ర కవిత్వంలో సాటిలేని మేటి గణపవరపు వేంకటకవి ‘ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసం’లోని నాగదత్తుడి పాత్రా ఇలాంటిదే.

బేతవోలు రామబ్రహ్మం ‘పాండురంగ మాహాత్మ్యం కథా పరమార్థం’లో అన్నట్లు ‘‘కవిత్వమూ కళలూ సమాజగతిని నిజంగా మారుస్తాయా? ప్రతిబింబిస్తాయి!’’

ఆయా కథల్లో ఆ యువకులు అలా అయ్యేందుకు కారణం వాళ్లొక్కరే కాదు, తల్లిదండ్రులు కూడా. పిల్లల్ని తల్లిదండ్రులే కనిపెట్టుకుని, వాళ్ల ప్రవర్తన, నడవడికను ఓ కంట చూస్తూ... దారితప్పుతుంటే వాళ్లను సరిదిద్దాలన్న విషయాన్ని ఈ కథలు నొక్కి చెబుతాయి. ఎంత పెద్ద చదువులు చదువుకున్నా మంచిచెడ్డల విచక్షణ లేకపోతే సమాజం ఎంత సంక్షోభాన్ని అనుభవిస్తుందో వీటి ద్వారా తెలుస్తుంది. ఇంత గొప్ప సాహిత్యాన్ని పాఠాలుగా చెబితే ఇప్పటి యువతకు వ్యక్తిత్వ వికాస తరగతులు ప్రత్యేకంగా అవసరమవుతాయా?💞


🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments

  1. ప్రబోధాత్మకమైన కథలు చక్కగా అందించారు. ఇలాంటి కథలు పదేపదే చెబితే యువతలో కొంతైనా మార్పు రావచ్చు. ఎలా వుండకూడదో చెప్పే కథ లివి. ధ్యవాదాలు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!